My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, November 16, 2011

తొలి కలల ప్రేమలేఖ


ప్రణయభావం హృదయ సంబంధి. నిండు నూరేళ్ల జీవితానికి రసాలందించే ఆ ప్రేమఫలం చవిని పసగల రెండు మూడు పదాల్లో పొదగాలంటే ఎంత అనుభవం కావాలి? 'ప్రేమంటే ఒక తికమకలే. అది వేధించే తీపి కలే' అన్నాడో ఓ సినిమా కవి. ఎద సడిని సరిగమపదనిసలుగా మలచి పాడే ఆ గడసరి- పిడికిలంత గుండెలో కడలిని మించిన హోరును పుట్టించగల జగడాలమారి. 'మ్రొక్కి మొక్కించుకొనునట్టి చక్కదనము/పొగిడి పొగిడించుకొనునట్టి ప్రోడతనము/దక్కి దక్కించుకొనునట్టి దంటతనము/ దానికేకాక కలదే యే చానకైనా?' అని ముద్దుపళనివారి మాధవుడు తలపోసింది రాధిక గురించే. నిజానికి ఆ శాపనార్థాలన్నీ అన్యాపదేశంగా అశరీరుడి ఆగడాలమీద గురిపెట్టిన శరాలే! సదా గోపాలపాద చింతనామగ్న అయిన గోపకాంత ఒకతె చెంతవాలిన చంచరీకాన్నే ప్రియుడు పంపిన ప్రేమదూతగా భావించుకొని ఆలపించిన భ్రమరగీతాలూ ఈ ధోరణిలోనే సాగే తంతు. తనను మన్మథ వేదనపాలు చేసిన విధాత నిర్దయను వ్రేపల్లె గొల్లభామ పడ తిట్టిపోస్తుంది- పోతన భాగవతంలో. 'కత్తిలేని ఒరకు కాంతి లేనట్టుగా ప్రేమలేక యున్న బ్రతుకు సున్న' అని దాశరథి వంటి కవులు భావిస్తూనే ఉన్నారంటే ఆ కొంటెతనమంతా ఈ మిటారితనంలోనే ఉందనేగా! 'ప్రణయ వధువు నొక రాతిరి త్రాగినాను/ప్రళయ దినము దాక నిషా వదలదు నన్ను' అంటూ పారశీక గజల్ కవి మీర్ పదాలు పాడింది ఈ పాడు తీపి ప్రణయ మధువు గమ్మత్తు మత్తు గురించే!

ప్రేమంటే మోకాలి లోతు దుఃఖం. పీకల దాకా సుఖం. ముల్లు ముల్లుకీ మధ్యనే పువ్వు విచ్చుకున్నట్లు, పువ్వు పువ్వుకీ మధ్య ముల్లూ పొడుచుకొని ఉంటుంది. ప్రేమలో కన్నీళ్లు వద్దనుకుంటే ఎలా? మెరుపు లేకుండా, చినుకు రాకుండా చిగురు పుడుతుందా? రాధికా సాంత్వనంలోని కథానాయిక బాధే ఏ మదన పీడితులకైనా. 'కంటికి నిద్రరాదు, వినుకాంతుని బాసిన నాటి నుండియున్/వంటకమింపు గాదు, పెఱవార్తలు వీనుల సోకలేదు నే/డొంటిగ బ్రొద్దుపోదు, మరులూరక యుండనీదు, తొల్లినే/జంట బెనంగు వారిగన జాలక చాల కరంగ గంటినో' అంటూ పెంపుడు చిలుక ముందు కంటనీరు పెట్టుకొంటుంది రాధిక ఒంటరి తుంటరి ఒంటిబాధ భరించలేక. సుభద్రను తొలిరేయి సమాగమానికి స్వయంగా అలంకరించి భర్త వద్దకు పంపిన తాళ్ళపాక తిమ్మక్కవారి 'ద్రౌపది'దీ అదే హృదయ వేదన. 'విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా!' అంటూ పింగళి వంటివారు ఎంత వూరించినా నండూరివారి నాయుడు బావకిలా గుండె గొంతుకలో కొట్లాడుతుండే కూకుండనిస్తుందా కూసింతసేపు?! 'ఒక ముద్దుకోసం యుగాలైనా ఆగుతాను/ తన పొందుకోసం యోజనాలు సాగుతాను' అని బీరాలు పలికే ప్రేమదాసులు మూడుముళ్లు పడితేచాలు... తొలి రేయిదాకానైనా తాళలేరు. 'ఆలుమగల మధ్యగల ఆ అనుబంధం కాలం గడిచేకొద్దీ బలమైన స్నేహబంధంగా మారితేనే ఆ సంసారం సరస సుధాసారం... ఆ జంట లోకం కనులపంట' అంటాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. ఈ తరం యువతరం తొందరపాటు, కలిసి నడవడంలోని తడబాటు, నూతన దంపతుల్లోని ఎడబాటును మరింత వేగంగా పెంచుతోందని మానసిక శాస్త్రవేత్తలిప్పుడు ఆందోళన చెందుతున్నారు.

'ఆమె కడలి తీరపు దీపం. కాకపోతే... అతను సంసార సాగరంలో జాడ తెలియని ఓడ. అతను సాగర హృదయ వైశాల్యం కాకపోతే ఆమె సంగమ సాఫల్యం అందని నదీసుందరి' అంటాడొక ఆధునిక కవి. ఉత్తమ ఇల్లాలు ఎలా ఉండాలో కుమారీ శతకం ఏనాడో తెలియజెప్పింది. భర్తకు భోజనం వడ్డించేటప్పుడు తల్లిలా, పవళింపు సేవలో రంభలా, ఆలోచనల వేళ మంత్రిగా, సేవించేటప్పుడు దాసిగా మెలగాలంటుంది. మరి, భర్త ఎలా ఉండాలి? ఆలుమగలు ఆకాశం, భూమిలాగా- హృదయవైశాల్యం, సహన సౌశీల్యం అలవరచుకుంటేనే ఆ దాంపత్యం వాగర్ధ ప్రణయైకమత్యమంత ఆదర్శప్రాయమవుతుంది. 'ఆత్మ సమానత్వం పొందిన జీవిత భాగస్వామి ముందు మోకరిల్లటం ఆత్మనమస్కారమంత ఉత్తమ సంస్కారం' అని కదా మల్లినాథహరి కిరాతార్జునీయంలోని ఒక ఉపకథాసారం! 'పొందనేర్తునె నిన్ను పూర్వజన్మ / కృతసుకృత వైభవమున దక్కితివి నాకు' అని ఆమె అనుకోవాలి. 'ఎంత మాధుర్యమున్నదో యెంచగలనె! / సలలిత కపోల నీ మృదుసూక్తిలోన' అని అతను మనస్ఫూర్తిగా భావించి పైకి అనాలి. పెళ్ళినాటి సప్తపదిలో ముందు నాలుగడుగులు వధువు వరుణ్ని నడిపిస్తే, మిగిలిన మూడడుగులు వరుడు వధువు చేయిపట్టుకొని నడిపించేవి. పెళ్ళిపీటల మీద అగ్నిసాక్షిగా పరస్పరం చేసుకొన్న ప్రమాణాలు కాళ్ల పారాణి పచ్చదనం తడి ఆరకముందే నేటితరానికి మరపునకు రావడం విచారకరం. పెరుగుతున్న విడాకులకు విరుగుడుగా పొరుగున చైనాలోని బీజింగ్ తపాలాశాఖ ప్రేమలేఖల చిట్కా ప్రవేశపెట్టింది. మూడుముళ్లు పడిన మరుక్షణంలోనే వధూవరులు తమ జీవిత భాగస్వాముల మీదున్న ప్రేమనంతా ఒలకబోసి రాసిన ప్రేమలేఖలను ఆ శాఖవారు భద్రపరచి ఏడేళ్ల తరవాత తిరిగి ఇస్తారట! పెళ్ళినాటి ప్రమాణాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఎడబాటు ఆలోచనలు తగ్గుముఖం పడతాయన్నది వారి సదాలోచన. కలకాలం కలిసే ఉండాలన్న కోరికలు మరింత బలపడితే శ్రీ గౌరీశ్వర సాన్నిహిత్యంలా వారి దాంపత్యం కళకళలాడుతుందన్న ఆలోచనే హర్షణీయం. అందమైన సంసారాలను ఆశించే వారందరికీ అది ఆచర
ణీయం. 
(ఈనాడు సంపాదకీయం, ౦౯:౧౦:౨౦౧౧)
__________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home