లేఖానంద లహరి
ప్రేమానురాగాల ఫలితాల 'కుమార సంభవ' రమణి పార్వతి సౌందర్య ధురీణ. సదా నవాభ్యుదయ సుధలొలికించిన 'రఘువంశ' నాయికామణి సీతాదేవి బహుగుణ సంపన్న. కథానాయకులతో వీరి మహత్తర ప్రత్యుత్తరాలు మృదుమధుర భూషితాలు, పరమ మనోహర విలసితాలు. వీరిది- ప్రేమరసైక కవితామూర్తి పలవరించినట్టు 'అచ్చపు జుంటి తేనియల, సుధారసాల, గోర్వెచ్చని పాలమీగడల/ విచ్చెడి కన్నెగులాబి మొగ్గలన్ మచ్చరికించు మంజుల మోహన ముగ్ధ శైలి'. వెన్న మార్దవం, వెన్నెల చల్లదనం కలబోసిన పద లాలిత్యాలవి. కొదమ రాయంచ నడకల కులుకు బెళుకు నయగారాలవి. ఆ మాటల వెనక అక్షర రమ్యత, కల్పనా చతురత, అనల్పార్థ రచనా ప్రావీణ్యత... పుష్కలం. వేటూరి మాటల్లోని 'పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు పలికే మరందాల అమృత వర్షిణి' అదేనేమో! కాలానుక్రమంలో భావ వ్యక్తీకరణ పర్వంలో ఇంటింటా సన్నటి తీగలకు గుచ్చిన ఉత్తరాల దొంతరలు 'ఉభయకుశలోపరి'ని వేనోళ్ల ధ్వనించేవి. వ్యక్తిత్వాన్ని పట్టి చూపే, సామాజిక బాంధవ్యాన్ని తట్టి లేపే దీప్తిధారలుగా మారి అవి శిలాక్షరాలే అయ్యాయి. నవనవోన్మేష రీతుల పరంపరతో, భువనచంద్ర భావించినట్టు- అవి 'కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం'. ప్రేమామృత వాహినిలో జగమే అణువైంది, యుగమే క్షణమైంది. 'తెలతెలవారు లీల, తొలి దిక్కున బాలమయూఖ మాలికల్/ కలకలలాడు లీల, కమలమ్ముల జంట సరోవరమ్ములో/ కిలకిల నవ్వు లీల, గిలిగింతలతో సెలయేటి కాలువల్ జలజల పారు లీల' కవుల కలాల్లో గళాల్లో పొంగులెత్తింది ప్రేమ. చల్లచల్లని పాలవెల్లిలో జాబిల్లి మల్లెమొగ్గలు వెదజల్లినంత అనుభూతి సాంద్రతే అదంతా! 'నా వాంఛలన్నీ ప్రేమలో ఫలిస్తా'యన్న చలం వచన గాఢతా కొండంత. భార్యకు నెపోలియన్ రాసిన లేఖల్లోనూ ఎంతో సరళత, స్వచ్ఛత. 'ఉత్తరం సహజసిద్ధంగా రాయగలిగిన ప్రతి వ్యక్తీ రచయితే' అని బెర్నార్డ్ షా అనడం రచనాశక్తి విశ్లేషణకు సూచిక. కంటితడితో పాటే మనసు తడినీ తడిమే సత్తువ ఉంటుందా లేఖల్లో. భారాలు కాని, బేరాలంటూ ఉండని ప్రేమ రాయబారాలే ఆ అన్నీ!
అనుమానాలూ అధికారాలూ రహస్యాల నడుమ బతికేవారికి ప్రేమ గురించి ఏం తెలుసన్నది ఆధునిక కాల ప్రశ్నాస్త్రం. గురజాడ వచించిన 'ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును' అన్నది అక్షరాలా సత్యం. భావాల తీవ్రత ప్రతిఫలించే, మానసిక ఒత్తిడిని పరిహరించే ప్రేమలేఖలు కాలక్రమంలో మార్పుల పర్వంలో కనుమరుగైన రోజులొచ్చాయిప్పుడు. ఎదుటపడి మనసు తెలపలేక, తెలిపేందుకు భాష చేతకాక, గుండెలో గూడుకట్టుకున్న ప్రేమోద్వేగం ఉత్తరంలోకి ఎంతకీ ప్రసరించక నానా యాతన. అన్నీ పొట్టిపొట్టి మాటలు, చిట్టిచిట్టి సందేశాలు! 'ప్రేమయనగ నెల్లర ద్రవింపగ జేయుటె' అనుకుని పానుగంటిని గుర్తుచేసుకున్నా, ఆధునిక లేఖల్లో లోపిస్తున్నదల్లా ఆ రసార్ద్రతే! గాలిలో తరంగాల్లా మారిపోతున్న మాటల్ని పదేపదే అదే పనిగా వెదికి తెచ్చుకోవాల్సిన స్థితి దాపురించింది. అందుకనే... కాగితాలతో పాటు అంతర్జాలం, ఇతర సామాజిక యంత్ర సాధనాల్నీ వినియోగించి ప్రేమలేఖలు రాసి పంపే పోటీని వచ్చే కొత్త సంవత్సరం జనవరిలో భారీయెత్తున నిర్వహిస్తున్నారు పుణే(మహారాష్ట్ర) వాసి శ్రీకాంత్. పదహారేళ్ల యువత మొదలు అరవై ఏళ్ల వృద్ధులదాకా రాయొచ్చంటున్న లేఖల్ని ఆ వైద్యుడు వడపోసి ఎంపిక చేసి పుస్తక రూపంలో తెస్తామంటున్నారు. వాటిని విక్రయించి సంపాదించే మొత్తాన్ని 'హృదయమిత్ర' పేరున్న తన స్వచ్ఛంద వైద్యసేవా సంస్థకే వినియోగిస్తామంటున్నారు. ఏ అంతరాలూ లేకుండా అందరూ పాలుపంచుకునే ఈ లేఖల పోటీ ఇక ప్రేమ హృదయాల పాలిట దివిటీ!
(సంపాదకీయం, ఈనాడు ,16:12:2012)
---------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home