జల తరంగిణి
సమస్త మానవాళినీ అనంత రసానంద వాహినిలో ఓలలాడించే సుమధుర మంత్రాక్షరి... సంగీతం! అష్టభోగాల్లో ఒకటిగా, చతుష్షష్టి కళల్లో మేటిగా ఘనతనందుకున్న ఆ గాన మధురిమే పానుగంటి కంటిముందు నిలిచినట్టు 'కన్నులకు జల్వ చెవులకు గమ్రతయును/ శ్వాస సంస్తంభనమున నాసకును బలిమి/ గాత్రమున రోమహర్షణ కలన మఱియు/ మనసునకు దాండవంబు నాత్మకును శాంతి/ సర్వరోగ సంహరణంబు'గా సర్వజన ప్రయోజనకరమైంది. వీర, శృంగార, కరుణ, శాంతి, హాస్యాది నవరస మిశ్రితంగానూ జనజీవన రంగమంతటినీ ఆవహించిందా రాగసుధ! దశవిధ ప్రణవ నాదాల్లో పాటతో పాటు చోటుచేసుకున్న వీణ, వేణు, మృదంగ వాద్యాదులూ లలిత చరిత మృదుకర చరణాలు... అరుణారుణ సమప్రభా భాను కిరణాలు. ఢమఢమ డమరుక నాదాలైనా భంభం శంఖారావాలైనా ధిమింధిమిత మంగళ మృదంగాలైనా ప్రతి మదినీ కదిలించేవీ, అణువణువూ మురిపించి మైమరపించేవీ! మనోజ్ఞ మల్లికావనిలో సుధామధుర కోమల గీతిక ఆలపించిన వనితామణిలో 'కరుణశ్రీ'కి ప్రణయకాంక్ష కనిపించింది. మహేశుని తపోదీక్షను భగ్నపరచిన అనుంగుడు ఆ ఫాలనేత్రాగ్నిలో భగ్గుమనగానే, సహచర జవరాలి నోటినుంచి కన్నీటి పాట వినవచ్చింది. 'చిచ్చువలె చందురుడు పైకివచ్చినాడు/ హెచ్చరిలినాడు గాడుపుపిల్లవాడు/ రాడు మోహన మురళీస్వరాలవాడు' అని హృది రగిలిన రాధికలో విరహ బాధ గోచరించింది. 'వేణుగీతివయి నిద్దుర లేపితివీ ప్రసుప్త బృందావనమున్' అన్న మరో లలన జ్యోతిర్మయి- సుందర పదాంకిత కింకిణికా ధ్వనులు మోగిన వేళ కవి ప్రశంసను వశపరుచుకుంది. ఘల్లుఘల్లున కాలిగజ్జెలు మోగుతుండగా మునుముందుకు సాగిన వేరొక భామామణి నడచినంత దూరమూ సుమనోహర దృశ్యమాలికే ప్రత్యక్షమైంది.
ఎండిన మోడులు చివురించడం, బండ గుండెలు ద్రవించడం కూడా గీత సంగీతాలతో సులభసాధ్యమనేందుకు పురాణ సంబంధ ఆధారాలు ఇంకా ఎన్నెన్నో. మంద్ర, మధ్యమ, తార స్థాయులతో స్వరభేదాలున్నా వాటన్నింటి సుస్థిర లక్ష్యం జన మనోరంజనమే. భావాన్ని గానంతో సమృద్ధం చేసి చూపేది రాగం. ఆ గానం వీనులవిందుగా కొనసాగడానికి ఉపకరించేది లయ. ఆరోహణ, అవరోహణల సమ్మేళనంతో స్వర గాంధర్వం విస్తరించినప్పుడు రసజ్ఞ శ్రోతలకు అదే రక్తిప్రదాయకం. 'సంగీత సాహిత్య సమలంకృతే/ స్వరరాగ పదయోగ సమభూషితే'నన్న కవి కైమోడ్పులకు అది ఉత్ప్రేరకం. అంతటి గీతామాధురీ ధారలో తడవనిదెవరు? మల్లెలతోటలోని ఆ మలయ మారుతాన్ని శ్వాసించని వారెవరు? 'నభమున చంద్రుడు తిలకించెనే/ చిరునవ్వుల వెన్నెల లొలికించెనే/ చక్కనితీవలు తరులు సరస్సులు/ చిక్కని మధువులు చిలికించెనే' అన్న క్రాంతదర్శి వర్ణనకు పులకించని మనసంటూ అసలుంటుందా? గాత్రమైనా వాద్యమైనా స్పందించే హృదయులతో అదో కరస్పర్శ, ఆదరపూర్వక పరామర్శ. సంగీతనిధి రామరాజ భూషణుడు ప్రస్తుతించినట్టు 'బాల రసాలమూ, పికపాలి పాలిటి అమర సాలమూ' అదే. పాలు, పెరుగు, చక్కెర, తేనెలవంటి పంచామృతాల సమం సంగీతమే. కర్పూరం, కస్తూరి, జవ్వాది, పన్నీరు, శ్రీగంధాది సుగంధాల సారమంతా గాన, గ్రహణ, శ్రవణ, మననాలతో సిద్ధిస్తుందనేదీ అందుకే. ఆస్వాదించినంత కాలమూ, అనంతరమూ ఏ ఆలాపనైనా అక్షరం, అక్షయం. పంచభూతాల్లో ఒకటైన జలానిది ద్రవణ గుణం. ఆ ద్రవీకరణే సంగీత పరిణామం. పొంగి పొరలిన లావణ్యం అలలా, నింగిమీద నక్షత్రాల నీలినీడల వలలా మనోమందిరాన్ని ఆక్రమిస్తుందది. కవి గాయక నట వైతాళిక భువన విజయంలో వెండి వెన్నెల జిలుగులెన్నని? కలవరించి పలవరించాల్సిన సరిగమలూ సురాగాలూ జీవితకాలంలోలెక్కకు అందనన్ని!
'కళ్లు మూసుకుని పడుకున్న గదికి విశ్వనాదాలు మంద్ర శ్రుతిలో వినిపిస్తున్నాయి/ ఆ నాద మాధురిలో పరవశించిన గది... విశ్వాన్నే తన కౌగిట్లో పొదుగుకుంది' అన్న 'విశ్వంభర' కర్త భావన మధురాతి మధురం. మనసారా ఆలకించాలే కానీ- గీతగోవిందం అలరిస్తుంది, కృష్ణలీలా తరంగం మురిపిస్తుంది. దేశీయం, విదేశీయం, జానపదం వంటి భేదాలేవీ సంగీత రసాస్వాదనలో అసలే ఉండవు. అజరంగా నిలిచే, అమరంగా వెలిగే గీతానందం... సింగరార్యుడన్నట్టు 'సంగీతవిద్య కెలమిన్/సంగడి సాహిత్యవిద్య సరిగా రెండున్/ మంగళవతి కలిగిన యా/ రంగు వచింపగ దరమె'. సంగీత సాహిత్యాలకున్నట్టే, జలానికీ అలలకీ అవినాభావ సంబంధముంది. వాటి మేలు కలయిక- మనసున మల్లెల మాలలూగిస్తుంది, కన్నుల వెన్నెల కాంతి నింపుతుంది. రాగంతో అనురాగం చిలికించి, రక్తితో అనురక్తిని ఒలికించే గానం ఏ మాటలకీ అందనిది, ఏ విశేషణాలకీ లొంగనిది. ఆనందానికి పర్యాయపదమేదైనా ఉందా అంటే, చటుక్కున గుర్తుకొచ్చేది గానమే! జీవన నందనాన నిరంతర యవ్వనిని తలపించే గానకళను బ్రిటన్ సంగీతకారుడు కిర్కీ వినూత్నరీతిలో ప్రదర్శించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈతకొలనులోని జలతరంగాలతో సంగీత సృష్టి చేశారు. శరీరానికి అమర్చుకున్న యంత్ర పరికరాల వూతంతో కొలను అలలతో సంగీతామృతాన్ని పాలీమౌత్ విశ్వవిద్యాలయం వేదికగా యువ హృదయాలకు పంచిపెట్టారాయన. ఆ జల తరంగిణిని వర్తమాన జన మనోల్లాసిని అనుకుంటే, భవిష్యత్తు తరాలకది శాశ్వత వర ప్రసాదినే కదా!
(సంపాదకీయం , ఈనాడు ,18:11:2012)
----------------------------------------------
Labels: Liesure/Telugu, Life/telugu
0 Comments:
Post a Comment
<< Home