కాలజ్ఞాన ప్రాప్తిరస్తు!
ప్రకృతి... మూడక్షరాల మాటే అయినా, మానవాళికి అది అక్షర లక్షల విలువైన విలక్షణ బహూకృతి. ప్రతి మనిషినీ అణువణువునా పులకరింపజేసే ఆ నిత్యానందదాయిని ఒంటికి చంద్రకాంతి, కంటికి సూర్యక్రాంతి. భువిలో దివిని చూపే మహా ప్రసాదిని కనుకే 'శారదరాత్రు లుజ్వల లసత్తర తారక హార పంక్తులన్/ జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో/దార సమీర సౌరభము దాల్చి' అంటూ జీవనానంద భాగ్యాన్ని కళ్లకు కట్టించారు మహాభారత కవి. నింగిలో మెరుపు చుక్కల మిలమిలలు అటు, నేలమీద అప్పుడే వికసించిన సుమాల గుబాళింపులు ఇటు. చంద్రుడందిస్తున్న తెల్లని వెన్నెల కర్పూరపు పొడిలా ఉందనడం, ఆకాశమంతా వెలుగుల లోకంగా మారి సరికొత్త అందాలతో భాసించిందనడం ఇక్కడ సర్వ సహజాలంకారం. ఆస్వాదించే హృదయమున్నప్పుడు ప్రతి అంతరంగమూ సంతోష తరంగం. కూతురు శకుంతలను కాంతుని దరికి పంపేముందు 'పుష్పలతలార! మీ అక్క పోవుచుండె/ హరిణ తతులార! మీ రాణి అరుగుచుండె' అని పలికిన కణ్వమునిది ప్రకృతితో అవినాభావ ప్రేమ. ప్రియ మహేశుని సమక్షాన అనురాగ మాలికలూపిన హిమనందిని 'వచ్చుచునున్న సూర్యభగవానుని చక్కిలిగింతకప్పుడే/ విచ్చుచు విచ్చుచున్న అరవిందములందున పొంగి వెల్లువౌ/ వెచ్చని తియ్య దేనియలు...' అనుభూతినందడం ప్రకృతి ప్రేమైక భావన. అంతటి అపురూపమైనందువల్లే అందాల రాణిగా, మంజుల వీణాపాణిగా, పరమ సౌభాగ్యవాణిగా, నవజీవిత జయ కల్యాణిగా వెలిగిందీ ప్రకృతికాంత.
అందానికి ఆర్ద్రత తోడైననాడు జీవన సర్వస్వం ప్రతిఫలించినట్టే. సౌందర్యం చూసుకునేందుకు కావాల్సింది అద్దం కాదు, అంతరంగం. అందుకే అందమన్నది మనోగతం, సహృదయ సంబంధం. ఆ సుందరానందం అందించేది ప్రకృతే అయినప్పుడు తిక్కన అన్నట్టు 'తాను ప్రకృతి బ్రకృతి దనయందు నిల్చు ని/ల్చినను దాన వికృతి జెందకుండు' అన్నది ప్రత్యక్షర సత్యం. విరిసే పువురేకు, మురిసే చివురాకు, సెలయేటి గలగల, విహంగాల కిలకిల... ఎక్కడ లేదు ప్రకృతి అందం? ఆటపాటలు, ముద్దుముచ్చట్లు, సుఖసంతోషాలు... అన్నీ అందులోనే. పెదవులపైన చిరునవ్వు విరిసిందంటే ఏటిమీద వెన్నెల వాన కురిసినట్టే! చినుకులంటే ఏమిటి? అంబరాన్నీ అవనీ స్థలాన్నీ కలగలిపే పరమ ఆత్మీయ బంధాలు. అందునా తొలకరి చినుకులు పులకరించాయంటే, పుడమి ఒంటినిండా పులకాంకురాలే! కవి సినారె చెప్పినట్టు 'కళ్లదీ చూపులదీ దృశ్యాలదీ/ అవినాభావంగా సాగే అనుబంధం/ అది సక్రమంగా సాగినంత కాలం మనసుకు అనిర్వచనీయ తాదాత్మ్యం'. మరి కాలమో? అది క్షణాల ఇంద్రజాలం. ఆ చక్రం నిరంతర చలనం. జీవిత చక్రం మాత్రం యంత్రాలతో తిరగదు. ఉద్యమించే సహజాత జీవగుణాలతోనే దాని భ్రమణం. వాన కురిసినా మెరుపు మెరిసినా ఆకాశాన హరివిల్లు విరిసినా స్పందించే హృదికి కాలం వరం, అపారం. కాలజ్ఞత అంటే అన్ని క్షణాల్నీ మనో దర్పణంలో చూసుకోవడమే! మల్లన కవి బోధించినట్టు 'తెలివి సంపద గలవాడె దేవ సముడు/ తెలివి లేక మేని బలమేమి పనిచేయు?/ పరగునె వివేకమిల జడ ప్రకృతులకును?'. నేత్రానందం పెంపొందించేలా పచ్చగా ఎదుగుతున్న చెట్లు ఆయుష్షు ఆరోహణకు మెట్లు. గరిక పచ్చని మైదానాలు మనిషి చూపుల్లో వైశాల్యాన్ని నింపే ఉపకరణాలు. కృష్ణప్రేమకు పలవరించిన రాధ ఎదుట వనలక్ష్మి పూచిందని, పిండారబోసినట్లు వెన్నెలంతా నిండిందని, శీతల సురభి సమయాన యమునా నది వెంట చల్లగా మెల్లగా పిల్లగాలి వీచిందని కవి భావనా వర్ణన. ప్రకృతిని అంతగా ఆరాధించడం- పొంగి పొరలిన లావణ్యాల హేల. మహాకవి కాళిదాసు కంఠంలోనూ మేఘం కందళించింది. కరుణ మయూఖం ఆ గంటంలో కరిగి నీరైంది.
హృదయం పొంగినప్పుడే కాదు, ఎండి బండబారినప్పుడూ ప్రకృతే స్ఫూర్తి! గగనం మాదిరే మానవుల ఆశలకీ అంతూ పొంతూ ఉండదు. కాల పరిభ్రమణంలో వెల్లువెత్తే ఆ కోరికల పరంపరలో కొన్నిసార్లు ఆలోచనలు తిరగబడితే, కళ్లు ఎర్రబడితే, మాటలు తడబడితే, చేతల్లో దోషాలు దొర్లితే? ఆకులు రాలి, పువ్వులు వాడి, వృక్షాలు నేలకొరిగి, జలాలు ఇంకి, గాలి స్తంభించి... ఎన్ని ఉత్పాతాలో! 'అల్లదుగో పూలతీవ/ అందానికి అసలు త్రోవ/ ఆడుతూ పాడుతూ మెల్లిమెల్లిగా/ అల్లుకుంది అల్లిబిల్లిగా' అని కరుణ కవిలా అనలేడు. 'ప్రకృతి రక్షతిరక్షితః' అనుకునేందుకు, ఆ సహజ సంపదను పదిలపరచుకుని ముందు తరాలకీ ప్రేమకానుకగా అందించేందుకు ప్రతీ మనిషీ ఆరాధకుడు కావాల్సిందే. కాల జ్ఞానిలా తనను తాను రూపుదిద్దుకుని, పరిరక్షణ బాధ్యతను తనకు తానుగా స్వీకరించి నెరవేర్చాల్సిందే. బాధ్యతలు మరెవరివో కావని, వాటిని మనసా వాచా కర్మణా వహించి ఆనందామృతాన్ని పంచాల్సింది తానేననీ మానవుడు గ్రహించినప్పుడు- ప్రకృతి వరప్రసాదమే, ఆ వివేకాన్ని సొంతం చేసుకున్న ప్రతి వ్యక్తిదీ భావి కాలజ్ఞానమే! అందాలూ ఆనందాలూ అక్కడెక్కడో లేవు. ఉల్లాసాలూ విజయాలూ ఏనాడూ ఉన్నపళంగా వూడిపడవు. గాలి, నేల, నీరు అందరివీ, అవి ప్రతి ఒక్కరివీ. గుండెనిండా హాయిగా వూపిరి పీల్చుకుంటే, ఇతరుల్నీ పీల్చుకోనిస్తే- 'అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం!'
(సంపాదకీయం, ఈనాడు , 16:12:2012)
----------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home