Saturday, May 10, 2014
Sunday, March 30, 2014
1396- Now hot, then cute!
[1] Tapsi [13] Ram
[2] junior NTR [14] Kajal
[3] allari Naresh [15] Nitin
[4] Allu Arjun [16] Sidhdharth
[5] Samanta [17] Anushka
[6] Trisha [18] Nani
[7] RaaNaa [19] Karti
[8] Nitya Menon [20] Deepika Padukone
[9] Sruti Hasan [21] Mahesh Babu
[10]Naga Chatanya [22] Prabhas
[11]Ram Charan [23] Surya
[12]Ktrina Khife
(ఈనాడు, 30.03.2014)
____________________________
Labels: children, Cinima/ Telugu, Life/ children / telugu, Personality
Wednesday, October 09, 2013
Wednesday, May 15, 2013
1163- పెద్దలకూ పరీక్షే!!
'తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్' అనడంతోనే, మనోమందిరమంతటా ఆ విద్యామయే నిండుతుంది. అక్షరలక్షల భావ సంపదను ప్రసాదించే అంతటి శక్తిసంపన్న సుస్థిరస్థానం కవిగాయక వైతాళిక హృదయపీఠి మీదే. సారస్వతపుర సామ్రాజ్యమైనా సంగీతామృత సాగరమైనా ఆ దేవేరి కనుసన్నలలోనే. అగణిత పదయుతగా అద్భుత పదనుతగా వెలుగొందే ఆమే వాణీ గీర్వాణీ వివేక మూలకారిణీ. 'చతురాశ్రమములు నీ జీవనసూత్రం/చతుర్వేదములు నీ పావనగాత్రం/చతుర్థామముల హృది వీధిని వినిపించినది నీ సమతానాదం' అని కవిగళం చతురమతి ప్రస్తుతి చేసిందీ అందుకే. సత్యమే సాహిత్యం, సౌభ్రాత్రమే మిత్రం, సౌశీల్యమే జీవం, స్వాతంత్య్రమే దైవం అయినప్పుడు జీవితమంతా జయమూ శుభమే. ఎప్పుడైనా ఎక్కడైనా సారవంత మనోభూముల్లోనే చదువు సేద్యం సుభిక్షమవుతుంది. శ్రమరక్షణ, క్రమశిక్షణ, సమవీక్షణలే గురుదక్షిణలైన వేళలో దాశరథిలా 'తల్లీ భారతి వందనం/ నీ ఇల్లే మా నందనం/ మేమంతా నీ పిల్లలం/ నీ చల్లని ఒడిలో మల్లెలం' అని ప్రతి ఒక్కరి మదీ పరవశించి పాడదా మరి! భవంతి ఎంత మహోన్నతంగా ఉన్నా, దాని ఉనికికి పునాదే ఆధారం. ఆ రీతిలోనే, జీవితంలో సమున్నత స్థాయికి చేరేందుకు ప్రధానం- చదువూ, అది అందించే ఉపాధీ. చదువుసంధ్యలు మనిషికి మూడో నేత్రం, జీవనానికి గౌరవపాత్రం. మనిషి పుట్టేది మంచిని పెంచేందుకే. చదువు నేర్చేది ఉత్తమత్వాన్ని పొందేందుకే. ఆ ఉన్నతత్వమే ఉత్తమత్వమే ఉదాత్తతకు రహదారి. కానీ 'రసజ్ఞతా స్థితిన్ పొందగలేని విద్య పరిపూర్ణత నిచ్చునె, శాంతి నించునే' అన్న గరికిపాటి ప్రశ్నకు సమాధానమేదీ? 'అందరకందలేదు సరే, అందినవారలకైనగాని ఏ/మందినదందులోని పరమార్థ విశేషము?' అని ఆ కవే సంధించిన మరో ప్రశ్నాస్త్రానికీ బదులు రావాలి. చదువుల సుమపరిమళాలు అన్నిటా అంతటా గుబాళిస్తేనే, ఆ ఆస్వాదనలో మానవాళి పులకిస్తేనే కృతార్థత, సార్థకత. చదివినంతసేపూ ఆసక్తి ఉన్నప్పుడు, చదివింది పరీక్షల్లో రాసేంత శక్తి నిండినప్పుడు భావిపౌరులైన నేటి బాలలతో నవభారతికి శుభోదయమే కదా! విద్య అన్నది ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడే ఉండిపోయే జడపదార్థమేమీ కాదు. అదో సత్తా, సత్తువ, శోధన, సాధన. వాటిని ఫలప్రదం చేసేందుకే శిక్షణలూ పరీక్షలూ.
Tuesday, May 14, 2013
Sunday, May 12, 2013
1148- తల్లీ... నమస్తుభ్యం!
ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తిచెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదా దేవియున్ నీవు మా/ తండ్రిం దల్లియు నంచు నుండుదుము... ఇంతటి వారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటూ రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటివాడు నందుడి సందర్శనార్థమై రేపల్లె వచ్చిన సందర్భంగా- భాగవతంలో. జగన్నాథుణ్ని అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాల్లో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి. దుర్గా, ఫాతిమా, మేరీ, బుద్ధుడి మేనత్త గౌతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుడి తల్లి త్రిషాల... మాతృ ప్రేమకు కులమతాలని, దేశకాలాలని ఎల్లలేముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాల్లో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. ఇంగ్లాండులో తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి వందేళ్లు! ప్రపంచీకరణ ప్రభావాన ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి కృతజ్ఞతలు చెప్పే ఓ సంబరంగా జరుపుకొంటున్నాయి. ప్రేమాభిమానాలు భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ కావడం అబ్బురం కాదు.
కాలం సనాతనమైనా, అధునాతనమైనా- అమ్మ పాత్రలో మాత్రం మారనిది సౌజన్యం; బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగ గుణం; కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి- 'అమ్మ' అంటే ఏమిటని. 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!' అని దేవుడి ప్రత్యుత్తరం. భిక్షమడిగే బికారిని అడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకు'లని సమాధానం. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీదే సదా దాగుండేది అమ్మేనని. విలువ తెలియనివారికి అమ్మ అంటే 'ఇంతేనా'!; తెలుసుకున్నవారికి 'అమ్మో... ఇంతనా!'. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/ పాపపు వేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి...' అనే అన్నమాచార్యులవారి సంకీర్తనలోని హరినామానికి అమ్మ పదమొక్కటే ఇలలో సరి. అడ్డాలనాటి బిడ్డలకు గడ్డాలు మొలుచుకొచ్చి- ఆలి బెల్లం, తల్లి అల్లమవుతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ... పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు, రాబోదు. అందుకేనా చులకన? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే చివరి దశన కాస్తంత చెట్టునీడ కరవవుతున్నది. పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్టి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/ లల్లుకుని వచ్చాను/ అందులో సగభాగ/ మాశపెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/ మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహరాలు... అమ్మ పాదాలు కొండంత అండ! 'అమ్మపండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే!
(ఈనాడు , సంపాదకీయం , 11:05:2013)
________________________________________
Labels: children, Family, Life/ children / telugu, Life/telugu, Women
Saturday, November 05, 2011
పేగుబంధం
దైవ జీవ భావాలకు ఆలవాలమైన అమ్మ గర్భమే శిశువు ఆవిర్భానికి కొలువైన గర్భగుడి. కోటేరు ముక్కు, కోల కళ్లు, లేత కొబ్బరివంటి చెక్కిళ్ళు, చెక్కిళ్లలోకి చిలిపి నవ్వులు తెచ్చిపెట్టే నొక్కులు- పొత్తిళ్లలో నవ్వు పువ్వు పూయాలంటే పేగుపంచే తల్లి ఎన్ని నొప్పులు భరించాలో! ఎన్ని నియమాలు పాటించాలో! బీజ దశనుంచి బిడ్డను భూమి మీదకు తీసుకుని వచ్చేదాకా తల్లి పొందే ఆ 'దేవకీ పరమానందానుభవా'లను పోతన భాగవతం కళ్లకు కట్టింది. ఆదికవి నన్నయనుంచి నేటి కవి ఆచార్య గోపి దాకా అమ్మతనం కమ్మదనాన్ని గురించి కలవరించని కవి లేడు. 'పదినెలలు మోసి కనియ- తల్లి రుణంబు దీర్చగలవె?' అంటుంది కుమారీ శతకం. అమ్మకు అమ్మయి పుడితే తప్ప తీరనిదీ ఆ జన్మాంతర రుణభారం. పాలగుమ్మి పద్మరాజు పురిటిపాట వింటుంటే అసలెన్ని జన్మలెత్తినా తెంపుకోలేనిదేమో ఈ పేగుబంధం అనిపిస్తుంది. 'ఆ రాత్రి... గడియారం చక్రం పంట్లో కాలం చిక్కుబడింది. కీలు కీలునా వేదన. అమ్మో అంది అమ్మాయి చివరకు చటుకుని తోసుకు తూరుపు కొసకు/ పండులా లేచాడు సూర్యుడు. అమ్మది చూపూ, నాన్నది రూపూ... పండుని కన్నది నా తల్లి' అని అప్పుడు అంటారు యావన్మంది. అలిసిన నరాల మసకల్లోపల అమ్మ చైతన్యం మాత్రం ఒక బందీ. వెలసిన తుపాను వెనకటి ధీమాను గుండెలోపల నిలుపుకోలేకపోతే ఇబ్బందే. స్త్రీకి ప్రసవం మరో జన్మ అన్నది లోకోక్తి. జన్మ చరితార్థత కోసం మరో బ్రహ్మగా మారి ప్రాణసంకటాన్ని భరించి మరీ మరోజీవికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. తాను లేకున్నా తన మొలక ఉండాలన్న అమ్మదనపు ఆర్తి- మానవాళిని చిరంజీవిగా దీవిస్తోంది!
Labels: Life/ children / telugu, Life/telugu
Monday, October 17, 2011
అమ్మపాలే అమృతం
రక్తానికి రంగుమార్చి క్షీరధారగా- పేగు తెంపుకొని పుట్టిన పసికందు నోటికందించటానికి తహతహ పడని తల్లి ఉంటుందా ఏ లోకంలోనైనా? ఆయుర్వేదం ప్రకారం పసివగ్గు తొలి ఆరు మాసాలూ సంపూర్ణంగా పాలమీదే ఆధారపడే 'క్షీరద'. చనుబాలు పసిబాల జన్మహక్కు. జాషువా భావించినట్లు 'అక్షయంబైన మాతృక్షీర మధురధార/ లన్నంబుగా తెచ్చుకున్న అతిథి'- బుజ్జిపాపాయి. కన్నబిడ్డకు తనివితీరా తల్లి చన్నివ్వలేని దురదృష్ట పరిస్థితుల్లో సైతం పాలివ్వదగిన, పాలివ్వగలిగిన 'ధాత్రి', ఉపమాత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న సంస్కృతి మనది. భోజరాజీయంలో- చంపి భోంచేస్తానని హుంకరించిన బెబ్బులికి బెదరలేదు గంగిగోవు. ఆ తల్లి బెంగంతా 'మునుమును పుట్టి... ఏడెనిమిదినాళ్ల పాటి గలిగి ఇంత పూరియు మేయనేరని ముద్దుల పట్టి' గురించే. తల్లిలేని కైలాసవాసుడికి తనను తానే తల్లిగా భావించుకుని చన్నిచ్చి సాకే ప్రయత్నం చేసింది బసవ పురాణంలోని బెజ్జమహాదేవి. హాలాహలం మినహా ఏ అమృతం రుచి ఎరుగని ఆ ఫాలాక్షుడికీ బహుశా తల్లిపాల చవి అంత నచ్చినందువల్లనేనేమో- ఆ అమ్మకు నిత్యత్వం ప్రసాదించింది! రొమ్ము గుద్దినా సరే... కమ్మని పాలు కడుపారా కన్నబిడ్డకు అందించడంలోనే జన్మసార్థకత ఉందని తల్లులు తలచే ధర్మకాలం మారుతోందా మెల్లమెల్లగా! శిశువుకు చన్నివ్వడం శరీరాకృతిని వికృతంగా మార్చే హీనచర్య- అనే అపోహ మాతలను బెబ్బులికన్నా ఎక్కువగా బెదరగొడుతోందా? బతుకు పోరాటంలో పెరుగుతున్న ఒత్తిళ్లు పొత్తిళ్ల పాపాయిలను తల్లి ఒడినుంచి ఎడమ చేయడం కాదనలేని చేదునిజం.
ప్రసవానంతరం మూడు రోజులపాటు స్రవించే ముర్రుపాలు- శిశుదశలోనే రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని అపరిమితంగా పెంచే దివ్యౌషధం. ఎదుగుదల దశలో బిడ్డ ఎదుర్కొనే వివిధ వ్యాధులకు నివారణ మంత్రం- తదనంతరమూ తల్లిద్వారా అందే ఆ క్షీరామృతం. తాగినంత కాలమే కాదు తల్లిపాలతో మేలు... పాలు తాగడమనే చిన్న కిస్తీ క్రమం తప్పకుండా చెల్లిస్తే చాలు- ముందున్న బతుకంతా అందుతుంది ఆరోగ్య బీమా. స్తన్యక్షీరం ఒక్క కన్నయ్యకే కాదు... కన్నతల్లి దైహిక మానసిక వికాసానికీ ఎంతో మేలు- అంటోంది అష్టాంగ హృదయ సంహిత. నివార్యమైన ఎన్నో తల్లి రుగ్మతలకు సంతోషకరమైన సంజీవని సూత్రం చంటిబిడ్డకు చెంగుచాటు నుంచి చన్నిచ్చే సహజ కార్యం. తనివితీరా చిట్టిపాపకు చనుబాలు అందించడం అందాన్ని హరించే హీన చర్య కాదు. గుండెబరువును దింపుకొనే ఆ ఆనందకర యోగం ఆడతనం అందాలను మరింత మెరుగులు పరచే సౌందర్య సాధనమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలోని నస్యకర్మ విధి కోసమూ, కంటివ్యాధులకు చేసే 'తర్పణం' చికిత్స విధానం కోసమూ ఓ మందుగా వాడుతుండటమే చనుబాల విశేష ఔషధగుణానికి తిరుగులేని తార్కాణం. నాలుగు వందల పోషక పదార్థాలు రంగరించి ఉండే తల్లిపాలకు ఏ ఆవు, మేక, ఒంటె, డబ్బా పాలు ప్రత్యామ్నాయాలు కాలేవు. 'నాలుగువేల క్షీరదాల్లో అత్యున్నతమైనది మానవజన్మ. మరి మనిషికొక్కడికే ఈ తల్లిపాల విషయంలో శషభిషలెందుకో? స్తన్య స్పర్శ హర్షానుభూతి తల్లికీ, క్షీరామృత ప్రేమ వర్షానుభూతి బిడ్డకీ ఎన్ని జన్మలెత్తితే మళ్ళీ అనుభవానికందేను? తల్లిపాలు తాగి పెరిగే కన్నయ్యలకే లోకమంతా వ్రేపల్లెలా లోకులంతా యశోదమ్మలుగా తోచే అవకాశం అధికంగా ఉందని 'ది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్' తాజా వ్యాసం చెబుతోంది.
Labels: Life/ children / telugu
Monday, September 27, 2010
టీనేజీ ............ గెలుపు ఈజీ....

పదహారేళ్ల వయసంటే... అయస్కాంతాల మధ్య ఇనుపరజం. చౌరస్తాలో బాటసారి. సరికొత్త అనుభవాల అన్వేషి. బోలెడన్ని ఆకర్షణలు. బోలెడన్ని భ్రమలు. బోలెడన్ని సందేహాలు. బోలెడన్ని అపోహలు. ఎలా
నిలవాలి? ఎలా గెలవాలి?
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వవికాస రచయిత స్టీఫెన్‌కోవె తనయుడు సీన్‌కోవె తన కౌమార అనుభవాల్ని రంగరించి రాసిన సప్తసోపానాల వికాస సూత్రాలివి...
ఓ శిల్పి తదేకదీక్షతో రాతిని రమణీయమైన శిల్పంగా తీర్చిదిద్దుతున్నాడు... అదే ప్రపంచమైనట్టు, అదే జీవిత లక్ష్యమన్నట్టు. సరిగ్గా అలాంటి శిల్పమే ఓ మూలనపడుంది. అటుగా వెళ్తున్న యాత్రికుడు దాన్ని చూశాడు. అద్భుతంగా ఉంది. జీవకళ ఉట్టిపడుతోంది. అంత గొప్ప శిల్పం ఉండగా, మరొకటి చెక్కాల్సిన పనేముంది? లేదంటే, రెండూ అవసరమై ఉండాలి. శిల్పి సేదదీరుతున్న సమయంలో, యాత్రికుడు మాటలు కలిపాడు. సందేహం వెలిబుచ్చాడు.శిల్పి ఓ నవ్వు నవ్వి, ఇలా చెప్పాడు... 'వెుదటి శిల్పం పూర్తికావస్తున్న సమయంలో ఒక పొరపాటు జరిగింది. అందుకే దాన్ని పక్కనపెట్టి, మరొకటి చెక్కుతున్నాను'.
'ఎంత జాగ్రత్తగా గమనించినా, ఒక్కటంటే ఒక్క లోపం కూడా కనబడటంలేదే'... మరోసారి శిల్పాన్ని తదేకంగా చూస్తూ చెప్పాడు యాత్రికుడు.
'విగ్రహం వెుహం మీద చిన్న గాటు పడింది' చూపించాడు శిల్పి. అమరశిల్పి అనవసరంగా కష్టపడుతున్నాడేవో అనిపించింది యాత్రికుడికి. 'అయినా దాన్ని పది అడుగుల గద్దె మీద కదా ప్రతిష్ఠించేది? అంత చిన్న లోపం ఎవరికి తెలుస్తుంది?...' సలహా ఇవ్వబోయాడు.
'నాకు తెలుస్తుంది' స్థిరంగా జవాబిచ్చాడు శిల్పి.
ఎవరో గుర్తించాల్సిన పన్లేదు. ఎవరో వేలెత్తిచూపించాల్సిన పన్లేదు. ఎవరో సరిదిద్దాల్సిన పన్లేదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. మనతప్పుల్ని మనమే సరిచేసుకోవాలి. మన లోపాల్ని మనమే అధిగమించాలి.ఎందుకంటే, ఈ జీవితం మనది!
ఆ ప్రయత్నంలో టీనేజీ పిల్లలకు ఉపకరించే లక్ష్యంతో 'సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ టీనేజర్స్'
రచయిత సీన్‌కోవె ఈ ఏడు సూత్రాల్నీ రూపొందించారు.

విజేతలు రెండు దశల్లో ప్రాణం పోసుకుంటారు.
తొలి దశలో... తమను తాము గెలుస్తారు. రెండో దశలో... ప్రపంచాన్ని గెలుస్తారు.
తొలి విజయం లేకుండా, మలి విజయం అసాధ్యం. తమనుతాము గెలిచే ప్రక్రియ టీనేజీలోనే ప్రారంభం కావాలి. ఆ లక్ష్యసాధనలో ఈ ఏడుమెట్ల నిచ్చెన ఉపయోగపడుతుంది.
1 డ్రైవరు మీరే!
సోషలిస్టు నేత థామస్‌మూర్ ఉరికంబం ముందు నిలబడ్డాడు. ఆ మహానేత ప్రాణాలు తీయలేక తలారి వణికిపోతున్నాడు. 'నా మెడ కాస్త పొట్టి. సరిగ్గా చూసి తాడు బిగించు. నీ వృత్తికి కళంకం తెచ్చుకోవద్దు' అతన్ని హెచ్చరించాడు మూర్. 'ఏంటోయ్! మరీ విడ్డూరం కాకపోతే, నా గెడ్డానికి కూడా ఉరేస్తావా? అదేం తప్పుచేసింది పాపం!'... అని జోకేశాడు కూడా. ఉరితాడు మెల్లమెల్లగా బిగుసుకుంటోంది. మరు నిమిషంలో మరణం తప్పదు. ఆ పరిస్థితుల్లోనూ మూర్ నవ్వుతూనే ఉన్నాడు.
ఆయనతో పోల్చుకుంటే మీ కష్టాలు ఏపాటి? పరీక్షలో ఫెయిల్ అయితే, మళ్లీ రాసుకోవచ్చు. ఇంజినీరింగ్‌లో సీటు రాకపోతే, ఇంకేదైనా మంచి కోర్సులో చేరిపోవచ్చు. ప్రేమించిన అమ్మాయో, అబ్బాయో కాదన్నంత మాత్రాన జీవితం ముగిసిపోదు. ఆమాత్రం దానికే వణికిపోతారెందుకు? కొందరైతే అతిగా స్పందించి, చావులో పరిష్కారం వెతుక్కుంటారు. ఎంత మూర్ఖత్వం! ఈ జీవితం మీది. మీ బండికి మీరే చోదకులు. ఎవరో స్టీరింగ్ తీసేసుకుంటే, ఇంకెవరో తాళాలు లాగేసుకుంటే బిక్కవెుహం వేసుకుంటారా? ముక్కున వేలేసుకుని చూస్తారా?
అనగనగా ఓ అమ్మాయి. ఏదో కాలేజీలో చదువుతోంది. బస్‌స్టాప్‌లో రోమియో పిచ్చిచూపులతో గుచ్చిగుచ్చి చూస్తాడు. బస్సులో కండక్టరు కావాలనే చేయి తగిలిస్తాడు. క్లాసులో ఎవరో నల్లగా ఉన్నావనో తెల్లగా ఉన్నావనో, పొట్టిగా ఉన్నావనో పొడుగ్గా ఉన్నావనో కామెంట్ చేస్తారు. రికార్డు దాఖలుచేయలేదని ప్రొఫెసరు చివాట్లు పెడతాడు. పరధ్యానంగా రోడ్డు దాటుతుంటే బైక్‌వాలా 'కళ్లు దొబ్బేశాయా?'అని నోటికొచ్చినట్టు తిట్టేశాడు. ఆలోచిస్తూ కూర్చుంటే ప్రతీదీ సమస్యే! అయినా, మనం సమస్యల్ని నియంత్రించలేం. అది మన చేతుల్లో లేదు. కానీ, ఎలా స్పందించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది.
హిమాలయ యాత్రకు బయల్దేరాం. దార్లో పొరపాటున బురదలో కాలేశాం. లేదంటే, పక్కనుంచి వెళ్తున్న వాహనం మన మీద బురదనీళ్లు చిందించి వెళ్లింది. ఆమాత్రం దానికి ప్రయాణమే ఆపేస్తామా? లేదు. శుభ్రంగా కడుక్కుని ముందుకెళ్తాం. జీవితమూ అంతే. అవరోధాల్ని దాటుకుని గమ్యాన్ని చేరుకోవాలి. మీ ప్రయాణాన్ని మీరే నిర్ణయించుకున్నట్టు... మీ జీవితాన్ని కూడా మీరే నిర్ణయించుకోండి... ప్రేమికుడో, పరిచయస్థుడో, దారినపోయే దానయ్యో మీమీద పెత్తనం చెలాయించడం ఏమిటి?
2 మీ దారి... రహదారి!
మన బండికి మనమే డ్రైవర్లమన్నది వెుదటి పాఠం. ఆ బండిని ఏవైపు నడిపించాలన్నది రెండో పాఠం.
నీ లక్ష్యం ఏమిటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? ఐదేళ్ల తర్వాత, పదేళ్ల తర్వాత, పాతికేళ్ల తర్వాత... నిన్ను నీవు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు?
బొమ్మ వేసేముందు చిత్రకారుడు ఓ చిత్తుప్రతిని గీసుకుంటాడు. తన చిత్రానికి ఏ రంగులు వాడాలో, ఏ మిశ్రమాలు సరిపోతాయో, ఏ భావాలు పలికించాలో, ఏ ధరకు అమ్ముకోవాలో ముందే
నిర్ణయించుకుంటాడు.

కథ రాసేముందు రచయిత ప్లాట్ సిద్ధంచేసుకుంటాడు. ఏ పాత్ర స్వభావం ఎలా ఉండాలో, కథని ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో, ఏ ప్రచురణ సంస్థకు ఇవ్వాలో కచ్చితంగా ఆలోచించుకుంటాడు.
ఓ సివిల్స్ విజేత... ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచే తన పేరు పక్కన 'ఐఏఎస్' అని రాసుకునేవాడు. ఏ సమస్య వచ్చినా కలెక్టరులానే ఆలోచించేవాడు. అంతే బాధ్యతగా వ్యవహరించేవాడు. దీంతో నాయకత్వ అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ఆ చురుకుదనం సివిల్స్ ఇంటర్వ్యూలో మంచిమార్కులు తెచ్చిపెట్టింది. ఎప్పటి నుంచో తను ఐఏఎస్ అధికారిలా ఆలోచిస్తున్నాడు కాబట్టి, ఉద్యోగం కూడా మరీ కొత్తగా అనిపించలేదు. కొద్దికాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నాడు.
'1980 నాటికంతా నేను గొప్ప నటుడిని అవుతాను. ఒక్కో సినిమాకు పది మిలియన్ల పారితోషికం తీసుకుంటాను. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సంతృప్తి పరుస్తాను. హాయిగా ఆనందంగా జీవితం సాగిస్తాను'... 1970లో బ్రూస్‌లీ పదేళ్ల ప్రణాళికతో తనకుతాను రాసుకున్న లేఖ ఇది.
ప్రారంభంలోనే... ముగింపు గురించి ఆలోచించడం అంటే ఇదే!
టీనేజీకి వచ్చారు. ఐదారేళ్లలో చదువు ఓ దారికి వచ్చేస్తుంది. ఆతర్వాత..సమాజంలో మీ పాత్ర ఏమిటి? నటుడా, గాయకుడా, ఇంజినీరా, రాజకీయనాయకుడా? వ్యాపారవేత్తా? దీన్నే వ్యక్తిత్వవికాస నిపుణులు 'కోర్‌కాంపిటెన్సీ' అంటారు. ఆ స్పష్టత మీకుందా? ఈ విషయంలో ఒకటే గీటురాయి. ఏపని చేస్తున్నప్పుడు మీకు, అదసలు పనే అనిపించదో, ఏ పనిలో మిమ్మల్ని మీరు మరచిపోతారో... అదే మీ కోర్‌కాంపిటెన్సీ. ఆవైపుగా అడుగులు వేయండి.
బ్లాట్‌నిక్ అనే నిపుణుడు ఇరవై ఏళ్లపాటు పదిహేనువందల మంది యువతీయువకుల కెరీర్ ఎదుగుదలను పరిశీలించాడు. అందులో రెండురకాల వారున్నారు.
సంపాదనతో సంబంధం లేకుండా తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్నవారు(ఎ).
అభిరుచిని పట్టించుకోకుండా సంపాదనే ధ్యేయంగా వృత్తి, ఉద్యోగాల్ని ఎంచుకున్నవారు (బి).
ఇరవై ఒకటో సంవత్సరం నాటికి ఆ జాబితాలో ఉన్నవారిలో దాదాపు వందమంది కోటీశ్వరులయ్యారు. వారిలో 99మంది ఎ గ్రూపువారే!
మీరిప్పుడు సరిగ్గా చౌరస్తాలో ఉన్నారు. చుట్టూ నాలుగు దార్లున్నాయి. ఏవేవో ప్రభావాలు ఆకర్షిస్తున్నాయి. ఇంకేవో భ్రమలు ఊరిస్తున్నాయి. ఇదీ అని తెలియని పిచ్చి ఆవేశం పదపదమని తొందరపెడుతోంది. జాగ్రత్త. అడుగు వేసేముందే బాగా ఆలోచించుకోండి. జారేది కాలు కాదు... బంగారు భవిష్యత్!
'నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఇంగ్లిష్ గడగడా మాట్లాడలేను. సివిల్స్ రాయడం కష్టమేవో'
'నాకు కాస్త నత్తి. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ. క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గుకురాలేనేవో'
'ఎంబీయే చదివినా, వ్యాపారంలో విజయం సాధించలేనేవో. మా కుటుంబంలో ఎవరికీ వ్యాపారం అచ్చిరాలేదు'
... మీ కారు రివ్వున దూసుకుపోతుంది. ఇంజిన్ మంచి కండిషన్‌లో ఉంది. పెట్రోలు కూడా దండిగానే ఉంది. అద్దాలు మాత్రం దుమ్ముపట్టిపోయాయి. వాటి గుండా చూస్తే దారి మసకమసగ్గా కనిపిస్తుంది. అలానే, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వల్లే లేనిపోని సందేహాలు పుట్టుకొస్తాయి. అద్దాన్ని శుభ్రంగా తుడుచుకుంటే దారి స్పష్టమైనట్టు, అపోహల్ని తొలగించుకుంటే లక్ష్యసాధన సులభమైపోతుంది.
3 ఆరోగ్యం జాగ్రత్త!
టీనేజీలో స్నేహితులు పెరుగుతారు. తిరుగుళ్లు పెరుగుతాయి. చిరుతిళ్లు ఎక్కువవుతాయి. కొత్త అలవాట్లు వూరిస్తుంటాయి. అర్ధరాత్రిదాకా టీవీలూ ఇంటర్నెట్ వ్యసనాలు. సెల్‌ఫోన్ కబుర్లకైతే అంతే ఉండదు. నిద్ర కరవైపోతుంది. ఆరోగ్యం సంగతే పట్టించుకోం. మన మీద మనకు నియంత్రణ తగ్గుతుంది. ఇవన్నీ శరీరానికీ మనసుకూ హానికలిగించేవే. ఆ ప్రభావాల నుంచి బయటపడాలి. శక్తినిచ్చే భోజనం చేయాలి. కంటినిండా నిద్రపోవాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. మెదడుకు ఓ రకమైన వ్యాయామం అవసరం. హృదయానికి ఓ రకమైన వ్యాయామం అవసరం. ఆత్మకు ఓ రకమైన వ్యాయామం అవసరం. ఆరోగ్యవంతులం అనిపించుకోవాలంటే, ఈ నాలుగూ ముఖ్యమే.
ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. అందులోనూ, మానసిక ఆరోగ్యానికి... విజేతల ఆత్మకథలు, మహావ్యక్తుల జీవిత చరిత్రలు, ప్రపంచ సాహిత్యం చదవాలి. ఆలోచనలకూ భావాలకూ అక్షర రూపం ఇవ్వాలి. ఆత్మీయ స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకోవడం, వారాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం... ఇవన్నీ హృదయాన్ని తేలిగ్గా ఉంచే వ్యాపకాలు. ధ్యానం, ప్రార్థన, యోగా... ఎనలేని ఆధ్యాత్మిక శక్తినిస్తాయి.చదువంటే పాఠ్య పుస్తకాలొక్కటే కాదు. ర్యాంకులే సర్వస్వం కాదు. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. అందులో కొత్తకొత్త విషయాలు తెలుసుకోండి. ఇంటర్నెట్‌లో మరింత సమాచారం వెతకండి. నిపుణులతో మాట్లాడండి. ఆలోచనలు విస్తరిస్తున్నకొద్దీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మూడేళ్లో నాలుగేళ్లో చదువుకున్నాక పట్టా ఇస్తారే, అంతకంటే వేయిరెట్లు విలువైంది ఈ అనుభవం.
4. ముందు... వెనుక
పొద్దున్నే క్లాసులు. మధ్యాహ్నం క్రికెట్. సాయంత్రం ఐఐటీ కోసవో, ఎంసెట్ కోసవో కోచింగ్ సెంటర్‌కు పరుగులు. అర్ధరాత్రి దాకా ప్రాజెక్టు పనులు. మధ్యమధ్యలో స్నేహితులతో కబుర్లు, ఇంటర్నెట్ ఛాటింగులు, సినిమాలు, షికార్లు. నిజమే, కౌమారం మునుపెన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మీరంతా వయసుకు మించిన బరువు వోస్తున్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. అది మీ సూట్‌కేసులోనే ఉంది! ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు. సూట్‌కేస్ సర్దుకుంటున్నారు. ముందుగా ఏం చేస్తారు... బట్టలు పెట్టుకుంటారు. ఆతర్వాత టూత్‌బ్రష్, పేస్టు, సబ్బులు గట్రా. అన్నీ అయ్యాక ఖాళీ ఉంటే, ఒకట్రెండు పత్రికలు!
అలానే, లక్ష్యాలకూ ఓ ప్రాధాన్యతా క్రమం ఉండాలి. ముందేది వెనకేది... అన్నది నిర్ణయించుకోవాలి.
ఏది అవసరవో, ఏది అనవసరవో తేల్చుకోవాలి.
అ. అతి ముఖ్యమైన పనులు:
వీటికే తొలి ప్రాధాన్యం. ఇవి జీవితానికీ లక్ష్యాలకూ సంబంధించినవి. ఉదా: పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడం.ఆ. ముఖ్యమైన పనులు:
వీటి ప్రభావం వెంటనే కనిపించదు. కానీ జీవితానికి చాలా అవసరం. ఉదా: విశ్రాంతి, అనుబంధాలు, వ్యాయామం, భవిష్యత్ ప్రణాళిక.
ఇ. అత్యవసరమైన పనులు:
తక్షణం చేయకపోతే ఇబ్బంది కలిగించే పనులు. ఉదా: కాలేజీలో రికార్డులు ఇచ్చేయడం. అనారోగ్యం కలిగినప్పుడు డాక్టరుకు చూపించుకోవడం.
ఈ. అత్యవసరమూ అతిముఖ్యమూ కాని పనులు.
ఉదా: స్నేహితులతో సినిమాకు వెళ్లడం, టీవీ చూడటం, నెట్ ఛాటింగ్, బ్లాగింగ్ వగైరా.
ఒక్కసారి పరిశీలించుకుంటే, మన సమయాన్ని మనం ఏ విభాగానికి ఎక్కువగా కేటాయిస్తున్నావో అర్థమైపోతుంది. 'ఈ' విభాగమే ఎక్కువ తినేస్తుంటే మాత్రం, తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో తొలిదశలో కొన్ని వైఫల్యాలు ఉండొచ్చు. ఎదురుదెబ్బలు తగలొచ్చు. సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ ముందుకెళ్లడమే? మీరెప్పుడూ ఓడిపోలేదంటే, మీరెప్పుడూ ప్రయత్నించలేదనే అర్థం!
5 కలసికట్టుగా
ఆకాశంలో పక్షులు ఎగురుతున్న దృశ్యం చూశారా? ఒకటీరెండూ కాదు, గుంపులుగుంపులుగా 'వి' ఆకారంలో వెళ్తుంటాయి. ఆ సపరివార యాత్రను అధ్యయనం చేస్తే, చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. వాటిలో ఒకటి లీడర్‌గా వ్యవహరిస్తుంది. మిగిలినవి అనుచర పక్షులు. అవి నాయకుడ్ని అనుసరిస్తాయి. దీనివల్ల దారి వెతుక్కోవాల్సిన ఒత్తిడి తగ్గుతుంది. ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి కాబట్టి, గాలి తీవ్రత పెద్దగా ఉండదు. ప్రయాణవేగం పెరుగుతుంది. లీడరు అలసిపోతే, ఆ బాధ్యత ఇంకో పక్షి తీసుకుంటుంది. దార్లో ఏ పక్షికైనా అనారోగ్యంగా అనిపిస్తే, తోడుగా మరో పక్షి ఆగిపోతుంది. ఒకదానికి
ఎక్కడైనా ఆహారం కనిపిస్తే, ఆ సంగతి మిగిలినవాటికి చెబుతుంది. కలసి ప్రయాణించడంలో హాయి ఉంది. భద్రత ఉంది. భరోసా ఉంది.
మీ క్యాంపస్‌లో రాక్‌బ్యాండ్ ఉందా? సాయంత్రం క్లాసులైపోయాక, ఓసారి జామింగ్ సెషన్‌కు వెళ్లిచూడండి. ఒకరు డ్రమ్ వాయిస్తుంటారు. ఒకరు గిటారు మీటుతుంటారు. ఒకరు తన్మయంగా పాడుతుంటారు. ఆ స్వరాలన్నీ కలిస్తే అద్భుతమైన సంగీతం అవుతుంది. విడివిడిగా విన్నామంటే... చెవులు మూసుకోవాల్సిందే! ఆ సమన్వయం జీవితానికీ అవసరం.భారతంలో పాండవుల సంగతే తీసుకోండి. ఒకరు నీతిశాస్త్రంలో నిపుణులు. ఒకరు గదాయుద్ధంలో ఉద్ధండులు. ఒకరికి ధనుర్విద్యలో తిరుగులేదు. ఒకరు భవిష్యత్‌ను బేరీజువేయగలరు. ఒకరు వైద్యంలో నిష్ణాతులు. అలా అని అందరూ పరిపూర్ణులేం కాదు. ఎవరి బలహీనతలు వారికున్నాయి. కృష్ణుడు వాటిని అధిగమించేలా చేసి, ఆ నైపుణ్యాలను చక్కగా సమన్వయం చేశాడు. ఫలితం... వందమంది కౌరవులు కుప్పకూలారు!
మీ చుట్టూ రకరకాల మనస్తత్వాల వారుంటారు. కొందరు అతిగా మాట్లాడతారు. కొందరు మితంగా మాట్లాడతారు. రకరకాల అనుభవాలు ఎదురవుతాయి. కొందరు ప్రేమ కురిపిస్తారు. కొందరు అకారణంగా ద్వేషం ప్రదర్శిస్తారు. అందర్నీ కలుపుకుపోవాలి. ఎదుటి వ్యక్తిని యథాతథంగా ఆవోదించాలి. మనలో లేని నైపుణ్యాలు ఎదుటి వ్యక్తిలో ఉండొచ్చు. మనకు తెలియని విషయాలు మరొకరికి బాగా తెలిసుండవచ్చు. ఎదుటి వ్యక్తి మన అభిప్రాయాలతో విభేదించాడంటే... సమస్యను మనం రెండో కోణంలోంచి అర్థంచేసుకునే అవకాశం వచ్చినట్టే. ఎవరైనా మనల్ని విమర్శించారంటే మనలోని లోపాల్ని తెలుసుకునే అదృష్టం దక్కినట్టే. పాజిటివ్ ఆలోచనా ధోరణి పెంచుకుంటే... మనకు బాగా పరిచయమున్న మనుషులే సరికొత్తగా కనిపిస్తారు, రోజూ ఎదురయ్యే సమస్యలే పాఠాల్లా అనిపిస్తాయి.
6 బంధాలు-అనుబంధాలు
స్నేహితులతో ఎలా ఉంటారు?

లెక్చరర్లతో ఎలా ఉంటారు?
అమ్మానాన్నలతో ఎలా ఉంటారు?
తోబుట్టువులతో ఎలా ఉంటారు?
మానవ సంబంధాలన్నీ ఈ నాలుగు ప్రశ్నల చుట్టూ తిరుగుతాయి. బయటి ప్రపంచంతో మన అనుబంధాలు బ్యాంకు ఖాతా లాంటివి. డిపాజిట్ చేస్తున్నకొద్దీ బలపడతాయి. విత్‌డ్రా చేసుకుంటూపోతే తరిగిపోతాయి. ఇక్కడ, ఖాతా తెరవడం చాలా సులభం. ఓ చిరునవ్వు చాలు. 'హలిో' అన్న పలకరింపు చాలు. 'బావున్నారా' అన్న మాట చాలు. అయితే రికరింగ్ డిపాజిట్‌లా ఎప్పుడూ ఎంతోకొంత జమచేస్తూ ఉండాలి. చక్కని ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఇవ్వొచ్చు. అప్పుడప్పుడూ కాల్‌చేసి కబుర్లు చెప్పవచ్చు. ఓ పూట ఇంటికి పిలవొచ్చు. 'నీ డ్రస్ బావుంది', 'ప్రిన్సిపల్‌గారు మెచ్చుకున్నారటగా! కంగ్రాట్స్', 'నీ చేతిరాత బావుంటుంది', 'మమ్మీ! వంట అదుర్స్', 'మీ ఆరోగ్యం ఎలా ఉంది డాడీ!'... నిజాయతీగా ఇచ్చే ప్రశంస, అందించే ఓదార్పు నెలసరి వడ్డీల్లాంటివి. డిపాజిట్ వెుత్తాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఒక్క విషయం. స్నేహితుల ఖాతాలో అమాంతంగా డిపాజిట్లు పెరగడం, అమ్మానాన్నల ఖాతాలో కనీస వెుత్తం కూడా లేకపోవడం... మంచి లక్షణం కాదు. అన్ని ఖాతాల్లోనూ సరిసమానంగా పెరుగుదల కనిపించాలి.
హాస్యానికీ అపహాస్యానికీ మధ్య సున్నితమైన తేడా ఉంది. ఆ సంగతి తెలుసుకుని మాట్లాడాలి. అర్థంలేని వ్యాఖ్యానాలు, పరోక్షంలో చేసే విమర్శల వల్లే చాలా స్నేహాలు ప్రారంభంలోనే వీగిపోతాయి. 'గాసిప్స్' క్యాంపస్ స్నేహాలకు ప్రధాన శత్రువులు. ఆత్మన్యూనతలోంచే గాసిప్స్‌రాయుళ్లు పుట్టుకొస్తారు. స్నేహానికి నమ్మకం పునాది. మిత్రుడి రహస్యం గుండెల్లో దాచుకోవాలి. మిత్రుడి సమస్యల్ని హృదయంతో ఆలోచించాలి. కొన్నిసార్లు పొరపాట్లు జరగొచ్చు. మిత్రుడిని బాధపెట్టాల్సిరావచ్చు. అలాంటి సమయంలో మనస్ఫూర్తిగా 'సారీ' చెప్పాలి. బంధాన్ని నిలుపుకోడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.7 అర్థంచేసుకోండి!
డాడీ అర్థంచేసుకోడు. మమ్మీ అర్థంచేసుకోదు. ఫ్రెండ్స్ అర్థంచేసుకోరు. లెక్చరర్స్ అర్థంచేసుకోరు.
ఏదో ఒక సందర్భంలో వినిపించే ఫిర్యాదే ఇది. నిజమే, ఎవరూ అర్థంచేసుకోవడం లేదనే అనుకుందాం. మీ సంగతి ఏమిటి? ఏ మార్పు అయినా మననుంచే వెుదలు కావాలంటాడు మహాత్ముడు. ముందు మీరు అర్థంచేసుకోండి. ఆతర్వాతే మిమ్మల్ని అర్థంచేసుకోవాలని ఆశించండి.మాట్లాడనివ్వండి... ఆపైన, మాట్లాడండి.
మమ్మీని ఎప్పుడైనా మాట్లాడనిచ్చారా? తను ఏదైనా చెప్పబోతుంటే, వెంటనే తుంచేస్తారు. అన్నీ మీకే తెలిసినట్టు. ఆమె ఆలోచనలతో మీకేం పనిలేనట్టు. బైక్ కావాలి, లాప్‌టాప్ కావాలి, వెుబైల్ కావాలి... అని సతాయించడమే కానీ, ఎప్పుడైనా నాన్న మాటలు విన్నారా? నెల జీతంతో కుటుంబ ఖర్చులు, చదువులు, తాతయ్య నానమ్మలకి మందుల ఖర్చులు, సమీప బంధువుల అవసరాలు ...అన్నీ ఎలా తీరుస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన్ని అడిగారా? ఫ్రెండ్స్‌తోనూ అంతే. అభిప్రాయాలూ ఆలోచనలూ అనుభవాలూ కష్టాలూ మనసు విప్పి చెప్పనివ్వండి. ఇదంతా అర్థంచేసుకునే ప్రక్రియలో భాగమే.
ఏ అనారోగ్యంతోనో డాక్టరు దగ్గరికి వెళ్లినప్పుడు... మనం చెప్పేది ఆయన ఆసాంతం వినాలని కోరుకుంటాం. మన మనసులో ఉన్నదంతా చెప్పేయగానే, సగం రోగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అదే ఆ డాక్టరుగారు... మన మాటలతో ప్రమేయం లేకుండా, మనం చెప్పేది పట్టించుకోకుండా తన మానాన తాను సూదిమందు సిద్ధంచేసుకుంటూ ఉంటే, మహాచిరాకేస్తుంది. ఆ మందులు పనిచేసినట్టే అనిపించదు. మాటలకున్న శక్తి అలాంటిది. ఎదుటి మనిషి మనసులోకి తొంగిచూడటానికి మాటలు కిటికీల్లా పనిచేస్తాయి.స్నేహితుడో బంధువో మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు... ఓ అద్దంలా స్పందించాలి. అద్దాలు అర్థంలేని వ్యాఖ్యానాలు చేయవు. ఉచిత సలహాలు అంటగట్టవు. అకారణంగా జాలిచూపవు. ఒక సత్యాన్ని యథాతథంగా ఆవోదిస్తాయంతే. మనం చేయాల్సిందీ అదే.
ఏం ఆలోచిస్తావో, అదే చేస్తాం. ఏం చేస్తావో, అదే మన 'అలవాటు' అవుతుంది. ఆ అలవాట్లే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. ఆ వ్యక్తిత్వమే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అంటే ఆలోచనతో వెుదలుపెట్టి, గమ్యానికి చేరుకునేదాకా... అంతా మన చేతుల్లోనే ఉంది. ఒక మంచి అలవాటు మన జీవితంలో భాగమైపోవడానికి ముపైశ్పరోజులు చాలు. ఆ తర్వాత ఓ గొప్ప మార్పు వెుదలవుతుంది. మనమీద మనకు నియంత్రణ వస్తుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. జీవితమంటే స్పష్టత వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* * *
టీనేజీ పిల్లలకు నా సలహా...
జీవితంలో అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ఒక్కసారి కూడా సర్వశక్తులూ ఒడ్డి పోరాడకపోవడం. ఒక్కసారి కూడా నలుగురి ముందూ సగర్వంగా, నిటారుగా నిలబడలేకపోవడం. ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకండి!
- అర్నాల్డ్ బెన్నెట్
_____________________________
(ఈనాడు, సండే స్పెషల్, ౧౨:౦౯:౨౦౧౦)
_____________________________
Wednesday, August 25, 2010
అనురాగ బంధాలు
ఒకే నెత్తురు పంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్లు. అక్కాతమ్ముళ్ల పేగుబంధం ఎప్పటికీ తెగిపోనిది. అది- ఎన్నటికీ చెరిగిపోని పుట్టుమచ్చలా శాశ్వతమైనది. పెళ్లిమంటపంలో అమ్మచేతిని పట్టుకుని నాన్నారు ప్రమాణపూర్వకంగా పఠించిన మంత్రార్థంలా పవిత్రమైనది. అమ్మ పంచి ఇచ్చిన ప్రాణరక్తమంత చిక్కనైనది. ఒకరిపై ఒకరికిగల మమతలు, అనురాగాలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఎల్లవేళలా మారాకు తొడుగుతూనే ఉంటాయి. పసిప్రాయంలో తోబుట్టువుల అల్లరిలో ఎన్ని చిన్నెలో! ఆటలూ పాటలూ, అచ్చట్లూ ముచ్చట్లూ... అంతలోనే రగడలూ, జగడాలు- పిల్లలున్న ప్రతి ఇంటా నిత్యం ప్రత్యక్షమయ్యే సందడే. తమకన్నా ముందుగా పుట్టినంత మాత్రాన అన్నలు, అక్కలు తమపై పెత్తనం చలాయించడాన్ని చెల్లెళ్లు, తమ్ముళ్లు సుతరామూ ఒప్పుకోరు. చిన్నపాపాయి పెద్దబుజ్జాయిపై కళ్లెగరేస్తుంది. తనకన్నా పెద్ద చిన్నారిపై చిన్నబుడతడు తలెగరేస్తాడు. ఒకరితో ఒకరు కలబడటాలు, ఒకరినొకరు కొట్టుకోవడాలు, ఇవతలివారి బుగ్గలపై గిచ్చుళ్లు, అవతలివారి వీపులపై పిడిగుద్దులు... ఇలా పసితనాన ఆ గడుగ్గాయలు సాగించే అల్లరల్లరి విన్యాసాలు ఇంటింటి ముచ్చటే. పిల్లల రగడలపై పంచాయితీకి పెద్దలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే, ఆరుద్ర అన్నట్లు 'తీసుకోకూడదు రైటు చేసినవాళ్ల వాంగ్మూలం/ తీరా రెండో సైడు వింటే అది రాంగ్మూలం'. కాబట్టి నిజంగా రచ్చచేసిన 'బాలనేరస్తులు' ఎవరో తేల్చడం ఓ పట్టాన తెమలని పని. ఎప్పటికప్పుడు పేచీ పెట్టుకోవడం, అప్పటికప్పుడే రాజీకి రావడం, ఎప్పటిలా తిరిగి కలిసిపోవడం చిన్నారి 'నియంతల' పెద్ద మనసు!అమ్మ తమకు తోడుగా మరో చిచ్చరపిడుగును అందించబోయే వేళ తెలుగు చిన్నారి పెద్ద ఆరిందాలా 'తామర పువ్వంటీ తమ్ముణ్నియ్యావే' అంటూ కూనిరాగం తీస్తుంటే ఎంత వినవేడుక! అదే శ్రుతిలో 'చేమంతి పువ్వంటీ చెల్లెల్నియ్యావే' అంటూ తెలుగు బుడతడు తన సోదరికి పోటీగా వస్తుంటే ఎంత కనసొంపు! తామర పువ్వంటి అన్నదమ్ముల ముంజేతికి కట్టే వీసమెత్తు రాఖీ- తమకు కలకాలం రక్షరేకై అభయమివ్వాలన్నది ఆడపడుచుల ఆకాంక్ష. చేమంతి పువ్వంటి అక్కాచెల్లెళ్లకు తాము పెట్టే పసుపు, కుంకుమలు కలకాలం వెలుగులీనుతుండాలన్నది అన్నదమ్ముల శుభకామన. 'అత్తవారింట భాగ్యం బెంత గల్గిన/ ఆకాశము పొడవు తన కాపురంబుండిన/ మొదట పుట్టింటాశ వదలదింతులకు...' అన్నారు పెద్దలు. ఆడపిల్ల అలా ఆశపడటం- పుట్టినింటివారి పెట్టుపోతల గురించి మెట్టినింటిలో ఘనంగా చాటుకోవడానికే. ఆ విషయంలో తోడబుట్టినవారు ఏ లోటూ చేయకపోయినా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఓ చిన్న లోపానికి అత్తవారింట ఆమె మాటపడే సందర్భాలూ ఉంటాయి. తెల్లని కాకులు లేనట్లే, అల్లునిలో మంచితనమూ ఉండదన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. బహుశా నరుడు అని పేరున్నందుకు కాబోలు అర్జునుడూ ఆ కవి వాక్కును ఒకసారి నిజం చేశాడు. అత్తారింటివారు తనను పిలవలేదని అలిగాడు. 'పున్నమినాడైన బూరెలు వండుకొని, అల్లుడా రమ్మని పిల్చిరె మీవాళ్లు?/ అమావాస్యనాడైన అట్లు వండుకుని, అల్లుడా రమ్మని పిల్చిరె మీవాళ్లు?' అంటూ భార్య సుభద్రపై రుసరుసలాడాడు. ఆ ఆడకూతురు నొచ్చుకుంది. ఎంతైనా ఇద్దరు అన్నల గారాల చెల్లెలు ఆమె! తన పుట్టింటివారిపై మర్యాద తెలియనివాళ్లని పెనిమిటి ముద్రవేయడాన్ని సహించలేకపోయింది. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరగడంతో సుభద్ర అలిగి పుట్టింటికి వెళ్లింది. చిన్నన్న శ్రీకృష్ణుడు ఆమెకు ఘనంగా సారె పెట్టడం గిట్టని వదినెలు సూటిపోటి మాటలన్నా 'కొన్న మానిసులంటె కొదవేమి మనకు?' అని సముదాయిస్తూ ఆయన చెల్లెమ్మను సగౌరవంగా అత్తవారింటికి సాగనంపాడు. మానవ స్వభావాన్ని పురాణ పాత్రలకు ఆపాదిస్తున్న ఈ జానపదం అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు అద్దంపట్టేదే. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పిల్లలను మేనకోడళ్లు, మేనల్లుళ్లు అని ఎందుకంటారు? మేనుకు మేనైనవారు కనుకనే.
పుట్టిల్లు, అత్తవారిల్లు- ఆడపిల్లలకు తమవైన సామ్రాజ్యాలే. 'అన్నలైతే పసిడి అందెలిస్తారు, తమ్ములైతే వేలు సొమ్ములిస్తారు/ గౌరవానికిగాని, ఘనతకుగాని/ తన పుట్టినింటిలో తాను దొరసాని/ మెట్టినింట ఉంటె మగువ యువరాణి' అంటూ తెలుగు ఆడపడుచుల శిరస్సులపై అశీరక్షతలు జల్లాడు తన అక్షరాల్లో కృష్ణశాస్త్రి. అన్నలూ తమ్ముళ్లూ ఇచ్చే ఆ సొమ్ములేపాటివి అనిపించేంతగా వారిపై ఆడపడుచులు ప్రేమానురాగాలు కురిపించడం రక్తసంబంధంలోని గొప్పదనం. దూరాన ఉన్నా అది- మనసులను, మనుషులను నిత్యం కలిపి ఉంచే జీవన సూత్రం. తమ పుట్టినింటివారు పదికాలాలపాటు చల్లగా ఉండాలని, మెట్టినింటిలో ఉన్న ఆ యువరాణుల శుభకామన- వారి తోడబుట్టినవారికి దివ్య దీవెన. తోబుట్టువులకు అంతకుమించిన ఆనందమేముంటుంది? సోదరి చెంత ఉంటే సోదరుల జీవితం సంతోషదాయకంగా ఉంటుందని శాస్త్రజ్ఞులూ చెబుతున్నారు. సోదరీ సోదరుల మధ్య పెనవేసుకున్న అనుబంధం వారి జీవితాల్ని అమితంగా ప్రభావితం చేసినట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త లారా పడిల్కా వాకర్ అంటున్నారు. అక్కాచెల్లెళ్లున్న కుటుంబంలోని మగపిల్లల్లో దాతృత్వ గుణం అధికంగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలడం- పెట్టుపోతల విషయంలో ఆడపిల్లలే ఆ ఇంటిలోని మగపిల్లలకు తొలి గురువులు అనడానికి నిదర్శనం. ఒంటరితనం, అపరాధ భావన, భయం, ఒత్తిడి వంటివాటినుంచి మగపిల్లల్ని బయటపడేసేదీ ఆ బంగారుతల్లుల ఆసరాయే. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు తల్లి లాలనను అందిస్తున్నారనడానికి ఇంతకన్నా దాఖలా ఏముంటుంది? రక్తసంబంధం నిరంతరం పరిమళ భరితమే.
(ఈనాడు, సంపాదకీయం, ౦౮:౦౮:౨౦౧౦)
____________________________
Labels: Life/ children / telugu
Sunday, June 20, 2010
కని పెంచే విధాతలు
జన్మప్రదాతలను దైవపీఠంపై ప్రతిష్ఠించిన మహోన్నత సంస్కృతి మనది. తమకు దేహాన్నిచ్చి, రూపందిద్ది, ప్రాణం పోసి, చలనాన్ని కల్పించిన తల్లిదండ్రులను 'మాతృదేవోభవ... పితృదేవోభవ' అన్న మూలమంత్రంతో అర్చించే మహత్తర సంప్రదాయానికి వారసులు ఇక్కడి పిల్లలు! బిడ్డలు అమ్మానాన్నల అనురాగ ఫలాలు. ఆశాదీపాలు. కంటివెలుగులు. పసితనాన 'అంగరక్ష, ఆదిరక్ష, దీపరక్ష, చిన్ని నా బుజ్జాయికి శ్రీరామరక్ష'- అంటూ కన్నతల్లి నోట జాలువారిన జోలపాట... చిరుతప్రాయానేకాదు, జీవనపర్యంతమూ వ్యక్తిని ఆశీర్వదించే ఆరో వేదమే. నాన్నారు అదిలించే వేళ, ధీమాగా దాక్కోవడానికి అమ్మ అందించే చీరకొంగుచాటు పాపడికి చిలిపి రక్ష! అమ్మ గసిరే సమయాన, లెక్కలేనట్లుగా లేడిపిల్లలా చెంగున వచ్చి వాలేందుకు గుడిగా మలచిన నాన్నారి ఒడి చిన్నారికి గడుసు రక్ష! ఇతరుల పిల్లలకంటే తమ కలల పంటలే జనమెచ్చు బిడ్డలని ప్రతి తల్లీ తండ్రీ గర్వించడం లోకసహజం. 'వీధినెందరు వున్న విసరదే గాలి- రచ్చనెందరు వున్న రాదమ్మ వాన/ చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె- మొగిలిపువ్వుల గాలి, ముత్యాల వాన' అని మురిసిపోయే అమ్మ గళంతో అబ్బాయి తండ్రీ శ్రుతి కలపడం తెలుగింటి మురిపెం. బుగ్గలు సొట్టపడేలా తమ అమ్మణ్ని 'కిలకిలా నవ్వితే కలువల్లు పూసె- కలువరేకులేమొ కలికి చూపుల్లు' అనీ అయ్య, అమ్మ పరవశించడం తెలుగు లోగిళ్ల ముచ్చట. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మణిమాణిక్యాలతో అభిషేకించలేకపోవచ్చుకానీ, వాటి కాంతుల్ని ధిక్కరించేలా మిలమిలమెరిసే మల్లెపువ్వుల్లాగా వారిని చూసుకుంటారు. బిడ్డలకు వారు పట్టుపరుపుల్ని అమర్చలేకపోతే మాత్రమేం, వాటి మెత్తదనం దిగదుడుపనిపించే తమ రెక్కల్నే వారికి పక్కలుగా పరుస్తారు. పసికూనలుగా తమ చిన్నారులు బుడిబుడి అడుగులు వేసే వేళ, వారికి ఆసరాగా తమ చేతుల్నే అందించేటప్పుడు అమ్మానాన్నలది అనిర్వచనీయమైన ఆనందమే. చేతికి అందివచ్చేదాకా, పిల్లల వడివడి నడకలకు ఆలంబనగా తమ భుజాల్నే దండెలుగా కూర్చేదీ అమ్మానాన్నలు కాక ఇంకెవ్వరీలోకంలో?
పొత్తిళ్లనాడే కాదు, ఎంత ఈడు వచ్చినా తమ సంతానం కన్నవారి కళ్లకు పసివాళ్లే. పెరిగి పెద్దయి పెళ్లిళ్త్లె మనవల్ని మనవరాళ్లను తమకు కానుక చేసిన వయసులోనూ తమ బిడ్డలు తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అందుకే- పెద్దవాళ్లయ్యాకా వాళ్లు కట్టెదుటే కనబడుతుంటే వారికో తృప్తి. కార్యార్థులై వెళ్లిన పిల్లలు గూటికి తిరిగి వచ్చిన క్షణాన వారికో సంతుష్టి. అలా రానివేళ వారి మదిని తొలుస్తూ ఏదో వెలితి. తాను ఒక్క నిమిషం కనబడకపోతేనే, ఊరంతా వెదికే తండ్రి, ఏ వేళా తనను ఇల్లు కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి- హిమాలయాల్లో చిక్కుబడిన తన జాడ తెలియక ఎంత దిగులు పడుతున్నారోనని ప్రవరుడు తల్లడిల్లుతాడు. ఇంటికి వెళ్లే దారి చూపమని వరూథినిని అభ్యర్థిస్తూ- 'జననీజనకుల్ కడువృద్ధులు/ ఆకటన్ సోలుచునెదురు సూచుచునుండెదరు' అని మొరపెట్టుకుంటాడు 'మనుచరిత్ర' కావ్యంలో. ప్రవరుడి తల్లిదండ్రుల ఆ ఆర్తి- బిడ్డల క్షేమాన్నే అనుక్షణం కాంక్షించే ప్రతి అమ్మ, అయ్య తపనలోనూ సాక్షాత్కరిస్తుంది. ఏ బిడ్డలకైనా అంతలా తపించేవారి కడుపుపంటగా పుట్టడంకంటే మరో భాగ్యం ఉంటుందా? మనిషి చేసే పుణ్యాల జాబితా ఎంత పొడవున్నా, ఆత్రేయలా- 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/నేను చేసిన పుణ్యము నేటివరకు' అని పలవరించడంకన్నా మహాపుణ్యం మరొకటి ఉంటుందా? 'సకల దురితహరము, సర్వసంపత్కరము/మాతృ పాదపద్మ మకరంద మాధుర్య సేవనమ్ము, దివ్యజీవనమ్ము' అన్నది మనసు కవి సూక్తి.
అలసిన రెక్కలతో జీవిత చరమాంకంలో ఉన్న అమ్మానాన్నల్ని కడుపున దాచుకుని కాపాడుకుంటున్న బిడ్డలున్నట్లే- ఆఖరి మజిలీలో విశ్రమించి 'అటు'వైపు ఒత్తిగిలే రోజుల్ని లెక్కపెట్టుకొంటున్న కన్నవారిని కాలదన్నుతున్న సుపుత్రులూ ఉన్నారు! బాల్యంలో తమ ఆకలి ఎరిగి, ఆయుష్యవర్ధనంలాంటి అన్నప్రసాదమిడిన అమ్మకు, అయ్యకు పచ్చడి మెతుకులైౖనా ప్రేమానురాగాలతో పెడుతున్న పిల్లలున్నట్లే- ఆస్తులతోపాటు అమ్మానాన్నల్నీ పంచుకుని వారి కడుపుకింత రాల్చడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంటున్న 'పుత్రరత్నాలూ' ఉన్నారు! ఓ కవయిత్రి అన్నట్లు 'కడుపున కన్నవాళ్లు కసురుకున్నందుకు/ పేగుచించుకు పుట్టినవాళ్లు ప్రేమభిక్ష రాల్చనందుకు/ ఎదిగిన బిడ్డల మధ్య ఏకాకి అయినందుకు...' ఎందరో అమ్మా నాన్నలు దిగులుచెందుతూ, దీనులవుతూ కుమిలిపోతున్న దుర్భర దృశ్యాలెన్నో ఈ సమాజంలో! గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు తాము కాలదన్నినా ప్రాణరక్తాన్ని పణంగా పెట్టి తమకు జన్మనిచ్చిన తల్లి ముదుసలి అయినవేళ- కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తనయులే ఆమెను బతికి ఉండగానే కాటికి చేర్చారు ఆమధ్య! మొన్నటికి మొన్న- వేరుపడిన ఇద్దరు కొడుకులూ తనను నిరాదరించడాన్ని ఓ నాన్న మనసు తట్టుకోలేకపోయింది. 'మీరైనా కలిసిమెలిసి ఉండండర్రా' అన్న తన మొరను- ఎదిగిన బిడ్డలు తూష్ణీకరించారన్న వేదనతో ఆ తండ్రి తన మంచాన్నే చితిగా పేర్చుకున్నాడు. తనకు తానే నిప్పంటించుకొని సజీవంగా దహనమయ్యాడు. ఇటువంటి సంఘటనలను తలచుకుంటుంటే- కుటుంబ అనుబంధాల్ని, పేగుబంధాల్ని, రక్తపాశాల్ని ఆర్థిక అంశాలే శాసిస్తూ- తల్లిదండ్రులు, బిడ్డల నడుమ చెక్కుచెదరకుండా ఉండాల్సిన సంబంధాలకు, ప్రేమలకు మరణశాసనం రాస్తున్న రోజులు దాపురించాయేమోననిపిస్తుంది. గుండెల్ని కలుక్కుమనిపిస్తుంది. తడి ఆరని గుండెల్లో ఎంత విషాద వృష్టి!
(ఈనాడు, సంపాదకీయం, ౧౬:౦౫:౨౦౧౦)
______________________________
Labels: Life/ children / telugu
Friday, March 12, 2010
అమ్మ చేతి అమృతకలశం
సేవలు అందుకోవడమే తప్ప, సేవించడం ఎరుగనివారిలో మొదటివరుస పసిపిల్లలది, మహరాజులదే. అందుకే 'బాలభోగం రాజభోగం' అన్నారు పెద్దలు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి... ఆ వైభవంలోనూ రాజులకన్నా పసికూనలు ఒక మెట్టు కాదు, పదిమెట్లు పైనే ఉంటారు. గద్దెపైనున్నవారిని సేవించడంలోని డొల్లతనాన్ని వెక్కిరిస్తూ- 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ ధిక్కరించే స్వరాలు, 'రాజుల్‌మత్తులు'అని ఈసడించే గళాలు అప్పుడప్పుడన్నా వినిపిస్తుంటాయి. కానీ, సేవలందుకునే పసిబిడ్డలు ఎప్పటికీ వరాల మూటలే! బోసినవ్వులొలికిస్తూ ఉయ్యాలలూగే శిశువు, ముంగాళ్లపై నేలమీద దోగాడే పాపాయి, గోడనో మంచంకోడునో పట్టుకుని బుడిబుడి అడుగులు వేసే బుజ్జాయి- ఇలా ప్రతి అంచెలో, బంగారుకొండలాంటి తమ చిన్నారితల్లికి, వజ్రాలమూటవంటి చిట్టితండ్రికి సేవలందిస్తూ... 'ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము, ఇదిగాక వైభవం ఇకనొకటి కలదా!' అని పరవశించని తల్లులుంటారా? అప్పటిదాకా కొడుతున్న కేరింతల్ని ఉన్నట్టుండి ఆపేసి, ఏడుపు లంకించుకున్న పాపణ్ని లాలిస్తూ 'ఏడవకు, ఏడవకు వెర్రి నా తండ్రీ/ ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు/ నీలాలు కారితే నే చూడలేను/ పాలైన కారవే పాపాయి కళ్లు'- అంటూ తల్లులు పాడే జోలపాట ప్రతి తెలుగు ఇంటా ప్రతిధ్వనించేదే. పాపాయి ప్రతి ముచ్చటా అమ్మకు అపురూపమే, నలుగురితో పంచుకునే పెద్ద పండుగే! తన చిన్నారి ఊఁకొడితే ఉగ్గు గిన్నెలు; మూసిన పిడికిలి తెరిస్తే ముద్దకుడుములు; వచ్చీరాని పలుకులు పలికితే చక్కెర చిలుకలు; బోర్లాపడితే బొబ్బట్లు; అడుగులు వేస్తే అరిసెలు- పేరంటాళ్లకు సంబరపడుతూ పంచి మురిసిపోతుంది తల్లిమనసు.బుజ్జాయిలు మహాగడుగ్గాయిలు. ఇంటింటా వాళ్లే నియంతలు. బతిమాలో, బామాలో వాళ్లను మన దారికి తెచ్చుకోవాలే తప్ప- అదిలించడాలు, బెదిరించడాలు వారిదగ్గర ససేమిరా కుదరవు. నిద్రలేపడం, నీళ్లుపోయడం, బువ్వ తినిపించడం, మళ్ళీ బజ్జోపెట్టడం- ఏ విషయంలోనైనా తమ మాటే నెగ్గించుకునే చిన్నారి నియంతలకు స్వచ్ఛందంగా, సంతోషంగా తలొగ్గాల్సింది మనమే. మిగతావాటి సంగతెలా ఉన్నా- అన్నం దగ్గర చిన్నపిల్లలు చేసే మారాములు అన్నీ ఇన్నీ కావు. నింగిలోని జాబిల్లిని తెచ్చి ఇస్తేగానీ, అన్నం తిననని ముగ్గురు తల్లుల గారాలబిడ్డ శ్రీరాముడూ చిన్నతనాన మొండికేశాడట. 'ఎందుకు ఆ చందమామా/ అందగాడనా నీకన్నా, అందరాడనా నాకన్నా' అంటూ కైకమ్మ అనునయించినా వినలేదట. అప్పుడా తల్లి అద్దాన్ని తెప్పించి, అందులో చంద్రుడి ప్రతిబింబాన్ని చూపించి, రాముణ్ని మరిపించి అన్నం తినిపించడం రామకథాసుధారసార్ణవంలో ఓ రమణీయ లహరి. ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు బాలకృష్ణుడు- వెన్నముద్దలు తిన్నంత తిని మరింత వెన్న పారేయడంతో యశోదమ్మకు పట్టరాని కోపం వచ్చింది. ఆ 'దుండగీడు'కు రెండు తగిలించాలని కొంగుబిగించి మరీ వచ్చింది. గోడకు అంటుకుపోయి, భయం నటిస్తూ, కాటుకనిండిన చారెడు కళ్లను తనకప్పగించిన నల్లనయ్యను చూడగానే- ఆమె కోపం పోయింది. ఫక్కున నవ్వుతూ, గోపాలబాలుణ్ని యశోదామాత అక్కున చేర్చుకోవడం- కృష్ణ లీలాతరంగిణిలో మనల్ని ఓలలాడించే కమనీయ ఘట్టమే. తల్లులున్న తనయులు కాబట్టి, ఆ అయ్యలు ఏం చేసినా చెల్లింది. తల్లిలేని శివయ్యను తలచుకుని ఆయన భక్తురాలు బెజ్జమహాదేవి తల్లడిల్లిపోయింది. పరమేశ్వరుడికే తల్లి ఉన్నట్లయితే- ఆయన తల జడలు కట్టనిచ్చేదా, ఒంటిపై పాములను ధరింపనిచ్చేదా, విషం తాగనిచ్చేదా అని బాధపడిందామె. శివుడికి... 'చన్నిచ్చి బలుమారు వెన్నయు బెట్టి/ పన్నుగానిన్నియు బాలును పోసి/ ఆకొనగా గడుపరసి పాలిచ్చి/ సాకించి పెనుపదే జనని గల్గినను' అన్న ఆ భక్తురాలి ఆర్తిలో ఉన్నదీ మాతృహృదయ స్పందనే.
అమ్మ చేతిముద్దలు తినాలంటే 'అది కావాలి, ఇది కావాలి' అని మారాము చేసే ఆనాటి బాలరామచంద్రులకు, తినో తినకో పారేసే బాలకృష్ణులకు ఏమాత్రం తీసిపోనివారే ఈ కాలం పిల్లలు కూడా. లండన్‌లో మూడేళ్ల బాలుడు ఐదాన్ అలాంటి గడుగ్గాయిల్లో ఒకడు. తల్లి తెచ్చే అన్నంగిన్నెను లాక్కొని విసిరేయడం, ఆహారాన్ని పారేయడం, పాత్రలను దొర్లించడం నిత్యకృత్యాలైన ఐదాన్ పోరు పడలేకపోయింది ఆ బుడతడి తల్లి మెలిండా షెపర్డ్. ఆహారపదార్థాలు ఎటువైపు తిప్పినా పడిపోకుండా లోపలే జారేలా ఓ గిన్నెను ఆమె తయారుచేసింది. 360 డిగ్రీల కోణంలో తిప్పే వీలున్న ఈ గోళాకారపు గిన్నెను కిందపడేసినా, అందులోని ఆహారపదార్థాలు కిందపడవు! గిన్నెచుట్టూ వర్తులాకారంలో అమర్చిన చక్రాన్ని పట్టుకుని పిల్లలు హాయిగా ఆడుకుంటూ భోజనం చేయవచ్చు! 'లూపా గైరో బోల్' ఈ పాత్ర నామధేయం. కొత్త ఆవిష్కరణ దేనినైనా స్వాగతించవలసిందే. అన్నం తినకుండా మొండికేసే పిల్లణ్ని చంకనెత్తుకుని, అన్నం కలిపిన గిన్నెను ఓ చేత్తో పట్టుకుని- 'ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది బామ్మ ముద్ద' అంటూ కొసరికొసరి గోరుముద్దలు తినిపించే అమ్మకు తప్ప బిడ్డ ఆకలి మరెవరికి తెలుస్తుంది? అందుకే తల్లులు 'చందమామ రావె, జాబిల్లి రావె/ వెండిగిన్నెలో వేడిబువ్వ తేవె/ పైడిగిన్నెలో పాలబువ్వతేవె' అని పాడుతూ... మారాంచేసే తమ చిన్నారుల్ని బులిపిస్తుంటారు. ఆ చందమామ ఎవరో కాదు, అమ్మే. ఆ వెండిగిన్నె తల్లి మనసే. ఆ పైడిగిన్నె ఆమె మమతే. ప్రేమానురాగాల్నే దివ్యద్రవ్యాలుగా ఆమె కలిపి పెట్టే అన్నాన్ని మించిన అమృతముంటుందా? అమ్మచేతి గోరుముద్దలున్న గిన్నెకు, ఆ అక్షయ పాత్రకు, ఆ అమృత భాండానికి ఎన్ని 'లూపా గైరో బోల్స్' సాటిరాగలవు?!
(ఈనాడు, సంపాదకీయం,౧౩:౦౧:౨౦౧౦)
Labels: Life/ children / telugu
Sunday, August 30, 2009
విషాద గీతిక
'కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల'
అన్నారు జాలాది. ఆ రెండింటికీ నడుమ మనిషి జీవితంలో ఏవేవో మలుపులు, ఎత్తులూ-పల్లాలు, సన్మానాలూ-అవమానాలు, గౌరవాలూ-తిరస్కారాలు. ఒక్క గాయం జీవితపర్యంతం బాధిస్తుంది. ఒక్క ప్రశ్న ఆమరణాంతం వేధిస్తుంది. ఒక్క అవమానం గుండెను చిరకాలం దొలుస్తుంది. సుఖమయ జీవితాలన్నీ ఒకే కోవకు చెందినవి. దుఃఖపూరితమైన బతుకుల్లోనే లెక్కలేనన్ని వైవిధ్యాలు.
మార్లిన్ మన్రో నుంచి మైకేల్ జాక్సన్ వరకు; మీనాకుమారి మొదలు సావిత్రి, చిత్తూరు నాగయ్యల
వరకు ఒక్కో జీవితం ఒక్కోరకం విషాద కావ్యం! వెండితెరకు-గుండె పొరకు మధ్య కాలం నిర్మించిన కళాత్మక పూల వంతెనలు వారంతా! కళలతో కరచాలనం చేస్తూ, నిజజీవిత సాగరమథనంలో అమృతాన్ని సాధించి కలకాలం అభిమానులకు పంచారు. హాలాహలాన్ని తమ గుండెల్లో దాచిపెట్టి క్రమంగా
దహించుకుపోయారు. ఒక దశలో వారంతా 'పెదవి మెదిపితే పండుగ/పదం కదిపితే వేడుక/కళ్లు కలిస్తే కానుక'- అన్నంత వైభవంగా వెలిగినవారే.
ఇప్పటికీ కోట్ల గుండెల్లో పదిలంగా కొలువుతీరినవారే. పైపైన చూస్తే వారి జీవితాలకు లోటేమిటనిపిస్తుంది. సమీక్ష చేస్తే మిగిలిందేమిటన్న నిట్టూర్పు ధ్వనిస్తుంది. వారిని గురించి తల్చుకున్నప్పుడల్లా ఏదో వెలితి, ఎందుకో తెలియని దుఃఖం, అభిమానుల గుండె చూరుల్లోంచి బొట్టుబొట్టుగా రాలే విషాదం! మానవ జీవితానికి విషాదమే శాశ్వత చిరునామా కాబోలుననిపించి భయం వేస్తుంది.సిడ్నీ షెల్డన్ చిత్రించిన ఒక యువతి జీవితాన్ని తిరస్కార భయం చిందరవందర చేసింది. విషాదమయం చేసింది. ఆమె గొప్ప పారిశ్రామికవేత్త కూతురు. ఇంటినిండా సిరిసంపదలు. అందుబాటులో ఎన్నో భోగభాగ్యాలు. మనిషి మాత్రం కురూపి. ఆమె అక్కలిద్దరూ చక్కని అందగత్తెలు. దాంతో, ఆమెకు ఇంటా బయటా తిరస్కారాలు, అవమానాలు. ఆఖరికి తల్లీతండ్రీ సైతం చిన్నచూపు చూసేసరికి, చులకన చేసేసరికి తట్టుకోలేకపోతుంది. సమాజంపై కసి పెంచుకుంటుంది. ఆ దశలో ఒక అపరిచితుడితో శృంగారంలో పాల్గొంటుంది. అవసరం తీరాక అతడామెను బాగా పొగిడాడు. దాంతో- తన అస్తిత్వానికి ఓ ప్రత్యేక గుర్తింపు లభించిందన్న భావం తలెత్తుతుంది. అటువంటి గుర్తింపు కోసమే తపిస్తున్న తన దాహం మగాళ్లను సంతోషపరచడం ద్వారా తీరుతుందని ఆమె గ్రహిస్తుంది. దానికోసం ఆ గొప్పింటి పిల్ల కనిపించిన ప్రతి మగాడి వెంటా పడుతుంది. గుర్తింపు దాహం తీర్చుకుంటుంది. భారతంలో కర్ణుడి పాత్ర మరోరకం. 'సమాజం నన్ను అంగీకరించడం లేదు' అన్న అసహనంతో, అభద్రతాభావంతో సతమతమయ్యే స్థితిలో అతడికి దుర్యోధనుడి అండ దొరికింది. అంతవరకు నిరాశ నిస్సహాయతల నివురుమాటున దాగిన కసి భగ్గున ప్రజ్వరిల్లింది. తప్పని తెలిసీ పరేచ్ఛా ప్రారబ్ధానికి లోనై కానిపనులకు సైతం తల ఊపేలా చేసింది. క్రమంగా 'భారతం కర్ణుడి తల' అనిపించే స్థాయికి కర్ణుడు ఎదిగిపోయాడు. ఓటమి తప్పదని ఎరిగీ కడదాకా కౌరవ పక్షానే నిల్చి కసిలోనే కడతేరిపోయాడు. పారిశ్రామిక వేత్త కూతురు విషయంలో తల్లిదండ్రులూ సమాజమూ ఆమెను ఆదరణగా చూసి ఉంటే ఆమె జీవితం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం తప్పిపోయేది. కర్ణుడు కుంతి ఒడిలో పెరిగి సమాజంలో గౌరవానికి నోచుకుని ఉంటే కురుక్షేత్ర సంగ్రామం అసలు జరిగేది కాదేమో!
మైకేల్ జాక్సన్ జీవితాన్ని ఈ కోణంలోంచే పరామర్శ చేయవలసి ఉంది. సంపాదించిన లక్షలూ కోట్లూ అతనికి
ఆనందాన్నివ్వలేదు. అంతులేని భోగభాగ్యాలు సుఖాన్ని పంచలేదు. విశ్వవ్యాప్తంగా కంటతడి పెడుతున్న కోట్లాదిమంది అభిమానుల ఆరాధన అతణ్ణి ఒంటరితనాన్నుంచి రక్షించలేదు. ఈ లోకంలో మైకేల్ ఏకాకిగా జీవించాడు. 'తిరస్కారభయం మూర్తీభవించిన వ్యక్తిత్వం' అనిపించాడు. చేజిక్కిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన ధనరాశులు, గెల్చుకున్న హృదయాలు- ఇవేవీ అతడు కోల్పోయినదానికి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. తనలోని శూన్యతను పూడ్చలేకపోయాయి. అతడు పోగొట్టుకున్నది-అమూల్యమైన తన బాల్యాన్ని! అత్యంత విలాసవంతంగా నిర్మించిన తన రాజప్రాసాదంలో మైకేల్ లెక్కలేనన్ని జీవరాశులను, జంతువులను, పక్షులను ప్రేమగా పెంచి పోషించాడు. నిత్యం వాటి సావాసంలో తన బాల్యాన్ని తడుముకున్నాడు. ప్రపంచానికి బాగా పరిచయమైన మైకేల్ ప్రచండ స్వభావం, ప్రతిభా పెనువిస్ఫోటనం, మహోద్వేగ తీవ్రపదవిన్యాసం... ఆ ఉప్పెన అంతటికీ మూలం- కసి, విషాదం! అన్నింటికన్నా దారుణం-అతని తండ్రే దీనంతటికీ కారణం! 'మొద్దుమొహం, బండ ముక్కు' అంటూ పదేపదే అతని తండ్రి పిలిచిన పిలుపులు, చేసిన అవమానాలు ఆ పసిగుండెలో విషబీజాలను నాటాయి. కసినీ ద్వేషాన్నీ పెంచి పెద్ద చేశాయి. మనశ్శాంతిని దూరం చేశాయి. తనలోకి తాను ముడుచుకుపోయేలా చేశాయి. అతడు రూపురేఖలను మార్చుకునేందుకు లెక్కలేనన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవడాన్ని, చివరి దశలో మతం మార్చుకోవడాన్ని మనం ఈ కోణంలోనుంచే అర్థం చేసుకోవాలి. గంధర్వ లోకాల్లోంచి ఒంటరిగా వచ్చాడు. ఈ లోకానికి ఎంతో ఇచ్చాడు. ఏకాకిగా జీవించాడు. నిర్భాగ్యుడిగా తనువు చాలించాడు. మరణించిననాటికి ఆ కోటీశ్వరుడి కడుపులో గుప్పెడు మాత్రలే తప్ప పట్టెడు మెతుకులు లేవు! ఏమనాలి ఆ జీవితాన్ని? అతని పాట అమృతం, జీవితం హాలాహలం. అతని పంచనామాలోనుంచి వినవచ్చే సందేశం ప్రధానమైనది, ముఖ్యంగా తల్లిదండ్రులకు!(ఈనాడు, సంపాదకీయం, ౧౨:౦౭:౨౦౦౯)
___________________________
Labels: Life/ children / telugu, Life/telugu
Sunday, August 02, 2009
మట్టి వాసన

పసిపిల్లలకు అభం సుభం తెలియవు అంటుంది లోకం. 'భం' అంటే తార లేదా నక్షత్రం అని అర్థం. మంచి గుణాన్ని 'సు'గుణం అన్నట్లే, మంచి నక్షత్రాన్ని 'సు'భం అంటారు. సంపత్తార, మిత్రతార, క్షేమతార... వగైరాలు కలిసొచ్చే నక్షత్రాలు. సుభాలు. సుభానికి విరుద్ధమైనది 'అభం'. విపత్తార వంటి కీడు తెచ్చే నక్షత్రాలు అభాలు. ఈ తేడాలు, వివరాలు అంతగా తెలియవు కాబట్టి పసిపిల్లలను అభం సుభం ఎరుగనివాళ్ళని అనడం లోకంలో పరిపాటి. అభము సుభమ్ములం దెలియక ఆర్చెడి దేబెలు మాకు లెక్కయే?... అన్న తిరుపతి వేంకటకవుల ప్రయోగం ఈ అర్థంలోదే! అభం సుభం తెలియకపోవడమే బాల్యానికి అలంకారం. 'నా హృదయంలో నిదురించే చెలీ, పాటలో 'నీ వెచ్చని నీడ' అని ప్రయోగించారు కదా... నీడ ఎక్కడైనా వెచ్చగా ఉంటుందా?' అని శ్రీశ్రీని ఒక కుర్రవాడు ప్రశ్నించాడు. శ్రీశ్రీ అతణ్ని తేరిపార చూసి 'అభం సుభం తెలియని పసివాడివి... పెద్దయ్యాక నీకే తెలుస్తుందిలే' అని బదులిచ్చారు. పెద్దయ్యాక కన్యాశుల్కంలో గిరీశంలా తయారయ్యే అవకాశవాదులు సైతం బాల్యంలో అభం సుభం తెలియని పసివాళ్ళే కావడం ఈ సృష్టిలోని విశేషం. కల్లాకపటం ఎరుగని వయసు, కల్మషం తెలియని మనసు బాల్యానికి సహజసిద్ధమైన కవచకుండలాలు. తేడాలు పాటించకపోవడం అనేది బాల్యంలోనే సాధ్యం. ఒకే కంచం, ఒకే మంచం అనే మాట ఒక్క బాల్యానికే సరిగ్గా నప్పుతుంది. పక్కవాడి కంచంలోని వూరగాయను గబుక్కున తినేసి 'కావాలంటే నా నోరు చూడు' అని అడ్డంగా బుకాయించే బాల్యాన్ని భాగవతంలో అద్భుతంగా వర్ణించాడు బమ్మెర పోతన. అలాంటి నిష్కల్మషమైన పనులు పెద్దయ్యాక సాధ్యంకావు. అందుకే బాల్యం అమూల్యం! బాల్యంలో అనుభవాలు మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనస్తత్వ నిపుణులు చెబుతారు. గాఢమైన చేదు అనుభవాలు ఆ వయసును గాయపరిస్తే- పెద్దయ్యాక ఆ వ్యక్తి సంఘ వ్యతిరేక శక్తిగా మారే అవకాశం బాగా ఎక్కువ.
చెరువుల్లో ఈతలు, నదీతీరాల్లో ఇసుక గూళ్ళు, జామచెట్లపై కోతి కొమ్మచ్చులు, మైదానాల్లో గాలిపటాలు, వర్షం నీటిలో కాగితం పడవలు, లేగదూడలతో సయ్యాటలు, తూనీగలతో సరాగాలు, పక్షులతో పరాచకాలు... ఇవీ మన సంప్రదాయ క్రీడావినోదాలు! కేవలం బాల్య వినోదాలే కావు- మనిషిలో కలివిడితనానికీ ఇవే పునాదులు. నేలతో నెయ్యం, నింగితో స్నేహం, నీటితో సావాసం, పంచభూతాలతో జట్టుకట్టడం, ప్రపంచంతో ప్రకృతితో కలిసికట్టుగా జీవించడం... ఇవే సిసలైన బాల్యానికి గీటురాళ్లు. మనిషితనానికి ఆనవాళ్ళు. నిజానికి లోకజ్ఞానం అక్కడినుంచే అలవడుతుంది. వికాసం అప్పుడే మొదలవుతుంది. బొమ్మల కొలువులు, వామన గుంటలు, గవ్వలాటలు, చెమ్మచెక్కలు, కాకి ఎంగిలి మామిడి ముక్కలపై ఉప్పూ, కారం అద్దుకు తినడం... వంటివి లేకపోతే బాల్యానికి అందమూ లేదు, అర్థమూ లేదు. అద్దాల మేడల్లో అబ్బురంగా పెరిగే అసూర్యంపశ్యలకు ఆ బాపతు బాల్యంతోను, కమ్మని మట్టివాసనతోను పరిచయం ఉండదు. ఒంటరిగా కూర్చుని నిత్యం యంత్రాలతో సావాసం చేసే పిల్లల శరీరాలు ఎదుగుతాయేగాని, మనసులు ఎదగవు. వెనకటికో ముని సుఖంగా తపస్సు చేసుకుంటుంటే హంతకుడొకడు వచ్చి తన పిడిబాకును దాచిపెట్టమని అడిగాడు. నిత్యం దాన్ని పరిశీలించడం, దాని గురించి ఆలోచించడం అలవాటై ముని స్వభావంలో క్రమంగా నేర ప్రవృత్తి అంకురించిన కథ మనకు తెలుసు. బాల్యంలో బొమ్మ పిస్తోళ్ళ ఆటలతోనే తప్ప సజీవమైన పిట్టల పాటలతో పరిచయం లేని పిల్లల విషయంలోనూ అదే జరుగుతుంది. మట్టిలో తెగ ఆడి ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుపోయిన బాలకృష్ణుణ్ని చూస్తే- కైలాసంలో ఒంటినిండా విభూది పూసుకున్న శివుడు గుర్తొచ్చాడు పోతన్నకు! బయట నుంచి వచ్చినప్పుడల్లా రకరకాల కాలుష్యాలు పులుముకుని వస్తున్న పిల్లలను చూస్తుంటే దెయ్యాలు గుర్తొస్తున్నాయి మనకు!
ఇసుకతో గుడి కడతారు... తీరిగ్గా అలంకారాలు అద్దుతారు... తోచినంతసేపూ హాయిగా ఆడుకుంటారు... పొద్దుపోయేసరికి కట్టడాలను చులాగ్గా కూలగొట్టి పిల్లలు నిశ్చింతగా ఇంటిదారి పడతారు. బెంగలూ దుఃఖాలూ ఏమీ ఉండవు. సృజనాత్మకత అనే కాదు, మనిషిలో తాత్విక స్వభావానికీ అంకురారోపణ జరిగే సన్నివేశమది. నిర్జీవమైన యంత్రాలతో ఆట నైరాశ్యాన్ని నింపుతుంది. సజీవమైన పశువులతో, పక్షులతో ఆడుకునే పిల్లల హృదయాల్లో మానవీయ విలువలు స్థిరపడతాయి. అందుకే మన పెద్దలు సాహిత్యంలో సైతం విరివిగా జంతువులను సృష్టించారు. పశువూపక్షీ పిల్లామేకా పెట్టాపుంజూ చెట్టూచేమా- అన్నీ మనిషికి తోబుట్టువులేనన్న భావాన్ని మనసుల్లోకి చొప్పించారు. అవీ మానవ పరివారంలో భాగమేనని బోధించారు. పెంపకంలోనూ, సాహిత్యం ద్వారానూ ప్రకృతితో మనిషి బంధాన్ని పటిష్ఠం చేశారు. అలాగే జంతువుల బొమ్మలను ఆట వస్తువులుగా అందించారు. ఈ రకమైన సంప్రదాయ క్రీడావిధానాలు, ఆట వస్తువుల మూలంగా మనిషి వికాసానికి ఎంతో మేలు జరుగుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన బాల్య వికాస నిపుణుడు, మనస్తత్వవేత్త డాక్టర్ జాన్ జురైదిని పరిశోధనలో తరతరాల సంప్రదాయ ఆటపాటలు మనిషిలో సృజనాత్మకతకు, వికాసానికి, చలాకీతనానికి కారణం అవుతున్నాయని తేలింది. ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, కంప్యూటర్ క్రీడలు- పిల్లల్లోని భావుకతకు, ఊహాశాలితకు హానిచేస్తున్నాయనీ రుజువైంది. పిల్లల్లో నేరప్రవృత్తికి అవి దోహదపడుతున్నాయని డాక్టర్ జాన్ ప్రకటించారు. మరో శాస్త్రవేత్త కారెన్ స్టాగ్నిటి సంప్రదాయ క్రీడారీతులు, ఆటపాటలు, వస్తువులు- పిల్లలకు సహజత్వాన్ని నేర్పుతున్నాయన్నారు. సామాజిక జీవన కౌశలం, భాషాపటిమ, సమగ్రవికాసం వంటివాటికి అవే పునాదులుగా చెబుతున్నారు. ఎంతసేపూ పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లిదండ్రులు ఇకపై వారిని సమర్థులుగా రూపొందించే ప్రయత్నాలు చెయ్యాలన్నది వారందరి హెచ్చరిక!
(ఈనాడు, సంపాదకీయం, ౩౧:౦౫:౨౦౦౯)
____________________________
Labels: Life/ children / telugu
Monday, July 20, 2009
పేగుబంధం

వత్సం అంటే ఆవుదూడ. అది పుట్టినప్పుడు దాని ఒంటినిండా మావి అలముకుని జుగుప్సావహంగా ఉంటుంది. అప్పుడు వత్సల(గోమాత) బిడ్డ దేహంమీద మకిలి అంతటినీ స్వయంగా తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ప్రేమగా, ఆత్మీయంగా, శ్రద్ధగా తల్లిగోవు ఆ పని చేస్తున్నప్పుడు వ్యక్తమయ్యే గొప్ప భావాన్నే వాత్సల్యం అంటారు. వాత్సల్యం తల్లుల సొత్తు. మాతృత్వం అనేది సృష్టిలోని ఒకానొక మహత్వపూర్ణమైన అనుభూతి. అది బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ! తల్లి అనిపించుకోవడానికి స్త్రీ ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది. అమితమైన బాధను ఓర్చుకుంటుంది. ప్రసవ వేదన ఎంతటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది. రైలు పట్టాలమీద పెట్టిన నాణెం చక్రాలకింద నలిగి వెడల్పవుతుంది చూశారా! కాన్పులో బాధను దానితో పోల్చి చెప్పిందొక కవయిత్రి. దుర్భరమైన నొప్పులను ఓర్చుకున్న అమ్మ నలుసును చూడగానే సంతోషంగా నవ్వుతుంది. అమ్మనొప్పులకు కారణమైన ఆ బిడ్డ మాత్రం ఏడుస్తాడు. అదే సృష్టిలోని చిత్రం! కన్నాక కూడా కొన్నాళ్ళపాటు తన నోటిని కట్టేసుకుని తల్లి పథ్యంచేస్తూ బిడ్డకు మాత్రం తియ్యని పాలిచ్చి పెంచుతుంది. సంతానాన్ని పెంచి పెద్దచేసే క్రమంలో ముఖ్యభూమిక వహిస్తుంది. తల్లి పెంపకంలో గొప్పగొప్ప యోధులైనవారు చరిత్రలో మనకు చాలామంది కనిపిస్తారు. పురాణ కాలంలో పాండవులు మొదలు, ఆధునిక యుగంలో శివాజీ దాకా మహాయోధులైన వారెందరిపైనో తల్లి ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. దాన్ని గుర్తించాడు కాబట్టే 'ప్రపంచంలో గొప్పవారంతా తమ తల్లుల లక్షణాలను అధికంగా పుణికిపుచ్చుకున్నవారే' అని నిర్ధారించాడొక తత్వవేత్త. 'ఒడిలో కూర్చొనియుండ, నీవు మమతాయోగమ్ము పాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునపుడేమో గాఢసంరక్షలో గుడిలో దీపము వోలెనుంటి...' అన్న ఒక మహాసహస్రావధాని మాట- అమ్మ ఒడిలోని భద్రస్థితికి కవితాకర్పూర నీరాజనం.
అమ్మ జన్మదాత అనుకుంటే- నాన్న జీవదాత! దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది. పురుషేహవా... అనే ఐతరేయమంత్రం- తండ్రి శుక్రం ద్వారా తల్లి గర్భంలో దేహాన్ని పొందడం జీవుడికి మొదటి జన్మగా చెప్పింది. శిశువు రూపంలో భూమిమీద పడటం రెండో జన్మ. అక్కడినుంచి తండ్రి సంరక్షణ మొదలవుతుంది. తల్లీతండ్రీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అపురూపంగా పెంచుకుంటారు. వాళ్ళకోసం అవసరమైతే, తాము పస్తులుండటానికి సిద్ధపడతారు. తమ పిల్లలు తమకన్నా అన్నివిధాలా పెద్దస్థాయిలో జీవించాలని కోరుకుంటారు. తపనపడతారు. త్యాగాలు చేస్తారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెద్దవాళ్ళను చెయ్యడం తమ బాధ్యతగా భావిస్తారు. ఇష్టంగా నిర్వహిస్తారు. ఊహ తెలియగానే పిల్లవాణ్ని 'నీ బతుకు నువ్వు చూసుకో' అనడానికి భారతీయ తల్లిదండ్రులకు మనసొప్పదు. 'భార్య భర్త అనే రెండు తాళ్ళు ముడివేస్తే- ఆ ముడి సంతానం' అన్నాడు భర్తృహరి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఆ పేగుముడే- మనిషి అసలైన జీవ లక్షణం. చమురు ఆవిరైతే దీపం ఏమవుతుంది? బంధం శిథిలమైతే బతుకులో ఇక ఏముంటుంది? భార్యాభర్తలు విడిపోవచ్చు, చెడిపోవచ్చు గాని- తల్లిదండ్రులుగా మారాక బాధ్యతగా జీవించవలసిందేనని మన పెద్దల తీర్మానం. భార్యాభర్తల మధ్య ముందు ఏర్పడ్డ దూరం పిల్లలనే ముడితో తరిగిపోతుందంటారు వేటూరి ప్రభాకరశాస్త్రి. 'సంతానం కలగడంతో ఎన్నో సమస్యలు సమసిపోయి భార్యాభర్తలు దగ్గరకావడం మనం చూస్తున్నాం. అలాగే ప్రేమపెళ్ళిళ్లను ఆమోదించలేక విడిపోయిన కుటుంబాలు సైతం కొత్త జంటకు పిల్లలు కలిగేసరికి తిరిగి కలగలసిపోవడం మనం ఎరుగుదుం. అదే 'సుతాకారపు ముడి' అంటే! దాని ప్రభావం తియ్యనిదేకాదు, బలమైనది కూడా!
అనుబంధాలూ ఆత్మీయతలూ లేకుంటే జీవితానికి అర్థమే ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని సాదరంగా, ఆత్మీయంగా చూసుకోవాలి. ఆ సంప్రదాయ పరంపర తరవాతి తరానికి ఆదర్శం కావాలి. గడపడానికీ, జీవించడానికీ మధ్య తేడా అదే! తన తల్లిదండ్రుల పాదపద్మాలను ప్రీతిగా 'ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్నను విమల తరము...' అని స్తుతించాడు పాండురంగడు. స్వతహాగా చదువూసంధ్యా అబ్బకపోయినా- కౌశికుడంతటివానికి జ్ఞానబోధ చేయగలిగే స్థాయి వివేకం తనకు దక్కడానికి కారణం తల్లిదండ్రులకు చేసిన సేవలే అన్నాడు- భారతంలో ధర్మవ్యాధుడు. ఆడపిల్లలు తండ్రిమీద, మగపిల్లలు తల్లిపైన ప్రేమ అధికంగా కలిగిఉంటారని చెబుతారు. మనమూ పిల్లల్ని 'నువ్వు అమ్మ పార్టీయా, నాన్న పార్టీయా' అని ఆరా తీస్తుంటాం. 'వాడు అమ్మ కూచి... ఆమె నాన్న కూచి' అంటూ ముద్రలు వేస్తుంటాం. ఏ రకంగా ముద్రలు వేసినా, ఎటువైపు మొగ్గుచూపినా పిల్లలందరూ తమ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు. అమ్మానాన్నా ఒకరినొకరు మనసారా ప్రేమించడం, గౌరవించడమే పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇటీవల హైకోర్టు ధర్మాసనం సైతం ఇదే విషయాన్ని ఒక జంటకు వివరించింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కాపురంలో కలతలు మొదలై ఆ జంట విడిపోయింది. పిల్లలిద్దరూ చెరో చోటా ఉండిపోయారు. అయిదేళ్ళు గడిచాక విడాకుల కేసు కోర్టుకు వచ్చినప్పుడు చిన్నపాపను న్యాయమూర్తి పిలిచి 'నీకు అమ్మానాన్నల్లో ఎవరు కావాలి?' అని అడిగారు. ఆ పిల్ల చేతులు జోడించి 'నాకు అమ్మ, నాన్న, అక్క ముగ్గురూ కావాలి' అని దీనంగా అడిగింది. దాంతో న్యాయమూర్తి చలించిపోయారు. జనం కరిగిపోయారు. తల్లీతండ్రీ కన్నీటితో సతమతమయ్యారు. కరుణ రసాత్మకమైన ఆ ఘటనతో వారిద్దరూ పశ్చాత్తాపానికి లోనయ్యారు. తిరిగి ఒకటవుతామని కోర్టుకు విజ్ఞప్తిచేశారు. పేగుబంధం తన ప్రభావాన్ని చూపించింది. ఆ కుటుంబం ఆనందాశ్రువులతో ఒక్కటైంది. సమాజంలో వస్తున్న గొప్ప మార్పునకు సంకేతంగా నిలిచింది.
( ఈనాడు, సంపాదకీయం, ౦౩:౦౫:౨౦౦౯)
--------------------------------------------------
Labels: Life/ children / telugu
Sunday, March 01, 2009
తండ్రీకొడుకులు
తల్లిదండ్రుల సేవలో తరించిన ఉత్తములైన కుమారులు భారతీయ సాహిత్యంలో చాలామంది కనిపిస్తారు. వృద్ధులైన జననీ జనకులను కావడిలో కూర్చోబెట్టి, స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడి కథను రామాయణం వివరించింది. తండ్రి ఆనతి మేరకు రాజ్యాధికారాన్ని వదులుకుని, రాముడు అడవుల బాట పట్టిన విషయమూ వర్ణించి చెప్పింది. తల్లి దాస్య విముక్తికోసం బ్రహ్మప్రయత్నం చేసి, దేవతలను ఓడించి, అమృతాన్ని సాధించిన గరుత్మంతుడి కథను భాగవతం ప్రకటించింది. యయాతికి తన యౌవనాన్ని సమర్పించిన కొడుకు పూరుడి కథనూ చెప్పింది. 'తల్లిదండ్రుల సేవ మినహా నాకు తెలిసినదేదీ లేదు' అని వినయంగా పలికిన ధర్మవ్యాధుడి కథను భారతం పరిచయం చేసింది. తండ్రి నిమిత్తమై భీషణమైన ప్రతిజ్ఞ చేసి, అపూర్వ త్యాగానికి పాల్పడిన భీష్ముడి కథా చిత్రించింది. తల్లి దైన్యస్థితికి తల్లడిల్లి సమస్త రాజవంశ నాశనానికి పూనుకున్న పరశురాముడు, తల్లి కోరిందని ఆత్మలింగం సాధించడానికై పడరాని పాట్లు పడిన రావణాసురుడు, క్షణమాత్రం ఏమరుపాటు లేకుండా తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు, సన్యాసదీక్షలో ఉన్నా తల్లికి ఇచ్చిన మాటకోసం స్వయంగా అమ్మ ఆర్యాంబకు అంత్యక్రియలు నిర్వహించిన ఆదిశంకరులు- ఇలా జన్మనిచ్చిన వారికోసం పరితపించిన కుమారుల గాథలు మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తాయి. చరిత్రలోనూ ఆ తరహా ఆదర్శమూర్తుల ఉదంతాలకు కొదవలేదు. పున్నామ నరకం నుంచి తమను పుత్రులే రక్షిస్తారని మన పెద్దల విశ్వాసం. కొడుకులు లేకుంటే ఉత్తమ గతులే ఉండబోవని ఒక నమ్మకం. దానాదీనా మగవాడికి పుట్టుకతోనే సమాజం ఒకానొక ప్రాధాన్యం కల్పించింది. ఆ మేరకు బాధ్యతగా ప్రవర్తించినవారిని పనిగట్టుకుని ఆదర్శమూర్తులుగా ప్రచారం చేసింది. సత్పురుషులుగా ప్రశంసించింది.అంతమాత్రాన చెడ్డ కొడుకులు లేకుండా పోలేదు. వారి గురించీ సాహిత్యం వివరించింది. కాశీఖండంలో శ్రీనాథుడు చిత్రించిన గుణనిధి కథ లోకప్రసిద్ధమైనది. వాడివల్ల వంశప్రతిష్ఠ నాశనమైంది. తల్లీ తండ్రీ క్షోభపడ్డారు. తెనాలి రామకృష్ణుడు పరిచయం చేసిన నిగమశర్మా సర్వభ్రష్టుడే! 'ఉఫ్ మని అగ్నిహోత్రాన్ని ఊదడం అలవడలేదుగాని, నిగమశర్మ నిరంతరం విరహాగ్ని తాపంతో నిట్టూర్పులు విడుస్తూనే ఉండేవాడు' అని తన సహజశైలిలో రామకృష్ణుడు చమత్కరించాడు. చరిత్రలోకి వెళితే- కన్నవారికి అన్నంపెట్టని కసాయి పుత్రులూ, కారాగారం పాలుచేసి కక్ష సాధించిన ప్రబుద్ధులూ మనకు ఎందరో కనపడతారు. నరాలమీద వ్రణాలుగా తోస్తారు. నవనందులను నవనాడుల్లోని క్రిములుగా పోలుస్తూ ముద్రారాక్షసంలో పేర్కొన్నది ఇలాంటివారి గురించే! దుర్మార్గులుగా పుట్టినవారికన్నా పెంపకంలో చేటువల్ల చెడిపోయినవారే సమాజంలో అధికం. గుణనిధి చెడిపోవడానికి అతని తల్లే కారణం. అతి గారాబం చేసి వాణ్ని చెడగొట్టింది. యజ్ఞదత్తుడికి అనుమానం వచ్చి 'స్నానం సంధ్యా ఏమైనా ఉన్నాయా' అని నిలదీసేవాడు. వెంటనే తల్లి అడ్డంపడి 'స్నానమాడెను... వార్చెను సంధ్య... అగ్నిహోత్ర మొనరించెను' అంటూ కొడుకును వెనకేసుకొస్తూ పచ్చి అబద్ధాలు ఆడేది. తల్లులే కాదు, కొందరు తండ్రులదీ అదే వరస. దారితప్పి గాలితిరుగుళ్ళు మరిగిన కొడుకులను పుత్రప్రేమకొద్దీ దండించి దారిలో పెట్టకుండా వదిలేసేవారు. ఇలాంటివారి స్వభావాన్ని చెబుతూ ధర్మజుడు నారదుడితో '...పుత్రుల్ నేర్చిన నేర్వకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడున్' అన్నాడు.
ధర్మరాజు ఏ ఉద్దేశంతో చెప్పినా, ఇవాళ జరుగుతున్నది మాత్రం అచ్చంగా ఇదే! ఎలాంటి తప్పులు చేసినా పుత్రరత్నాలను గుడ్డిగా సమర్థించడం జనానికి అలవాటయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పెద్దలు విపరీతంగా సంపాదించి పోగులు పెడితే- సంతానం విచ్చలవిడిగా జీవించడం ఇటీవలి ఒక విషాద పరిణామం. తల్లిదండ్రుల నియంత్రణలోంచి జారిపోయిన సంతానం సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యే ప్రమాదం చాలా ఉంది. ఇటీవల అమ్మాయిలపై యాసిడ్ దాడికి తెగించిన కొడుకు విషయంలో అతని తల్లి- 'సమాజానికి చీడపురుగులా తయారైన వీణ్ని ఉరితీయించండి' అని కోరింది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో గ్రహించడానికి ఈ సంఘటన ఒక బలమైన ఉదాహరణ. మండువేసవిలో సూర్యుడి తీక్షణ తాపాన్ని గొడుగు లేకున్నా మనం సహించగలం. మరి అదే సూర్యుడి నుంచి తాపాన్ని గ్రహించి మిటమిటలాడిపోయే ఇసుకమీద చెప్పులు లేకుండా నడవలేం. అలాగే ప్రభువులు, అధికారుల పేరు చెప్పి రెచ్చిపోయే అనుచరగణాన్ని, బంధువర్గాన్ని తట్టుకోవడం చాలా కష్టం. సమాజం మారుతోంది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హింసాప్రవృత్తి, అవినీతి మితిమీరుతున్నాయి. సంతానం విషయంలో తల్లిదండ్రులు మరింత జాగరూకత వహించవలసిన సమయమిది. వేసవి సమీపిస్తోంది. వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి వేసవి తాపం మరీ తీవ్రంగా ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. దానికితోడు ఎన్నికల రుతువూ మొదలవుతోంది. వేసవికీ, ఎన్నికలకీ ఈసారి ప్రత్యేక అవినాభావ సంబంధం గోచరిస్తోంది. 'సన్‌స్ట్రోక్' ప్రభావం రెండింటా ప్రబలంగా ఉండేట్టుంది. సూర్యుడి కొడుకు శనీశ్వరుడు. శనిపీడ సంగతి అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో సాక్షాత్తు సూర్యుడికే పుత్రపీడ తప్పలేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రకంగానూ 'సన్‌స్ట్రోక్'కు ఈ దఫా ప్రాధాన్యం పెరిగేలా ఉంది. నాయకులూ బహుపరాక్!
(ఈనాడు, సంపాదకీయం, ౧౫:౦౨:౨౦౦౯)
___________________________________
Labels: Life/ children / telugu
Monday, October 20, 2008
గడ్డుసవాళ్లు
బకాసురుడికి ఆహారంగా ఎవరు వెళ్లాలని ఆ కుటుంబమంతా పెనుదుఃఖంతో కుదేలవుతోంది. ఆ సమయంలో, పరమ గంభీరమైన ఆ వాతావరణంలోకి ఒక పసిపిల్లవాడు కర్రొకటి చేతపట్టుకుని, ముద్దుమాటలతో ప్రవేశించాడు. '... ఏనా రక్కసు గిట్టి చంపి, చులుకవత్తు... మీరేడ్వగా వలవదనుచు కలయ నోదార్చ...' బోయాడు. బాలుడి చేష్టలతో, ఆ మాటలతో బరువైన వాతావరణం ఒక్కసారిగా మారి తేలికపడింది. ఆ మార్పు కారణంగానే కుంతీదేవివంటి కులీనురాలైన స్త్రీ పరాయి కుటుంబ సమస్యలోకి తలదూర్చడానికి వెసులుబాటు దొరికింది. ఆ కుటుంబానికి ఎంతో భారమైన సమస్యను కుంతీదేవి తేలిగ్గా పరిష్కరించింది, అది వేరే విషయం. ఇప్పటికీ రచనల్లోగాని, చలన చిత్రాల్లోగాని ఒకానొక బరువైన ఘట్టం ముగియగానే- ఏదో విధంగా హాస్య సన్నివేశం కల్పించడంలో ఆదికవిదే ఒరవడి! దానికి పిల్లల మాటలు, చేష్టలు గొప్ప వనరులు. పిల్లల ముద్దు పలుకులు దుఃఖాన్ని దూరం చేస్తాయి. మనసును తేలిక చేస్తాయి. దీపం వెలిగించగానే చీకటి తొలగిపోయినట్టు- పసివాళ్ల బోసినవ్వు కళ్లపడగానే మన చికాకు పారిపోతుంది. అలసట తీరిపోతుంది. పై ఘట్టంలో బాలుడివి 'తొక్కుపలుకులు' అన్నాడు నన్నయ్య. 'తానో లాములు... తండ్రి పేరెవరయా? దాచాతమాలాలు!' అంటాడు విశ్వనాథవారి బాలరాముడు. 'మరి నా పేరేమిటి' అని అడిగింది కౌసల్య. 'అమ్మగాలు' అన్నాడు 'ర' పలకని రాముడు. 'కాదు కౌసల్య' అంది అమ్మ. ఆ పేరు నోరు తిరక్క రాముడికి కళ్లలో నీళ్లు తిరిగాయి. దాంతో అమ్మకు గుండె చివుక్కుమంది. 'కౌసల్యను కానే కానులే! అమ్మనే' అనేసి రాముణ్ని హత్తుకుని ముద్దాడింది. ఇవన్నీ కళ్లలో నీళ్లు తెప్పించే పరమ ఆర్ద్రమైన పలుకులు. ఈ జాతి తన గుండెపుటల్లో దాచిపెట్టుకున్న నెమలిఈకలు. బాల్యం అంటే బెంగకు చిరునామా. మనసును కొన్నేళ్ల వెనక్కి పరిగెత్తించే తూనీగ- బెంగ. మనిషి మనసు బెంగల, బాల్యస్మృతుల నేలమాళిగ!పెద్దయ్యాకా రాక్షసుడయ్యే మనిషి సైతం బాల్యంలో మాత్రం దేవుడే! 'బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన ఆనందపడు నోరులేని యోగి... సతిని ముట్టని నాటి సాంబమూర్తి... ఉయ్యాల దిగని భాగ్యోన్నతుండు... తన ఇంటి క్రొత్త పెత్తనపు దారు' అని వర్ణించారు మహాకవి జాషువా. 'ఎవరు ఎరుంగరు ఇతనిది ఏ దేశమోగాని... మొన్న మొన్ననె ఇలకు మొలచినాడు... ఏమి పనిమీద భూమికి ఏగినాడొ! నుడువ నేర్చిన పిమ్మట అడుగ వలయు...' అనుకొని మాటలు నేర్చేదాకా వేచి చూడాలన్నారు. మనిషి జీవితంలో కొన్నేళ్లపాటు అమూల్య ఆనందాన్ని అందించే అమృతశక్తి బాల్యం- అన్నారు దాశరథి. ఆనందకరమైన బాల్యపు రోజుల్లో 'చినుకులను దిస్సమొలతో చని చేతులు చాచుకొంచు జగ్గుల నవ్వుల్ తనరగ, శాంతాదేవీ వనితామణి కొడుకు వాన వల్లప్పాడెన్' అన్నారు విశ్వనాథ.ఏం ఆడటానికైనా అసలు బాల్యం ఏదీ? సినిమా బురదలో, సెల్‌ఫోన్ వరదలో, టీవీ తుపానులో, ఇంటర్నెట్ ఉప్పెనలో బాల్యం మునిగిపోయి డ్రైనేజీలో కలసిపోయింది. అమాయకత్వం ఆవిరైపోయింది. బతుకులో సొగసు చివికిపోయింది. తొక్కుపలుకులు వినమరుగయ్యాయి. ముద్దుపలుకులు మోటతనాన్ని నింపుకొన్నాయి. బాల్యం- బాల్యంలోనే ముదిరిపోయింది.
ఇప్పుడు ఆ వినోద సాధనాలు, లైంగిక విజ్ఞాన సాధనాలుగా మారిపోయాయన్నది చాలామంది ఫిర్యాదు. అయినా ఇప్పటికీ అరవై ఎనిమిది శాతం పిల్లలకు లైంగిక సమాచారానికై తల్లిదండ్రులపై ఆధారపడటమే ఇష్టం- అంటున్నారు కెనెడియన్ అసోసియేషన్ ఫర్ ఎడాలిసెంట్ హెల్త్‌వారు. ఆ రకమైన సమాచారం చెప్పడం గాని, వివరించడం గాని తల్లిదండ్రులకు ప్రాణసంకటంగా తయారైంది. 'బస్సుల్లో వెళుతున్నప్పుడో లేక ఏ కిరాణా షాపులో సరకులు కొంటున్నప్పుడో వీడి నోటినుంచి దూసుకొచ్చే ప్రశ్నలు నాకు వణుకు పుట్టిస్తున్నాయి' అని నాలుగేళ్ల బిడ్డల తల్లులూ వాపోతున్నారు. ఇబ్బందికరమైన దృశ్యాలు వస్తున్నప్పుడు ఛానెళ్లు మార్చేయడం, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినప్పుడు మాట మార్చేయడంవల్ల పిల్లలు అసంతృప్తికి లోనవుతారని, వారిలో ఆసక్తి మరింత పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాలం మారేటప్పుడు ఎదురయ్యే సాంస్కృతికపరమైన కుదుపు(కల్చర్‌షాక్) ఇప్పుడు తల్లిదండ్రులను వేధిస్తోంది. పిల్లలు కోరే లైంగిక సమాచారం అందివ్వడమే తల్లిదండ్రులకు మేలు అని నిపుణులు వాదిస్తారు. అలా ఇవ్వకపోతే వాళ్లు ఇతరత్రా(?) మార్గాలు వెతుక్కుంటారని, అపోహలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణుల అభిప్రాయం. అంటే ప్రతి కుర్రాడికీ ఒక్కో కొక్కోకమో, కామసూత్ర గ్రంథమో కొని చదివించాలేమోనన్న భయం, అపోహ తల్లిదండ్రుల్లో వ్యాపిస్తోంది. కాదు, చందమామ కథల్లా జంతుపాత్రల ఆధారంగా లైంగిక సమాచారం వివరించడం తేలికేనని నిపుణులు వివరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పటివరకూ పిల్లలు బాల్యాన్నే కోల్పోయారనుకుంటున్నాం, కొంపదీసి యౌవనాన్ని సైతం కోల్పోబోతున్నారా అని పెద్దలు అనుమానించాల్సి వస్తోంది!
(Eenadu, Editorial, 28:09:2008)
_____________________________
Labels: Life/ children / telugu
Sunday, July 06, 2008
తల్లిదండ్రులూ బహుపరాక్!

గొప్ప మేధావిగా పేరుగడించిన ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్ షాకు ఒక విందు సమావేశంలో అందమైన సినీనటి తారసపడింది. నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి 'మనం పెళ్లిచేసుకుంటే మన పిల్లలకు మీ తెలివితేటలు, నా అందం రెండూ వస్తాయి. అందమూ, తెలివీ ఒక్కచోట చేరడం అద్భుతం కదా!' అని ప్రతిపాదించింది. షా చిన్ననవ్వు నవ్వాడు. 'మీరు చెప్పింది బాగానే ఉంది... ఆ పుట్టే పిల్లలకు మీ తెలివితేటలూ, నా అందమూ వస్తే- వారి గతి ఏమిటి?' అన్నాడు! తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏమేమి సంక్రమిస్తాయో నిర్ధారణగా చెప్పలేం. ఆడపిల్లకు తండ్రి పోలికలు, పిల్లవాడికి తల్లి పోలికలు వస్తే మంచిదంటారు. ప్రతి గొప్పవాడూ తన తల్లి గుణాలు చాలావరకు కలిగి ఉంటాడంటారు. స్త్రీ, పురుషుడు పెళ్లిచేసుకుని భార్యభర్తలవుతారు. పిల్లల్నికని తల్లిదండ్రులవుతారు. భార్యాభర్తలయ్యేది, తల్లిదండ్రులయ్యేది- ఆ ఇద్దరేగాని, భూమికల్లో మాత్రం చాలా తేడాఉంది. బాధ్యతల్లోనూ ఎంతో అంతరముంది. తల్లిదండ్రులు చెడిపోయినా, విడిపోయినా సంతానమే నష్టపోతుంది. వారి తప్పులు పిల్లలను వెంటాడతాయి, వేధిస్తాయి. పిల్లలు చిన్నవయసు వాళ్లయితే అదింకా ప్రమాదం. మనిషి స్వభావంపై బాల్యం ప్రభావం అధికమని శాస్త్రం నిరూపించింది. సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యేవారిలో ఎందరో బాల్యంలో తల్లిదండ్రుల ఆదరణకు దూరమైనవారే అనేది చేదు నిజం! అమ్మలాలన, నాన్న ఆదరణ లభించిన పిల్లలు అదృష్టవంతులు. తల్లిదండ్రులను అనుకరించడంతోనే పిల్లల ప్రవర్తన రూపుదిద్దుకుంటుంది. పూజగదిలో రోజూ దీపంపెట్టే అమ్మను ఆడపిల్ల అనుకరిస్తుంది. సిగరెట్లు కాకుండా, అగరొత్తులు వెలిగించే తండ్రిని కొడుకు అనుకరిస్తాడు. పిల్లలు బాగుపడాలని కోరుకునే తల్లిదండ్రులు ముందు తాము బాగుపడాలి. పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.
'మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్షదేవతామ్'- తల్లీతండ్రీ ప్రత్యక్ష దైవాలని మన సాహిత్యం బోధించింది. మాతృదేవోభవ, పితృదేవోభవ- అని నూరిపోసింది. తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవాలో చెప్పినంత గట్టిగా, ఎక్కువగా పిల్లలను ఎంతబాగా చూసుకోవాలో చెప్పలేదు. సమాజమూ 'పిల్లల్ని కనడం ఎలా' అనే అంశంపై చేసినన్ని ప్రయోగాలు, పరిశోధనలు 'పెంచడం ఎలా' అనే విషయంపై చేసినట్లు కనపడదు. పెంకును తానే పగలగొట్టుకుని కోడిపిల్ల బయటకు తొంగిచూస్తుంది. టెంకను చీల్చుకుని మామిడి విత్తు స్వయంగా మెడ బయటకు పెడుతుంది. తల్లిని తీవ్రహింసకు గురిచేసిగాని, బిడ్డ బయటపడదు. 'అమ్మ' అనిపించుకోవాలని స్త్రీ దానంతటినీ పంటిబిగువున భరిస్తుంది. అందుకనే ఈ లోకం తల్లికి అత్యున్నత స్థానాన్ని కల్పించింది. 'పదిమంది ఉపాధ్యాయుల కన్నా ఒక ఆచార్యుడు, వందమంది ఆచార్యులకన్నా ఒక తండ్రి, వెయ్యిమంది తండ్రులకన్నా గౌరవనీయురాలైన ఒక తల్లి ఎంతోగొప్పది' అనడం అమ్మదనానికి అపూర్వసత్కారం! పురుషుడికన్నా స్త్రీ ఎక్కువకాలం జీవించడానికి 'అమ్మ'కావడమే ముఖ్యకారణమని సైన్సు భావిస్తోంది. గర్భం ధరించినప్పుడు- బిడ్డకు సంబంధించిన శక్తిమంతమైన మూలకణాలు(స్టెమ్‌సెల్స్) తల్లి ఎముక మూలగల్లోకి చేరుతున్నాయి. పిండం ఎదిగేటప్పుడు రక్తం చర్మం కండరాలు మెదడు... రూపొందేది ఈ మూలకణాల్లోంచే! వ్యాధులు బాధించినప్పుడల్లా ఈ మూలకణాలు తల్లికి రక్షణ కల్పిస్తూ, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తాయి. బిడ్డకు సంబంధించిన ఈ సహజ రక్షణవ్యవస్థ- ప్రసవం తరవాత తల్లి మూలగల్లోనే స్థిరపడిపోతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఏభైఏళ్ల తరవాత సైతం ఆ మూలకణాలు చురుగ్గా ఉండటాన్ని లండన్‌లోని హామర్‌స్మిత్, ఇంపీరియల్ కళాశాలల పరిశోధక బృందం గమనించింది. ఇది బిడ్డవల్ల తల్లికి చేకూరే గొప్పమేలు.
మన పెద్దలు కొడుకువల్లే పురుషుడికి పున్నామ నరకం తప్పుతుందన్నారు. అపుత్రస్య గతిర్నాస్తి- పిల్లలు లేకపోతే ఉత్తమ గతుల్లేవన్నారు. పితృరుణం తీరాలంటే పుత్రులు కలగాలని భారతంలో జరత్కారుడి కథ వివరిస్తుంది. పురుషుడే తన భార్యగర్భంలోంచి పుత్రుడిగా జన్మిస్తున్నాడు కనుక తనకంటే వేరుకాడు, నా అన్యః అనే భావనలోంచే 'నాన్న' అనే పదం పుట్టిందని పెద్దల మాట. పిల్లల కోసమే తల్లిదండ్రులూ, తల్లిదండ్రులకోసమే పిల్లలూ! పిల్లల్ని సుఖంగా పెంచాలని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలని పిల్లలూ ఆలోచించాలి. అప్పుడే కుటుంబం బాగుంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకున్నంత బాగా పెద్దలు అర్థం చేసుకోవడం లేదని అమెరికాలోని 'చిల్డ్రన్స్ సొసైటీ' పరిశోధకులు భావిస్తున్నారు. 1176 మందితో వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం- తల్లిదండ్రుల్లో 'ఆదర్శమూర్తులు'(రోల్‌మోడల్స్) క్రమంగా తగ్గిపోతున్నారు. వారిలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. పిల్లలు గొప్పవారయ్యేందుకు కావలసిన స్ఫూర్తినీ ఉత్తేజాన్నీ తల్లిదండ్రులు తమ పిల్లల్లో రగిలించలేకపోతున్నారు. వారి వ్యక్తిగత బలహీనతలు, పరస్పరం ఆధిక్యతా ప్రదర్శనలు, నిరంతరం కీచులాటలు, చివికిపోతున్న బాంధవ్యాలు, చీలిపోతున్న బంధాలు, కూలిపోతున్న కాపురాలు, పతనమవుతున్న విలువలు, పరిహసిస్తున్న కుటుంబ వ్యవస్థలు... పిల్లల్ని కలవరపెడుతున్నాయి. కఠోపనిషత్తులో వాజస్రవసుని చేష్టలను నిరసించిన అతని కొడుకు నచికేతుని మాదిరిగా- పిల్లలు తమ తల్లిదండ్రుల దుశ్చర్యలను, దిగజారుడుతనాన్ని ప్రశ్నిస్తున్నారు. పరిశోధక బృందం నాయకుడు బాబ్ రీటిమియర్- పిల్లలు మెచ్చేట్టుగా తల్లిదండ్రుల్లో మార్పురావాలని అభిప్రాయపడుతున్నారు. అమృతత్వాన్ని సిద్ధింపజేసే 'నచికేతాగ్ని విద్య' సాధించిన నచికేతుని మాదిరిగా- లోకంలో సుఖసంతోషాలతో కూడిన చక్కని కుటుంబ వ్యవస్థను ఆ పిల్లలు సాధించగలరని ఆశిద్దాం!
(ఈనాడు,సంపాదకీయం,06:06:2008)
_______________________________
Labels: Life/ children / telugu


















