My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, October 23, 2011

శాంతిపోరాటం


రైలుబండినుంచి బైటకు గెంటివేసినప్పుడు గాంధీజీ ముందున్న ప్రత్యామ్నాయాలు రెండే రెండు. మౌనంగా తొలగిపోవడం, నిలబడి పోరాడటం. రెండో మార్గాన్నే ఎంచుకొన్నాడు- తరవాతి కాలంలో శాంతిదూతగా మారిన మోహన్‌దాస్. ఛీత్కారం అనర్హుడికి అతలం. అదే అర్హుడికి అందలం. నిశ్చింతే జీవిత అంతిమ లక్ష్యమని తెలియకనా... నోబెల్ శాంతి పురస్కార గ్రహీత దలైలామా టిబెట్ బహిష్కరణను వరంగా స్వీకరించింది! నెల్సన్ మండేలానుంచి ఆంగ్‌సాన్ సూకీదాకా... దుర్మార్గానికి దాసోహమని సుఖపడటంకన్నా, సంఘర్షణే సన్మార్గమని నమ్మిన వైతాళికుల జాబితా చాలా పెద్దదే! రామాయణ, భాగవత, భారతాలేమీ శాంతిగ్రంథాలు కావు. యుద్ధం అయిదూళ్లకే అయితే, అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామం జరిగేదే కాదు. ధర్మసంస్థాపనార్థం సంభవించిన వ్యతిరేకశక్తుల సంఘర్షణ అది. నూతన వైజ్ఞానికావిష్కరణ కోసం కొపర్నికస్ వంటి శాస్త్రవేత్తలు, రాజా రామ్మోహన్‌రాయ్ వంటి సంఘసంస్కర్తలు సంఘర్షణాత్మక వైఖరి కనబరచకపోయి ఉంటే- మనిషి ఇంకా నిప్పు రాజేసే రాతి దశనైనా దాటి ఉండేవాడు కాదు. నిప్పులమీద వితంతువులను వేయించడం తప్పే కాదన్న మూఢత్వంనుంచి బైటపడి ఉండేవాడూ కాదు. జీవితం విలువలను పునర్నిర్వచించే సంధిదశలో తప్పనప్పుడు సంఘర్షణా తప్పు కాదు అంటాడు గౌతమబుద్ధుడు. 'విష పాత్రనెత్తి త్రావెడి మహాయోగి కన్/ గొనలలో తాండవించిన యహింస/ సిలువపై నిండుగుండెలు గ్రుమ్మరించు' దయామూర్తి నుదుట పారాడు శాంతి/హృదయేశ్వరిని వీడి కదలు ప్రేమతపస్వి బరువు చూపుల పొంగిపొరలు కరుణ/ శిరసు వంచక స్వేచ్ఛ కొరకు పోరాడు వీరాగ్రణి హృదయాన నలరు దీక్ష'- ఒక్కొక్కరిది ఒక్కో సంఘర్షణ మార్గం. చివరికి అన్నీ మనిషిని చేర్చింది మాత్రం- ఒకే స్వేచ్ఛా సుఖసుందర స్వర్గధామానికే. దాశరథి కృష్ణమాచార్యుల వారన్నట్లు- ముసలి దశరథుడు వయసు భార్య కోరికను కాదనే సాహసం చేయనందుకే సీతాపహరణం వంటి దారుణం జరిగింది. చెరసాల దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా వసుదేవుడు చేసిన సాహసంవల్లే కంసవధ వంటి సత్కార్యం సాధ్యమైంది. 'ఈదవలెను- ఈది నెగ్గవలెను' అని పురందరదాసు పాడిందీ జీవవైతరణిని ఈదే సాహసం గురించే!

శిష్యుడిగా స్వీకరించని గురువూ తలవంచింది రాజీలేని ధైర్య లక్షణానికే. సూత పుత్రుడని పరిహసించిన రాధేయుడికి పట్టం కట్టించిందీ ఈ పట్టువదలని సాహసతత్వమే. 'కలశ రత్నాకరమ్ము/ అమృత భాండమ్ము పడసినా రమరవరులు'- కాని ఎంత మథనము?- అంటారు నాయనివారు. కరుణశ్రీ విజయశ్రీలో అన్నట్లు 'తాతలు వంటి వారయిన తప్పదు లోబడి పోదురోయి/ ధర్మేతర శక్తులెట్లు తలయెత్తును ధర్మంబు సన్నిధిన్?'- నిజం. కానీ, కావాల్సింది ధర్మపక్షానే చివరివరకు నిలబడి తలబడగల తెగువ. శిల శిల్పంగా మారాలంటే ఉలిపోటుకు తట్టుకోక తప్పదు. పొదలోని వెదురులన్నీ వేణువులవుతాయా? నిలువెల్ల గాయాలైనా పులకించే రాగాలతో లోకాలను అలరించాలని పలవరించే వెదురుకే పిల్లంగ్రోవి భాగ్యం. స్పందించడమంటే హృదయాల్ని పోగులుగా మార్చి సమాజంకోసం వస్త్రాన్ని నేయడం- అంటాడు ఖలీల్ జిబ్రాన్. అంత శ్రమకోర్చి 'పావన మభ్ర గంగ'ను భగీరథుడు భువికి దింపింది తన దప్పిక తీర్చుకోవడానికా? ఎవరైనా ఎవరెస్టు శిఖరాన్నెక్కేది కలకాలం అక్కడే కాపురం చేయడానికా? 'మనిషి మొక్కవోని పోరాటపటిమముందు ఎంత కాంచన శిఖరమైన లొంగి మొక్కవలసిందే'నన్నది టెన్జింగ్ సాహస పర్వతారోహణ సందేశం. 'స్వాతంత్య్రం లేని బ్రతుకు చావుకన్న హీనమని/ భీతిలేదు... లే లెమ్మని జాతినంత మేలు కొలిపే' పిలుపే నాటి భగత్ సింగ్ ఎత్తిన తిరుగుబాటు బావుటా. 'ఎట్లాగూ సమరం తప్పదు/ మాట్లాడితే శంఖం ఊదినట్లుండాలి' అన్న నేటి మహిళ సమరోత్సాహానికి నాటి సాహసమూర్తుల తీరే స్ఫూర్తి. ముందుతరం దివిటీలకు తరవాతి తరం వెలుగుదారి. 'స్పందించే మనిషి ప్రకృతి కనే మంచికల. భీరువు దాని పీడకల'- అంటాడు తిలక్.

లోకమే కాదు... జీవితమూ రణక్షేత్రమే. శాంతికీ అశాంతికీ ధర్మానికీ అధర్మానికీ న్యాయానికీ అన్యాయానికీ నిత్యం సమరమే. 'సిరులు దొరగి ఘోర వనసీమల చెట్టుకు పుట్టకొకరై/ యరగినవారు' ఒకరు. 'దొరలై తెక తేరకు తీయగా తినన్/ మరగినవారు' మరొకరు. 'అలతి మాటలతో 'ధర' యిత్తురయ్య/ సంగరమున గదలు, గాండివముల్, చెరలాడ కుండగన్/' అని, పరమాత్ముడంతటివాడే ధర్మ సంస్థాపనార్థం సంఘర్షణ తప్పదని తేల్చేశాడు. 'దేహమా కంపించుచున్నది. ద్రోహమా అనిపించుచున్నది. మోహమేదో కుంచుచున్నది' అంటూ వృథా సందేహాలతో కింకర్తవ్య విమూఢచిత్త చాంచల్యానికి లోనైతే- లోకంలో ఇంక వికాసానికి చోటేదీ? 'కొంపలుగాల్చు దుండగీతనముపై చూపించు అనుకంపమూ ధార్మికహింసే' అని యజుర్వేదవాదం. గజ్జెల మల్లారెడ్డి హెచ్చరించినట్లు 'బతుకు పూతోటలో ముళ్లపొదలు బలిసినపుడు' పలుగుకో పారకో పనిచెప్పటం తప్పు కాదుగా! ధర్మానికి కొమ్ముకాయడమంటే కొమ్మువిసరే దుర్మార్గంతో కుమ్ములాటకు దిగటమే. బైబిలైనా, భగవద్గీతైనా, ఖురానైనా, గ్రంథసాహిబ్ అయినా జీవితానికి చెప్పే భాష్యం- స్థితప్రజ్ఞతకు అవసరమైన సాహసంతో భవితను బంగారుమయం చేసుకొమ్మనే! మనిషి రెండుకాళ్లమీద నిటారుగా నిలబడి నేటికి రెండులక్షల సంవత్సరాలు. పడినప్పుడల్లా మళ్ళీ లేచి నిలబడి, పరుగులుపెట్టి, వేగం పెంచి పడే ఆ ఆరాటానికి అడ్డొచ్చే అవరోధాలకు ఎదురొడ్డటమే జీవన పోరాటం. జీవితం అంతిమ లక్ష్యం ప్రశాంతతే కావచ్చు. కానీ అది బండరాయిలో ఉండే స్తబ్ధత కాదు. 'రెండురెళ్లు నాలుగు' అన్నందుకు గుండ్రాళ్లు విసిరే గూండాతనం గుండెల్లో నిద్రపోవడమే నిజమైన చైతన్యం. నాడు జాతి స్వాతంత్య్రంకోసం బాపూజీవంటి సమరవీరులు చేసింది అహింసా పోరాటం. నేడు జాతికి పట్టిన అవినీతి చీడను పారదోలడానికి అన్నా హజారే వంటి సాహసవంతులు చేస్తున్నదీ అదే శాంతిపోరాటం. సంఘర్షణ అంటే, జాతి కొత్త జవసత్వాల ఆవిష్కరణ అన్నది చరిత్ర చెప్పే సత్యం!

(ఈనాడు సంపాదకీయం, ౨౧:౦౮:౨౦౧౧) 
________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home