1315-వంటా ఓర్పూ!
మనమూ మనదీ... అనుకోవడమే దాంపత్యం. మల్లాదివారన్నట్లు, తాంబూలంలా దాంపత్యమూ ఆద్యంతం రసవంతం. 'దంపతి తాంబూలంబులు/ చెంపలు దువ్వుటలు, పూలచెండ్లాటలు, క/వ్వింపులు, వదినల ముక్తా/యింపులు, నెచ్చెలుల హెచ్చరింపులు' వంటివెన్నో వధువుకూ వరుడికీ మొదట్లో అనుభవాలవుతాయి. వివాహానంతర జీవనయానంలో అలకలు, కలతలు, ఆటుపోట్లు, సర్దుబాట్లు అన్నీ అలవాటుగా మారి భిన్నత్వాన్నీ రుచిచూపిస్తాయి. ఎన్ని స్థితిగతులు ఎదురైనా 'ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము/ ఇదిగాక వైభవమ్ము ఇలనొకటి కలదా?' అనే ఐక్యభావనే ఇద్దరినీ ఎప్పుడూ ఒక్కటిగా ఉంచుతుంది. కొత్తగా వచ్చినభార్య చేతివంట జిహ్వను తీర్చినా, చిన్నప్పుడు తల్లిపెట్టిన గోరుముద్దే అతని జీవితాంతం వెన్నంటి ఉంటుంది. అమ్మ చేతిముద్ద, నాన్న వాత్సల్యాన్ని మించిన ఆనందానుభూతి పిల్లలకు ఇంకేముంటుంది? తల్లి మరపించి మురిపించి నోటికందించిన గోరుముద్దలతో పొంగి పులకించాడు బాలరాముడు. యశోదమ్మ కొసరి కొసరి తినిపించిన వెన్నముద్దలతో మహదానంద భరితుడయ్యాడు చిన్నికృష్ణుడు. 'పనస తొనలకన్న పంచదారకన్న/ జుంటి తేనెకన్న జున్నుకన్న/ చెరకురసముకన్న మిన్న' అమ్మ ముద్ద. ఆ మాధుర్యధార వల్ల కాబోలు- శ్రీరామకథ సుధా రసార్ణవమైతే, శ్రీకృష్ణ చరిత అనంత లీలా తరంగితంగా వెల్లివిరిసింది. ఉగ్గుగిన్నెలు మొదలు ముద్దకుడుములు, చక్కెర చిలుకలు, బొబ్బట్లు, అరిసెలు వరకు బాల్యమంతా విందులూ పసందులూ. త్రిమూర్తులనే వంటింట పసికందులుగా చేసుకొన్న అనసూ యమాత చేతి తాలింపు కమ్మదనం లోకాలన్నింటా ఘుమాయించింది. ఒక్క బాల్యమనే ఏమిటి... జీవితచక్రంలోని వివాహ కుటుంబాది సంబంధ బాంధవ్యాల్లో, ఆచార సంప్రదాయాలు మిళితమైన సమాజ స్వరూప స్వభావాల్లో వంట ఓ విద్య, కళ, శాస్త్రం. నాడు పసిపాపడి కోసం తపించిన గ్రామీణ వనిత సుజాత 'తియ్యగా వండిన పాయసమ్ము గొనివచ్చితి, చవులుపుట్ట భుజించి అనుగ్రహింపవే' అంటూ బుద్ధదర్శనం చేసుకొంది. సుగంధపూర్ణమైన ఆ మధురాన్నం అమృత తుల్యంగా తోచిందా బుద్ధదేవుడికి!
అరవైనాలుగు కళల్లో పాకశాస్త్రం, అరవైనాలుగు విద్యల్లో పాక చమత్కారం సుస్థిరస్థానం సంపాదించాయి. చతుర్విధ అగ్నుల్లో జఠరాగ్ని ఒకటి; పంచామృతాలుగా నెయ్యి, తేనె, చక్కెర, పెరుగు, పాలు మధురాతిమధుర ద్రవ్యాలు. పంచశుద్ధుల్లో ఒకటి భాండశుద్ధి. సందర్భాన్నిబట్టి 'ఇంటి పరిశుద్ధి ఎల్లప్పుడు ఇంతి వలన నిలబడును గాని, మగవాని వలన గాదు' అన్న పానుగంటివారి మాట ఇక్కడ తలంపుకొస్తుంది. 'పురుషుల భాగ్యమున్ చిగురుబోణుల చిత్తములెట్లు మారునొ' అని రుద్రకవి ఓ సందర్భంలో కాస్తంత సందేహించారు. తిరుపతి వేంకటకవులు భావించినట్లు 'పడతులు చేయింపలేని పనులుం గలవె' అన్నది బహుశా బహుజనామోదమే. ఇంటిల్లపాదికీ వండి వడ్డించటంలోనే కాదు- అతిథిజనులకు ఆతిథ్యమివ్వటంలోనూ ఇల్లాలిది కీలకపాత్ర. 'నేనూ నీ వెంటనే ఉన్నా'నంటూ ఇంటాయనా ఆ బాధ్యతలు పంచుకుంటే ఆ సంతృప్తి, ఆ సంతోషం షడ్రుచులూ నవకాయ పిండివంటలంత విశేషానుభూతి. సప్తవిధ రసాల్లోని తీపి, పులుపు, ఉప్పు, కారం, ఘాటు, చేదు, వగరులే కుటుంబ జీవితానికీ ప్రతీకలు. స్త్రీ పురుషుల రుచులూ అభిరుచులూ కలగలసినచోట 'భోజనస్వామ్యం' వర్ధిల్లడం తథ్యం. 'వంటచేయలేనివాడు మగడా?' అనే ప్రశ్న తలెత్తినప్పుడు నలభీములు ప్రత్యక్షంకావడం అంతకన్నా సహజం. బాహుకుడుగా నలమహారాజు, వలలుడుగా భీమసేనుడు వండి వడ్డించిన వంటకాలు వారి అనుపమాన పాక పటిమకు ప్రత్యక్ష తార్కాణాలు. 'కలిగె మార్పులెన్నొ కాల ప్రభావాన/ఇంట సతికి సాయమీయవలెను' అన్నప్పుడే పురుషుల బాధ్యతలు ముందు వరసలో నిలుస్తాయి!
'వంట చేయడం బ్రహ్మవిద్యా?' అని తూలనాడే పురుషులు సైతం కమ్మనైన రుచులకు దాసోహమంటూ 'అది అమ్మ విద్యే' అని తలూపక మానరు. 'పదునుగ మంచి కూర నలపాకము చేసినయైన/ అందు ఇంపొసగెడు ఉప్పులేక రుచి చేకూరునటయ్య' అని భాస్కరశతక కర్త పలికిన హితవులో అర్థపరమార్థాలు వేరు. ఇంట్లో తప్పొప్పులు/ ఉప్పొప్పులు తెలిసిన పురుషుడే ఘనుడన్నది అంతస్సారం. 'భార్య సుతుల మిత్ర బంధుల నితరుల/ ఉప్పు తీపు పులుపు రుచులు సమమై/ వండి వైశిష్ట్య భక్ష్యాల వంటచేయువాడె ఉత్తముండు' అన్నది భర్తకు ఆధునిక కవి ఇచ్చిన నిర్వచనం. ఇంట ఉత్తమపతిగా సత్తాచాటుకొనే పురుషోత్తముడికి అదేమంత బరువు కాదు- అదో ఆటవిడుపు! ఓ కవి వర్ణించినట్లు- 'ప్రాణనాథుడు భార్యపక్షమై యుంటేను/ మిన్ను విరిగిన గాని మీద పడదు' మరి. అంతేకానీ భానుమతీ రామకృష్ణ 'అత్తగారి'లా 'అన్నీ తెలుసనుకునే ఏమీ తెలియని మనిషి'లా ఉంటే తంటా తప్పదంతే. ఈకాలం అమ్మాయిలూ వంటింటి మొనగాళ్లనే భర్తలుగా కోరుకుంటున్నారు. ఉన్నత చదువుల్లోని యువతుల్లో సగంమందికి పైగా 'వంటచేయడం వచ్చిన అబ్బాయిలనే మనువాడుతా'మంటున్నారు. 'సమయానికి తగు మాటలాడి' అన్నట్లు సందర్భానికి తగిన వంటలు చేసే శ్రీవారితోనే జీవితానందం ఉందని వనితలెందరో గట్టిగా నమ్ముతున్నారు. ఒక వివాహవేదిక సంస్థ అంతర్జాలంలో నిర్వహించిన అభిప్రాయ సమీకరణ సారాంశమిది. వంటింటి సామ్రాజ్యానికి ఆమె మహారాణిగా, అతను మహారాజుగా వ్యవహరించడమే- దాంపత్య మధురిమ!
ఈనాడు .18:11:2013
________________________
Labels: Family, Indians/ Telugu, Knowledge, Self development
0 Comments:
Post a Comment
<< Home