ప్రేమ యాత్ర
తలపుల వలపుల కలగలుపు వల 'పెళ్లి'! అనంత రసాస్వాదన, రసరమ్య స్వప్నావిష్కరణ... రెండూ ఇందులోనే. ఆ సంబరం అర్ణవమైన వేళ 'కణకణమందు నీ యునికిగంటి, సుమధ్య సువర్ణ కింకిణీ/ క్వణనములందు నీ మధురగానము వింటి, విశాల సృష్టిలో/ అణువణువందు నీ మహిమ లారసికొంటి'- అని ఉభయులూ ఏకోన్ముఖులు కావడం కరుణశ్రీ భావించినట్టు, సుమనోహర దృశ్యమే. ప్రేమించి పెళ్లి చేసుకోవడమా, పెళ్లిచేసుకుని ప్రేమించడమా అన్న చర్చ, ప్రేమైక జీవన సౌందర్య పిపాసులకు పూర్తిగా అయిష్టం. అన్నింటికన్నా ప్రధానం ప్రేమతత్వమనుకుంటే, పెళ్లితో అది స్థిరపడుతుందన్నది తిరుగులేని వాస్తవం. నీటికి పారుదల ఎంత సహజసిద్ధమో పెళ్లయిన జంట మధ్య ప్రేమవాహినీ అంతే. అరిటాకులో అన్నంలా వెచ్చవెచ్చగా ఉండేదీ, తమలపాకులో సున్నంలా ఎర్రెర్రగా పండేదీ ఆ రసానుభవమే. 'మాధవీ విలాసంలా మధువసంత హాసం'లా ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే అదే ఆ ఇద్దరి రసోద్దీపనకీ సముద్రమంత వేదిక. ఆ అంతా సొంతం, శాశ్వతం చేసుకునే క్రమంలో ఇద్దరూ ఒక్కరిగా మారి సాగించే విహారయాత్ర అపూర్వమూ అపురూపమూ. అంతటి రసవత్తర ప్రేమయానానికి నగరాలూ నదీతీరాలూ వనాలూ భవంతులూ మజిలీలు. నారాయణ కవి భావించినట్టు 'కడకన్నుల కాంక్షలు పల్లవింపగా' క్రీగంట చూసుకుంటూ, గుసగుసలాడుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, కలిసి నడుస్తూ, కలిసే స్నానాలు చేస్తూ, శ్రమిస్తూ, విశ్రమిస్తూ... వారు సాగించేవన్నీ ముద్దూ మురిపాలే. ఆకలిదప్పులు లేకుండా, అలుపూ సొలుపూ కానరాకుండా ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు! ఆ ప్రపంచంలో ఉండేదల్లా ఆ ఇద్దరే! పొద్దస్తమానమూ వారిది సొగ'సరిగమల' ఆలాపన, సరస సామ్రాజ్య నిర్వహణ.
కవి సుధాంశుడు సందర్శించినట్టు- దంపతుల ఆ మధురాతిమధుర యాత్ర 'లలిత లాస్య నవ మహోదయం/ మంజుల మధుకర మన్మధోదయం'. అన్యోన్యత నిలుపుకోవాలన్న తపన తనువంతా నిండాలే కానీ, సరస విహార తరుణాన ఈ భువికి ఆ దివి దిగిరాక తప్పదేమో! ఇరు హృదయాల్నీ దేహాల్నీ మమేకం చేసే శుభ సందర్భమది. కలిసి ఆడుకునే ఊసులు, చేసుకునే బాసలు, వాలిపోవడాలు, సోలిపోవడాలు ఎంతెంత ఉత్తేజ కారకాలో! కలలూ కోరికల కలబోతతో జీవిత భాగస్వామి అంతర చిత్రం ఆ స్థలిలోనే నవ్య కోణంలో ఆవిష్కారమవుతుంది. బెరుకంటూ లేకుండా ఎటువంటి అవాంతరమూ రాకుండా ఉభయత్రా స్వేచ్ఛగా స్వతంత్రంగా పంచుకునే భావాల వెల్లువ ఉంటుందక్కడ. యుగళ గీతంలా వలపు బాణంలా సుతారంగా సూటిగా మదిని తాకడం అనుభవమై 'స్వర్ణకుమారి' కృతికర్త వర్ణించినట్టు 'మంద మలయానిలముల్ పులకించి స్వర్గసౌఖ్యములొలికించునట్టు' సంతోష సాగరాన్ని తరలించుకొస్తుందది! ఆ కడగంటి చూపులోని పడిగాపుల అర్థమేమిటో, ఆ సుతిమెత్తని తాకిడి వెనక అంతరార్థమేమిటో తెలిసేది వారికే. లోపలా వెలుపలా ఉండే తేడాలన్నీ అరిగిపోయి తరిగిపోయి కరిగిపోయి చివరికి కనుమరుగయ్యేదీ భార్యాభర్తల ప్రేమ పర్యటనలోనే! 'వలపుల బావిలో మునుక వైచెను జీవిత మాధురీ సుధా/ కలశము; పైకి చేదుకొనగా వలె చంచల కాలచక్రపుం గిలకల మీదుగా' అన్నారందుకే క్రాంతిశ్రీ. పెళ్లి నూరేళ్ల పంటగా ఉండాల్సిన చోట ఎప్పుడైనా మంట లేచిందన్నా, కలకాలం పదిలపరచాల్సిన పెళ్లిపుస్తకంనుంచి పుటలు కొన్ని జారిపోయాయన్నా... అక్కడేదో లోపమో దోషమో ఉన్నట్టే! సరసకు వచ్చినప్పుడే అది సరసమవుతుంది కానీ వరస తప్పితే దాపురించేది విరసమే కదా! నిట్టూర్పుల పొగలూ సెగలూ చుట్టుముడితే ఏ కాపురమైనా ఉక్కిరిబిక్కిరే. అయినా దువ్వూరివారన్నట్టు 'ప్రణయపాశంబులెట్టివో బలిమిబట్టి/ లాగినను ద్రెవ్విపోవక సాగుచుండు' అనుకోక తప్పదిక.
వివాహాలు ఆ లోకంలో నిర్ణయమైతే, విడాకుల వ్యవహారం ఈ లోకంలోనా అనిపిస్తుంది ఒక్కోసారి. కారణాలేవైనా, పగలొచ్చిన అలకా కలతా రాత్రి దాటినా తీరకపోతే- ఆ ఇద్దరిదీ ఒంటరి అంకె! ఆరుద్ర అవలోకించినట్టు వారి 'జీవితం శాశ్వత మథనం, తుదిలేని కథనం'. స్థితిగతులు ఆ తీరులో ఉన్నా 'మరో హనీమూన్' ఫలంగానే రససిద్ధి సులభ సాధ్యమవుతుందని 'మ్యారేజ్ కౌన్సిల్ ఆఫ్ అమెరికా' అధ్యయనం ఇదివరకే తేల్చిచెప్పింది. పెళ్లయిన రెండు దశాబ్దాలకు పలు కారణాలతో విడిపోవాలనుకున్న జంట ద్వితీయ యాత్రతో ఏం పొందిందన్న కథాంశంతో చలనచిత్రమూ మునుపే వచ్చింది. అదే అద్వితీయ యోచనతో మలేసియా యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం సైతం తాజాగా ఉత్తమ ఫలితాలనే అందించింది. పెళ్లయిన కొన్నాళ్ల తరవాత రకరకాల పరిస్థితుల్లో కీచులాటకు దిగుతున్న జంటల్ని 'ఇంకోసారి వెళ్లిరమ్మ'ని ఉల్లాస యాత్రకు పంపించారక్కడ! సమస్యల తీవ్రత తట్టుకోలేక వేరుపడాలన్న ఆలోచనదాకా వచ్చిన పురుషులు, స్త్రీల పాలిటా అదో ఆశాజ్యోతి అయింది. 'ఇద్దరం ఒక్కటే'నన్న మానసిక, శారీరక సఖ్యతతో ఆ తరహా విహారం వారికో తీపి జ్ఞాపకంగా మారింది. దాంపత్య బంధాన్ని ఆ విధంగా బలోపేతం చేసిన ప్రభుతకు సౌహార్ద్రపూరిత కృతజ్ఞత తెలిపేలా చేసింది. పెదవి విరుపులూ కోపతాపాలకు మారుగా సరదాలు, ఆనందాలకు ఆ స్థలమే స్థానం కల్పించిందన్న మాట! 'ప్రేమ చొరరాని తావులు పృథివి లేవు లే'వన్న నాళంవారి మాటలు నవోత్సాహ కారకాలైతే 'సకల యత్నముల నుత్సాహంబె మనుజులకు సకలార్థ మూల'మన్న 'రంగనాథ రామాయణ' కర్త వాక్కులు మరిక యాత్రా ప్రోత్సాహక రస గుళికలే!
(28:10:2012, ఈనాడు )
________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home