My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, December 18, 2012

సహజీవన సౌందర్యం

కోడికూతలతోనే ఒకనాడు తెల్లవారేది. 'తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి/ జలజల రెక్కలు సడలించి నీలి/ గ్రక్కున గాలార్చి కంఠంబు విచ్చి/ మెడసాచి నిక్కి మున్సూచి/ కొక్కొరో కుర్ర'ని కుక్కుటం కూసే తీరును బొమ్మ కట్టించాడు పాల్కురికి సోమన్న. ప్రకృతి ఒక్క మానవుడిదే కాదుగదా! ఓ లెక్కప్రకారం ఎనభైనాలుగు లక్షల రకాల జీవరాశులు మనిషిలాగే మనుగడ సాగిస్తున్నాయి ఇక్కడ. ప్రకృతి సమతౌల్యం- కనిపించని ఏ శక్తో కల్పిస్తున్న సౌకర్యం, సౌందర్యం. కాళిదాసు వర్ణించినట్లు 'మావి చిగుర్లు తిని వగరెక్కిన గొంతుతో మగకోయిల తియ్యగా కూయడమే' వసంతానికి అందం. వానకోయిల వర్ణన లేని సంస్కృత కావ్యాలు అరుదు. తలకిందులుగా ఎగురుతూ వెన్నెల మంచు బిందువులను మాత్రమే తాగి బతికే చాతకపక్షుల ప్రస్తావన పురాణాల్లో, ప్రాచీన కావ్యాల్లో విస్తారం. మేనకావిశ్వమిత్రుల సంగమ ఫలంగా పుట్టిన పురిటి పట్టిని మాలినీ నదీ సైకతాన ఏకాంతంలో పద్మపత్రాలు పొత్తులుగా పరిచి ఎండ, గాలి, గాలివాన, మంచుసోనలనుంచి కాపాడుతూ పెంచింది శాకుంతల పక్షులే. అందుకే ఆ బిడ్డ శకుంతల అయింది. పక్షిజాతి ప్రభావం మనిషిమీద అంతా ఇంతా కాదు. క్రౌంచపక్షుల వియోగం వాల్మీకిలోని కవిని తట్టి లేపింది. ఆదిదేవుడిది హంస రూపమంటారు. జీవుడినీ హంస అంటారు. ప్రాణం పోతే 'హంస లేచిపోయింది' అనడం రివాజు. నలదమయంతులను ఆలుమగలుగా నిర్ణయించిన దేవదేవుడు భువిమీద వారిని సంధానించడానికి ఎత్తిన అవతారం 'హంస'. 'సత్యలోకము దాకా సకల లోకంబులు నాటపట్టులు మాకు నబ్జవదన' అంటూ ఆ రాయంచ చెప్పే మాటలు మనిషి తెలివితేటలకు మించినవి. కార్యార్థం భర్త దేశాంతరంలో ఉన్న సందర్భం చూసుకుని రాజదర్శనం కోసం బయలుదేరిన నాయికకు కాలు బైటపెట్టేందుకైనా మనసొప్పని కథలు చెప్పి ఇంటిగౌరవం కాపాడుతుంది కదిరీపతి శుకసప్తతిలోని చిలుక. విష్ణుశర్మ పంచతంత్రం నిండా మనుషులకు నీతిపాఠాలు చెప్పే పక్షులు ఎన్నెన్నో!

గండభేరుండం నుంచి గడ్డిపూవుమీద వాలే చిట్టి పులుగుదాకా రెక్కల జీవాలు సృష్టికి అద్దే వైవిధ్యం ఎంతో, ఎంతెంతో. దేవలోకంనుంచి మానవులకు వార్తలు మోసుకొచ్చేది కాబట్టి పాలపిట్టను వేదం 'కికీదీవి'గా భావించింది. ఆకాశంలోని గద్దది నీటిలోని చేప కదలికలను పసిగట్టగలిగేటంత నిశితదృష్టి. జలాహారాన్ని గుర్తించడానికి కొన్ని క్షణాలపాటు గాల్లో కదలకుండా, ఎగరకుండా, వాలకుండా, జారకుండా నిలబడి ఉండే నేర్పు లకుముకి పిట్టది. నటరాజమూర్తి నెమలి. పాముల బెడదకు నెమలి పెంపకం విరుగుడు. బహుచక్కని గూడుకట్టి మిణుగురులను మైనంతో అద్ది దీపాలంకరణ చేసే గిజిగాడిది అపూర్వ సౌందర్య దృష్టి. గుడ్లగూబను పాశ్చాత్యులు విద్యావిజ్ఞానాల గనిగా భావించి పెంచుకుంటారు. గొడ్డూ గోదా మీద వాలుతూ పొలమంతా తన సొంతమన్నట్లు తిరిగేది కాబట్టి కాటుక పిట్టను 'పసుల పోలిగాడు' అని ముద్దుగా పిలుచుకుంటారు. కవిత్వంలో కాటుక పిట్ట ప్రస్తావన జాస్తి. తలలు రెక్కల్లోకి దూర్చుకుని పంట కాలువల ఒడ్డున పడుకొని ఉన్న తెల్లని బాతుల్ని 'ఉషఃకాలంలో స్నానంచేసి వెళ్లిన బ్రాహ్మణులు పిడిచి పడేసిన వస్త్రాలు'గా రాజభటులు పొరపడటాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో బహుసుందరంగా వర్ణించారు. నిజానికి సర్వజీవరాశులూ సజీవంగా సహకారబుద్ధితో సంచరిస్తుంటేనే ప్రకృతికి ఆనందం. ఏనుగైనా ఏట్రింత(భరద్వాజ పిట్ట) అయినా సృష్టి దృష్టికి సమానమే. 'కాకికేమి తెలుసు సైకోఎనాలసిస్' అని వెక్కిరింత సమంజసం కాదు. పక్షులన్నింటిలో ఎక్కువ తెలివి గలది కాకేనంటున్నారు జీవశాస్త్రజ్ఞులు. శ్రీపాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణ కవి కాకిని 'దూరప్రియాగమనాన్ని విస్పష్ట మధుర కూజితంతో' తెలిపే ఏకాక్షిగా ప్రశంసించాడు. మనిషి ఒక్కడే కాదు మేధావి. పరిసరాలను పరిశీలించే ప్రజ్ఞ అలవరచుకుంటే 'చిమట' కన్నా తానెంత అల్పజీవో తెలిసొస్తుంది.

'మనుజుల కగమ్యమై/ మహిత శక్తింగల్గి/ పరమామృతములొల్కు/ ప్రణయవాక్కులు మీరు' అంటారు బసవరాజు అప్పారావు కోకిలను కీర్తిస్తూ ఒక కవితా ఖండికలో. 'నిన్ను బాలకులు నిత్యము కోరుతు/ నీతో ఆటలు ఆడే వేళల/ వారు కృష్ణులను భావము పుట్టును/నిజమంటావా కాదా చెప్పవే?' అని నెమలికన్నును ప్రసాదించే నీలకంఠిని నిలదీస్తాడు దీక్షితులు. ఈ లోకంలో మనిషి ఒక్కడే మనుగడ సాగించాలనుకుంటే వైవిధ్యం కొరవడి బతుకు చేదవుతుంది. మానవుడితోపాటు ఇతర జీవరాశులు సహజీవనం సాగిస్తేనే మనిషి జీవితం పరిపూర్ణం. ముఖ్యంగా దగ్గరలో జీవించే పశుపక్ష్యాదుల సహకారం మనిషికి అత్యవసరం. 'సహజీవనం వల్ల మనిషికే అధిక లాభం' అంటున్నారు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు. చుట్టూ ఉండే పక్షులను కాపాడుకోవాలంటే ముందు వాటి ఉనికి మీద అవగాహన పెరగాలి. ముంబైకి చెందిన 'సమాజం కోసం ప్రకృతి(నేచర్ ఫర్ సొసైటీ)' అనే స్వచ్ఛంద సంస్థ పరిసరాల్లో తిరిగే పక్షిజాతుల వివరాలను సేకరించి ఒకచోట పెట్టడానికి ఒక 'ఆన్ లైన్' గూడును ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం చేపట్టే పక్షుల గణాంకాల ప్రకారం- ఒక్క ఏడాది కాలంలోనే మనిషి నిర్లక్ష్యం, స్వార్థప్రయోజనాల మూలకంగా పదుల సంఖ్యలో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. తంతి తీగెలమీద బారులు తీరి దర్బారులు నడిపే నిన్నటి వానకోయిలలు నేడు ఏవీ? ఇంటిముంగిట్లో ధాన్యంకంకుల మీద కువకువలాడుతూ సందడించే పిచ్చుకలు కనిపించడంలేదు. మనిషి ఇకనైనా మేలుకోవడం మేలు. కుదరదంటే రేపటికి మనిషీ మాయమైపోవచ్చు. తస్మాత్ జాగ్రత! జాగృత! 

(23:09:2012, ఈనాడు)

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Labels:

0 Comments:

Post a Comment

<< Home