1233 -అందమైన ప్రతినాయకుడు
ఓ కన్ను చిన్నదిగా చేస్తూ మరో కనుబొమ్మని ఎగరేస్తూ కథానాయకులకు సవాల్ విసిరితే చాలు... ఆ సన్నివేశం పండిపోవల్సిందే. దీటైన విలనిజం ఉన్నప్పుడే హీరోయిజం ఉచ్ఛస్థాయిలో కనిపిస్తుందన్నది సినిమావాళ్లు నమ్మే మాట. అందుకే హిందీలో కథలు, కథానాయకులు, సన్నివేశాలు ఇలా అన్నీ మారినా ప్రాణ్ మాత్రం మారేవారు కాదు. ధర్మేంద్ర, రిషికపూర్, అమితాబ్, రాజేష్‌ఖన్నా, దేవానంద్... ఇలా కథానాయకుడు ఎవరైనా సరే - వారికి ప్రత్యర్థిగా ప్రాణ్ ఉండి తీరాల్సిందే. దుష్టపాత్ర అనగానే దర్శకనిర్మాతలు, కథానాయకులు నిస్సందేహంగా ప్రాణ్‌వైపు మొగ్గుచూపేవారు. ఆ పాత్రలపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. ప్రతినాయకుడంటే ఇలాగే ఉండాలన్న సిద్ధాంతాన్ని మార్చిన నటుడు ప్రాణ్. హీరోల్ని మించిపోయే అందం ఆయన సొంతం. వాడైన చూపులు, గంభీరమైన స్వరంతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసేవారు.
ఆ పేరంటేనే భయం...: నాసిర్ హుస్సేన్ చిత్రం 'ఫిర్ వహి దిల్ లాయా హూ' చిత్రీకరణ జరుగుతోంది. అందులో కథానాయకుడు జాయ్ ముఖర్జీ. ప్రతినాయకుడు ప్రాణ్. షూటింగ్‌ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ గుంపుని నియంత్రించడం చిత్ర బృందానికి చేతకాలేదు. ఓ పక్క షాట్ రెడీ అయ్యింది. అయినా జనం మాత్రం దూరం జరగడం లేదు. ఇక చేసేదేం లేక దర్శకుడు విషయాన్ని ప్రాణ్‌కి చెప్పారు. ప్రాణ్ ఒక్కసారిగా జనం ముందుకు వెళ్లారు. తనదైన శైలిలో ఒక్క ఉరుము ఉరిమారు. అంతే... అంతటా నిశ్శబ్దం. షూటింగ్ సజావుగా సాగిపోయింది. పూర్తయ్యాక వారందరినీ పిలిచి క్షమాపణలు చెప్పారు. ఆ రోజుల్లో ప్రాణ్ ముద్ర అలా ఉండేది. తమ పిల్లలకు ఆ పేరు పెట్టడానికి కూడా తల్లిదండ్రులు వెనకాడేవారు. ఆ కరకు కంఠం, క్రూరత్వం నిండిన కదలికలు ప్రేక్షకుల్ని భయకంపితుల్ని చేసేవి. ప్రేక్షకులే కాదు... కథానాయికలు సైతం ప్రాణ్‌ని చూసి భయపడేవారు. ఆయన ఏదైనా ఓ హోటల్‌లో దిగారంటే... కథానాయికలు అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేసేవాళ్లు కాదట. అయితే ఒక్కసారి ఆయనతో పరిచయమయ్యాక మాత్రం ఆ వ్యక్తిత్వాన్ని అందరూ ఇష్టపడేవారని చెబుతుంటారు.
కంటతడి కూడా...: కేవలం ప్రతినాయక పాత్రలతోనే ప్రాణ్ సరిపెట్టుకోలేదు. క్రమంగా పరిణతి చెందిన సహాయక పాత్రల్లోకి మారిపోయారు. వినోదాన్ని పండించడంతోపాటు, కరుణరసం ఒలికించే పాత్రల్లోనూ ఒదిగిపోయారు. 'ఉప్‌కార్' చిత్రంలో మాజీ సైనికుడు మలంగ్ చాచా పాత్రలో కనిపించి ఇటు పరిశ్రమను, అటు ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. హృదయాల్ని ద్రవింపజేసేలా కరుణరసం ఒలికించగలనని ఆ పాత్రతో చాటిచెప్పారు. హిందీలో అడుగుపెట్టిన తొలి యేడాదిలోనే 22 సినిమాల్లో నటించారు ప్రాణ్. అందులో 18 సినిమాలు ఒకే యేడాదిలో విడుదలయ్యాయి. దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ముంబయికి మకాం మార్చాక ఆయన కెరీర్ కాస్త నెమ్మదించింది. దేవానంద్‌తో కలిసి 'జిద్దీ' సినిమా చేశాక ప్రాణ్ సినీ జీవితం మళ్లీ కళకళలాడింది. ఒక దశలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఖరీదైన నటుడిగా మారిపోయారు. రాజేష్‌ఖన్నా తర్వాత అత్యధిక పారితోషికం ప్రాణ్‌కే దక్కేదట.
విలువలున్న వ్యక్తిత్వం...: సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ గడపడం ప్రాణ్ అలవాటు. ఓసారి మాత్రం ముభావంగా కూర్చుని ఆలోచిస్తూ కనిపించాడు. దర్శకుడు విషయాన్ని ఆరా తీశాడు. ప్రాణ్ సోదరుడు మరణించాడని ఆయనకి తెలిసింది. ఆ విషయం చిత్రబృందానికి తెలిస్తే పని రద్దు అవుతుందనీ దీనివల్ల నిర్మాత నష్టపోతాడనీ ప్రాణ్ ఆ విషయాన్ని మనసులోనే దాచుకొన్నాడు. యథావిధిగా చిత్రీకరణలో పాల్గొన్నారు. పూర్తయ్యాక సోదరుడి అంతిమ సంస్కారాలకు వెళ్లాడు. వృత్తిపట్ల అంత నిబద్ధత కలిగిన వ్యక్తిత్వం ఆయనది. క్రమశిక్షణ, సమయపాలన విషయాల్లో చాలా నిక్కచ్చిగా వ్యవహరించేవారని ప్రాణ్‌కి పేరుంది. చేసేవి దుష్ట పాత్రలే అయినా... సంభాషణలు మాత్రం అసభ్యంగా ఉండకూడదని రచయితలకు ముందుగానే సలహా ఇచ్చేవారట. తన సహచర నటులు సరిగ్గా నటించడం లేదని తెలిసినప్పుడు... వారి మనసుని నొప్పించకుండా తగిన సూచనలు చేసేవారట. పాత్రల్లో కాఠిన్యం కనిపించినా... ప్రాణ్‌లో వేదాంత ధోరణి ఎక్కువనీ హిందీ సినిమావర్గాలు చెబుతుంటాయి. ''జీవితమనేది ఎవరి చేతుల్లో లేదనీ, భగవంతుడిని నమ్ముకోవడమే మానవ విధి'' అని తన దగ్గరికి వెళ్లేవాళ్లకి చెప్పేవారట.
మన తెరపైనా...
దక్షిణాది చిత్రపరిశ్రమతోనూ ప్రాణ్‌కి అనుబంధం ఉంది. తెలుగులో 'తాండ్ర పాపారాయుడు', 'కొదమ సింహం' చిత్రాల్లో నటించారు. కన్నడలో 'హోసరాగ' అనే చిత్రంలో నటించారు. సిగార్ పైపును నోట్లో పెట్టుకొని రింగురింగులుగా పొగను వదులుతూ దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించాడు ప్రాణ్. 'తాండ్ర పాపారాయుడు'లో బుస్సీ అనే పాత్రలో నటించి మెప్పించారు. ప్రాణ్ క్రీడలపై కూడా ఎంతో అభిమానాన్ని ప్రదర్శించేవారు. బాండే డైనమోస్ ఫుట్‌బాల్ క్లబ్ పేరుతో సొంతంగా ఓ ఫుట్‌బాల్ టీమ్ కూడా ప్రాణ్‌కి ఉండేది. కపిల్‌దేవ్ ఫాస్ట్‌బౌలర్‌గా అరంగేట్రం చేసినప్పుడు అతనికి ఇంగ్లాండ్‌లో శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వచ్చిన క్రీడాభిమాని ప్రాణ్.
ఆయన జ్ఞాపకాలు మరువలేనివి...
''భారతీయ సినిమాకు ఆణిముత్యం లాంటివారాయన. ఆయన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. భారతీయ సినిమా ఓ మంచి నటుడిని కోల్పోయింది.''
- డా||డి.రామానాయాడు, నిర్మాత
''తాండ్ర పాపారాయుడు సినిమాలో బుస్సీ పాత్ర పోషించిన ప్రాణ్‌తో 20 రోజుల పాటు కలిసి పనిచేశాను. ఆయనకు వేరే వసతి సౌకర్యం ఏర్పాటు చేసినా మాతోపాటు కలిసే ఉన్నారు. కలివిడిగా, నిరాడంబరంగా ఉండే ఆయన జ్ఞాపకాలను ఎన్నటికీ మరువలేను''
- కృష్ణం రాజు, నటుడు
''కొదమ సింహంలో ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. దేశం గర్వించే నటుడాయన. ప్రతినాయకుడిగానే కాదు, సహాయ నటుడిగానూ చిరస్మరణీయమైన పాత్రల్ని పోషించారు''
- చిరంజీవి, నటుడు, కేంద్ర పర్యాటక సహాయమంత్రి(స్వతంత్ర)
''ఆయన్ని జెంటిల్మెన్ విలన్ అని పిలుచుకోవాలి. సెట్లో ఆయన అంత వినమ్రంగా ఉండేవారు. ఆయనతో 'కొదమ సింహం' సినిమాకి పనిచేశా. మా సొంత నిర్మాణ సంస్థలో తీసిన సినిమా అది. ఆయన కాంబినేషన్‌లో సీన్ రావడానికి టైమ్ పట్టేది. అయినా సరే మేకప్ వేసుకొని గంటలకొద్దీ నిరీక్షించేవారు. 'మీ కోసమే కదా పనిచేస్తున్నా. మీరెప్పుడు రమ్మంటే అప్పుడు కెమెరా ముందుకు రావడం నా విధి'' అనే వారు. నిర్మాతల గురించి కూడా ఆలోచించడం సంతోషంగా అనిపించింది''
- కైకాల సత్యనారాయణ
''భారతీయ సినిమా విలనిజంలో ప్రాణ్ ఓ శిఖరంలాంటివారు. ఆయన స్థాయికి చేరుకోవడానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఆయన నటించిన చిత్రాల్లో 'జంజీర్' గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆయన పోషించిన పాత్రలో ఇప్పుడు నేను నటించడం గర్వంగా ఉంది. మా సినిమాని చూపించి ఆయన ఆశీస్సులు పొందాలనుకొన్నాను. కానీ కుదరలేదు. ప్రాణ్ నటనను ఆదర్శంగా తీసుకొని నేను ఈ స్థాయికి చేరుకొన్నాను''.
- శ్రీహరి
''చిత్రసీమ ఓ గొప్ప నటుణ్ని కోల్పోయింది. బాలీవుడ్‌కే తలమానికం ప్రాణ్. ఆయనతో కలిసి 'జంజీర్'(1973), 'డాన్'(1978), 'కాలియా'(1981) చిత్రాల్లో నటించాను. ఆ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నా''
- అమితాబ్ బచ్చన్
''భారతీయ సినిమా చరిత్రలో ఓ అధ్యాయం ప్రాణ్. పాత్రల్లో ఒదిగిపోయి నటించడం ఎలాగో ప్రతి ఒక్కరూ ఆయన్ను చూసి నేర్చుకోవచ్చు''
- షారుఖ్ ఖాన్
''ప్రతినాయకుడి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు ప్రాణ్. విలన్ అంటే ఇలానే ఉండాలి అనే మాటకు నిలువెత్తు రూపం ఆయన. యావత్తు భారతీయ ప్రేక్షకులందరికీ ఆయన మరపురానిప్రతినాయకుడు''
- కబీర్ బేడీ
''హిందీ చిత్రసీమకు ఆయన ఒక వరం. బాలీవుడ్ స్వర్ణయుగం అనిచెప్పుకొనే రోజుల్లో ఆయన నటించిన సినిమాలు ఎంతో మందికి మార్గదర్శకం''
- కరణ్ జోహార్
''ప్రతినాయకుడికి నిర్వచనం ప్రాణ్. ఆయన 'జంజీర్' సినిమాలో పోషించిన విలన్ పాత్రను నేను ఇప్పటి 'జంజీర్'లో పోషించడం ఎంతో గర్వంగా ఉంది''
- సోనూ సూద్
''ఆయన చేసిన సినిమాలన్నీ చూశాను. విలన్ పాత్రల్లోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు''
- అర్జున్ రామ్‌పాల్
''ఈ లోకంలో ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా''.
- బొమన్ ఇరానీ
''ఈ రోజుల్లో ప్రతినాయకులు... నాయకులకు దీటుగా ఉన్నారంటే దానికి కారణం ప్రాణ్. అందుకు ఆయనకు తలవంచి నమస్కరిస్తున్నా''
- మనోజ్ బాజ్‌పాయ్
''హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్న ప్రతినాయకుడు ప్రాణ్. ఆయన మన మధ్యన లేకపోవడం బాధాకరం''
- అనుపమ్ ఖేర్
''చిత్రసీమలో లెజెండ్ ప్రాణ్. ఆయన నటించిన 'జంజీర్'కు రీమేక్‌గా వస్తున్న తాజా 'జంజీర్'లో నేను నటించడం ఆనందంగా ఉంది. కానీ నేడు ఆయన ఈ లోకంలో లేనందుకు ఎంతో బాధపడుతున్నాను''
- ప్రియాంక చోప్రా
(ఈనాడు సినిమా , 15:07:2013)
______________________________
Labels: Cinema/ Hindi, Events, Liesure/Telugu, nostalgia, Personality
0 Comments:
Post a Comment
<< Home