My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, April 29, 2013

1127- వందేళ్ళ సినిమా.. వెయ్యేళ్ళు వర్ధిల్లాలి!

''అన్నదమ్ముల అనుబంధం', 'తోడు-నీడ', 'దోస్తానా', 'అపూర్వ సహోదరులు'... బాలీవుడ్-టాలీవుడ్ బంధానికి ఏ టైటిలు తగిలించినా అతికినట్టు సరిపోతుంది. భారతీయ సినిమా వందేళ్ల వైభవంలో తెలుగు సినిమాకూ వాటా ఉంది. మూకీలయుగం నుంచి మల్టీప్లెక్సులతరం దాకా - ప్రతి మలుపు దగ్గరా తెలుగుజెండా రెపరెపలాడుతూనే ఉంటుంది.

మూకీయుగం...
తొలి వందనం...
రఘుపతి వెంకయ్య
వందేళ్ల క్రితం...మే 3, 1913న దాదా సాహెబ్ ఫాల్కే రూపొందించిన 'రాజా హరిశ్చంద్ర' బొంబాయిలోని 'కోరొనేషన్ సినిమాటోగ్రాఫ్ హాలు'లో విడుదల కావడంతో భారతీయ సినిమా చరిత్ర మొదలైంది. ఆ చిత్రంతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, మూకీ యుగకర్తల్లో తెలుగువారైన రఘుపతి వెంకయ్య కూడా ఒకరు. ఆయన చాలా మూకీలే తీశారు. వెంకయ్య తనయుడు ప్రకాశ్ కూడా సినిమా స్వాప్నికుడే. తండ్రి నేతృత్వంలో 'భీష్మ ప్రతిజ్ఞ' (1922) చేశారు. ఇదే తొలి తెలుగు మూకీ చిత్రం. అంతకుముందే ఆయన 'మీనాక్షి కల్యాణం' అనే చిత్రాన్ని తీసినా కెమెరా లోపం కారణంగా శ్రమంతా వృథా అయిపోయింది.

టాకీ యుగం...
మలి వందనం...
హెచ్.ఎం.రెడ్డి, ఎల్వీ ప్రసాద్
మార్చి 14, 1931న ... తొలి భారతీయ టాకీ చిత్రం 'ఆలం ఆరా' విడుదలైంది. అదో ప్రేమ కథ. సంపన్న నాయకుడూ నిరుపేద నాయిక చుట్టూ తిరుగుతుంది. చిత్ర దర్శకుడు, నిర్మాత అర్దేశిర్ ఇరానీ. హనుమంతప్ప మునియప్పరెడ్డి (హెచ్.ఎం.రెడ్డి) ఆయన సహాయకుడు. బెంగుళూరులో పుట్టిపెరిగినా హైదరాబాద్‌లో కొంతకాలం ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు హెచ్.ఎం.రెడ్డి. సినిమా మీద ప్రేమతో బొంబాయి వెళ్లారు. 'ఆలం ఆరా' నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు. ఎల్వీ ప్రసాద్ అనే తెలుగు యువకుడు కూడా ఈ చిత్రంలో ఐదారు చిన్నచిన్న వేషాలు వేశారు. అన్ని పాత్రలకూ కలిపి ఆయనకు ఉన్నన్ని డైలాగులు హీరోయిన్‌కు కూడా లేవు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఇరానీ తన దృష్టిని తెలుగు, తమిళ భాషల వైపు మళ్లించారు. 'ఆలం ఆరా' బృందంలో పనిచేసిన ఎల్వీప్రసాద్, హెచ్.ఎం.రెడ్డి ... తర్వాతి కాలంలో, తెలుగు చిత్రాల నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించారు.చిత్ర పరిశ్రమకు ఆద్యులుగా నిలిచారు.

తొలి తెలుగు టాకీ...
ఎందరో మహానుభావులు

''భారత మూవీటోన్ అనబడుతున్న శ్రీ కృష్ణా ఫిల్ము కంపెనీ వారిచే అధిక వ్యయప్రయాసలకోర్చి తయారు చేయబడిన...

'భక్త ప్రహ్లాద'
ఆంధ్రనాటక రంగస్థలమందు వన్నెకెక్కిన సుప్రసిద్ధ నటీనటులు, శ్రవణానందకరమగు పాటలు, పద్యములు, నయనరంజకమగు దృశ్యములు, ఆంధ్రదేశము కొరకు ప్రత్యేకంగా తయారుచేయబడిన తెలుగు భాషలో మాట్లాడు దృశ్యములు''

...అంటూ వీధుల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు.


బాలీవుడ్‌లో టాలీవుడ్
బాలీవుడ్ బంగారు కిరీటంలో టాలీవుడ్ కలికితురాయిలా తళుక్కుమన్న సందర్భాలూ అనేకం. బాలీవుడ్ వందేళ్ల పుస్తకంలో రెండు అందమైన రంగుల పేజీలు - శ్రీదేవి, జయప్రద. జానీలీవర్, , వహీదా రెహ్మాన్‌ల మూలాలు మన దగ్గరే ఉన్నాయి. నగేశ్ కుకునూర్, శ్యామ్ బెనెగల్‌లకు హైద్రాబాద్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. బాలీవుడ్‌కు వేగాన్ని నేర్పిన బాపయ్య, సరికొత్త ధోరణులు పరిచయం చేసిన రామ్‌గోపాల్‌వర్మ - ముంబయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకులు. మూడువందల హిందీ చిత్రాల్లో నటించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ తెలుగువారే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పీబీ శ్రీనివాస్, సుశీల, జానకి ... హిందీ చిత్రాల కోసం ఎన్నో సూపర్‌హిట్ పాటలు పాడారు. రమేష్‌నాయుడు, ఎం.ఎం.క్రీమ్ పేరుతో కీరవాణి చక్కని బాణీలు కూర్చారు. ప్రఖ్యాత దర్శకులు గౌతమ్‌ఘోష్ (మా భూమి), శ్యామ్‌బెనెగల్ (అనుగ్రహం), మృణాళ్‌సేన్ (ఒక వూరి కథ), మహేష్‌భట్ (క్రిమినల్) తెలుగు చిత్రాలకు నిర్దేశకత్వం వహించారు. అమ్జాద్‌ఖాన్, అమ్రిష్‌పురి వంటి బాలీవుడ్ నటులు తెలుగు తెరమీదా కనిపించారు. లతామంగేష్కర్, మహ్మద్‌రఫీ, ఆశాభోంస్లే, శ్రేయాఘోషాల్ వంటి సుప్రసిద్ధ బాలీవుడ్ గాయకులు తెలుగు పాటలు పాడారు.టాలీవుడ్ అగ్రహీరోలంతా ఏదో ఒక రూపంలో హిందీ సినిమా అభిమానులకు సుపరిచితులే. ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయ్యాయి. ఎన్నో హిందీ చిత్రాలు తెలుగు తీర్థం పుచ్చుకున్నాయి. టాలీవుడ్-బాలీవుడ్‌లది అన్నదమ్ముల అనుబంధం!


గిన్నిస్ రికార్డు
అప్పుడెప్పుడో శ్రీనాథ కవిసార్వభౌముడు గౌడడింఢిమభట్టు కంచుఢక్కాను పగులగొట్టాడని ఘనంగా చదువుకుంటాం. ఆ మాటకొస్తే, ఒకటేమిటి నాలుగైదు ఇంటర్నేషనల్ రికార్డుల్ని తుక్కుతుక్కు చేశారు తెలుగు దిగ్గజాలు. అత్యధిక సినిమాల నిర్మాతగా రామానాయుడు రికార్డు సృష్టించారు. నలభై ఏళ్లనాటి 'తాత మనవడు' నుంచి నిన్నమొన్నటి 'పరమవీర చక్ర' దాకా దాదాపు నూటయాభై చిత్రాలకు దర్శకత్వం వహించి... అత్యధిక చిత్రాల డైరెక్టరుగా గిన్నిస్ ఎక్కారు దాసరి నారాయణరావు. అత్యధిక చిత్రాల మహిళా దర్శకురాలిగా విజయనిర్మల, ఒకే భాషలో అత్యధిక చిత్రాల నటుడిగా బ్రహ్మానందం... గిన్నిస్‌లో స్థానం సంపాదించారు. ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియో సముదాయంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ గిన్నిస్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒక ప్రాంతీయ సినిమా పరిశ్రమ... అంతర్జాతీయ గౌరవాన్ని అందుకోవడం అంటే మాటలు కాదు!
 

తెర రాజకీయాలు
తెలుగు సినిమా... జాతీయ రాజకీయాల్ని శాసించిన సందర్భాలెన్నో. అటు ఢిల్లీలో నేషనల్ ఫ్రంట్ సర్కారు, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం. ఫ్రంట్ ఛైర్మన్‌గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సెట్స్ మీంచే ఎన్టీఆర్ బాధ్యతలు నిర్వర్తించిన సంఘటనలున్నాయి. మేకప్‌తోనే అగ్ర నేతలతో సమాలోచనలు జరిపిన దాఖలాలున్నాయి. తెలుగు సినిమా- జాతీయ రాజకీయాల అనుబంధం ఇప్పటిది కాదు. స్వాతంత్య్రానికి పూర్వమే అనేక చిత్రాలు తీసిన నిర్మాత, నటుడు కోన ప్రభాకరరావు ఆతర్వాత రాజకీయాల్లోకి వచ్చి పీసీసీ అధ్యక్షుడిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 1966లో కొంగర జగ్గయ్య కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. సత్యజిత్‌రే మెచ్చిన అందాలతార జయప్రద ఉత్తరాదికి వెళ్లి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అయ్యారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు భారతీయ జనతాపార్టీ తరపున గెలిచి, కేంద్రమంత్రిగా వ్యవహరించారు. దాసరి నారాయణరావు కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. లేడీ అమితాబ్ విజయశాంతి తెరాస ఎంపీగా ఉన్నారు. శారద, కృష్ణ, జమున, రామానాయుడు, మోహన్‌బాబు, రావుగోపాలరావు - పార్లమెంటులోని ఉభయసభల్లో తెలుగు వారికీ తెలుగు సినిమాకూ ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర పర్యాటక మంత్రిగా చిరంజీవి 'భారత సాంస్కృతిక రాయబారి' పాత్ర పోషిస్తున్నారు. మన తారలు రెండున్నర గంటల సినిమాల్లోనే కాదు, ఐదేళ్ల నిడివి రాజకీయాల్లోనూ ప్రాధాన్యమున్న పాత్రలే పోషించారు, పోషిస్తున్నారు.
 

'తొలి' అడుగులు
'భక్త ప్రహ్లాద' కోసం ప్రత్యేకంగా గీతాలు రాసిన చందాల కేశవదాసు తొలి గీత రచయిత. ఆ చిత్రంలో నటించిన 'సురభి' కమలాబాయి తొలి తెలుగు కథానాయిక. స్వరాలు కూర్చిన హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి తొలి తెలుగు సంగీత దర్శకుడు.

తెలుగులో రూపుదిద్దుకున్న పూర్తిస్థాయి రంగుల చిత్రం 'లవకుశ'. 1963లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించింది.
'ప్రేమ విజయం' (1936) తొలి సాంఘిక చిత్రంగా ఘనత సాధించినా... సినిమాగా మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.
తొలి తెలుగు సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు'(1965). కృష్ణ సహా దాదాపుగా అంతా కొత్తవారే. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. నిజానికి చాలా 'తొలి...' చిత్రాలు సూపర్‌స్టార్ కృష్ణతోనే ముడిపడ్డాయి. తొలి తెలుగు కౌబాయ్ చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'. తొలి తెలుగు సినిమా స్కోప్ 'అల్లూరి సీతారామరాజు'. తొలి తెలుగు 70 ఎమ్ఎమ్ 'సింహాసనం'.

అంజలీ పిక్చర్స్ 'పరదేశి'లో అంజలి, అక్కినేని నాగేశ్వరరావులపై తీసిన ఓ పాటలో 'స్లోమోషన్' టెక్నిక్‌ను తొలిసారిగా ఉపయోగించారు.

తొలి ద్విపాత్రాభినయ చిత్రం 'అపూర్వ సహోదరులు' (రంజన్), తొలి త్రిపాత్రాభినయ చిత్రం 'కుల గౌరవం' (ఎన్టీఆర్), తొలి పంచపాత్రాభినయ చిత్రం 'శ్రీమద్విరాట పర్వం' (ఎన్టీఆర్), తొలి నవపాత్రాభినయ చిత్రం 'నవరాత్రి' (ఏఎన్ఆర్).
మనదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చిత్రోత్సవాలకు ఎంపికైన మొట్టమొదటి దక్షిణాది చిత్రం 'పాతాళభైరవి'. విదేశీ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం 'మల్లీశ్వరి'

తొలి సోషియోఫాంటసీ చిత్రం 'దేవాంతకుడు'. తొలి త్రీడీ చిత్రం 'జై బేతాళ'. వినోదపు పన్ను మినహాయింపు పొందిన తొలి చిత్రం 'తీర్పు'. తొలి తెలుగు అపరాధ పరిశోధన చిత్రం 'దొరికితే దొంగలు'
పరభాషలోకి అనువాదమైన తొలి చిత్రం 'కీలుగుర్రం' (తమిళంలో -మాయ కుదిరై). శతదినోత్సవ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం 'బాలరాజు' (1948).
ప్రజల్లో భూస్వామ్య వ్యవస్థ పట్ల వ్యతిరేకతను పెంచుతోందనే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో జమీందార్లు 'రైతుబిడ్డ' (1939) చిత్ర ప్రదర్శనల్ని నిలిపేశారు. అలా, తొలి నిషేధిత చిత్రం కూడా ఇదే.

తొలి నవలా, హాస్యచిత్రం 'బారిస్టరు పార్వతీశం'. తొలి మహిళా దర్శకురాలు సావిత్రి.
'విజయా సంస్థ' నిర్మించిన 'షావుకారు' చిత్రం టైటిలు కింద 'ఇరుగు పొరుగుల కథ' అని వేశారు. టాగ్‌లైన్ సంస్కృతికి ఇదే మూలం కావచ్చు.
 

తెలుగు పిక్చర్ ప్యాలెస్
పుల్లయ్యగారికి టూరింగ్ టాకీసుల వ్యాపారం ఉండేది. ఏదో ఓ చోట టాకీసు ప్రారంభించడం, కొంతకాలం విజయవంతంగా నడిపించి...పరిసర ప్రాంతాల్లోని సంపన్నులకు గిట్టుబాటు బేరానికి అమ్మేయడం...ఇంకో చోట, మరో టూరింగ్ గుడారం పాతేయడం. వ్యాపారం బాగానే నడిచేది. 1921లో విజయవాడలో ప్రారంభమైన తొలి శాశ్వత సినిమా థియేటర్...మారుతీ సినిమా. దీని యజమాని పోతిన శ్రీనివాసరావు. డూండీ పిక్చర్స్ అధినేత డూండీశ్వరరావు, మారుతీ సినిమా అధినేత బెనర్జీ ఆయన కుమారులే. తొలి టాకీచిత్రం 'ఆలం ఆరా' బొంబాయిలో విడుదలైన రోజే మారుతీలోనూ విడుదలైంది. అప్పటి పరిస్థితులతో పోలిస్తే...థియేటర్లో మంచి సౌకర్యాలే ఉండేవి. పుల్లయ్యగారి ప్రోత్సాహంతో పూర్ణా మంగరాజు థియేటర్ల నిర్మాణానికి పూనుకున్నారు. కలకత్తా-మద్రాసుల మధ్య తొలిసారిగా టాకీ ఎక్విప్‌మెంట్‌ను అమర్చిన ఘనత ఆయనదే. విజయవాడలో మారుతి, కాకినాడలో మినర్వా (యజమాని సి.పుల్లయ్య), రాజమండ్రిలో మినర్వా (యజమాని నిడమర్తి సూరయ్య), విశాఖలో పూర్ణా (మంగరాజు)... అప్పట్లో పేరున్న థియేటర్లు. రానురాను సంఖ్య పెరిగింది. థియేటర్లు సరికొత్త సౌకర్యాల్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకున్నాయి. రెండుమూడు ప్రింట్లతో మొదలైన తెలుగు సినిమా 'మాలపిల్ల' (1938) నాటికి ఎనిమిది ప్రింట్లకు చేరింది. ఇప్పుడైతే... వేయి థియేటర్లకైనా సై!

తొలి ఏసీ థియేటరుగా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్, తొలి 70 ఎమ్ఎమ్ థియేటరుగా హైదరాబాద్‌లోని రామకృష్ణ రికార్డుకెక్కాయి. ప్రసాద్స్ ...తెలుగు ప్రేక్షకులకు మల్టీప్లెక్స్ అనుభూతిని తొలిసారిగా రుచి చూపించింది. ఆస్కార్లు సాధించిన ఆంగ్లచిత్రం 'అవతార్'... ప్రపంచంలోనే అతి ఎక్కువ రోజులు అడింది ఏ అమెరికాలోనో కాదు ... హైదరాబాద్‌లోని ప్రసాద్స్‌లో!
 

మన స్టూడియోలు
తొలిరోజుల్లో మనవాళ్లు ఏ కలకత్తాకో షోలాపూర్‌కో వెళ్లి సినిమాలు చిత్రించుకుని వచ్చేవారు. తొలిసారిగా...ఉమ్మడి రాజధాని మద్రాసులో పినపాల వెంకటదాసు వేల్ పిక్చర్స్ స్టూడియోను నిర్మించారు. 'సీతాకల్యాణం' షూటింగ్ జరుపుకొన్నది ఇక్కడే. ఆతర్వాత తెలుగువారి యాజమాన్యం కింద మద్రాసులో చాలా స్టూడియోలే వెలిశాయి. 1936లో నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో దుర్గా సినీటోన్ స్టూడియోను ప్రారంభించారు. ఇక్కడే 'సంపూర్ణ రామాయణం' పేరుతో ఓ సినిమా తీశారు. పరిపూర్ణంగా తెలుగు నేలమీదే తీసిన చిత్రమిది. ఆతర్వాత విశాఖపట్నంలో ఆంధ్రా సినీటోన్ నిర్మితమైంది. సి.పుల్లయ్య కలలపంట ఈ స్టూడియో. 1959లో హైదరాబాద్‌లో సారథి స్టూడియో ఆరంభమైంది. ఆతర్వాత 'అన్నపూర్ణ', 'రామకృష్ణా', 'పద్మాలయ', 'రామానాయుడు' స్టూడియోలు వచ్చాయి. రామోజీ ఫిల్మ్‌సిటీతో తెలుగు సినీ స్టూడియోల ఘనత విశ్వవ్యాప్తమైంది. హాలీవుడ్ చిత్రాల నిర్మాణానికీ ఫిల్మ్‌సిటీ వేదికవుతోంది.
 

ఒకటోసారి...రెండోసారి...
దాదాపుగా ఒకే కథను...రెండుసార్లు, మూడుసార్లు సినిమాగా తీసిన సందర్భాలున్నాయి. అలాంటి చిత్రాల్లో ముందుగా 'లవకుశ' గురించి చెప్పుకోవాలి. మొట్టమొదటి 'లవకుశ' 1934లో వచ్చింది. రెండోది 1963లో వచ్చింది. మొదటి చిత్రంలోని వారంతా దాదాపుగా నాటకరంగంలోనివారే. రెండు చిత్రాలకూ ఒకరే దర్శకులు...పుల్లయ్యగారు. బాపూరమణల 'శ్రీరామరాజ్యం'తో లవకుశుల కథ ముచ్చటగా మూడోసారి తెరకెక్కింది. భక్తరామదాసు చరిత్ర కూడా మూడు చిత్రాలుగా వచ్చింది. మొదటి 'రామదాసు' 1933లో విడుదలైంది. ఈ చిత్రం షూటింగ్ భద్రాచలం మొదలు హిమాలయాల దాకా చాలా ప్రాంతాల్లో జరిగింది. అప్పట్లోనే పాతికవేల బడ్జెట్‌తో భారీగా తీశారు. అప్పటికే ప్రాచుర్యం పొందిన రామదాసు నాటకబృందం వారే ఈ చిత్రంలో నటించారు. ఘంటసాల రాధాకృష్ణయ్య ఆ బృందానికి నాయకుడు, చిత్రానికి దర్శకుడు. రెండో 'రామదాసు' 1964లో వచ్చింది. చిత్తూరు నాగయ్య దర్శకనిర్మాత. నైజాం ప్రాంతంలో హిందూముస్లింల మధ్య ఐక్యత పెంపొందించడానికి నిజాం నవాబు కోరికమేరకు తీశారు. నిజానికి, ఖర్చంతా నైజాం సర్కారే భరించాల్సి ఉంది. అంతలోనే ... సర్దార్ పటేల్ నేతృత్వంలోని భారత సైన్యం నిజాం సంస్థానంపై మువ్వన్నెల జెండా ఎగురవేసింది. చిత్రాన్ని పూర్తి చేయడానికి నాగయ్య నానా కష్టాలూ పడ్డారు. మూడోది...నాగార్జున హీరోగా వచ్చిన 'శ్రీరామదాసు'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని హృద్యంగా మలిచారు. తెలుగువారి దృశ్యకావ్యం 'మాయాబజార్' రెండుసార్లు పౌరాణిక చిత్రంగా, ఒకసారి సాంఘిక చిత్రంగా, ఒకసారి సాంకేతిక అద్భుతంగా...మొత్తం నాలుగుసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిసారి 1936లో విడుదలైంది. చిత్ర దర్శకుడు పి.వి.దాసు. ట్రిక్‌షాట్స్ అద్భుతంగా పేలాయి. సినిమా విజయవంతమైంది. రెండో 'మాయాబజార్' (1957) మహామహులు ...ఎన్టీఆర్, అక్కినేని, ఎస్వీఆర్, సావిత్రి, సూర్యకాంతం తదితరులు నటించిన చిత్రరాజం. మూడో 'మాయాబజార్' (1995) దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సాంఘిక చిత్రం. అక్కినేని కథానాయకుడు. నాలుగో 'మాయాబజార్' ఓ సాంకేతిక అద్భుతం. పాత చిత్రమే పూర్తిరంగులతో రెండేళ్లక్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 

'గ్లోబల్' సినిమా
అజంతాల తెలుగే కాదు, అందమైన తెలుగు సినిమా కూడా దిగంతాలకు వ్యాపించింది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో...మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కొత్త సినిమా విడుదలైందంటే చాలు, ప్రవాసులకు కొత్తావకాయ జాడీ దొరికినట్టే. మహేష్‌బాబు, పవన్ కల్యాణ్, జూ.ఎన్టీఆర్...చిత్రాలకు తిరుగులేని ఆదరణ ఉంది. రాజమౌళి, శేఖర్ కమ్ముల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రవాసుల అభిమాన దర్శకులు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఈగ', 'బొమ్మరిల్లు', 'హ్యాపీడేస్' తదితర చిత్రాలు ఆదరణ పొందాయి. అమెరికా లాంటి చోట్ల అయితే, తెలుగు సినిమాల కోసమే ప్రత్యేకంగా కొన్ని థియేటర్లున్నాయి. ఓవర్సీస్ హక్కుల కోసమూ పోటీ పెరుగుతోంది.
 

సాహితీ చిత్రాలు
ఉత్తమ సాహిత్యానికి సమాజంలో మూలాలు ఉంటాయి. సమకాలీన వ్యవస్థలోని వ్యక్తులే పాత్రలు, సంఘటనలే ఇతివృత్తాలు. ఏ సినిమా అయినా ఘన విజయం సాధించాలంటే సమాజం ఆమోదించాలి, ప్రేక్షకులు మెచ్చాలి, మళ్లీమళ్లీ చూడాలి. మంచి సినిమాకు అవసరమైన ముడిసరుకు సాహిత్యంలో పుష్కలంగా ఉంటుంది. భారత భాగవతాల వంటి పురాణాల నుంచి నవలలూ నాటకాల దాకా... చక్కని సినిమా కథలుగా ఉపయోగపడుతున్నాయి. అందులోనూ తెలుగువారికి 'వన్సుమోర్లు' కొట్టించుకోగల పద్యసంపద ఉంది. సినిమా పరిశ్రమ ఆ అక్షర అక్షయపాత్రను అద్భుతంగా ఉపయోగించుకుంది. చింతామణి, బారిస్టరు పార్వతీశం, వరవిక్రయం, కన్యాశుల్కం, మాలపిల్ల్ల, రక్తకన్నీరు, ఏకవీర, చక్రభ్రమణం, బలిపీఠం, సెక్రటరీ...తదితర రచనలు సినిమాలుగా తెరకెక్కాయి. పాండవోద్యోగ విజయాలు, సత్యహరిశ్చంద్ర, గయోపాఖ్యానం వంటి పద్యనాటకాలు వెండితెర ద్వారా మరింత ఆదరణ పొందాయి. శ్రీరమణ కథ 'మిథునం' కూడా ఈమధ్యే తెరకెక్కింది. మనవాళ్లు బెంగాలీ సాహిత్యాన్నీ వదల్లేదు. నాటకాలూ నవలలూ సినిమాలుగా రావడంతో ప్రారంభమైన ధోరణి...అంతటితో ఆగిపోలేదు. విజయవంతమైన వెండితెర సినిమాలు స్టేజీ నాటకాలుగా కొత్త అవతారం ఎత్తాయి. ఇప్పటికీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్‌ల సినిమాల ఆధారంగా తయారైన నాటకాలు చాలా ప్రాంతాల్లో ప్రదర్శితం అవుతున్నాయి. అంతేకాదు, పాపులర్ సినిమాల స్క్రిప్టులూ రూపకల్పన అనుభవాలూ పుస్తకాల రూపంలో వస్తున్నాయి. సినీ-సాహిత్యాల ఇచ్చిపుచ్చుకునే ధోరణి అటు సినిమాలకూ ఇటు సాహిత్యానికీ ఎంతోకొంత మేలు చేస్తూనే ఉంది.
'మనిషినైతే వందేళ్లు నిండుగా జీవించమని ఆశీర్వదిస్తాం. సినిమా సంగతేమిటి? వెయ్యేళ్లు బతకమన్నా...తక్కువే అవుతుంది? పదివేల ఏళ్లంటే సరిపోతుందా?'...ముహూర్తం షాట్‌లకు వెళ్లే పురోహితుడు తనకు వేదం నేర్పిన గురువుగార్ని అడిగాడు.

'ఒరే అబ్బాయ్! భారతీయ సంప్రదాయంలో వేయి అనంతానికి ప్రతీక. విష్ణుసహస్రనామాలంటే, విష్ణుమూర్తికి వేయిపేర్లు మాత్రమే ఉన్నాయని అనుకోకూడదు. వేయి నామాలవాడు అనంతమైన పేర్లవాడని అర్థం. సినిమా ఇండస్ట్రీ వెయ్యేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తే... వెయ్యిన్నీ ఒకటో ఏడు టపా కట్టెయ్యాలని కాదు. చిరకాలం కళకళలాడాలని భావం. అయినా, సినిమా చిరంజీవి. మనిషి ఉన్నంతకాలం, మనిషికి వినోదం అవసరమైనంత కాలం...నిక్షేపంగా ఉంటుంది. కాకపోతే, ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్తాడా, థియేటరే ప్రేక్షకుడి దగ్గరికి వస్తుందా అన్నది ఎప్పటికప్పుడు మారే టెక్నాలజీని బట్టి ఉంటుంది' స్పష్టతనిచ్చారు గురువుగారు. 

(ఈనాడు , సండే స్పెషల్ , 28:04:2013)
_______________________________________

Labels: , ,

0 Comments:

Post a Comment

<< Home