My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Thursday, December 29, 2011

స్వేదయాగం


'పొలాలనన్నీ/హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పిండే' విరామ మెరుగని శ్రామికుడు కర్షకవీరుడు. 'ఎవరు నాటిరో, ఎవరు పెంచిరో/ వివిధ సుందర తరువుల/ మివుల చల్లని దయాధారల/తవిలి కురిపించి?' అని కృష్ణశాస్త్రి సందేహం. సందేహమెందుకు, ఆ దయామూర్తి నిశ్చయంగా కర్షక చక్రవర్తే! సర్వజీవుల హృదయపూర్వక వందనాలందుకోగల అర్హత అన్నదాతకుగాక మరెవరికుంది? తెలతెలవారకముందే పల్లెకన్నా ముందు లేచిన రైతుకు నులివెచ్చని చలి మంటలు హారతులు పడుతుంటే, చెట్టూచేమా వింజామరలై గాలులు వీస్తాయి. నాగులేటి వాగు నీళ్లు కాళ్లు కడుగుతుంటే, జామ కొమ్మ చిలకమ్మ క్షేమసమాచారాలు విచారిస్తుంది. పువ్వునూ కాయనూ పేరుపేరునా పలకరించుకొంటూ పొలం పనుల్లోకి దిగే హలధరుణ్ని సాక్షాత్ బలరాముడి వారసుడిగా పొగుడుతాడొక ఆధునిక భావుకుడు. పాల కంకులను పసిపాపలకు మల్లే సాకే ఆ సాగుదొరను 'ఆకుపచ్చని చందమామ'గా పిలుచుకుంటూ మురిసిపోతాడు ఇంకో గేయకవి సుద్దాల. 'మట్టి దాహం తోటి నోరు తెరవంగా/ మబ్బు కమ్మీ నింగి జల్లు కురవంగా' వీలు తెలిసి వాలుగా విత్తులు జల్లితేనే గదా పాతరలోని పాత గింజకైనా పోయిన ప్రాణం లేచి వచ్చేది! పుడమితల్లి పురిటి సలుపులు రైతన్న మంత్రసానితనం వల్లనేగదా చల్లంగా తీరేది! కలుపు పెరగకుండ ఒడుపుగా తీయడం, బలుపు తగ్గకుండా తగు ఎరువులేయడం, తెగులు తగలకుండ మందు చల్లడం, పురుగు ముట్టకుండ ఆకులు గిల్లడం, పశువు మేయకుండా కంచెలా కాపు కాయడం, పిట్ట వాలకుండా వడిసెతో కొట్టడం- పంట చేతికి దక్కడమంటే చంటిబిడ్డను మీసకట్టు దాకా పెంచడంకన్నా కష్టం. కృషీవలుడు అందుకే రుషితుల్యుడు.

అరచేతి గీతలు అరిగిపోయేదాకా అరక తిప్పడం తప్ప మరో లోకం పట్టని ఆ నిష్కాముకత్వం అమాయకత్వం కాదు. నమ్ముకున్న వాళ్లందరికీ ఇంత బువ్వ పెట్టాలన్న అమ్మతనం అది! ఆరు గాలాలూ శ్రమించి పుడమితల్లిని సేవించినా ఫలం అందనప్పుడు తల్లడిల్లేది తానొక్కడికోసమే కాదు. బిడ్డ ఆకలి తీర్చలేని తల్లిపడే ఆవేదన అది! మట్టితో సాగుబడి బంధం పేగుముడికన్నా బలమైనది. 'ప్రాణములొడ్డి ఘోర గహ/ నాటవులన్ బడగొట్టి, మంచిమా/గాణములన్ సృజించి, ఎము/కల్ నుసి జేసి పొలాలు దున్ని/భాషాణముల్' జాతికి నింపిపెడుతున్నా సొంతానికి చారెడు నూకలైనా చేటలో మిగలని రైతు దుస్థితికి కలవరపడిన కవులెందరో! 'వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు/వానికి భుక్తి లేదు' అని కవి జాషువాలాగా ఆర్తి చెందిన భావుకులు తెలుగు నేలమీద ఏటుకూరి వేంకట నర్సయ్యనుంచి దర్భశయనం శ్రీనివాసాచార్యదాకా కోకొల్లలు. సింగమనేని నారాయణ భావించినట్లు నిజానికి 'ఎర్రటి నేలలో నాగలి మొనదించి యుగాలుగా విత్తనాన్ని మొలకెత్తిస్తున్న ప్రతి అన్నదాతా కవులకు స్ఫూర్తిప్రదాతే. ఆ కర్షకుడి హృదిలోకి జొరబడి, కనుకొనుకుల్లో నిలబడి, కన్నీటికీ పన్నీటికీ కినిసి, మురిసిన దువ్వూరివారైతే ఏకంగా 'కృషీవలుడు' అనే కర్షక కావ్యాన్నే సృష్టించారు. శాస్త్రవిజ్ఞానం ఎంత శరవేగంగా దూసుకుపోతున్నా సాగుదారుడు లేకపోతే బతుకు బండి ముందుకు సాగదు. ఏడు నక్షత్రాల హోటలు పాయసాల పాలనుంచీ ఏడడుగులు నడిచే వధూవరులమీద జల్లే తలంబ్రాలదాకా... అన్నీ అన్నదాత స్వేదయాగ ఫలాలే! ఆకలి తీర్చాల్సిన నేలతల్లి రైతు బతుకుల్ని మింగే రాక్షసబల్లిగా మారుతుండటమే సాగు భారతంలో నేడు నడుస్తున్న విషాదపర్వం.

జీవనదులెన్ని ఉన్నా మాయదారి కరువు పీడిస్తోంది. ఉత్తరానివి ఉత్తుత్తి ఉరుములు, దక్షిణానివి దాక్షిణ్య మెరుగని మెరుపులు. పడిన చినుకులకు ఎడతెరిపి తోచదు. పాలుతాగే చంటిపిల్ల నీట మునిగితే తల్లికెంత కడుపు కోతో, పంట మునిగిన రైతుకంత గుండెకోత. చేతులారా పెంచుకున్న పంటకు చేజేతులా నిప్పంటించుకున్నా ప్రభుత్వాలకు పట్టదు. గోడలేని పొలాలకు గొళ్లేలు బిగించుకున్నా గోడు వినేందుకు ఏ నాథుడూ రాడు. కళ్ళాల దగ్గరేకాదు... అంగళ్లలో సైతం ఆసరా దొరకదు. నిల్వలకు నీడలేక నడి బజారులో నిండు జీవితాన్ని పొర్లబోసుకుంటున్నాడు నేడు రైతు. ఓటమని తెలిసీ చివరి వరకూ పోరాడవలసిన కర్ణుడైనాడు కర్షకుడు. పొలం గుండె తొలుచుకుంటూ పొగగొట్టాలు లేస్తున్నాయి... పంట చేల కంఠాలకు ఆర్థిక మండళ్ల ఉరితాళ్లు పడుతున్నాయి... ఉరి రద్దుకు పరితపించే పెద్దలకైనా పట్టదా ప్రాణదాత ఉసురుకు ముంచుకొచ్చే ఆపద! రైతు చావుదెబ్బ జాతికి శాపం కాదా! వట్టొట్టి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు. వేదికల వాదనలు రైతు వేదన తీర్చవు. అన్నదాత కన్నీటికి కావాల్సిందిప్పుడు చిత్తశుద్ధితో వేసే ఆనకట్ట. ఆ పని వెంటనే ప్రారంభం కాకపోతే ఆ ప్రవాహంలో జాతి మొత్తం కొట్టుకొనిపోయే ప్రమాదం ఆట్టే దూరంలో లేదు. కాడి ఇంతదాకా పడేయక పోవడం సేద్యగాడి చేతకానితనం కాదు. 'కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై/ చెక్కిళ్లమీద జాలిగా జారుతున్నా/ ఒక్క వాన చుక్కయినా చాలు/ వచ్చే 'కారు'కి 'చాలు'లో విత్తే చారెడు గింజలైనా దక్కుతాయి' అన్నది అన్నదాత ఆశావాదం. 'ఇఫ్కో' సాహితీ పురస్కార ప్రదానోత్సవ సభలో కేంద్ర మంత్రి శరద్ పవార్ వల్లెవేసిన మన వ్యవసాయ సంస్కృతిలోని విలక్షణత అదే. 'మూల వర్షం ముంచినా జ్యేష్ఠ వర్షం తేలుస్తుంది' అన్న ఆశే అన్నదాతను ఇంకా బతికిస్తోంది. మనందరికీ బతుకులు మిగులుస్తోంది.

(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, ౦౪:౧౨:౨౦౧౧)

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home