1331- ధన్యజీవి అక్కినేని!
సినీ కళామతల్లి గర్భశోకంతో తల్లడిల్లుతున్న వేళ ఇది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ వందేళ్ల ఉత్సవాల్నీ చూసే అదృష్టం దక్కిందంటూ నాలుగు నెలలనాడు మురిసిపోయిన తొంభయ్యేళ్ల పసివాడు అక్కినేని మరి లేరన్న దుర్వార్త తెలుగువారి గుండెల్ని పిండేస్తోంది. 1931లో మాటలు నేర్చిన తెలుగు వెండితెరను స్వర్ణయుగానికి తోడ్కొని వెళ్ళిన నవరస నటనా ధురీణులు ఎన్టీఆర్, అక్కినేని. పద్దెనిమిదేళ్ల క్రితం నటసార్వభౌముడి హఠాన్మరణం దరిమిలా తెలుగు చిత్రసీమకు ఏకైక పెద్దదిక్కుగా ఉన్న అక్కినేని ఇప్పుడు క్యాన్సర్ సోకి పరమపదించడంతో వెండితెర విలపిస్తోంది. ప్రతి తెలుగు లోగిలీ నిశ్శబ్దంగా రోదిస్తోంది. ఆంధ్రులు ఆరంభ శూరులన్న అపప్రథను తుడిచిపెట్టిన సమున్నత వ్యక్తిత్వం అక్కినేనిది. 'స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య' అంటూ తన బలాబలాల్ని అంచనా వేసుకొని కూడా ఏటికి ఎదురీది ఆయన సాధించిన రికార్డులు, రివార్డులు లెక్కలేనన్ని! '1974లో, 1988లో గుండెజబ్బుతో పోరాడి విజయం సాధించాను... ఇప్పుడు క్యాన్సర్‌ను జయించి మూడో రికార్డు కొట్టబోతున్నా... అందుకు అభిమానుల ఆశీర్వాద బలం కావా'లని విలేకరుల సమావేశం పెట్టిమరీ అక్కినేని స్వీయ అనారోగ్యాన్ని వెల్లడించారు. ఇటీవల యువరాజ్ సింగ్, మనీషా కొయిరాలా వంటివారు క్యాన్సర్‌ను జయించిన నేపథ్యంలో అక్కినేనీ తప్పక కోలుకొంటారనే అభిమానులంతా విశ్వసించారు. క్యాన్సర్‌ను తాను మనోబలంతో జయిస్తానని, ప్రజల ఆశీర్వాద బలంతో సెంచరీ కొట్టి మళ్ళీ ఇలా విలేకరుల భేటీ ఏర్పాటు చేస్తానని ధీమాగా చెప్పిన అక్కినేని గళం అర్ధాంతరంగా మూగవోయింది. గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని అక్కినేనిలా పూర్ణారోగ్యంతో నలభై ఏళ్లు జీవించినవాళ్లు ప్రపంచంలోనే లేరు. తొంభయ్యేళ్ల ముదిమిలోనూ మొహానికి, మనసుకు ముడతలు పడని సతత హరిత(ఎవర్ గ్రీన్) కథానాయకుడిగా అక్కినేని రికార్డుకు తిరుగులేదు. క్యాన్సర్‌తో చనిపోయే పాత్రల్లో జీవించి కంటతడి పెట్టించిన ఏఎన్నార్, అభిమానులకు ధైర్యం నూరిపోస్తూ చెప్పిన మాట- 'సినిమాల్లో మాదిరిగా జరుగుతుందనుకోవడం అపోహే'! అవును... నిజం. అమరజీవి అక్కినేనికి మరణమా- అపోహే!
'దీక్ష, సంఘర్షణ, సాధన- నటనకు సానపడతాయి. శక్తిని, పటిమను పదునెక్కిస్తాయి' అన్న అక్కినేని మాటల్లో ఆయన అసమాన నటనా వైదుష్యానికి మూల ధాతువులు బోధపడతాయి. నాలుగో తరగతితో చదువు ఆపేసి, రంగస్థలంపై కమల, చంద్రమతి, తార వంటి స్త్రీ పాత్రలతో పేరుమోసి, అర్ధరూపాయి పారితోషికంతో ప్రారంభమైన అక్కినేని నటప్రస్థానం- 'నాగ్గాడు' అంటూ తెలుగువారంతా ఆత్మీయంగా గుండెలకు హత్తుకొనేలా అప్రతిహతంగా సాగిపోయింది. సురేంద్రనాథ్, దేవదాస్ వంటి శరత్‌చంద్ర పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఏఎన్నార్ ఒక్కరేనని భిన్న భాషల్లోని సాటి నటులచేత జేజేలందుకొనేలా ఆయన నట తపోదీక్ష దుర్నిరీక్ష్యమై తేజరిల్లింది. ఆటుపోట్లకు రాటుతేలుతూ, భిన్న పాత్రల్లోకి పరకాయ ప్రవేశం ద్వారా సొంత వ్యక్తిత్వానికి చిత్రిక పట్టుకొంటూ, సవాళ్లను పట్టుదలతో స్వీకరిస్తూ నటరాజుకే మణిమకుటమై నిలచిన అక్కినేని కారణ జన్ముడు కాదు- రణజన్ముడు! అయిదున్నర దశాబ్దాలక్రితం శ్రీనగర్‌లో ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా మశూచి సోకినప్పుడు, దుర్భరమైన బాధను భరించి యాసిడ్ చికిత్స చేయించుకొన్న ఏఎన్నార్- తన జీవితాన్ని నెమరువేసుకొంటే ఎంతో గర్వంగా, తృప్తిగా ఉంటుందన్నారు. అదృష్టాన్ని కాక, మార్గదర్శిగా ఎదిగి తీరాలన్న సంకల్పబలాన్నే నమ్ముకొని చిత్రసీమలో ఆరోగ్యకర విలువలకు గొడుగు పట్టిన అక్కినేని- నటుడిగా అధిరోహించని శిఖరాల్లేవు. 'ఒక్కమాటు కెమెరా రన్ అయ్యి, వెయ్యింతలుగా మొహంలోని భావాన్ని మాగ్నిఫై చేస్తూ ఫోకస్ అవుతుంటే, నటుడైన వాడిలో పట్టుదల ఒక్కమాటుగా వెయ్యింతలై నిలబడి భావపరిధిని ఆవర్తిస్తుంది' అన్న అక్కినేని- సరిసాటి లేని నటదిగ్గజం. అమేయ నటకళావైదుష్యంతో తరతరాల్ని అలరించడం అక్కినేని అదృష్టమా, ఆ అభినయ రసఝరిలో తన్మయత్వం పొందడం తెలుగుజాతి సుకృతమా అన్నది తేల్చి చెప్పడం కష్టం!
కృషితో ఆత్మవిమర్శతో జీవితాన్ని పండించుకొన్న అక్కినేని సమున్నత వ్యక్తిత్వాన్ని 24 ఫ్రేముల వెండితెర చట్రంలో బంధించి చూడటం దుస్సాహసమే అవుతుంది. విశ్లేషకులు అన్నట్లు బడికి వెళ్లని ఆచార్యుడిగా, గుడికెళ్లని తాత్వికుడిగా స్వయం క్రమశిక్షణ, కట్టుబాట్లతో అక్కినేని తన తొంభయ్యేళ్ల జీవితాన్నే పాఠ్యగ్రంథంగా మార్చి బోధించిన ఆరోగ్యకర అలవాట్లు లెక్కలేనన్ని! పరిశ్రమకు వెళ్ళిన కొత్తలో పెద్దలకు నమస్కారం చేయడమే తెలియని కుర్రాడు కాలక్రమంలో రంగుల ప్రపంచాన్ని కాచి వడపోసి తీర్చిదిద్దుకొన్న సమున్నత వ్యక్తిత్వానికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. నటశ్రేష్ఠుడికి నీరాజనాలు పలుకుతూ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం కోరి వరించింది. తెలుగు గడ్డకు చిత్రసీమ తరలివచ్చేలా ముందడుగు వేసిందీ ఆ 'బాటసారే'. 1988లో తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్న గుండె, శస్త్రచికిత్సకు అనువుగా లేదన్న డాక్టర్లు- అక్కినేని జీవితకాలం మరో నాలుగేళ్లని ఆనాడు నిర్ధారించినా ఇంకో పాతికేళ్లు నటప్రస్థానం సాగేలా చేసింది ఆయన మనోబలమే! 'వృత్తిపరంగానే కాదు, జీవితంలో కూడా నాకెంతో తృప్తి ఉంది' అని చెప్పిన అక్కినేనికి ఆ 'తృప్తి' కష్టించి సాధించిన విజయాలతో, సవాళ్లకు ఎదురొడ్డి గెలిచిన ఆత్మస్త్థెర్యంతో వచ్చింది. వూపిరి ఉన్నంత కాలం నటిస్తూనే ఉంటానన్న మాటకు కట్టుబాటు చాటి తన వంశాంకురాలతో సినిమా పూర్తిచేసిన అక్కినేని- ఒక్కమాటలో చెప్పాలంటే, ధన్యజీవి. నాటకరంగంలో పొందిన ఆరణాల కప్పునుంచి ఫాల్కే అవార్డుదాకా అవే తన అసలైన సంపద అంటూ భావితరాలకోసం భద్రపరచిన అక్కినేనే- తెలుగువారి తరగని చెదరని ఆస్తి!
Labels: Cinima/ Telugu, Liesure/Telugu, nostalgia, Personality, Self development
0 Comments:
Post a Comment
<< Home