దృష్టికి దివ్యత్వం
రెప్పపాటులో హత్తుకుపోయే అయస్కాంతమే చూపంటే. ఆ మహత్తేమిటో కానీ- ఆనంద విషాద సంభ్రమాదుల్ని మనిషి అనుభవానికి తెచ్చి, ప్రజాకవి వేమనకు కనిపించినట్టు 'చూచువారికెల్ల జూడ వేరై యుండు/ చూపు జూచి తెలియజూచువారు/ చూచి తాము చూపు చూపె తామగుదురు' అనిపిస్తుందది. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలు మానవ గుణాలైతే ఆ దేహపు మూల లక్షణాల్లో కీలకం దర్శనమే! అది పన్నెండు జతల కపాల నాడుల్లో ఒకటైన దృష్టినాడికి పుట్టుక స్థలి. చూపునకు వర్తించే సమస్త సమాచారాన్నీ నేత్రముఖంగా నిలుపుతుంది దర్శనచక్రం. అందులో అర్ధ నిమీలితాలే కాక పరిపూర్ణ అవలోకితాలూ ఉండటం దృష్టి ధర్మం. 'చూచెదవేలనో ప్రణయ సుందరి' అని రాగాలాపన సాగించిన 'అద్వైతమూర్తి' కర్త మరో సందర్భంలో 'సమరమ్ము గావించు సత్య కన్నులనుండి వెడలు క్రోధ వీక్షణాలు' చూడగలిగిందీ ఆ కారణంగానే! దివ్య, జ్ఞాన, హ్రస్వ, దూర, పూర్ణ, అభేద దృష్టులు అనేకమున్నా నేత్రాంచలాల నుంచి జాలువారినంత మేర సహజానుభూతి అందించేది సమదృష్టి మాత్రమే. తొలిచూపు మొదలు కడచూపు వరకు కొనసాగే జీవన గమనంలో... ఓరగా చూసేవీ, సోగకళ్ల అంచుల్లో దాగుడుమూతలాడేవీ, చల్లని చూపులు ప్రసరించి అలరించేవీ, ఉల్లాసభరితాలు. కోరగా, చురచురా, నిప్పులు రాల్చేలా చుట్టుముట్టే వీక్షణాలు కలవర కారకాలు. మూగచూపూ ఎదురుచూపూ చిన్నచూపుతో మానవాళికి కలిగేవి అనేకానేక విభిన్న అనుభవాలు. వాటన్నింటినీ మేళవించి పరికించినప్పుడు 'జల్లెడను చూడు, పొల్లును సంగ్రహించి/ సారమౌ గింజలను క్రింద జారవిడుచు' నన్న కబీరు మాటల అంతరార్థం బోధపడక తప్పదు.
సీతా స్వయంవర వేళ శిష్యుడు రామచంద్రుడి మోము చూసిన మునివర్యుడి చక్షువుల్లో ఆశీస్సుమాల కాంతిమాల! సభామండపంలో జానకీదేవిని క్రీగంట తిలకించిన రాఘవుడిలో మహదానంద ప్రేమ డోల! చెల్లరే విల్లు విరుచునే నల్లవాడు... సిగ్గు సిగ్గంటు ఉరిమే కళ్లతో లేచి గర్జించిన తెల్లమొగాలవారిలో క్రోధాగ్ని జ్వాల! కాలిదోవ సైతం కానరాని కీకారణ్యాన పతి ప్రాణాన్ని దక్కించుకోవాలని పరితపించిన సావిత్రీలలామ దయనీయ నయన. 'సమవర్తీ, నీకిది ధర్మమా?' అని ఆ 'రక్త నయనమ్ముల' యముడిని వెంటాడి మరీ విజేత కాలేదా ఆ బేల చూపుల బాల? పసికందును పొత్తిళ్లలో దాచుకుని నీటిమడుగు వైపు నడిచిన కుంతీకుమారికి ఆ బిడ్డ 'వాలుగన్నుల చక్కదనాల తండ్రి'. 'చిన్నినాన్నకు కన్నులు చేరడేసి' అంటూనే ఒత్తుకుంటూ హత్తుకుంటూ కూనను పెట్టెలో పరుండబెట్టిందా తల్లి. ఏటి కెరటాల్లో కదిలి వెళుతున్న చిన్నారిని 'నిశ్చల నిరీహ నీరస నిర్నిమేష లోచనమ్ముల'తో చూస్తూనే ఉండిపోయిన ఆమెను తలచుకున్న ఎవరికైనా కళ్లు చెమర్చవూ? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. వెన్నెల కురిపించినా, మంటలు రగిలించినా ఆ కళ్లతోనే. తపోముద్రలో నిమగ్నుడైన పరమశివుడే లక్ష్యంగా సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు చెరకు విలుకాడు. ఆ మహిమాన్విత శస్త్రం మొదట గౌరి కడగంటి చూపులో కలిసిపోయి, పిదప సూటిగా ముక్కంటి గుండెలోనే గుచ్చుకుపోయింది. ధ్యానాన్ని భగ్నంచేశాడన్న ఆగ్రహంతో మరుక్షణంలోనే మన్మథస్వామిని భగ్గుమనిపించాడా ఫాలనేత్రుడు. భిన్నకోణంలో చూసినప్పుడు- చూపులు కలసిన శుభవేళ సంతోషం సాగరమవుతుంది. చూపులు కలబడినప్పుడు మాత్రమే ఎంత నిర్మాణముంటుందో అంత విధ్వంసమూ తప్పదక్కడ! 'చూపు చినుకై తాకితే వలపు వరమై వరిస్తుంది' అన్న కవి గళం 'తలపు పిలుపై మేల్కొలిపితే పలుకు స్వరమై మైమరపిస్తుంది' అనడం ఎద ఎదలోనూ వెల్లివిరియాల్సిన ఆశావాదానికి ప్రత్యక్ష ని'దర్శనం'.
రాయలవారి కలలోకొచ్చాడు జలజాక్షుడు. ఆ సువిశాల నేత్రద్వయుడు 'చామనచాయ మేనితోడ అరవిందముల కచ్చులడగించు జిగి హెచ్చు ఆయతంబగు కన్నుదోయి తోడ' సాక్షాత్కరించిన దృశ్యం మననీయ కృతి 'ఆముక్తమాల్యద' సాక్ష్యంగా నయనపర్వం. విష్ణుమూర్తి వర్ణన తరుణంలో 'పెద్ద ఎర్రదామరల వంటి నేత్రాలు గలవాడ'నడమూ నేత్రానంద దాయకమే! అన్ని ఆనందాల కలబోతే జీవితమనుకుంటే, నిఖిలేశ్వర్ దర్శించినట్టు అందులో ప్రత్యక్షమయ్యేది 'కాంతి పరావర్తన దృశ్య పరంపర/ పరస్పర సంబంధ బాంధవ్యాలతో నిరంతరం చలించే అవిరామ కిరణధార' కాలమా... ఆగేది కాదు. అనంతంగా, అవ్యయంగా ఉండే కాలం- విశ్వమంతటినీ తన చుట్టూ తానే తిప్పుకోగల రంగుల రాట్నం. ఈ పరిభ్రమణ క్రమంలో ఇప్పటి తాకే తెర సాంకేతిక విజ్ఞతా ఇకముందు తెరమరుగవుతోంది. స్పర్శించే పనీ లేకుండా ఒక్కటంటే ఒక్క చూపునే సాధనంగా మలచుకున్న కొంగొత్త పరిజ్ఞానం భవిష్యత్ యవనికపైన ఆవిష్కారం కానుంది. కనుపాప నుంచి ప్రతిబింబించే పరారుణ కిరణాల ఆధారంగా దూరవాణి యంత్రం(మొబైల్) పనిచేసేలా నవీన రూపనిర్మాణం ముగించారు లండన్ పరిశోధక విద్యార్థులు. అంటే- కేవలం కంటిచూపుతోనే ఈ తరహా యంత్ర పరికరాల్నీ పూర్తిగా నియంత్రించవచ్చన్న మాట! నూతన సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చే ఇటువంటి పరిజ్ఞానంతో ఇక పుటలు తిరగేయడాలు, ఆటలాడుకోవడాలు తదితరాలన్నీ చూపులతోనే జరిగిపోతాయి. 'దివ్య' దృష్టి అంటే బహుశా ఇదేనేమో!
(సంపాదకీయం , ఈనాడు , 04:11:2012)
-----------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home