ఒక్క అవకాశం చాలు.. ఎదగడానికి
అవకాశాలు చెప్పిచెప్పి రావు.. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఆనక తీరిగ్గా చింతించాల్సిందే. అందిపుచ్చుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచంలో వేలకొద్దీ కోటీశ్వరులు ఉండొచ్చు. వందల సంఖ్యలో అపర కుబేరులు ఉండొచ్చు. అందరినీ ఒకే గాటన కట్టలేం. నేడు కార్పొరేట్ దిగ్గజాలుగా కీర్తింపబడుతున్న వారంతా ఒకప్పుడు జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అనునిత్యం సవాళ్లతో సవారీ చేస్తూ ఉంటారు. మనం ఒక స్థాయికి చేరాలంటే చాలా కష్టపడాలి. ఆ స్థాయికి ఎదిగాక.. మెట్టు దిగజారకుండా చూసుకోవాలి. అది అతిపెద్ద సవాలు. కొంచెం కష్టపడితే నంబర్‌వన్‌గా గుర్తింపు పొందవచ్చు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మిమ్మల్ని కిందకు లాగడానికి ఎన్నో శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఈ దశలో అప్రమత్తత చాలా అవసరం. లేదంటే మన పీఠాన్ని వేరొకరికి అప్పగించాల్సిందే. భారత క్రికెట్ జట్టు అగ్రస్థానానికి చేరడానికి చాలానే శ్రమించింది. కొన్నాళ్లపాటు ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది కూడా. కానీ, ఒక్క ఇంగ్లండ్ పర్యటన తలరాత మార్చేసింది. అగ్రస్థానం చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ దాన్ని అందుకోవడం కత్తిమీద సామే అవుతోంది. పైగా పోటీదారులు అంత తేలిగ్గా దరిచేరనివ్వడం లేదు. పైమెట్టు ఎక్కడమే కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో తెలియజెప్పేందుకు ఇదో చక్కటి ఉదాహరణ.
కోటీశ్వరులం కావాలని.. కోట్లకు పడగలెత్తాలని.. అపర కోటీశ్వరులుగా నిలిచిపోవాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ దానికి తగ్గ కసరత్తు మాత్రం చేయరు. కలలతోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తమవల్ల కాదనుకుని సర్దిచెప్పేసుకుంటారు. పైగా తాము ఎదగలేకపోవడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటారు. ఇతరులపైకి నెపం నెట్టేస్తారు. వ్యవస్థను దుమ్మెత్తిపోస్తారు. చివరకు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో స్థిరపడిపోతారు. సాదాసీదా జీవితానికి అలవాటుపడిపోతారు. చాలామంది చేసేది ఇదే. కానీ దిగ్గజాలుగా ఎదిగిన కార్పొరేట్లు మాత్రం ఇలా చేయరు. జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. దాన్ని సాధించేవరకు పట్టు విడవరు. ప్రయాణంలో ఎన్నిసాధకబాధకాలు ఎదురైనా దీటుగా ఎదురొడ్డి నిలుస్తారు. ఎందుకంటే వారి కళ్లముందు సాధించాల్సిన లక్ష్యం ఒక్కటే కనిపిస్తుంది. ఈ ప్రజ్ఞత అలవరచుకోవడానికి వారు అనుసరించే ఏకైక విధానం 'సానుకూల దృక్పథం'. ఈతరహా ఆలోచన ఉన్న వ్యక్తులు ఇతరులకు భిన్నంగా ముందుకు దూసుకుపోతూ.. ఎదుటివారికి తమను తాము పరిచయం చేసుకుంటుంటారు. అవకాశాలకోసం ఎదురు చూడరు. అన్వేషిస్తారు. లేదంటే సృష్టించుకుంటారు. సమస్యలో సైతం అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటారు. తద్వారా దక్కే ప్రయోజనాన్ని భవిష్యత్తుకు బాటగా మలుచుకుంటారు. ఇలా ముందడుగు వేసిన వ్యక్తే రిచర్డ్ బ్రాన్సన్. వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఈయన.
మీరు అర్జెంట్‌గా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాలి. టికెట్ సహా అన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. తీరా విమానాశ్రయానికి వెళ్లేసరికి ఆ విమానం రద్దయిందని తెల్సింది. ఆ సమయంలో సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు...?
కోపం కట్టలు తెంచుకుంటే సంబంధిత అధికారులపై మీ ప్రతాపం చూపిస్తారు. ఫిర్యాదు చేస్తారు.
లేదంటే మళ్లీ విమానం ఎప్పుడుందని ఆరా తీస్తారు.
ఈ రెండూ కానప్పుడు సహ ప్రయాణీకుల దగ్గర మీ ఆక్రోశం వెళ్లగక్కుకుంటారు. ఒకరు ఇబ్బందులు ఒకరు చెప్పుకుని ఓదార్చుకుంటారు.
మనలో అందరూ దీన్ని ఒక సమస్యగా చూస్తారే తప్ప అంతకు మించి ఎక్కువ ఆలోచించరు.
ఇలా ఎప్పుడైతే చేశారో పరిస్థితులపై పట్టు కోల్పోతారు.
మరి ఇలాంటి సమస్యే బ్రాన్సన్‌కూ ఎదురైంది 1980లో. అప్పటికి ఆయనేమీ వర్జిన్ గ్రూప్ అధిపతి కాదు. మనలా మామూలు వ్యక్తే. కానీ, ఇతరులకు భిన్నంగా ఆలోచించాడాయన. భార్యతో కలసి ప్యూర్టో రికాన్‌కు వెళ్లాల్సిన బ్రాన్సన్ విమానం ఏదో సమస్యతో రద్దయింది. ఎలాగైనా ఆరోజే వెళ్లితీరాలి. ఎలా..? ఆరోజుకు ఇంకో విమానం లేదు. ఏంచేయాలో పాలుపోని పరిస్థితిలో బుర్రకు పదును పెట్టాడు. జరిగినదాన్ని సమస్యగా కాకుండా.. తన పని ఎలా నెరవేర్చుకోవాలా? అని ఆలోచించాడు.
ఆలోచించాడు.. ఆలోచించాడు..
వెంటనే ఛార్టర్ విమాన సేవలందించే కంపెనీలకు చకచక ఫోన్ చేశాడు. 2,000 డాలర్లకు ఒక విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడే చాకచక్యంగా వ్యవహరించాడు. అక్కడున్న ఒక బ్లాక్‌బోర్డుపై చకచకా ఓ నాలుగు ముక్కలు రాశాడు.. అవేమిటో తెలుసా...?
'ప్యూర్టో రికాన్‌కు వర్జిన్ ఎయిర్‌వేస్ విమానం సిద్ధంగా ఉంది. టికెట్ 39 డాలర్లు'.
అంతే.. ఓ గంట గడిచిందో లేదో.. ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా విమానం మొత్తం నిండిపోయింది. తాను వెళ్లాల్సిన చోటుకు వెళ్లడమే కాదు. తోటి ప్రయాణికుల ఇబ్బందీ తీర్చాడు. అదే సమయంలో ఖర్చులు పోను లాభాలూ జేబులో వేసుకున్నాడు.
'వర్జిన్ ఎయిర్‌వేస్.. బాగుంది. ఇలాగే విమానాలు నడపొచ్చుగా..' అంటూ ఓ ప్రయాణికుడు ఇచ్చిన సలహా అతని బుర్రలో నాటుకుపోయింది.ఆ తర్వాతి రోజుల్లో వర్జిన్ ఎయిర్‌వేస్ విమాన సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం దాని టర్నోవర్ దాదాపు రూ.19,000 కోట్లు.
ఆ రోజు విమానం రద్దు కాకపోయి ఉంటే ఇప్పుడు వర్జిన్ ఎయిర్‌వేస్ ఉండేదో, లేదో కానీ.. అది వేరే విషయం.
ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం..విమానం రద్దును బ్రాన్సన్ ఒక సమస్య భావించలేదు. అవకాశం సృష్టించుకున్నాడు. పైగా తన జేబులోంచి ఒక్క పైసా పెట్టలేదు. ఆలోచనను అమలు పరిచాడు.. లాభాలు జేబులో వేసుకున్నాడు. ప్రతిసారీ ఇలా సాధ్యం కాకపోవచ్చు. కానీ, అందివచ్చిన ఒక్క అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. సాధించాడు. సానుకూల దృక్పథం ఉంటే నీరసం, నిస్సత్తువ నుంచి సైతం చక్కటి ఫలితం సాధించొచ్చు అనేందుకు ఇదో చక్కటి ఉదాహరణ.
సానుకూల దృక్పథం చేసే మేలు తక్కువేమీ కాదు. జీవితంపై నియంత్రణ సాధించొచ్చు. ఒకనాటికైనా లక్ష్యాన్ని సాధించే సత్తా సమకూర్చుకోవచ్చు. విజయం, సంపదకు అర్హులుగా నిలవొచ్చు.
-ఈనాడు వాణిజ్య విభాగం
(ఈనాడు, ౦౪.౧౨.౨౦౧౧ )
______________________________________________
Labels: Management, Personality, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home