My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, January 18, 2012

వెలుగుదారి

కాలమనే కడలిలో మరో కొత్త అల లేచింది. కొత్తదనమనగానే చిత్తానికెందుకో అంత ఉత్తేజం! 'అంతరంగం వింత విహంగమై/ రెక్కలు తొడుక్కుని ఎక్కడెక్కడికో/ ఎగిరిపోవాలని ఉబలాటపడే' శుభవేళ ఇది. 'అక్కయ్యకి రెండో కానుపు/ తమ్ముడికి మోకాలి వాపు/ చింతపండు ధర హెచ్చింది/ చిన్నాన్నకు మతిభ్రమ కలిగింది'. ఇలా, నిద్రనుంచి మేల్కొన్న మరుక్షణంనుంచీ గోరుచుట్టులా మనిషిని సలిపే సమస్యలు సవాలక్ష. 'ఆనందాన్ని చంపేందుకు/ అనంతంగా ఉంది లోకం/ కులాసాని చెడగొట్టేందుకు అలాస్కా దాకా అవకాశం ఉంది' అన్న కవి తిలక్ పలుకులు నిరాశ కలిగించేవే అయినా అవి నేటికీ సరిపోయే నిష్ఠుర సత్యాలే. చుట్టుముట్టిన చీకట్లను తిట్టుకుంటూ కూర్చుంటే వెలుగుదారి వెతుక్కుంటూ రాదు కదా! కాసేపైనా గోర్వంకల రెక్కలమీద ఊహావసంతాల చుట్టూ చక్కర్లుకొట్టి రాకపోతే ఈ చికాకుల లోకంనుంచి మనిషికి మరి తెరిపేదీ! 'మనసూ మనసూ కలగలిసిన మైమరుపు ముందు మద్యం ఎందుకు?' అంటాడొక నవ కవి. ఎవరెస్టుకన్నా ఎత్త్తెన శిఖరాల్నీ వూహల్లో త్రుటిలో లేపేయగల చేవ సృష్టిమొత్తంలో ఉంది మనిషికే. అదో అదృష్టం. ప్రతి క్షణం ఓ రుబాయత్ పద్యంలా సాగిపోవాలంటే సాధ్యపడకపోవచ్చు. పాతంతా గతించి, సరికొత్తదనం మన జీవితం గడపలోకి కొత్త పెళ్ళికూతురులా అడుగుపెట్టే వేళా మనసు ఒమార్ ఖయ్యాం కాకపోతే జీవితానికింకేం కళ! 'నేటి హేమంత శిథిలాల మధ్య నిలచి/ నాటి వసంత సమీరాలను' తలచుకొనే శుభసందర్భం కొత్త ఏడాది తొలి పొద్దుపొడుపే! ఉషాకాంతుల వంటి బంగరు వూహలతో దివ్య భవితవ్యానికి సర్వప్రపంచం సుస్వాగతాలు పలికే సంప్రదాయం వెనకున్న రహస్యం- మనిషి నిత్య ఆశావాది కావడమే!

ఆదిమానవుణ్ని అణుమొనగాడిగా మలచింది ఆశావాదమే. 'మనిషికి మనిషికి నడుమ/ అహం గోడలుండవని/ అంతా విశ్వజనని సంతానం కాగలరని/ శాంతియనెడి పావురాయి/ గొంతునెవరు నులమరని/ విశ్వసామ్య వాదులందు/ విభేదాలు కలగవని' మనిషి కనే కల వయసు మనిషి పుట్టుకంత పురాతనమైనది. ఎదురుదెబ్బలెన్ని పడినా బెదరక కాలానికి ఎదురేగి మరీ వూరేగే సుగుణమే మనిషిని మిగతా జీవరాశికి అధిపతిగా నిలబెట్టింది. శిశిరం వచ్చి పోయిందనీ తెలుసు. తిరిగి వచ్చి విసిగిస్తుందనీ తెలుసు. అయినా మధుమాసం రాగానే మావికొమ్మమీద చేరి కోయిల కూయడం మానదు. చినుకు పడుతుందా, వరద కడుతుందా... అని చూడదు. వానకారు కంటపడితే చాలు- మయూరం పురివిప్పి నాట్యమాడకుండా ఉండదు. అత్తారింట్లో అడుగుపెట్టే కొత్తకోడలి అదృష్టం లాంటిది భావి. గతానుభవాలతో నిమిత్తం లేదు- రాబోయే కాలమంతా సర్వజనావళికి శుభాలే కలగాలని మనసారా ఆపేక్షించే అలాంటి స్వభావమే మనిషిదీ. 'సకల యత్నముల నుత్సాహంబె మనుజు/ లకు సకలార్థ మూలము' అని రంగనాథ రామాయణ ప్రవచనం. 'నానాటికి బ్రదుకు నాటకము/ పుట్టుటయు నిజము పోవుటయు నిజము/ నట్ట నడిమిపని నాటకము' అని అన్నమయ్య వంటివారు ఎన్నయినా వేదాంతాలు వల్లించవచ్చు. రక్తి కలగాలంటే నాటకానికైనా ఆసక్తి రగిలించే అంశం అవసరమేగా! పర్వదినాలు ఆ శక్తిని అందించే దినుసులు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో ఉత్సాహంగా మునుముందు జరుపుకోబోయే పండుగలన్నింటికీ జనవరి ఒకటి నాంది. గురజాడవారు భావించినట్లు 'నవ వసంతము నవ్య వనరమ/ మావి కొమ్మల కమ్మ చివురుల/ పాట పాడెడి పరభృతంబు(కోయిల)ను' పాడకుండా ఆపటం ఎవరితరం! కొత్త సంవత్సరం మొదటిరోజున మనిషి చేసుకునే సంబరాలను ఆపబోవడమూ ఎవరి తరమూ కాదు. ఎవరికీ భావ్యమూ కాదు.

'వైషమ్యాలు శమింపలేదు; పదవీ వ్యామోహముల్ చావలే/ దీషణ్మాత్రము గూడ; మూతవడలేదే కైతవ ద్వారముల్/ మరి యెన్నాళ్లకిటు వర్ధిల్లున్ బ్రజాభాగ్యముల్?' అంటూ రణక్షేత్రం మధ్య అర్జునుడిలా మనసు జీవితక్షేత్రంలో విషాదయోగంలో పడే సందర్భాలు బోలెడన్ని ఉంటాయి. భుజంతట్టి, లేపి, నిలబెట్టి చైతన్యమార్గం చూపించే నాటి ఆచార్యుని 'గీత' లక్ష్యమే నూతన సంవత్సర శుభాకాంక్షల అంతరార్థం. 'ఘన ఘనా ఘనము చీకటి మేడ వెలిగించు దివ్వెల నూనె తరుగలేదు/ పవలు రేలును తీరుబడి లేక ఘోషించు/ తోయధీశుని గొంతు రాయలేదు'- మరి ఎందుకు మధ్యలో ఈ విషాదయోగం? నియతి తప్పక నడిచే కాలమూ మనిషికిచ్చే సందేశం- శిశిరంలో సైతం వసంతాన్నే కలగనమని. అంది వచ్చిన కాలాన్ని ఆనందంగా అనుభవించాలని. కొనలేనిది, పట్టుకొనలేనిది, సృష్టించలేనిది, వృథా అయినా తిరిగి సాధించలేనిది, మొక్కినా వెనక్కి తెచ్చుకోలేనిది... మనిషి కొలమానానికి అందనంత అనంతమైన వింత- కాలం. జీవితంలో ప్రేమించడమొక్కటే కాలాన్ని వశపరచుకోగల ఏకైక మంత్రం. కాలగమనాన్ని సూచించే పర్వదినం జనవరి ఒకటి ప్రత్యేకతే వేరు. కుల మతాలు, చిన్నా పెద్దా, ఆడా మగ, తెలుపూ నలుపు ఏ తేడా లేకుండా 'సర్వేజనా స్సుఖినో భవంతు' అనే ఒకే ఉద్వేగభావంతో ప్రపంచమంతా సంబరాలు చేసుకొనే అపూర్వ పర్వదినం నూతన సంవత్సరం మొదటిరోజు మొదటి క్షణం. అంత ఉత్తేజకరమైనది, ఉత్సాహభరితమైన పండుగ మళ్ళీ వచ్చేది వచ్చే ఏటి మొదటిరోజు ఇదే సమయానికే. అందుకే ఈ రెండు పండుగల నడుమ కాలమంతా సర్వప్రపంచంలో సుఖ ఐశ్వర్య శాంతులతో ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం! 

(ఈనాడు, సంపాదకీయం, ౦౧:౦౧:౨౦౧౨)
________________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home