1275- తెలుగు జాతిరత్నం
శోకం- శ్లోకం పలికితే రామాయణం. ఆకలి- అక్షరాభ్యాసం చేస్తే తెలుగువారికొక జ్ఞానపీఠం! పనసపండు తన రహస్యాన్ని పరిమళం రూపంలో చెప్పినట్లుగా, రచయితలు తమ ఆకలిని అక్షరాల రూపంలో ఈ లోకానికి వివరిస్తారు. అక్షరాలతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్షరాలతోనే ఆత్మారాముడు తృప్తిచెందినట్లు భావిస్తారు. అక్షరాలకు అంజలి ఘటిస్తారు. తమ నుంచి అక్షరాలను వెలువరిస్తోంది కనుక ఆకలినీ గౌరవిస్తారు. 'ఆకలి నా రచనలకు ప్రేరణ' అని సగౌరవంగా ప్రకటించడంలో రావూరి భరద్వాజ స్ఫురద్రూపిగా కనిపిస్తారు. ఆకలి ఆయనను జ్ఞానిని చేసి పై మెట్టుపై కూర్చోబెట్టింది. జ్ఞానపీఠాన్ని కట్టబెట్టింది. ఆకలిని గౌరవించడమంటే అట్టడుగు వర్గాన్ని గౌరవించడమే! అత్యున్నత జ్ఞానపీఠాన్ని అందుకున్నప్పుడు భరద్వాజ అదే చెప్పారు. 'నేను సామాన్యుణ్ని... గట్టిగా చెప్పాలంటే అంతకన్నా తక్కువవాణ్ని' అన్నారాయన. పిడికెడు మెతుకులకోసం ఆయన వ్యవసాయకూలీగా పనిచేశారు. పశువులు కాశారు. బొగ్గుపనిలో మాశారు. పేపర్లు వేశారు. కలప అడితిలో, కమ్మరి కొలిమిలో, పొగాకు కొట్టులో పనిచేశారు. ఆకలి అన్ని పనులూ నేర్పింది! ఏడో తరగతి మానేసిన కుర్రాణ్ని జీవితం చదువుకున్న గొప్ప విద్యావంతుణ్ని చేసింది. పదిహేడేళ్లకే రచయితను చేసింది. సాహిత్య అధ్యయనాన్నే విద్యాభ్యాసంగా మార్చింది. బతుకు పుస్తకాలను చదివించింది. రాయించింది. 'నాకు సంబంధించి నా జీవితానికి, రచనకు వైరుధ్యం లే'దని చెప్పిన రావూరి భరద్వాజ- సహస్ర వృత్తుల శ్రమజీవుల జీవన సమరాన్ని గుండెలకు హత్తుకొనేలా అక్షరీకరించిన ధన్యజీవి!
చూసినవారి గురించే రాశాడాయన. 'జీవనసమరం' దానికి గట్టి సాక్ష్యం. అందులో పాత్రలు అందరికీ పరిచయమైనవేగాని, వాటిని చిత్రించడం మాత్రం భరద్వాజకే సాధ్యం. అట్టడుగు వర్గమంటే సాంఘిక అసమానతలకు గుర్తు. అణచివేతకు, అవమానాలకు ఆలవాలం. ఆకలి దహిస్తుంటే... ఆక్రోశం, అణిచివేస్తుంటే- ఆందోళన సహజం. ఆ రెండూ అక్షరరూపం దాల్చినప్పుడు ఆ అక్షరాల్లోంచి మాడుతున్న పేగు వాసన ఉబికివస్తుంది. రావూరి రచనల్లోని జీవలక్షణం ఆ ఘాటువాసనే! సమాజంలోని అట్టడుగు జీవుల్ని సాహిత్యలోకపు అందలాలెక్కించిన భరద్వాజ రచనల్లో- రాగిణి, కొత్తచిగుళ్లు, కాదంబరి, నాలోని నీవు, అంతరంగిణి, ఐతరేయం, ఒకింత వేకువకోసం, పదహారు నెలలపాటు 'ఈనాడు' దినపత్రికలో ధారావాహికగా ఆకట్టుకున్న 'జీవనసమరం'... వంటివన్నీ ఒక ఎత్తు. ఆయనకు జ్ఞానపీఠాన్ని అందించిన 'పాకుడురాళ్లు' మరో ఎత్తు. అందులో రంగస్థల సహజ జీవి 'మంగమ్మ'- తళుకుబెళుకుల సినీతార 'మంజరి'గా తర్జుమా అయిన తీరు విషాద రమణీయం. అందులోని అక్షరాలు అంతరంగ లోతట్టు పొరల గవాక్షాలు. గుండెపొరల్లోంచి విచ్చుకున్నవి కాబట్టి, వాటి తడి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ రచనకారచన ప్రత్యేక శైలితో, విభిన్న ధ్వనులతో, కాకువు విశేషంతో మనలను పలకరిస్తుంది. రచయితగా భరద్వాజ స్థాయిని నిరూపిస్తుంది. రావూరి జీవితానికి గట్టి ఓదార్పు అక్షరం. ఆయన జీవితానికి తీర్పు అక్షరం. అక్షరం ఆసరాతో మనసు తేలికపడ్డ ప్రతి రచయితలాగే- భరద్వాజ సైతం అక్షరానికి నివాళి అర్పించారు. అక్షరానికి జీవితాన్ని ముడుపుకట్టి దాని నీడన ఆశ్రయం పొందారు.
రావూరి జీవితానికి మరో చల్లని నీడ- ఆయన భార్య కాంతం! కాంతాన్ని- కాంతమ్మా అని పిలవడం భార్యగా ఆమె సాధించిన గొప్ప గౌరవం. 'భగవంతుడు కూడా నీ రూపంలో కనబడితే తప్ప నేనిప్పుడు గుర్తించలేను కాంతం' అన్న భరద్వాజ- 'నేనిప్పుడు నిరీహస్థితిలో ఉన్నా'నంటూ చేసిన అక్షరార్చన అజరామరం! ఆమె మరణం ఆయన చేత స్మృతికావ్యాలు రాయించింది. అక్షర నీరాజనాలు పలికించింది. మాడుతున్న పేగు వాసనలాగే మట్టి వాసన కూడా ఆయన సాహిత్య జీవలక్షణం. 'పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం నడిచివచ్చిన పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం దారిచూపిన పాదాలకు కృతజ్ఞతలు... నన్ను అనుసరించిన పాదాలకు కృతజ్ఞతలు' అన్నాడొక కవి. రావూరి చితికట్టెల చిటపటలు కూడా బహుశా అవే మాటలను వినిపించి ఉంటాయి. మరింత నిశితంగా వినిఉంటే, ఆ చితిమంటల సవ్వడి నుంచి 'మంగమ్మ'కు కృతజ్ఞతలు...' అనీ తప్పక వినపడే ఉంటుంది. ఆమె 'మంజరి'గా మారకుంటే 'పాకుడురాళ్లు' నవలా లేదు, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠమూ లేదు. జీవితంలో మేలుచేసిన ప్రతి సందర్భానికీ, ప్రతి వ్యక్తికీ, పదేపదే ధన్యవాదాలు చెప్పుకొన్న భరద్వాజ- తన చరమదశలో విశ్వనాథ, సినారెల సరసన చోటుకల్పించిన ఆ స్త్రీమూర్తికి తప్పక కృతజ్ఞతలు చెప్పినతరవాతే అనంతవాయువుల్లోకి ప్రయాణం సాగించి ఉంటారు. పల్చని దేహంతో, నెరిసిన గెడ్డంతో అచ్చతెనుగు రూపురేఖలతో ఆంధ్రదేశాన్ని అలరించిన రావూరి భరద్వాజ తన ఆరోప్రాణం దగ్గరికి పరుగెత్తిన పతి... మనకిక తీయని స్మృతి. తెలుగుజాతికి మరో జ్ఞానపీఠం దక్కడానికి అవసరమైన స్ఫూర్తి! 'ఆవిరి ఓడలో జలధియానమొనర్చు బాటసారులు'గా వర్ణించాడు- మనుషుల్ని మహాకవి జాషువా. ఎవరి రేవు రాగానే వారు దిగి వెళ్ళిపోతుంటారు. రావూరి భరద్వాజ దిగవలసిన రేవు వచ్చింది. ఆయన దిగి వెళ్ళిపోయాడు- నిశ్శబ్దంగా!
(ఈనాడు, 20:10:2013)
__________________________
Labels: Life/telugu, Telugu language, Telugu literature, Telugu literature/personality
0 Comments:
Post a Comment
<< Home