My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, December 29, 2011

గీతా మకరందం


గంగ, గాయత్రి, గీత- ప్రపంచానికి భారతీయత ప్రసాదించిన మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక కానుకలు. తొలిరెంటి మాట అలా ఉంచి గీతాసూత్రం మాత్రం 'శంకా సంకుచితాంతరంగులకు, వృథా సందేహమందేహులకు' కింకర్తవ్య విమూఢత్వం ఆవరించినప్పుడల్లా మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా స్వస్థతనందించే చక్కటి ఔషధం. దాదాపు అయిదువేల సంవత్సరాల కిందట- దుర్మదాంధులైన కురుసైన్యం ఎదుట కురుక్షేత్ర రణక్షేత్రం ముంగిట దైన్యయోగంలోపడ్డ నరుడికి నారాయణుడే జ్ఞానసారథ్యం వహించి చేసిన కర్తవ్యబోధ- గీత! 'గీ' అంటే త్యాగం, 'త' అంటే తత్వజ్ఞానం. యుద్ధ సందర్భాన్ని ఓ మిషగా తీసుకొని సర్వకాలాలకూ వర్తించే నిష్కామ కర్మయోగ ప్రాశస్త్యాన్ని భగవంతుని మాటగా 'గీత' ప్రకటించిందని బుద్ధిజీవులూ విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సరిసమానంగా ప్రమాణత సంతరించుకొన్న ప్రవచనంగా శంకరాచార్యుల వంటి భగవత్పాదులే గీతను భావించి భాష్యాలు వెలువరించారు. సంక్షుభిత సమాజానికి సాంత్వన చేకూర్చే చిత్రమైన తత్వమేదో గీతలో దాగుందని డాక్టర్ అనిబిసెంట్ వంటి మేధావులూ వ్యాఖ్యానాలు చేశారు. దేవుడు పట్టించుకోనంత దూరంలో ఉన్నాడు కనుక, మనిషి నిర్భయంగా సుఖపడవచ్చని ఆదిమానవుడు నమ్మిన కాలంనుంచి, నేటికాలం దాకా- మానవజీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మతాలు, మార్పులు, మలుపులు. త్రికరణశుద్ధిగా, ఫలాపేక్ష రహితంగా, భవబంధాలకు అతీతంగా, కర్మ చేయడమొక్కటే మనిషి కర్తవ్యమని నిక్కచ్చిగా చెప్పిన గీతాసూత్రం- ఈ అణుయుగంలో సైతం అణువంతైనా మారలేదు. గీత సజీవతకు, అంతస్సూత్రంగా దాగిన ఈ నిత్య జీవిత సత్యసంధతే ప్రధాన కారణం. మంచి మనుగడే మతం అభిమతమైతే గీత సర్వమత సమ్మతం ఎందుకు కాదు?

'దేహమా కంపించుచున్నది/ 'ద్రోహమా' యనిపించుచున్నది/ మోహమేదో కుంచుచున్నది' అంటూ విషాదయోగంలో పడ్డ నరుణ్ని- 'మోహమడంగె తొలంగె ధర్మ సందేహములన్నియున్' అనే మోక్ష సన్యాస యోగదశదాకా నడిపించుకొని రావడానికి 'గీత'లో నారాయణుడు ఎత్తిన అవతారాలు ఎన్నెన్నో. 'ముందు గూర్చుండి నే పగ్గములను బట్టి/ రథము నడిపింతు/ కార్యసిద్ధికి నీవింక గడగుమయ్య!' అంటూ నాయకుడిలా ముందు నిలబడి భరోసా ఇస్తాడు ఒకసారి. 'దారుణ మారణ క్రియ/ కెట్టు లోర్చు మదీయ హృదయము?/ కొట్టనీ... చేతులు కట్టుకొని యుందున్' అంటూ డీలాపడిపోయినప్పుడు 'త్యజింపుము బేలతనమ్ము/ ధైర్యమున్ జెదరనీకుము' అంటూ తల్లిలా లాలిస్తాడు ఇంకోసారి. 'కొంచెపు మాట లాడెదు, జుగుప్స, అశోచ్యుల కోసమేల శో/ కించు టనార్యజుష్ట మపకీర్తికర, మ్మపవిత్రమైనదీ/ చంచలబుద్ధి, కశ్మలత చాలు' అంటూ తండ్రిలా మందలిస్తాడు మరోసారి. మోహపాశంలో పడి కొట్టుమిట్టులాడే మిత్రుడి చేయిపట్టుకొని ఎలాగైనా పైకి లేపాలనే తాపత్రయం చూపిస్తాడు చాలాసార్లు. 'నరుడే కైక ధనుర్ధరుండయి యఖండ త్యాగదీక్షా దురం/ ధరుడై నిల్చిన ముజ్జగమ్ముల నసాధ్యమన్నదే లేదు' అంటూ గురువులా ధర్మమార్గం దర్శింపజేస్తాడు భగవానుడు గీతలో. 'కర్తన్ నేను సమస్త భూతములకున్/ సర్వమ్ములో వర్తింతున్, అవతార ధర్మమును నిర్వర్తింతు, భూభారమున్/ దీర్తున్, నీవు నిమిత్త మాత్రమగు మంతే, క్త్లెబ్యమింకేల? నీ/ కర్తవ్యము గుర్తెరింగి విజయా/ గైకొమ్ము గాండీవమున్' అంటూ నిలబెడతాడు. చింతాక్రాంతుడైన మానవుడికి సాంత్వన కలిగించడానికి అంతా తనమీద వేసుకొనే ఔదార్యం ఇంతగా మరే సంస్కృతిలోనూ ఎవరూ ప్రదర్శించినట్లు కనిపించదు.

చెప్పడంలోని గొప్పతనమో, వ్యాసుడు రాయడంలోని గడుసుదనమో గాని... పరమ గంభీరమైన వేదాంతసారం గీతాపాత్రలో పరమాన్నమంత మధురంగా ఉంటుంది. యోగులు, స్వాములు, జ్ఞానులు, అవధూతలే కాదు... బుద్ధివాదులు, చివరికి చలం వంటి స్వేచ్ఛాప్రణయ జీవులూ గీతామకరందాన్ని సీతాకోక చిలుకల్లాగా సేవించడానికి ఉవ్విళ్లూరడాన్నిబట్టి, సుఖజీవిత అంతస్సూత్రమేదో ఆ పుష్పంలో దాగుందనేగా అర్థం! 'చాలాకాలం కిందటే కనుమరుగైన నా తల్లి స్థానాన్ని భర్తీ చేసింది భగవద్గీతే. మనసు కలత చెందినప్పుడల్లా నేనా తల్లి ఒడిలోనే తలదాచుకొనేది' అనేవారు అహింసాయోగి మహాత్మాగాంధీ. 'చిత్తం పరిశుద్ధమయ్యేకొద్దీ కొత్తకొత్త అర్థాలు తోచే చిత్రమైన ఆధ్యాత్మిక పొత్తం గీత' అనేవారు ఆధునిక యోగి వివేకానంద. ధర్మాధర్మాల మధ్య ఘర్షణ హృదయాన్ని రణక్షేత్రంగా మార్చినప్పుడు విచక్షణ భగవత్ స్వరూపం పొంది సన్మార్గం చూపిస్తేనే గదా మనిషి పతనావస్థనుంచి బైటపడగలిగేది! వ్యాస ప్రోక్తమైన గీత అష్టాదశాధ్యాయాల్లోని శ్లోకాల్లో- ఏదో ఒకటి ఎల్లవేళలా ప్రపంచంలోని ఏదో మూల ఎవరో ఒకరి చిత్తచాంచల్యమనే చీకటిని చెండాడే దివిటీలా వెలుగుతూనే ఉంది. అందుకనే విశ్వవ్యాప్తంగా శ్రీమద్భవద్గీతకు ఇంతకాలంగా ఇంత మన్నన. గీత కేవలం వ్యాస మహాభారతంలోని భాగం మాత్రమే కాదు. మనిషి- నిశ్చింత జీవితానికి నిత్యం పాటించదగిన జీవన సూత్రాల్ని విరివిగా పొదిగిన మనోవికాస శాస్త్రం. నరుడికి నారాయణుడు గీతలో చేసిన 'తామరాకు మీది నీటిబొట్టు తత్వం'- మతాలు, నమ్మకాలతో నిమిత్తం లేకుండా లోకం మొత్తం అనుక్షణం అనుసరించదగిన సూక్తం. అనేక భాషల్లో భాష్యాలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు వెలువడ్డ భగవద్గీతపై నేడు వివాదం రేగడమే దురదృష్టం. ఉత్తమ మానసిక వికాస సాహిత్యంగా, జ్ఞానామృత భాండాగారంగా ప్రశంసలు చూరగొంటున్న శ్రీమద్భగవద్గీత మీద తీవ్రవాద సాహిత్యమనే ముద్ర వేయడం, నిషేధానికి పూనుకోవడం సంకుచిత మనస్కుల తెలివిమాలినతనం. మనసును ఉద్దీప్తం చేసి, జాతి కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక జ్ఞాన పిపాసుల ఆర్తి తీర్చడంలో ముందున్న గీతను ఎవరేమని ఆడిపోసుకున్నా- అది, మకరందం!

(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, ౨౫:౧౨:౨౦౧౧)
_____________________________________

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home