జయహో కృష్ణరాయ!
'కారే రాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనం గలదే...?' అన్నాడు పోతనామాత్యుడు భాగవతంలో. బలిచక్రవర్తి నోట ఆయన పలికించిన ఆ సత్యవాక్కు అక్షరాలా ఆణిముత్యమే. ఈ లోకయాత్ర ముగిసిన వేళ- సిరులూ సంపదలూ తమ వెంట తీసుకువెళ్లలేరెవరూ. ఎన్ని రాచరికాలు, ఎంతమంది రాజులు, ఎవరి ఏలుబడులు ప్రజల స్మృతిపథంలో ఇప్పుడు నిలిచి ఉన్నాయి? స్థాపించిన సామ్రాజ్యాలు, మిడిసిపాటుతో సాగించిన దొరతనాలు, కట్టుకున్న సౌధాలు, కూడబెట్టిన సిరులతోపాటు తమ నామధేయాలూ కాలగర్భంలో కలిసిపోయిన ఏలికలు ఎందరో! జనరంజకంగా, యశఃకాములై ప్రవర్తిల్లినవారి పేర్లే జగత్తులో చిరస్థాయిగా వర్ధిల్లుతాయి. వారి కీర్తిసౌరభాన్ని వందలు, వేల ఏళ్లయినా వెదజల్లుతూనే ఉంటాయి- అదృశ్యంగా. తెలుగునేలను సంతోష చంద్రశాలగా, శౌర్యస్థలిగా, సకల కళల కాణాచిగా తేజోమయం చేసిన ప్రభువు కనుకనే శ్రీకృష్ణదేవరాయల పేరు- చెక్కుచెదరని శిల్పంలా, చెరిగిపోని శిలాక్షరంలా నేటికీ సజీవంగా మిలమిలలాడుతోంది. అయిదేళ్ల ఏలుబడితోనే మొహం మొత్తించే పాలక నిక్షేపరాయళ్లున్న ఈ రోజుల్లోనూ- అయిదు శతాబ్దాల క్రితంనాటి ఏలిక కృష్ణరాయల పేరు సమ్మోహన మంత్రమై మోగుతూ అందరికీ చిరస్మరణీయమవుతుండటం అందుకు దాఖలా. ఆయన పట్టాభిషిక్తుడై అయిదువందల ఏళ్లు దాటిన సందర్భమిది. రాజకీయంగానే కాక, సాంస్కృతికంగానూ దక్షిణాపథాన్ని ఏకం చేసిన రాయలవారిని స్మరించుకుంటూ తెలుగుజాతి వేడుకల్ని నిర్వహిస్తున్నది అందుకే.
తెలుగునేలను ఏలిన విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణరాయలు స్వతహాగా కన్నడ దేశస్తుడు. అమ్మపలుకు తుళు. సంస్కృతంలో కావ్యాలల్లినవాడు. సకల భాషలకు జననిగా వాసికెక్కిన సంస్కృతంపైనా ఆయనకు మక్కువే. ద్రావిడ భాషా కుటుంబంలో పెద్దక్కగా పేరొందిన తమిళ'మొళి' మీదా గౌరవమే. వాటితోపాటు కన్నడ కస్తూరి పరిమళాల్నీ తన ఆస్థానంలో గుబాళింపజేసినవాడే. అయినా- పది బాసలు తెలిసిన ఆ ప్రభువు 'బాస యన యిద్ది' అంటూ ఎలుగెత్తి చాటి, మణిమకుటం పెట్టింది మాత్రం తెలుగుభాషకే! అందుకే ఆయన తెలుగు రాయలయ్యాడు. తెలుగువారికి ఆరాధనీయుడయ్యాడు. బంగారు పళ్లెరానికి గోడ చేర్పువలె- భాషకు పాలకులు గొడుగుపడితే, సారస్వత వికాసం మూడు పూవులూ ఆరు కాయలుగా విరాజిల్లుతుందనడానికి... రాయల పాలనలో అపూర్వ గౌరవాదరాలను సొంతం చేసుకున్న తెలుగు వెదజల్లిన విద్వత్‌కాంతులే తార్కాణం. ఆ కాలంలో తెలుగు అక్షరం కొత్త నడకలు నేర్చింది. కొత్త సోయగాలు సంతరించుకుంది. 'మరపురాని హొయల్' చిలికించింది. ప్రబంధమై నర్తించింది. ఆచార్య రాయప్రోలు అన్నట్లు 'విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు' కప్పించిన రోజులవి. సారస్వత మూర్తులను 'న భూతో...' అన్న రీతిన సమ్మానించిన రాజు రాయలవారే. మనుచరిత్ర కర్త ఆంధ్రకవితా పితామహుడు పెద్దనామాత్యుడు 'ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి/ కేలూత యొసగి యెక్కించు'కున్నవాడు ఆయన. తనకు అంకితమిచ్చిన ఆ ప్రబంధాన్ని స్వీకరించేవేళ, పెద్దన పల్లకిని 'తనకేల యెత్తి పట్టిన'వాడు. తెలుగు కవీంద్రుడు ఆనాడు కవితా రాజసంతో దక్కించుకున్న రాజ లాంఛనమది! హృద్యమైన పద్యం వినిపిస్తే 'స్తుతమతి ఐన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకెట్లు కల్గె/ ఈ అతులిత మాధురీ మహిమ?' అంటూ పరవశించిన కవితా పిపాసి రాయలు.
రాయలవారి 'భువనవిజయ' సభామంటపం సాహితీ గోష్ఠులకు వేదిక. అష్టదిగ్గజాలుగా విఖ్యాతులైన కవీశ్వరులకు నెలవు. సారస్వత చర్చలకు, కవితా పఠనాలకు ఆటపట్టు. తెలుగు సాహితీ సరస్వతి కొలువు తీరిన ఆస్థానమది. ఆంధ్రభోజుడు ఆయన! సమరాంగణంలోనే కాదు, సాహితీ రంగంలోనూ రాయలు సార్వభౌముడే. మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము- తెలుగు సాహిత్యంలో పంచ మహాకావ్యాలని ప్రతీతి. ఆముక్తమాల్యద కృతికర్త కృష్ణరాయలే. శృంగార నైషధాన్ని మినహాయిస్తే, మిగిలిన మూడు కావ్యాలూ రాయలవారి ఆస్థాన కవుల అమృత కరస్పర్శతో అక్షరాకృతి దాల్చినవే. తెలుగులోని అయిదు మహాకావ్యాల్లో నాలుగు, రాయల కాలంలోనే వెలువడటం- ఆయన హయాములో విద్యానగరం తెలుగు భాషాభారతిని సమున్నత పీఠంపై అధిష్ఠింపజేసిందనడానికి దర్పణం. తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగానిది ఓ అధ్యాయం. దానికి అంటుకట్టింది రాయల కాలమే. అప్పటివరకు అనూచానంగా వస్తున్న అనువాద కావ్య రచనల పద్ధతికి కవులు స్వస్తి చెప్పి, ప్రబంధ రచనా సంప్రదాయానికి శ్రీకారం చుట్టేలా బాటలు పరచినవాడు రాయలు. అనంతర కాలంలో తెలుగునాట రెండు, మూడు శతాబ్దాలు కొనసాగిన సంప్రదాయమది. అపారమైన ప్రతిభా వ్యుత్పత్తులతో, అనితరసాధ్యమనిపించే రీతిలో ఆయన రచించిన ఆముక్తమాల్యద- రాజనీతి, వైరాగ్య, భక్తి బంధుర మహాకావ్యంగా పండితుల ప్రశంసలందుకున్న ప్రౌఢ ప్రబంధం. రాయల యుగం తెలుగు సాహిత్యానికి సంబంధించి స్వర్ణ శకం. ఆయన ఆస్థానంలో అగ్రపూజలందుకున్నదీ, అందలాలెక్కిందీ తెలుగు భాషే. కవుల్ని ఎత్తుపీటపై నిలపడమే కాదు, స్వయానా తానూ తెలుగులో మహాకావ్యం రాసిన రాజకవి కృష్ణరాయలు. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు/ ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ/... దేశ భాషలందు తెలుగు లెస్స' అంటూ రాయలు కట్టిన పద్యం- ప్రతి తెలుగు ముంగిటా నిత్య రంగవల్లికై వెలుగులీనాలి. ప్రతి తెలుగు గుండె తలుపునూ తట్టాలి. తెలుగువారి జాతీయగీతమై ఎదఎదలో రవళించాలి. తెలుగువారందరూ తెలుగు అక్షరానికి పట్టం కట్టినప్పుడే- రాయలవారి పట్టాభిషేక పంచశత ఉత్సవాలకు సార్థకత. తెలుగు రాయల స్మృతికి నికార్సయిన నివాళి అదే! (ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౭:౨౦౧౦)
____________________________
Labels: Telugu language, Telugu literature, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home