అనురాగ బంధాలు

అమ్మ తమకు తోడుగా మరో చిచ్చరపిడుగును అందించబోయే వేళ తెలుగు చిన్నారి పెద్ద ఆరిందాలా 'తామర పువ్వంటీ తమ్ముణ్నియ్యావే' అంటూ కూనిరాగం తీస్తుంటే ఎంత వినవేడుక! అదే శ్రుతిలో 'చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యావే' అంటూ తెలుగు బుడతడు తన సోదరికి పోటీగా వస్తుంటే ఎంత కనసొంపు! తామర పువ్వంటి అన్నదమ్ముల ముంజేతికి కట్టే వీసమెత్తు రాఖీ- తమకు కలకాలం రక్షరేకై అభయమివ్వాలన్నది ఆడపడుచుల ఆకాంక్ష. చేమంతి పువ్వంటి అక్కాచెల్లెళ్లకు తాము పెట్టే పసుపు, కుంకుమలు కలకాలం వెలుగులీనుతుండాలన్నది అన్నదమ్ముల శుభకామన. 'అత్తవారింట భాగ్యం బెంత గల్గిన/ ఆకాశము పొడవు తన కాపురంబుండిన/ మొదట పుట్టింటాశ వదలదింతులకు...' అన్నారు పెద్దలు. ఆడపిల్ల అలా ఆశపడటం- పుట్టినింటివారి పెట్టుపోతల గురించి మెట్టినింటిలో ఘనంగా చాటుకోవడానికే. ఆ విషయంలో తోడబుట్టినవారు ఏ లోటూ చేయకపోయినా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఓ చిన్న లోపానికి అత్తవారింట ఆమె మాటపడే సందర్భాలూ ఉంటాయి. తెల్లని కాకులు లేనట్లే, అల్లునిలో మంచితనమూ ఉండదన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. బహుశా నరుడు అని పేరున్నందుకు కాబోలు అర్జునుడూ ఆ కవి వాక్కును ఒకసారి నిజం చేశాడు. అత్తారింటివారు తనను పిలవలేదని అలిగాడు. 'పున్నమినాడైన బూరెలు వండుకొని, అల్లుడా రమ్మని పిల్చిరె మీవాళ్లు?/ అమావాస్యనాడైన అట్లు వండుకుని, అల్లుడా రమ్మని పిల్చిరె మీవాళ్లు?' అంటూ భార్య సుభద్రపై రుసరుసలాడాడు. ఆ ఆడకూతురు నొచ్చుకుంది. ఎంతైనా ఇద్దరు అన్నల గారాల చెల్లెలు ఆమె! తన పుట్టింటివారిపై మర్యాద తెలియనివాళ్లని పెనిమిటి ముద్రవేయడాన్ని సహించలేకపోయింది. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరగడంతో సుభద్ర అలిగి పుట్టింటికి వెళ్లింది. చిన్నన్న శ్రీకృష్ణుడు ఆమెకు ఘనంగా సారె పెట్టడం గిట్టని వదినెలు సూటిపోటి మాటలన్నా 'కొన్న మానిసులంటె కొదవేమి మనకు?' అని సముదాయిస్తూ ఆయన చెల్లెమ్మను సగౌరవంగా అత్తవారింటికి సాగనంపాడు. మానవ స్వభావాన్ని పురాణ పాత్రలకు ఆపాదిస్తున్న ఈ జానపదం అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు అద్దంపట్టేదే. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పిల్లలను మేనకోడళ్లు, మేనల్లుళ్లు అని ఎందుకంటారు? మేనుకు మేనైనవారు కనుకనే.
పుట్టిల్లు, అత్తవారిల్లు- ఆడపిల్లలకు తమవైన సామ్రాజ్యాలే. 'అన్నలైతే పసిడి అందెలిస్తారు, తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు/ గౌరవానికిగాని, ఘనతకుగాని/ తన పుట్టినింటిలో తాను దొరసాని/ మెట్టినింట ఉంటె మగువ యువరాణి' అంటూ తెలుగు ఆడపడుచుల శిరస్సులపై అశీరక్షతలు జల్లాడు తన అక్షరాల్లో కృష్ణశాస్త్రి. అన్నలూ తమ్ముళ్లూ ఇచ్చే ఆ సొమ్ములేపాటివి అనిపించేంతగా వారిపై ఆడపడుచులు ప్రేమానురాగాలు కురిపించడం రక్తసంబంధంలోని గొప్పదనం. దూరాన ఉన్నా అది- మనసులను, మనుషులను నిత్యం కలిపి ఉంచే జీవన సూత్రం. తమ పుట్టినింటివారు పదికాలాలపాటు చల్లగా ఉండాలని, మెట్టినింటిలో ఉన్న ఆ యువరాణుల శుభకామన- వారి తోడబుట్టినవారికి దివ్య దీవెన. తోబుట్టువులకు అంతకుమించిన ఆనందమేముంటుంది? సోదరి చెంత ఉంటే సోదరుల జీవితం సంతోషదాయకంగా ఉంటుందని శాస్త్రజ్ఞులూ చెబుతున్నారు. సోదరీ సోదరుల మధ్య పెనవేసుకున్న అనుబంధం వారి జీవితాల్ని అమితంగా ప్రభావితం చేసినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త లారా పడిల్కా వాకర్ అంటున్నారు. అక్కాచెల్లెళ్లున్న కుటుంబంలోని మగపిల్లల్లో దాతృత్వ గుణం అధికంగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలడం- పెట్టుపోతల విషయంలో ఆడపిల్లలే ఆ ఇంటిలోని మగపిల్లలకు తొలి గురువులు అనడానికి నిదర్శనం. ఒంటరితనం, అపరాధ భావన, భయం, ఒత్తిడి వంటివాటినుంచి మగపిల్లల్ని బయటపడేసేదీ ఆ బంగారుతల్లుల ఆసరాయే. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు తల్లి లాలనను అందిస్తున్నారనడానికి ఇంతకన్నా దాఖలా ఏముంటుంది? రక్తసంబంధం నిరంతరం పరిమళ భరితమే.
(ఈనాడు, సంపాదకీయం, ౦౮:౦౮:౨౦౧౦)
____________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home