జీవనం ఓ మైత్రీవనం

మిత్రుడు అంటే సూర్యుడని మరో అర్థం. ఏ లాభాపేక్ష లేకుండానే తన చుట్టూ పరిభ్రమించే భూగోళాదిగ్రహాలకు ఉదారంగా వెలుగురేకలు పంచిపెట్టే ప్రభాకరుడు నిజంగా సార్థక నామధేయుడే. 'మేఘుడు బుధికి బోయి జలంబులు దెచ్చి యీయడే/వాన సమస్త జీవులకు వాంఛిత మింపెన లార!-' అని భాస్కర శతకపద్యం. మేఘం చెట్టుకు చుట్టమా, పక్కమా? ఉసిరితొక్కును దానంచేసిన పేదగృహిణి ఇంట కనకధారలు కురిపించడానికి శంకరుణ్ని ప్రేరేపించిందీ పరోపకారమే పరమార్థంగా ఉన్న స్నేహభావమే. పెదవి విప్పి చెప్ప పనిలేదు; మౌనహృదయం లయను కూడా గుర్తించగలడు నిజమైన నేస్తం. కలిమి లేములకు సంబంధం లేనిది చెలిమి. కృష్ణ కుచేల సంబంధమే దానికి ఉత్తమ ఉదాహరణ. రాధా మాధవుల మధ్య నెలకొన్నది ప్రేమభావానికి అతీతమైన స్నేహసౌందర్యమే. స్థాయీ భేదాలతో నిమిత్తం లేనిది స్నేహం. నరనారాయణుల సాహచర్యమే దీనికి చక్కని తార్కాణం. శ్రీకృష్ణుని నిర్యాణానంతరం హస్తినకు తిరిగి వచ్చిన పార్థుడు అన్నగారితో ఆవేదనగా పలికిన మాటలే చాలు నేస్తభావ సంపూర్ణ నిర్వచనానికి. స్నేహితుడు- సన్నిహితుడు, సారథి, సచివుడు, వియ్యం, సఖుడు, బాంధవుడు, విభుడు, గురువు... అన్నింటికీ మించి దేవర. గజేంద్రమోక్షంలో కరిరాజు మొరపెట్టుకున్నట్లు 'పెంజీకటి కవ్వలనెవ్వడు/నేకాకృతి వెలుగునో, ఆ వెలుగే మన అంతరంగాన్ని వెలిగించే స్నేహదీపం. ఒంటరైనా ఓటమైనా... వెంట నడిచే నీడ నేస్తం. తడికన్నులను తుడిచే ఆ స్నేహహస్తం- ఒడుదొడుకుల బతుకుబాటలో చివరివరకు తోడు దొరకటమే... మనిషి జన్మ ఎత్తినందుకు మనం చేసుకునే అదృష్టం.
వేడితే గాని వరాలివ్వని దేవుడి కన్నా వేడుకలా మన జీవితంలోకి నడిచి వచ్చే నేస్తం ఎందులో తక్కువ? ఎక్కడుంటాడో తెలియని దైవం కన్నా కష్టంలో సుఖంలో, ఎత్తులో పతనంలో... ఎన్నడూ చేయి విడవక పక్కనుండే సన్మిత్రుడి సన్నిధిని మించిన పెన్నిధి మరేముంటుంది? కృష్ణపరమాత్మను చెలికాడిగా పొందిన గోపబాలకుల జన్మే జన్మమని వ్యాస భగవానుడిలా మనమూ ఈసుపొందాల్సిన పనిలేదు. ఠాగోర్ చెప్పినట్లు మన హృదయ కవాటం తెరిచి ఉంచాలేగాని... చొచ్చుకుని వచ్చేందుకు ప్రేమవాటికలో తచ్చాడే నెచ్చెలులు లక్షలు లక్షలు. తండ్రి బిడ్డకు స్నేహితుడు. భార్య భర్తకు సహచరి. ఇరుగిల్లు పొరుగిల్లుకు తోడు. లోకమే ఏకైక కుటుంబంగా మారిన ఈ కాలంలో స్నేహసామ్రాజ్యం విస్తరించుకోవడానికి కులాలు, మతాలు, ప్రాంతాలు, వయసు, స్థాయీ భేదాలు- అడ్డుకావు. అమృత సాధనకోసం దేవదానవులే ఒక్కటై శ్రమించారు. స్నేహామృత సాధనకోసం జాతి మతాలకు అతీతంగా అందరూ ఒకటి కావడానికి అడ్డుగోడల్ని పడగొట్టలేమా? సంకల్పం చెప్పుకొనే సందర్భం 'అంతర్జాతీయ స్నేహదినం'(౦౭:౦౮:౨౦౧౧). ఆస్ట్రియా సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం- స్నేహబంధం కలిగించే ఆత్మసంతృప్తి మరే ఇతర బంధం కలిగించలేనంత బలమైనది. హృదయపూర్వకంగా స్నేహహస్తం చాచేవారికి హృద్రోగ సంబంధ రుగ్మతలూ అధికంగా రావంటున్నారు. మైత్రికి విలువిచ్చేవారి జీవితకాలం ఒంటరిజీవులకన్నా ఎక్కువనీ వారి పరిశోధనల సారం. ఆరుద్ర చెప్పినట్లు- ఎవరినీ ప్రేమించకపోవడం ఒక నేరం, ప్రేమ తెలియని జీవితం భూమికి భారం!
(ఈనాడు, ౦౭:౦౮:౨౦౧౧)
__________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home