1188- పద సన్నిధి
సర్వ విద్యల రూపం, సకల కళల సాకారం నాట్యం. హావభావ పూరితంగా వేదికమీద నర్తించేవారికి, ఆసాంతం చూసి అనంత రసానుభూతి పొందే సహృదయులకు అపురూప సందర్భమది. 'జయజయ నటరాజా! జగత్త్రయ నాట్య సమాజా!' అంటూ ఆ రాగతాళలయ రసార్ద్రమూర్తినీ నిత్యసత్య సాహిత్య స్ఫూర్తినీ కీర్తిస్తున్నప్పుడు పరమాద్భుత భక్తిభావన కలుగుతుంది. 'మొలకమీసపు కట్టు, ముద్దుచందురు బొట్టు/ పులితోలు బట్టు, జిలుగువెన్నెల పట్టు/ నెన్నడుమునకు చుట్టు నాగు మొలకట్టు' అని పుట్టపర్తివారిలా శివరూప వర్ణన సాగిస్తున్నప్పుడు కలిగేదీ మహదానంద తత్వచింతనే. 'తకఝుం తకఝుం తకదరికిట నాదమ్ములతో/ లోకమ్ముల వేలుపు నెమ్మిగ నిలబడి నృత్యమాడునెడ' ప్రత్యక్షమయ్యే తాండవకేళి మరెన్నో భావాల జడి. భరతముని సృజించిన ఆ నాట్యప్రక్రియ పలు వృత్తాలు, ప్రవృత్తులు, సిద్ధులు, స్వరాలు, రంగాలు, గానాభినయాల మిశ్రితం. ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాలతో జతకూడిన నృత్తంగా అదో జీవన శాస్త్రం, ఆరాధకులకో వేదం. జ్ఞాన, యోగ, శిల్ప, కర్మరూపాదుల అనుసారంగా సాగే ఆ సహజ అభివ్యక్తీకరణ- విలక్షణతకు మారుపేరు. శాంత, శృంగార, వీర, కరుణ, రౌద్ర, భయానక, హాస్య, బీభత్సాదులతో నవరస పూర్ణంగా నిలిచే ప్రతి ప్రదర్శనా విశిష్టతకు మరో పేరు. నృత్యం ప్రతిభాన్వితమని జర్మన్ మేధావి ఐన్‌స్టీన్, పదనర్తనం జాగృతభరితమని ఆంగ్ల కవి జాన్ డ్రైడన్ అన్నదందుకే. సంగీత, సాహిత్య రసఝరుల మేళవింపు కారణంగానే నాట్యకళకు అంత గుబాళింపు. భాష, భావం, శైలిలోని ఆ నిగారింపు మూలంగానే కళాకారులకీ వీక్షకులకీ అంతటి రవళింపు. నాదలహరిలో భువనాలు నిదురించేది, నాట్యసరళితో గగనాలు నినదించేది అందుకు కాదూ?
'ఇంతినే చామంతినే మరుదంతినే వలబంతినే' అంటూనే పలు హొయలొలికించే లలామ సత్యభామ. గంగ పొంగు వంటి అంగ భంగిమలతో, నింగి రంగుల్లాంటి లీలా విలాసాలతో ఆమె నర్తిస్తున్నంతసేపూ... కవి భుజంగరాయశర్మ గళంనుంచి జాలువారినట్లు- అది నయన మనోహరమే, నవమోహనాభిరామ దృశ్యకావ్యమే. సంప్రదాయ కూచిపూడి అయినా రాగతాళ మిళిత భరతనాట్యమైనా హస్తలక్షణ సంపన్న కథాకళి, పాద ప్రాధాన్య కథక్, లాస్యపూరిత మణిపురి... పేరు ఏదైనా, ప్రక్రియ ఏ ప్రాంతానిదైనా- నాట్యమెప్పుడూ సార్వజనీనం, సార్వకాలికం. అన్నమాచార్య కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, జయదేవ అష్టపదులు, నారాయణతీర్థుల తరంగాలు- ఒకటనేమిటి... ప్రతి ఒక్కటీ సమైక్యతా సాధనం, సమగ్రతా సాధనకు మూలకారకం. విజ్ఞాన వికాసాలందించే అధ్యయన, నాట్యాలే మానసిక ఆనందాన్నీ సామాజిక ప్రయోజనాన్నీ విస్తరిస్తాయన్నాడు ఫ్రెంచి రచయిత వోల్టేర్. నాదం ఝుమ్మంటే సై అనని పాదముంటుందా? 'చక్కని గోపాలా, చేతికి చిక్కని గోపాలా!/ అక్కడ ఇక్కడ చెక్కుల చెలి పలుకుల/ నొక్కుల గోపాలా! చెలి పలు నొక్కుల గోపాలా!' అంటూ మాధవీయ కృతికర్తలా సందడించే లలనామణి వీక్షణమూ నేత్రపర్వమే కదా? ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలతో పాటు హితాన్నీ యశాన్నీ సమకూర్చే నృత్తమే ప్రత్యేకించి భారతీయతకు ప్రతీక, సాంస్కృతిక ప్రాభవానికీ సూచిక. హృదయ అనువర్తనంగా, సదా ఉల్లాససాధక ఔషధంగా కలకాలం నిలిచే జనజీవన నవ సంజీవని అది. శాస్త్రబద్ధత, కళాత్మకత రంగరించిన జానపద, ఆధునిక నృత్యరీతులతో అంతిమంగా లభించేది బహురస వృద్ధి, సమరస సమృద్ధి. రసజ్ఞ ప్రేక్షకుల కరతాళధ్వనులే నర్తకులకు- సిరివెన్నెల అన్నట్లు 'వికసిత శతదళ శోభిత సువర్ణ కలశాలు'. రమణీయమైన ఏ కళా ఆవిష్కరణకైనా పరమార్థం హృదయానందమే. దానికి సమాజశ్రేయమూ తోడుకావడమంటే, స్వర్ణానికి సుగంధం జతపడటం. లలితకళారాధనలో మధుర భారతి పదసన్నిధిలో ఆ నర్తనం, వీక్షణం కూడా బహుధా ధన్య చరితమే. అన్నింటికంటే గొప్ప విజయం- దాన్ని అందరూ గుర్తించడం. అందుకే గుర్తింపు, గౌరవం కోరుకునే నాట్యాచార్యులూ కళాకారులకు ప్రతి బహూకరణా ప్రతి పురస్కారమూ వారి మానస సరోవరాన విరిసిన కమల సమానం.
మనిషి మనసు మాట్లాడటమే నాట్యమన్నారు అమెరికా నర్తకులు మార్థా గ్రాహం. మాటలకందని మధురభావనగా వర్ణించిన భారతీయ నాట్యగురువులు రంగస్థలినే మనోమందిరంగా భావించారు. 'హరిచరణం మమశరణం భవతరణం హితధరణం ప్రియవరణం శ్రితకరుణం' అన్నప్పుడు పద్మావతీ శ్రీనివాసుల్ని భజించే మహర్షి కళ్లముందు కదలాడతాడు. సమర రంగాన చండప్రచండులు కావాలని ఉత్తేజగీతి ఆలపించేటప్పుడు తన సేనను కదంతొక్కించే రాణీ రుద్రమ ఉగ్రరూప దర్శనం స్ఫురిస్తుంది. 'సుజనావన రుజుభావన త్రిజగన్నుత చరితా! రజనీచర రణభీకర విజయోత్సవ భరితా!' అని రామాయణ కవి సంభావించేప్పుడు రఘునందన రూపం చూపరుల ముందు నిలుస్తుంది. జనకుడి కొలువున అలనల్లన సాగిన జానకి, కోరి పిలిపించుకున్న వేణుధరుడి వెంట ప్రణయ రథయాత్ర సాగించిన రుక్మిణి నర్తనల్నీ చూసి తరించని మది అంటూ ఎక్కడైనా ఉంటుందా? పతి సన్నిధానాన ఒదిగి ఉండే గౌరి, ఆ పతి సిగ నుంచి ఎగిరి పడే గంగ... నర్తన రూపాలు అనేకం. ప్రణయరాగ వాహినినీ స్వరసుర ఝరీ తరంగాన్నీ ఏకకాలంలో చూపగలిగిన చాతుర్యం వేదికమీద ఎంతగానో జీవించే భారత నర్తకులది. అక్షరాలు కొన్నే అయినా కావ్యాలు లెక్కలేనన్ని. అదే తీరులో, అడుగులు రెండే అయినా దేశవిదేశాల్లో ఎందరెందరినో మురిపించే నాట్యవిన్యాసాలు మరిన్ని. అంతటి మేటి నృత్య దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిన నిర్వహించుకున్న 28,ఏప్రిల్ శుభతరుణం కళామతల్లికి నిఖిల ప్రజ నీరాజనం.
(ఈనాడు , సంపాదకీయం ,28:04:2013)
__________________________________
Labels: art, Liesure/Telugu, Life/telugu
0 Comments:
Post a Comment
<< Home