My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, November 05, 2011

ఆకుపచ్చ'ధనం'

అశ్వత్థవృక్షాన్ని నాశనం లేనితనంలో సంసారంతో పోల్చాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదిహేనో అధ్యాయంలో. రావి ముక్కోటి దేవతల ఆవాసమని భారతీయుల విశ్వాసం. దత్తావతార పరంపరలో వృక్షాలకుండే ప్రాధాన్యం విశేషమైనది. షిర్డీసాయి పన్నెండేళ్లు వేపచెట్టుకింద తపస్సు చేసినట్లు చెబుతారు. పంటపొలాలు లక్ష్మీ నివాసాలని ప్రాచీనుల భావన. సంతాన కామన, గ్రహదోష విముక్తి, పితృదేవతల అనుగ్రహం వంటి లౌకిక కార్యకలాపాలన్నింటికి అశ్వత్థ, బిల్వ, శింశుప వంటి వృక్షదేవతల అనుగ్రహం అత్యంత ఆవశ్యకమని బ్రహ్మవైవర్త పురాణం నుంచి తైత్తరీయ సంహిత దాకా ఘోషిస్తున్నాయి. అన్యమత సంస్కృతుల్లోనూ వృక్షసంపదకు గౌరవస్థానముంది. బౌద్ధ హీనయాన సంప్రదాయ శిల్ప కళాఖండాల్లో తథాగతుడికి సంకేతం బోధివృక్షమే. యూదుల ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో సృష్టి అంటే జీవవృక్షం. యూరోపియన్లు ఇగ్డ్రాసిత్ మహావృక్షంగా అభివర్ణించేది ఈ జీవవృక్షాన్నే. ఈజిప్షియన్, ఇస్లామిక్ వంటి ప్రాచీన సంస్కృతులన్నీ వృక్షప్రాథమిక స్వరూపాన్ని వివరించాయి. మానవాళి మనుగడకు మూలాధారం ప్రకృతి ప్రసాదించిన వృక్షసంపదే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో- అత్తవారింటికి పోతున్న శకుంతలను తపోవన వృక్షాల అనుమతీ తీసుకొమ్మని కణ్వమహర్షి కోరింది అందుకే. చెట్లపాదుల్లో నీరు పోయకుండా తాను చుక్కనీరైనా తాగేది కాదు శకుంతల. అలంకారమంటే ఎంత మమకారమున్నా చిగురుటాకు తెంపడానికీ ఇష్టపడేది కాదామె. మొదటిసారి మొక్క పూతకొచ్చినప్పుడు అదో మహోత్సవంగా సంబరాలు జరుపుకొనే ప్రకృతి ప్రేమే ప్రపంచమంతటా పరచుకుని ఉండేది నిన్నమొన్నటిదాకా.

చెట్లు, తీగెలు, పూలు, పళ్లు, చిగురుటాకులు, వసంతాలు, హేమంతాలూ- ఇవే ఒకనాటి మన మహాకవులకు అభిమాన కవితా వస్తువులు. ప్రకృతితో తాదాత్మ్యత పొందడం సుకవిత లక్షణంగా భావించిన రోజులవి. శివుడికోసం తపోనియమంలోకి దిగుతూ గౌరి తన హొయలు విలాసాలను పూలతీగెల్లో భద్రంగా దాచుకుంది- అంటాడు కుమార సంభవంలో కాళిదాసు. ప్రవరాఖ్యుణ్ని అడ్డుపెట్టుకొని అల్లసాని పెద్దనామాత్యులు హిమగిరి వర్ణనలవేళ చెలరేగిపోయారు. భగీరథుడు తలవెండ్రుకలు జడలు కట్టేదాకా నిశ్చింతగా తపం చేయగలిగాడన్నా, బిడియం విడిచి పార్వతి ఏకాంతంలో శివుడు డస్సిపోకుండా అవిశ్రాంతంగా సేవలందించగలిగిందన్నా... అదంతా అడవితల్లి చలవే! త్రేతాయుగంలో పతీవియోగం వేళ సీతమ్మతల్లి శోకాన్ని పంచుకున్నది ఒక అశోక వృక్షం. మేఘనాథుడి మాయదెబ్బకు మూర్ఛిల్లిన లక్ష్మణస్వామిని పునర్జీవితుణ్ని చేసింది ఆంజనేయుడు తెచ్చిన సంజీవనీ మూలిక. 'అసతోమాసద్గమయా' తత్వం తథాగతుడి హృదయానికి తట్టింది ఓ బోధివృక్షం కిందేగదా! గడ్డిపరకనుంచి మహా వటవృక్షం దాకా మొక్కలోని ప్రత్యంగమూ మానవ జాతికి చేస్తున్న ఉపకారాలను ఏకరువు పెడుతూ పోతే ఎన్ని ఉద్గ్రంథాలైనా చాలవు. పోతన భాగవతంలో గోపబాలురు వేసవితాపాన్ని తట్టుకోలేక తరుచ్ఛాయల కింద చేరిన సందర్భంలో గోపాలకృష్ణుడు పాదపాల ప్రయోజనాలను తెలియజెబుతాడు. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ నుంచి, మన తెలుగువాడు గోపీచంద్ దాకా పోతనలాగా వృక్ష మహిమలను కథలుగా చెప్పినవారు ఎందరో. వాటిని చెవిన పెట్టేవారు కరవవుతున్నారు ఈ కలికాలంలో!

తరుదేవతల మహాప్రసాదం తగుపాళ్లలో లేకపోతే మనిషి ఎంత తిన్నా అది అసంపూర్ణాహారమే అంటుంది ఆయుర్వేదం. మనిషి పుట్టుకకు ముందునుంచే చెట్టు ఉంది. బట్ట కట్టడానికి పత్తి, పెరిగి పెద్ద కావడానికి పండ్లూకాయలు, పండుగలకు తోరణాలు, పెళ్ళిళ్లకు మండపాలు, చివరికి అంత్యదశలో కాష్ఠమై కాలేదీ చెట్టుచేమలిచ్చే కట్టెలతోనే గదా! అణుయుద్ధంలో అంతా సర్వనాశనమైపోయినా బీజరూపంలో భూగర్భంలో దాగి అదను చూసుకుని తిరిగి మోసులెత్తే బతుకు చేవ సృష్టిమొత్తంలో ఉన్నది ఒక్క మొక్కకే- అంటారు జగదీశ్ చంద్రబోస్. 'వాడిన వనవాటిక / మరల తిరిగి పల్లవిస్తుంది' అన్న దాశరథి గేయంలో దాగున్న భావమూ అదే! రాకాసి రెక్కల నీడలో వ్యాపారమొక్కటే వూపిరవుతున్న ఈవేళ పచ్చదనం గతకాలపు జ్ఞాపకంలా మిగిలిపోతుండటం విషాదకరం. పచ్చని పొలాలను, అడవులను విచ్చలవిడిగా దున్నేసి పరిశ్రమలు నెలకొల్పే పిచ్చితనంతో మనిషి మనుగడకే ముప్పు ముంచుకొస్తోంది. అంతకంతకు వృక్షసంపద తరిగిపోతూ భూగోళాన్ని వేడెక్కించేస్తోంది. రుతుధర్మాలు గతి తప్పి కొత్తరోగాలు కమ్ముకొస్తున్నాయి. వేరునుంచి చిగురుదాకా నిస్వార్థంగా సకలం సమర్పించుకునే వృక్షసంతతిని సర్వనాశనం చేయడం- మనిషి స్వవినాశానికి మొదటి మెట్టు. అర్ధశతాబ్ది వయసున్న ఒక వృక్షం అందించే సేవల విలువ రూపాయల్లో సుమారు పదిహేడు లక్షలు. మూడుపదుల చదరపు కిలోమీటర్ల పచ్చదనం ఒక్కరోజులో అందించే ప్రాణవాయువు ఒక మనిషికి రోజంతా సరిపోతుందని అంచనా. హెక్టారు భూమిలోని చెట్టూచేమా ఇరవైనాలుగు కిలోల సారవంతమైన మట్టిని కొట్టుకుపోకుండా కాపాడటంతోపాటు ఆరునుంచి ఎనిమిది డెసిబుల్స్ వరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గించగలవు. పచ్చదనాన్ని మించిన పసిడిధనమిది. మనిషికి ప్రకృతిలో మరేదీ ఇంత ఉచితంగా దొరకదు. ఎక్కి ఉన్న కొమ్మనే విరిచేసే వెర్రితనం మనిషి మానుకోవాలి. వృక్షాలను నరికితే ఆరునుంచి రెండేళ్లదాకా బెయిలు ఇవ్వని కారాగారవాస శిక్ష విధించే జీవవైవిధ్య మండలి చట్టాన్ని అందుకే అందరం హృదయపూర్వకంగా స్వాగతించాలి.
(ఈనాడు సంపాదకీయం, ౩౦:౧౦:౨౦౧౧)
_________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home