1169- సహజ బలం
బాల్యంతో పాటు యౌవన, కౌమార, వార్ధక్య దశలన్నింటా సంతోషాలు అనేకం. కలిగే సంతోషాల్ని ఆస్వాదిస్తూ ఉన్నంతసేపూ అంతరంగ బావిలో అనుభూతుల జలలూరినట్టే! ప్రియసఖి కోమల బాహుబంధాల్లో కోటి స్వర్గాల్ని కొల్లగొట్టానంటాడు ప్రాణనాథుడు. 'ముద్దులొలుకు నిరతము నీ/ ముఖ ఫలక శ్రీ తిలకము/ కాంతులొలుకు సతతము నీ గళసూత్రము కల్యాణీ' అనడంలోనూ మది ఆసాంతం సంతోష తరంగితమే. మేను పులకరించి వలపు తొలకరించి గౌరీదేవి చేయి పట్టుకున్నాడు శంకరుడు. అప్పుడు పెదవులమీద చిరునవ్వుల ముత్యాలొలుకుతూ సుతారంగా వారించబోయిన ఆమెదీ మహదానందమే. విశేష ఆతిథ్యంతో నిఖిలలోక మూర్తిత్రయాన్ని శిశువుల్ని చేసి లాలించింది సతీ అనసూయ. సృష్టి స్థితి లయకర్తలైన ఆ ముగ్గుర్నీ వూయలలూపి జోలపాడిందా చల్లని తల్లి. అంతటి తూగుతో వారే కాదు, సమస్త ప్రపంచమూ అనురాగ పూరిత స్పర్శానందాన్ని అందుకుని హాయిగా నిద్రించలేదూ? నన్నయ పద మాధురి, త్యాగయ్య నాద ఝరి, భరతాచార్యుడి నాట్య రవళి- రసహృదయులెందరినో సంతోష సాగరంలో ఓలలాడించాయి. తిక్కన ప్రస్ఫుటం చేసినట్టు 'విమల జ్ఞానులు శమమును/ దమమును ద్యాగంబు శాశ్వత ప్రచురానందమునకు మూలమండ్రు'. ప్రసన్న వివేకులు ఆ సహజ గుణాలనే స్వీకరించి సంతోష చిత్తులవుతారన్నదీ కవి వాక్కు. దీనజన సేవలో తరించిన కరుణార్ద్ర హృదయిని థెరెసా. ఆ దయామయ నిర్మల ధర్మమూర్తికి ఆర్తుల్ని ఆదుకోవడంలోనే సంతోషం. ఆమెది మనసును చల్లబరచే స్పర్శ, కలతను రూపుమాపే పరామర్శ. కష్టాలూ నష్టాలూ చుట్టుముట్టినప్పుడు, సిరివెన్నెల అన్నట్టు 'మిణుగురులా మిలమిల మెరిసే దరహాసం చాలు కదా/ ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తియ్యదా?'
సంతోషం సహజ బలం. అందులోనే ప్రేమ, వాత్సల్యం, కరుణ, ఆదరణ, ఆప్యాయత అన్నీ. సంతోషం తొణికిసలాడే మనసుకు ఎదుటివ్యక్తి కదలికలోనే విశ్వమంతా కనపడుతుంది. ఆ కనురెప్పల చిరుచప్పుడులో కూడా వేదమే వినపడుతుంది. 'నాకు సంతోషం కావాలి' అనుకోవడం మాత్రం ఏ మనిషికీ సంతోషాన్ని ఇవ్వదు. నాకు మాత్రమే- అనుకుంటే అది స్వార్థబుద్ధి. దాన్ని వదిలితేనే చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి. ఉపకారం చేయడంలో సంతోషం అంతా ఇంతా కాదు. అందులో ప్రతిఫలించేది నిస్వార్థ గుణ సంపన్నతే. 'నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతమ్మగును ప్రపంచంబెల్లన్' అన్నది గరికిపాటి మాట. పొందడంలో కంటే, ఇవ్వడంతోనే మిక్కుటమవుతుంది సమస్త సంతోషమూ. ఎండిన మోడైనా చిగురించేదీ, మొండిబండైనా పులకించేదీ సంతోషానుభవంతో మాత్రమే! దారిదీపమూ ధైర్య కవచమూ మనిషితనమే. సంతోషమే స్వర్గమన్నాడు సుమతీ శతకకారుడు. ఎక్కడ వికాసం వెల్లివిరుస్తుందో అక్కడే స్వర్గముంటుందన్నది రవీంద్ర కవీంద్రుడి బోధ. వికాస ప్రకాశాలు రెండూ ప్రతిఫలించేది ఒక్క మంచితనంతోనే. అదంటూ వర్ధిల్లినప్పుడు అనురాగం అంబరమంత, ఆనందం అర్ణవమంత. తనవారికీ ఇతరులకీ మంచి చేయగలిగినప్పుడు లోకానికి సైతం అదే సంతోషం, అదే శోభస్కరం. కాలప్రవాహానికి అటూ ఇటూ ఉండే రెండు పాయలు జననం, మరణం. వాటి మధ్య వెల్లివిరిసే సహృదయత, పరోపకార భావనలతోనే మానవతకు ఇంపు, సంతోషాల గుబాళింపు. 'తన్ను దా తెలిసిన దైవంబు తానాయె' అని కదా వేమన సూక్తి. అదే స్ఫూర్తిగా స్వీకరించి ఆచరించిన ప్రతి మనిషి హృదయమూ దైవ నిలయమే!
(ఈనాడు ,సంపాదకీయం ,03:03:2013)
____________________________________
Labels: Life/telugu, Self development/Telugu
0 Comments:
Post a Comment
<< Home