My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, August 21, 2010

జీవిత పరమార్థం

'కోటి గ్రంథాల సారాంశాన్ని నేను అర్ధశ్లోకంలోనే చెప్పగలను. అదేమిటంటే- పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం' అన్నాడు కవి కులగురువు కాళిదాసు. 'పరోపకారార్థమిదమ్‌ శరీరమ్‌' అన్నది ఈ వేదభూమిలో నిత్యం ప్రతిధ్వనించే రుషివాక్కు. సమాజంలో సౌభ్రాతృత్వ భావన వెల్లివిరియడానికి, మనసున విశాల దృక్పథం పెంపొందడానికి, మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు పరిఢవిల్లడానికి- యావత్‌జగత్తుకు ఈ నేల అందించిన దివ్యసందేశమది. శరీరమున్నది ఇతరులకు ఉపకారం చేయడానికేనన్న ఆ ఆర్యోక్తికి భారతీయ సంస్కృతి యుగయుగాలుగా పట్టం కడుతూనే ఉంది. మనిషి సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడటంకంటే పుణ్యప్రదమైన కార్యమేముంటుంది? స్వకార్యాల కోసమేకాక, ఇతరులకు ఉపకారం చేయడానికీ శరీరాన్ని సాధనంగా మలచుకోవలసింది మనిషే. 'అనిత్యాని శరీరాణి' అంటూ అందరికీ బోధించేవారిలో చాలామంది, స్వవిషయంలో మాత్రం 'అంతా మాకే రానీ' చందంగా వ్యవహరించడం కద్దు. తనువు అశాశ్వతం, సిరులు అస్థిరం, భోగభాగ్యాలు తాత్కాలికమన్న ఎరుకతో- తమ శక్త్యానుసారం సాటివారిని సమాదరించే వితరణశీలురూ ఎందరో ఉన్నారు ఈ లోకంలో. 'జీవితం కరిగిపోయే మంచు/ ఉన్నదాంట్లోనే నలుగురికీ పంచు' అన్న కవి వాక్కును సార్థకం చేస్తూ ఆపన్నహస్తం అందించేవారు ఆర్తుల పాలిట ఆప్తులూ ఆత్మబంధువులే. మనిషికి అమ్మ ఒడిలాంటి ప్రకృతి కూడా పరోపకారతత్వానికి ప్రతీకే. దాహార్తిని తీర్చే సెలయేరు, వూరటనిచ్చే చిరుగాలి, ఛత్రమై నిలిచే చెట్టునీడ- ప్రకృతి ప్రసాదితాలైన ఇవన్నీ తమ ఉనికి పరుల మేలుకేనని చాటుకుంటున్నవే.
స్వసుఖాలకంటే సామూహిక శ్రేయానికే పాటుపడటం సత్పురుషులకు సహజాలంకారం. 'తమ కార్యంబు పరిత్యజించియు బరార్థ ప్రాప్తకుల్‌ సజ్జనుల్‌...' అన్నాడు సుభాషితకర్త భర్తృహరి. అలా- పరోపకారమే పరమావధిగా తమ జీవిత ప్రస్థానం సాగించిన మహనీయులు ప్రజల గుండెల్లో భగవత్‌ స్వరూపులుగా కొలువై ఉంటారు. రామానుజాచార్యుల చరితమే అందుకు దృష్టాంతం.
ఎవ్వరికీ చెప్పకూడదంటూ గురువు తనకు ఉపదేశించిన తిరుమంత్రాన్ని రామానుజులవారు అందరికీ వెల్లడించారు. గురువుకు ఇచ్చిన మాట తప్పి- 'ఓమ్‌ నమోనారాయణాయ' అన్న ఆ మంత్రాన్ని బహిర్గతం చేయడంవల్ల తనకు నరకం ప్రాప్తించినా ఫరవాలేదన్నారు. ఓ గోపురశిఖరం పైకి ఎక్కి... జాతి, మతం, కులవిచక్షణ లేకుండా సమస్త ప్రజానీకం చెవిన పడేలా ఆ మంత్రాన్ని ఎలుగెత్తిచాటారు. తిరుమంత్రం మహిమ 'ఇంతమందికి మోక్షాన్ని, స్వర్గాన్ని ప్రసాదిస్తున్నప్పుడు- నేనొక్కణ్నీ నరకానికి పోవలసివస్తే మాత్రమేం, ఆనందంగా వెళ్తాను' అన్న నిండుమనసు ఆయనది.
పరుల మేలుకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించినందునే శిబి చక్రవర్తి, దధీచి మహర్షి మహాదాతలుగా చిరకీర్తిని సొంతం చేసుకున్నారు. దానశీలత, ధర్మనిరతి, దయాగుణం, సత్యవచనం, రుజువర్తనం- 'రాజుల పాలిటికివి రాజయోగంబులు' అన్నాడు వేమన. ఆ గుణగణాలన్నీ మూర్తీభవించిన శిబి- తనను శరణు వేడిన పావురాన్ని రక్షించడంకోసం ప్రాణాల్ని అర్పించడానికీ సిద్ధపడ్డాడు. దానవ సంహారార్థం ఆయుధాలను అర్థిస్తూ తన కడకు వచ్చిన దేవతల కోసం శరీరాన్నే త్యజించిన రుషి దధీచి.

జీవసమాధి పొందిన దధీచి వెన్నెముకే దేవేంద్రుడి వజ్రాయుధంగా రూపుదాల్చిందని ప్రతీతి.
సశరీరంగానే కాదు, మరణానంతరమూ మానవదేహానికి పరమార్థం లోకోపకారమేనన్నది శిబి, దధీచి వృత్తాంతాలు బోధిస్తున్న నీతి.

'మ్రోడు మందారాలు పెడుతుంది/ అటు చాపి, ఇటు చాపి అభయహస్తాలల్లి/ జగమంత పందిరిని కడుతుంది' అంటూ చెట్ల జీవలక్షణాన్ని అక్షరీకరించారు కృష్ణశాస్త్రి ఓ కవితలో. శాశ్వతంగా జీవితం మోడువారే వేళ- పరోపకారానికి పందిరి పరవడం ద్వారా- తాము లేకున్నా తమ పేరు నిలిచిపోయేలా పుట్టుకను సార్థకం చేసుకుంటున్నవారెందరో. మరణానంతరమూ సమాజానికి ఉపయోగపడాలన్న సదాశయంతో- వైద్య పరిశోధనల నిమిత్తం తమ పార్థివ శరీరాన్ని ఆసుపత్రులకు అప్పగించాలని ఆకాంక్షిస్తున్నవారున్నారు. లోకమంతా చీకటైపోయినవారికి తమ కళ్లతో వెలుగులు పంచాలని కోరుకుంటున్నవారున్నారు. ఆ మేరకు వాగ్దాన పత్రాలపై వారు సంతకాలు చేస్తున్నారు కూడా. ప్రమాదవశాత్తో, ఇతరత్రానో మృత్యుముఖంలోకి వెళ్లిన తమ పిల్లల అవయవాలను- ఇతరులకు అమర్చడానికి పెద్దమనసుతో సమ్మతి తెలుపుతున్న తల్లిదండ్రులున్నారు. ఓ చిన్నారి... ముప్ఫై ఏళ్లలోపు వయసున్న ఓ జంట కలల పంట... పుట్టిన నాలుగోరోజునే కనుమూసింది... అమ్మకు, అయ్యకు గుండెకోత మిగిల్చి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది ఈ మధ్యనే... పుట్టెడు దుఃఖాన్ని పంటిబిగువున అదిమిపట్టి ఆ తల్లి తన పసికూన అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. భర్త, బంధువులు ఆ మహత్కార్యాన్ని ప్రోత్సహించారు. ఆ కసిగందు హృదయనాళాలను ఇద్దరు పసివాళ్లకు, కళ్లను మరో ఇద్దరు బిడ్డలకు అమరుస్తామంటున్నారు వైద్యులు. అమ్మ పక్కలో పడిన తరవాత నాలుగు రోజులకే మృత్యుఒడిలోకి చేరిన పాప- భౌతికంగా లేకపోవచ్చు. కానీ, ఆ చిట్టితల్లి- తన హృదయనాళాలు అమర్చిన ఇద్దరు చిన్నారుల ప్రాణస్పందనలో ఉంటుంది. తాను దృష్టి ప్రసాదించిన మరో ఇద్దరు చిన్నారుల కళ్లల్లోనుంచి ఈ లోకంలోని అద్భుతాలను, సౌందర్యాన్ని వీక్షిస్తూనే ఉంటుంది. 'మృతినెరుంగని ఒంటిదేవతలకన్న/ నలుగురికి మేలు చేసెడి నరుడె మిన్న' అన్న గాలిబ్‌ సూక్తికి ప్రతిబింబమై వెలుగులీనుతూనే ఉంటుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౨౫:౦౭:౨౦౧౦)
____________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home