My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, November 05, 2011

పేగుబంధం

మొత్తం 'పందొమ్మిదిమంది దేవతల దివ్యాలయం మానవ శరీరం' అన్నది భారతీయ వైదిక విజ్ఞాన భావన. ఈ ఆలయం గర్భగుడిలో నిత్యం వెలుగుతుండే అఖండజ్యోతే ప్రాణమని ప్రశ్నోపనిషత్తు పాఠం. 'మూడు మూలల పెట్టె మూతదీసే నేర్పు తెలుసుకోండి! మూత దీసితె భూతము గనపడును తెలిసికోండి' అంటూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు పాడింది ఆ ఆపాజ్యోతి ఘనతను గురించే. శల్య రక్త మాంసములపైన చర్మపు ముసుగు, పలు వ్యాధులకు నెలవు, పంచభూతాల కొలువు- అంటూ పురందరదాసు వంటి విరక్తులు ఈసడించిన ఈ తోలుబొమ్మనే- 'చతుర్విధ భూతములందు గడు/ హెచ్చు... నీచమని చూడరాదు' అంటూ నారాయణ శతక కర్త నెత్తికెత్తుకున్నాడు. మానవ శరీరాన్ని రథంతో పోల్చింది కఠోపనిషత్. 'పొంగేటి కుంగేటి మురుగేటి తరుగేటి/ అగ్నిలోపడి దగ్ధమగు దేహానికి పొంగేవు ఏలరా' అని ఎన్ని తత్వాలైనా పాడుకోవచ్చు. ముక్కోటి దేవతలు ఒక్కటైతేగాని చక్కని ఈ దేహ నిర్మాణం సాధ్యమే కాదంటారు ఆగంటి లక్ష్మప్ప వంటి తాత్విక విచారకులు. 'పుష్పం ఒక సంపూర్ణ వికాసం కోసం ఎన్నో దశలను దాటివచ్చినట్లే- మానవజన్మ సంబుద్ధం కావడానికి గడిచి రావాల్సిన దశలు ఎన్నో ఉంటాయి'- అన్నది బౌద్ధికుల భావన. జాతక కథల క్రమం ప్రకారం సిద్ధార్థుడు బుద్ధుడు కావడానికి దాటివచ్చిన దశలు అక్షరాలా అయిదువందల నలభై ఏడు. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా తీసుకున్నా నవమాసాలు నిండి తల్లిగర్భంనుంచి బైటపడ్డ పిండం ఏకకణం నాటి స్థితి- వీరబ్రహ్మేంద్రస్వామి భావించినట్లు, శ్రీహరిని వెతకడానికి తిరిగిన చిలుక పరిస్థితే! 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/ నేను చేసిన పుణ్యము నేటివరకు' అన్న భావన వెనకున్న మర్మం పుట్టుకకన్న పుట్టించిన ఆ అమ్మలోనే గొప్పతనం ఉందని చాటిచెప్పడమే!

దైవ జీవ భావాలకు ఆలవాలమైన అమ్మ గర్భమే శిశువు ఆవిర్భానికి కొలువైన గర్భగుడి. కోటేరు ముక్కు, కోల కళ్లు, లేత కొబ్బరివంటి చెక్కిళ్ళు, చెక్కిళ్లలోకి చిలిపి నవ్వులు తెచ్చిపెట్టే నొక్కులు- పొత్తిళ్లలో నవ్వు పువ్వు పూయాలంటే పేగుపంచే తల్లి ఎన్ని నొప్పులు భరించాలో! ఎన్ని నియమాలు పాటించాలో! బీజ దశనుంచి బిడ్డను భూమి మీదకు తీసుకుని వచ్చేదాకా తల్లి పొందే ఆ 'దేవకీ పరమానందానుభవా'లను పోతన భాగవతం కళ్లకు కట్టింది. ఆదికవి నన్నయనుంచి నేటి కవి ఆచార్య గోపి దాకా అమ్మతనం కమ్మదనాన్ని గురించి కలవరించని కవి లేడు. 'పదినెలలు మోసి కనియ- తల్లి రుణంబు దీర్చగలవె?' అంటుంది కుమారీ శతకం. అమ్మకు అమ్మయి పుడితే తప్ప తీరనిదీ ఆ జన్మాంతర రుణభారం. పాలగుమ్మి పద్మరాజు పురిటిపాట వింటుంటే అసలెన్ని జన్మలెత్తినా తెంపుకోలేనిదేమో ఈ పేగుబంధం అనిపిస్తుంది. 'ఆ రాత్రి... గడియారం చక్రం పంట్లో కాలం చిక్కుబడింది. కీలు కీలునా వేదన. అమ్మో అంది అమ్మాయి చివరకు చటుకుని తోసుకు తూరుపు కొసకు/ పండులా లేచాడు సూర్యుడు. అమ్మది చూపూ, నాన్నది రూపూ... పండుని కన్నది నా తల్లి' అని అప్పుడు అంటారు యావన్మంది. అలిసిన నరాల మసకల్లోపల అమ్మ చైతన్యం మాత్రం ఒక బందీ. వెలసిన తుపాను వెనకటి ధీమాను గుండెలోపల నిలుపుకోలేకపోతే ఇబ్బందే. స్త్రీకి ప్రసవం మరో జన్మ అన్నది లోకోక్తి. జన్మ చరితార్థత కోసం మరో బ్రహ్మగా మారి ప్రాణసంకటాన్ని భరించి మరీ మరోజీవికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. తాను లేకున్నా తన మొలక ఉండాలన్న అమ్మదనపు ఆర్తి- మానవాళిని చిరంజీవిగా దీవిస్తోంది!
భోజరాజీయంలోని గోమాత వ్యాఘ్రరాజానికి ఆహారంగా మారే ముందు ముందుగా ఆందోళన చెందింది- 'జఠరాగ్ని బొక్కి పడుచు/బొరుగిండులకు నొంటిబోవ గుక్కలు దోల/కరచునో' అనుకొంటూ తన లేగదూడను గురించే! వేటగాడొకడు వలవేసి పట్టుకున్నప్పుడు ఆ వలలో చిక్కిన తల్లిపక్షి విలపించింది చావు గురించి కాదు... రెక్కలింకా రాని పిల్లల గురించే! శ్రీనాథుని శృంగార నైషధంలో నలుని చేతికి చిక్కిన హంస ప్రాణం కోసం వాపోయిందీ కన్న సంతానం జీవన స్థితిగతులకోసమే. నెల తప్పడం తల్లితనం పరీక్ష ఉత్తీర్ణతలో మొదటి మెట్టయితే... క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో పండంటి బిడ్డను కనడం చివరిమెట్టు. ప్రాణానికన్నా తాను ఎక్కువగా ప్రేమించే నాథుని నిజప్రాణ ప్రతిబింబాన్ని ఆ నాథుని చేతిలో పెట్టాలనే ఏ వివాహిత అయినా కోరుకుంటుంది. ఆ ప్రయత్నంలో తన ప్రాణాల్ని కూడా లెక్కచేయని నైజం ఆమెది. యూఏఈ జాతీయురాలైన ఒక మహిళ మెదడు వాపు వ్యాధితో ఆసుపత్రిపాలై వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించేనాటికి ఏడు నెలల నిండు గర్భిణి. ఆమె చివరి కోరిక ప్రకారం కడుపులోని శిశువును రెండు నెలలపాటు ఆమె గర్భసంచీలోనే ప్రాణావసర సాధనాలతో సంరక్షించిన వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స ద్వారా చక్కటి ఆరోగ్యంతో ఉన్న శిశువును తండ్రి చేతిలో పెట్టారు! కవి ప్రసాదమూర్తి చెప్పినట్లు 'అమ్మ ఎక్కడికీ వెళ్లదు. మహా అయితే తాను పంచిన రక్తంలోనుంచే తిరుగు ప్రయాణం కడుతుంది.' పేగుబంధం అంత బలమైనది. 
(ఈనాడు సంపాదకీయం, ౨౫:౦౯:౨౦౧౧)
_________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home