చక్కని నడుముకు చాంగుభళా!

వెన్నెల వెండిదారాలల్లినట్లుగా, గుబురులు కట్టిన తెల్లని నీటి నురుగులతో పరుగులిడే నీలి కెరటాల హొయల్లో- జలదేవతల నృత్య విన్యాసాలు! వికసించిన విరులతోటల తళతళలలో- వనలక్ష్మీకళ. ప్రకృతికి స్త్రీమూర్తి మారుపేరు కనుకనే- 'పచ్చనీ సేలోకి, పండు యెన్నెల్లోన/ నీలి సీరాకట్టి నీటుగొస్తావుంటె/ వొయ్యారమొలికించు నా యెంకీ, వొనలచ్చిమనిపించు నా యెంకీ' అని మురిసిపోతాడు ఆ పల్లెపడుచు జతగాడు నాయుడుబావ. మబ్బును అంటిపెట్టుకున్న మెరుపులా ఆడపిల్లలు, అందచందాలు జంట వీడని సైదోడులు. తమ వన్నెలను చిన్నబుచ్చినట్లు వీసమెత్తు అనుమానమొచ్చినా, రుసరుసలాడే భామినీమణులు పురాణకాలంలోనూ ఎందరో! అనునయ కళలో ఆరితేరిన కృష్ణయ్య కూడా సతుల సాధింపుల బాధిత పతిదేవుడే. దేవేరి రుక్మిణితో పాచికలాడుతున్న వేళ ఏదో గుర్తుకొచ్చి నల్లనయ్య నవ్వాడు. ఆట రసపట్టులో ఉన్న సమయాన ఆయన అలా నవ్వడం తనపై చిన్నచూపుతోనేనన్న అనుమానంతో రుక్మిణీదేవి కినిసింది. 'నీరజనాభుడ నవ్విన విధము నీతి తోడుత నెరిగించు/ నాతిరూపు నల్లనిదని నాకు తగదని నవ్వితిరా!/ పదహార్వేల భామలలోపల పడతి తగదని నవ్వితిరా!'- సమాధానం చెప్పమంటూ ఆమె నిలదీసిందని మన జానపదులు కట్టిన పాట తమ అందచందాలపై మహిళల మక్కువకు నిదర్శనం. 'సొగసు కీల్జడదాన, సోగకన్నులదాన, ముత్యాలవంటి పల్వరుసదాన/ బంగారుజిగిదాన, పటువు గుబ్బలదాన... పిడికిట నడుగు నెన్నడుముదాన' అంటూ శ్రీనాథుడు అక్షర రూపమిచ్చినంత అందంగా ఉండాలని కోరుకోని ఆడపిల్లలుంటారా ఈ జగతిలో?! అటువంటి సౌందర్యరాసుల సాహచర్యంలో బతుకు పండించుకోవాలని ఆకాంక్షించని అబ్బాయిలుంటారా ఈ లోకంలో!
మన అక్షరశిల్పుల రచనల్లో- నీలికురుల నుంచి అరికాలి మెరుపుల వరకు దృశ్యమానమయ్యే స్త్రీమూర్తుల సౌందర్యం చిందించిన వగలు, సంతరించుకున్న సొబగులు ఎన్నో. పలికించిన సరాగాలు, ఒలికించిన వయ్యారాలు మరెన్నో! చంద్రబింబాన్ని పోలు నెమ్మోములు, కాముని బాణాలవంటి కన్నులు, చెరకువింటి వంపులను మరపించే కనుబొమలు, మీటిన విచ్చు చనుగుబ్బలు, ఇలాతలాన్ని తలపించే జఘనపీఠాలు- ఇలా తమ కావ్యకథానాయికల సౌందర్య లహరులకు మనోహరమైన అక్షరరూపమిచ్చిన కవులు... నడుమును ఆకాశంతో- అంటే, శూన్యంతో పోల్చడం ముచ్చటగొలుపుతుంది. నడుము ఎంత సన్నగా ఉంటే ఆడవాళ్ల అందం అంతగా ఇనుమడిస్తుందన్నది లోకోక్తి. ఉన్నట్టులేదే, లేనట్టుందే అనిపించేలా కనిపించేంత సన్నని నడుమున్న అందగత్తెలు సింహమధ్య, అణుమధ్య అన్న ప్రశంసలకు పాత్రులు కావడం అందువల్లనే. 'కడు హెచ్చు కొప్పు, దానిన్ గడవన్ జనుదోయి హెచ్చు/ కటియన్నిటికిన్ హెచ్చు... నడుమే పసలేదు నారీమణికిన్' అంటూ- 'విజయవిలాస'కర్త చేమకూర వేంకటకవి వర్ణించిన సుభద్ర అందం ఆ కోవలోనిదే. ఏడుకొండలస్వామి ఏకాంతసేవలో ఉన్న అలమేల్మంగను కీర్తిస్తూ 'ఉన్నతి పతిపై నొరగి నిలుచు/ తన సన్నపు నడిమికి చాంగుభళా' అంటూ- ఆ చక్కనితల్లి నడుముకు జోతలర్పించాడు అన్నమయ్య. ప్రియాన్వేషణలో మగపిల్లల్ని అమితంగా ఆకట్టుకుంటున్నదేమిటన్న అంశంపై అధ్యయనం చేసిన పరిశోధకులూ- ఆడపిల్లల అందానికి మరింత శోభ చేకూర్చేది వారి సన్నని నడుమేనని చెబుతున్నారు. జఘనం చుట్టుకొలత పరిమాణంలో డెబ్బై శాతానికి పరిమితమైన నడుముగల అమ్మాయిల్నే తమకు సరిజోడుగా ఎంచుకోవాలని మగపిల్లలు అభిలషిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడి కావడం- 'నడుము సొంపులే కంటికింపులు' అనిపించేదే. అలాంటి అమ్మాయిల బాంధవ్య భాగ్యం లభించిన అబ్బాయిలు- 'ఒకరి నడుం ఒకరు చుట్టి ఉల్లాసంగా తిరుగుదాం/ సరుగుడు చెట్ల నీడలలో సరదాగా తిరుగుదాం' అంటూ చెట్టపట్టాలుగా సాగిపోతుంటే ఎంత చూడముచ్చట!
(ఈనాడు, సంపాదకీయం, ౦౫:౦౯:౨౦౦౧౦)
_____________________________
Labels: Beauty/telugu
0 Comments:
Post a Comment
<< Home