వంశవృక్షం
నిరంతర జీవధారగా కొనసాగే కాలం ఏనాడూ ఆగదు, మారదు. ఆ వేగ గమనంలో ఆగేదీ సాగేదీ మారేదీ దారి మళ్లేదీ మనిషే! నిత్యకృత్యాల పెను ఒత్తిళ్ల మధ్య అతనెంతగా పరిభ్రమిస్తున్నా, ఎర్రన కవి తలచినట్టు- జననీ జనకులకు సుగతి కలిగించేవాడే ధర్మాత్ముడు. ఎంతటి ఘన చరితుడికైనా చిరునామా... అమ్మా నాన్నా. జన్మనిచ్చిన వారినీ వంశానికి మూలంగా నిలచిన పురుషులనీ ప్రాతః స్మరణీయులుగా సంభావించడమే మనిషితనం. సృష్టికర్త బ్రహ్మదేవుడికే తన మూలాలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిందని పురాణం చెబుతోంది. అది అత్యంత సర్వసహజమైన ఉత్సుకత. 'తన్ను దానెరుగలేని తలపేటి తలపు' అన్న అన్నమయ్య భాషితాన్నీ ఇక్కడ స్మరించుకోవాల్సిందే. పుట్టుకకీ పెరుగుదలకీ మూలకారకులైన తాత ముత్తాతలు, సంబంధీకుల్ని పేరుపేరునా తలచుకోవడంలో జీవితకాలానికి సరిపడేంత ఆనందముంది. పుట్టి పెరిగిన ప్రదేశాన్ని చూడాలన్న తాపత్రయం ఎంతో, పూర్వీకుల వివరాలు తెలుసుకుని నమస్కరించుకోవాలన్న కాంక్షా అంతే. మనుషుల్నీ మనసుల్నీ నిత్యమూ కలిపి ఉంచేంత జీవన సూత్రం ఇక్ష్వాకుల వంశ చరితలో ప్రతిఫలిస్తుంది. ఆ కుల తిలకుడు శ్రీరామచంద్రుడైతే, కుమారుడు కుశుడి ద్వారా కొనసాగిందంతా రఘువంశ కీర్తి విస్తరణే. తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించేలా మహా తపమాచరించిన భగీరథుడిదీ సఫల మనోరథమే.
'వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే' అనడంతోనే అత్రి, అగస్త్య, ఆంగీరస, వసిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, భృగు, జమదగ్నాది మహర్షుల దర్శనమవుతుంది. పుత్రపౌత్రాది పరంపర వర్ణన సాగిన ప్రతిసారీ 'జన్మవృక్షమునకు చవి గలయట్టి పటుతర కమనీయ ఫలములు రెండు కెరలు/ భోగములొండు కీర్తి రెండవది' అని చాటిన అలనాటి పల్నాటి చరితా జ్ఞప్తికి రాక తప్పదు. కదనరంగానికి కదిలే ముందు భార్యామణిని చూడబోయిన బాలచంద్రుడు అక్కడే సౌందర్యారాధన బంధితుడవుతాడు. ఆ పరిష్వంగ వలయం నుంచి తప్పించి కూతురు ముఖతః అల్లుణ్ని కర్తవ్యోన్ముఖం చేసేందుకు రేఖాంబ సాగించిన బోధ వారి వంశకీర్తిని విశదపరచేదే! తరాలూ వారసత్వాలూ అనేకానేక రంగాల్లో ఉన్నా, వంశ మూలాల ఆలోచనే మనోమందిరాన్ని పరమానందభరితం చేస్తుంది. జీవన సంస్కార వారసత్వమే ఎప్పుడైనా ఎవ్వరికైనా గర్వకారణం. 'వరమున బుట్టితిన్, భరత వంశమున జొచ్చితి, నందు పాండు భూ/ వరునకు గోడలైతి, జనవంద్యుల బొందితి, నీతి విక్రమ/ స్థిరులగు పుత్రులం బడసితిన్, సహ జన్ముల ప్రాపు గాంచితిన్' అంటూ అన్నింటా ఉన్న తన ప్రశస్తిని చాటిన ద్రౌపదిదీ మూలాచార పరాయణత్వమే. సత్యం, ధర్మం, శమం, దమం, విక్రమం, ప్రియవాక్యం తదితరాలూ గుణసంపత్తికి తార్కాణాలు. వారసత్వాన్ని పదిలపరచి విస్తరించాలన్న భావన వెనక వంశాభిమానముంది. వూరూ పేరూ ప్రస్తావించి 'నచట పుట్టిన చివురు కొమ్మైన చేవ' అంటూ ప్రవర కథాసంబంధ అభివర్ణన సాగించారు మనుచరిత్రకారులైన పెద్దనామాత్యులు. 'వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె/ నందు పెక్కండ్రు నృపులుదయంబు నొంది/ నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్ర కీర్తి/నధికులైరి తదీయాన్వయమున బుట్టి' అన్న వేరొక సందర్భమూ మూల చరితుల సంబంధమే. అంతటి ముఖ్యులు సహా విశిష్టులైన మహా రుషుల పేర్లను కలిపి చూసుకుని, తామూ అదే కుటుంబానికి చెందినవారమన్న ప్రవరాన్విత భావం పొందడం ఎవరికి వారికే అబ్బురమనిపించే అనుభవం.
ఎన్నడూ చెదరని, ఎప్పటికీ చెరగని, ఏనాటికీ తెగని అనుభవాన్నిచ్చేవి కళలు, సాహిత్యం, చరిత్రలు. ఆకట్టుకునే త్రివేణీ సంగమంలా, అంటిపెట్టుకునే పుట్టుమచ్చలా అవి శాశ్వతాలు. నాడు నేడు రేపు అన్నవి ఎవరికి వారు గీసుకునే కొండగుర్తులనుకుంటే, కలసి మెలసి జీవించడంలో ప్రతి ఒక్కరూ అందుకునే ఉల్లాస స్థాయి శిఖరంతో సమానం. ఆదికవి నన్నయ 'కీర్తి నిలుపుటయు కాదె/ జనులకు జన్మఫలంబు' అనడంలో వెల్లివిరిసేది మూలధర్మాల సంరక్షణ సంకల్పమే. కంటిముందే కాగితాల మడతల్లోకి జారిపోతుంది గతం. చూస్తుండగానే గుమ్మంలోకొచ్చి నిలుస్తుంది వర్తమానం. ఆశగా వూరించి వూహల ఉయ్యాలలూగిస్తుంది భవితవ్యం. అయినా 'మా పూర్వీకులు...' అని ప్రారంభించడంలోనే మనిషిలోని ప్రేమాభిమానాలూ అచ్చట్లూ ముచ్చట్లూ పెల్లుబికి, శుభకామనలై నిలవడంతో పాటు దివ్య దీవెనల్నీ కోరుకుంటాయి. పండుగలూ పబ్బాలప్పుడు ఉమ్మడిగా చేసుకునే వేడుకల్లో అందరికీ అనుభవానికొచ్చేది- ఆ ఉల్లాసమే, ఆ ఉత్సాహమే! సొంత వూళ్లో 'అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్, మావయ్య, తాతయ్య, బామ్మ'ల వంటి బంధుత్వ పిలుపులూ జనజీవన భాగ్యాలే. ఆయా సత్సంప్రదాయ పరంపరలే భువిలోని తదుపరి తరాలకు సదా ఆరాధ్యాలు, ఆదర్శప్రాయాలు. 'విశ్వంభర' కర్త గళం పలికినట్టు 'మట్టిలో మొలిచిన ఏ మొక్కయినా/ నేలపైన అలాగే ఉండాలనుకోదు/ తాను చెట్టంత ఎదిగిపోయే గడియ/ ఎప్పుడా అని ఎదురుచూస్తుంది'. మతం, భాష, ప్రాంతం, ఆచారం, సంప్రదాయం... అన్నింట్లోనూ ఎన్నో వైవిధ్యాలున్నా, వాటిని ఏకోన్ముఖం చేసే ప్రగాఢ శక్తి మూలాల అన్వేషణ, ఆరాధన, పరిరక్షణల్లోనే దాగుంది. అదే మన సంస్కృతి, అదే మనందరిలోని భారతీయత.
(సంపాదకీయం, ఈనాడు , 23:12:2012)
--------------------------------------------
Labels: Indians/ Telugu, Life/telugu
0 Comments:
Post a Comment
<< Home