మన స్వాతంత్య్రం మేడిపండు!
'గతకాలమె మేలు వచ్చుకాలము కంటెన్' అన్న భావన బలపడుతోందంటే, క్షీణ విలువలకు ఆటపట్టుగా జాతి దిగజారుతోందని అర్థం. నేడు భారతావనిని పట్టి కుదుపుతోంది అదే అనర్థం. భారత స్వాతంత్య్రోద్యమం పూర్తిగా త్యాగధనుల చరిత్ర. మందికోసం మాగాణులమ్ముకొన్న (అ)సామాన్యులు మొదలు, దేశహితం తప్ప మరేమీ పట్టని దార్శనికులు యాభయ్యేళ్ల క్రితందాకా నడయాడిందీ నేల! సొంత ఇల్లు లేని 'హోం'మంత్రిగా, దరిమిలా ప్రధానమంత్రిగా ఆయా పదవులకే వన్నె తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం నేటి నేతల్లో ఎందరికి తెలుసు?ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రైల్వేమంత్రి పదవిని త్యజించిన లాల్ బహదూర్ ముందు నేటి నేతలంతా పిపీలికాలే. 'ప్రయత్నలోపం లేకుండా ముందడుగేద్దాం... విజయం సాధిస్తే సంతోషం. విఫలమైతే రాజీనామా చేసి నిష్క్రమిస్తా'నని ప్రధానమంత్రిగా ఆయన చెప్పిన మాట సమున్నతాదర్శానికి కరదీపికే! అభియోగపత్రం దాఖలైతే రాజీనామా చెయ్యాలని రాజ్యాంగంలో రాసి ఉందా అని కుతర్కం తీసిన లాలు మహాశయుల తలదన్నే నేతలు రాష్ట్రంలోనే దాపురించారు. ఫెరా ఉల్లంఘన కేసులో జైలుశిక్షకు గురైనా నైతిక బాధ్యతను తుంగలో తొక్కి పదవిని పట్టుకు వేలాడుతున్నారు ఓ మంత్రిసత్తములు! పదవులు చేపట్టేముందు చేసిన రాజ్యాంగ ప్రమాణాలే గీటురాయి అయితే మంత్రివర్గంలో అసలు మిగిలేదెందరు? 'రాజ్యాంగాన్ని ముట్టకుండానే, కేవలం పాలన యంత్రాంగం సరళిని మార్చడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాచి, దాన్ని భ్రష్టుపట్టించడం సాధ్యమే'నని 1949 అక్టోబరులోనే భారతరత్న అంబేద్కర్ హెచ్చరించారు. అక్రమాల ఏలికలు ఇప్పుడు చేస్తున్నవి అదే తరహా అవినీతి ప్రయోగాలు!
క్రమం తప్పక ఎన్నికలు జరగడమే ప్రామాణికమైతే, 'మేరా భారత్ మహాన్' అనుకోవాల్సిందే. డబ్బులు వెదజల్లి గెలవడం, మళ్ళీ అంతులేని సంపదలు పోగేసుకోవడానికి నానా గడ్డీ కరవడం- భారత ప్రజాస్వామ్య ముఖచిత్రం ఇదీ అంటే, సిగ్గుపడాల్సిందే! నేడు- నేరం, రాజకీయం అవిభాజ్యం; రాజ్యం అవినీతి భోజ్యం! 'కాగ్' లెక్కల ప్రకారం లక్షా 76వేలకోట్ల రూపాయల రాబడి నష్టానికి కారకుడైన అవినీతి 'రాజా'- సుప్రీంకోర్టు కొరడా ఝళిపించేదాకా కేంద్రమంత్రి పదవిలో ఎలా కొనసాగగలిగాడో తెలియనిది కాదు. పద్నాలుగుమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు రువ్విన అన్నా బృందమే అందుకు రుజువులు చూపాలంటున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రివర్యులు! 'ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపండి- వాస్తవాలుంటే, విచారణ జరిపిస్తాం' అన్నది వైఎస్ పెడధోరణి. అదే పంథాను కేంద్రమూ పుణికిపుచ్చుకొంటే- ఎక్కడికక్కడ దోచుకొన్నవాళ్లకు దోచుకున్నంత! అవినీతిపరులకు రక్షాకవచాలు తొడగడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పరస్పరం పోటీపడుతున్నాయని చెప్పక తప్పదు. పట్టుమని అయిదేళ్లలో రాష్ట్రం పుట్టిముంచి పదుల వేలకోట్ల రూపాయల అక్రమాస్తుల్ని జగన్‌కు దోచిపెట్టేలా నీకిది నాకది(క్రిడ్ ప్రో కో) బాటలో సాగిన వైఎస్, 26 జీఓలతో చీకటి లాలూచీలకూ చట్టబద్ధత కల్పించారు. ఆ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు సంబంధిత మంత్రులు, అధికారులకు నోటీసులు జారీచేస్తే న్యాయసహాయం పేరిట- మళ్ళీ ప్రజాధనాన్నే వెచ్చించి మచ్చపడ్డవాళ్లను రక్షించే ప్రయత్నం చేస్తోంది కిరణ్ సర్కారు! ప్రజలకోసమే ప్రభుత్వాలున్నాయని, జనశ్రేయం కోసమే అవి పనిచేస్తున్నాయని ఎవ్వరూ గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పలేని మేడిపండు ప్రజాస్వామ్యం మనది. అధికార స్థానాల్లోని అవినీతి కుళ్లును ప్రక్షాళించడానికి సత్యాగ్రహ స్ఫూర్తితో జనం మరో స్వాతంత్య్ర సమరమే సాగించాలి!
(సంపాదకీయం, ఈనాడు , 15:08:2012)
____________________________________________
Labels: India/Telugu
0 Comments:
Post a Comment
<< Home