సహజీవన సౌందర్యం
గండభేరుండం నుంచి గడ్డిపూవుమీద వాలే చిట్టి పులుగుదాకా రెక్కల జీవాలు సృష్టికి అద్దే వైవిధ్యం ఎంతో, ఎంతెంతో. దేవలోకంనుంచి మానవులకు వార్తలు మోసుకొచ్చేది కాబట్టి పాలపిట్టను వేదం 'కికీదీవి'గా భావించింది. ఆకాశంలోని గద్దది నీటిలోని చేప కదలికలను పసిగట్టగలిగేటంత నిశితదృష్టి. జలాహారాన్ని గుర్తించడానికి కొన్ని క్షణాలపాటు గాల్లో కదలకుండా, ఎగరకుండా, వాలకుండా, జారకుండా నిలబడి ఉండే నేర్పు లకుముకి పిట్టది. నటరాజమూర్తి నెమలి. పాముల బెడదకు నెమలి పెంపకం విరుగుడు. బహుచక్కని గూడుకట్టి మిణుగురులను మైనంతో అద్ది దీపాలంకరణ చేసే గిజిగాడిది అపూర్వ సౌందర్య దృష్టి. గుడ్లగూబను పాశ్చాత్యులు విద్యావిజ్ఞానాల గనిగా భావించి పెంచుకుంటారు. గొడ్డూ గోదా మీద వాలుతూ పొలమంతా తన సొంతమన్నట్లు తిరిగేది కాబట్టి కాటుక పిట్టను 'పసుల పోలిగాడు' అని ముద్దుగా పిలుచుకుంటారు. కవిత్వంలో కాటుక పిట్ట ప్రస్తావన జాస్తి. తలలు రెక్కల్లోకి దూర్చుకుని పంట కాలువల ఒడ్డున పడుకొని ఉన్న తెల్లని బాతుల్ని 'ఉషఃకాలంలో స్నానంచేసి వెళ్లిన బ్రాహ్మణులు పిడిచి పడేసిన వస్త్రాలు'గా రాజభటులు పొరపడటాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో బహుసుందరంగా వర్ణించారు. నిజానికి సర్వజీవరాశులూ సజీవంగా సహకారబుద్ధితో సంచరిస్తుంటేనే ప్రకృతికి ఆనందం. ఏనుగైనా ఏట్రింత(భరద్వాజ పిట్ట) అయినా సృష్టి దృష్టికి సమానమే. 'కాకికేమి తెలుసు సైకోఎనాలసిస్' అని వెక్కిరింత సమంజసం కాదు. పక్షులన్నింటిలో ఎక్కువ తెలివి గలది కాకేనంటున్నారు జీవశాస్త్రజ్ఞులు. శ్రీపాండురంగ మాహాత్మ్యంలో తెనాలి రామకృష్ణ కవి కాకిని 'దూరప్రియాగమనాన్ని విస్పష్ట మధుర కూజితంతో' తెలిపే ఏకాక్షిగా ప్రశంసించాడు. మనిషి ఒక్కడే కాదు మేధావి. పరిసరాలను పరిశీలించే ప్రజ్ఞ అలవరచుకుంటే 'చిమట' కన్నా తానెంత అల్పజీవో తెలిసొస్తుంది.
'మనుజుల కగమ్యమై/ మహిత శక్తింగల్గి/ పరమామృతములొల్కు/ ప్రణయవాక్కులు మీరు' అంటారు బసవరాజు అప్పారావు కోకిలను కీర్తిస్తూ ఒక కవితా ఖండికలో. 'నిన్ను బాలకులు నిత్యము కోరుతు/ నీతో ఆటలు ఆడే వేళల/ వారు కృష్ణులను భావము పుట్టును/నిజమంటావా కాదా చెప్పవే?' అని నెమలికన్నును ప్రసాదించే నీలకంఠిని నిలదీస్తాడు దీక్షితులు. ఈ లోకంలో మనిషి ఒక్కడే మనుగడ సాగించాలనుకుంటే వైవిధ్యం కొరవడి బతుకు చేదవుతుంది. మానవుడితోపాటు ఇతర జీవరాశులు సహజీవనం సాగిస్తేనే మనిషి జీవితం పరిపూర్ణం. ముఖ్యంగా దగ్గరలో జీవించే పశుపక్ష్యాదుల సహకారం మనిషికి అత్యవసరం. 'సహజీవనం వల్ల మనిషికే అధిక లాభం' అంటున్నారు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు. చుట్టూ ఉండే పక్షులను కాపాడుకోవాలంటే ముందు వాటి ఉనికి మీద అవగాహన పెరగాలి. ముంబైకి చెందిన 'సమాజం కోసం ప్రకృతి(నేచర్ ఫర్ సొసైటీ)' అనే స్వచ్ఛంద సంస్థ పరిసరాల్లో తిరిగే పక్షిజాతుల వివరాలను సేకరించి ఒకచోట పెట్టడానికి ఒక 'ఆన్ లైన్' గూడును ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం చేపట్టే పక్షుల గణాంకాల ప్రకారం- ఒక్క ఏడాది కాలంలోనే మనిషి నిర్లక్ష్యం, స్వార్థప్రయోజనాల మూలకంగా పదుల సంఖ్యలో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. తంతి తీగెలమీద బారులు తీరి దర్బారులు నడిపే నిన్నటి వానకోయిలలు నేడు ఏవీ? ఇంటిముంగిట్లో ధాన్యంకంకుల మీద కువకువలాడుతూ సందడించే పిచ్చుకలు కనిపించడంలేదు. మనిషి ఇకనైనా మేలుకోవడం మేలు. కుదరదంటే రేపటికి మనిషీ మాయమైపోవచ్చు. తస్మాత్ జాగ్రత! జాగృత!
(23:09:2012, ఈనాడు)
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home