తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే
[డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి "ఇంటింటా తెలుగు దివ్వె" (వ్యాఖ్యానం- 'ఈనాడు'దినపత్రిక 25:04:2006) నుండి ఎత్తి రాసిన కొన్ని అంశాలు]
తెలుగువారిలో ప్రతి ఒక్కరూ తెలుగుకు నిలువెత్తు దర్పణంలా నిలవాలి.
మనం పలికే ప్రతి పలుకులో తెలుగుకే పట్టం కట్టాలి.
ప్రతి పలకరింతా తెలుగు పులకరింత కావాలి.
......................... తెలుగు భాషను బాగా వ్యాపింప చెయ్యాలంటే,...................... ఇప్పటికయినా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా మనలో తెలుగు బాగా వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మనం చిత్తశుద్ధితో కొన్ని నిర్ణయాలు తీసుకొని, వాటిని తు.చ. తప్పకుండా ఆచరిస్తే ఫలితం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మనల్ని చూసి ప్రభుత్వం కూడా మార్గం మార్చుకుంటుంది.
[1]ముందుగా- తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ వారి సంతకాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా తెలుగులోనే చేయాలి. బ్యాంకు లావాదేవీల దగ్గరనుంచి, ఉద్యోగం చేసే చోట చేస్తున్న పొట్టి సంతకాల దాకా!
[2]మనమందరం కలిసి ప్రతిరోజూ సాగించే ఉత్తర, ప్రత్యుత్తరాలు అసంఖ్యాకంగానే ఉంటాయి. ఆ ఉత్తరాలలో నిర్దేశించిన విషయం ఆంధ్ర దేశ పరిధిలో ఉంటే, ఆ విషయాన్ని; ఉత్తరాలపై రాసే చిరునామాల్ని కూడా తెలుగులోనే రాయండి. ఒకవేళ ఆయా అధికారులు ఆంధ్రేతరులైనట్లయితే, తెలుగులో ఉన్న ఆ లేఖల్ని చదివి తర్జుమా చేయించుకునే తలనొప్పి వారిదే అవుతుంది.
[3]బజారుకు వెళ్ళి మనమేదైనా కొనేటప్పుడు వాటి పేర్లను సహజంగా తెలుగులోనే చెప్పి కొనుక్కురండి. నిత్యావసర వస్తువుల్ని, పచారీ సామాన్లను, కూరగాయలను, పండ్లను ఇలా పలకడానికి ఇబ్బందిలేని, తెలుగు భాషలో చక్కని పదాలు ఉన్న వాటిని ఆ పేర్లతోనే పలకండి. తెలుగు భాషలో లేని పదాలు గల ఇతర భాషలలోని వస్తువుల పేర్లను (టీవీ, సైకిలు, రేడియోవంటివి) అలాగే పలకండి.
[4]బ్యాంకు ఫారాలను, మనియార్డరు ఫారాలను, చలానాలను నింపేటప్పుడు ఒకవైపు ఆంగ్లంలోనూ, మరొకవైపు తెలుగులోనూ నమూనా ఉంటే తెలుగులోనే కచ్చితంగా నింపండి.ఏవైనా దరఖాస్తులు రాయవలసి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ తప్పుల తడకలతో ఆంగ్లంలో రాయడం మానేసి చక్కగా తెలుగులో స్వేచ్ఛగా రాసి (మాట్లాడే భాషనే) ఆత్మవిశ్వాసంతో నిలబడండి.
[5]టీవీ చూస్తున్నప్పుడు తెలుగు ఛానళ్ళనే చూడండి.
[6] (అ)తెలుగు భాషతోపాటుగా మనోవికాసాన్ని కలిగించే భాగవతం, దేవీ భాగవతం, పంచతంత్రం వంటి (టీవీ) కార్యక్రమాలను తప్పనిసరిగా పిల్లలకు చూపించండి.
(ఆ)మీ పిల్లల్ని రోజుకో గంట సేపు మీ ఇంట్లో ఉన్న వృద్ధుల దగ్గర కూర్చోపెట్టండి. వారి చేత తెలుగు సంప్రదాయాన్ని, సాహిత్యాన్ని, కథలు, పాటల రూపంలో చెప్పించండి. కొత్తగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషను ఎంపిక చేయండి.
(ఇ)ఇంటి దగ్గర పిల్లలకు రోజూ కొన్ని కొత్త తెలుగు పదాల్ని నేర్పిస్తూ తెలుగులోనే మాట్లాడండి.
(ఈ)కనీసం వారానికో పద్యం వాళ్లు నేర్చుకొని చక్కగా చదివేటట్టు చూడండి.
(7)విజటింగ్ కార్డులను, వివిధ శుభకార్యాలకోసం మనం ముద్రించే శుభలేఖలను తెలుగులోనే ముద్రించి అందరికీ పంచండి.
(8)పాఠశాలల్లో తెలుగులో మాట్లాడవద్దని నియంత్రించే యాజమాన్యాన్ని తల్లిదండ్రులందరూ కలిసి నిలదీయండి.
(9)ఇంట్లో చక్కగా తెలుగు మాట్లాడేవారికి చిన్న చిన్న బహుమతుల్ని ఇవ్వండి. ఎవరైనా తెలుగు వచ్చి కూడా ఇంగ్లీషులో మాట్లాడితే వారితో తెలుగులోనే మాట్లాడండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. అపరిచితులకు తెలుగు రాదేమోనని ముందుగా మీరే ఊహించేసుకొని ఆంగ్ల సంభాషణ ప్రారంభించకండి. చక్కగా తెలుగులోనే మాట్లాడండి. వారికి చక్కగా అర్థమవుతుంది. వారానికొక రోజు (సెలవు రోజైన ఆదివారమైతే మరీ మంచిది) పూర్తిగా చక్కని తెలుగు భాషలో మాట్లాడాలనే నిర్ణయాన్ని ఇంటిల్లిపాదీ తీసుకొనేట్లు చూడండి.
(10)శుభాకాంక్షల్ని నోరారా తెలుగులోనే తెలియజేయండి. (ఎదుటి వారు ఇంగ్లీషులో చెప్పినాసరే!)
ఇలా ప్రతిఒక్కరూ నిత్యం తెలుగును గుర్తుంచుకొని వ్యవహరించాలి. ఇప్పటికే తెలుగు వచ్చినవారంతా ఈ సూచనలు పాటిస్తే తెలుగుకు ప్రాచుర్యం తక్కువ కాలంలోనే ఎక్కువగా లభిస్తుంది..............
తెలుగును వ్యాప్తి చేయడంలో ప్రజల బాధ్యత ప్రజలది, ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానిది. సాధ్యమయినంత వరకు మన నిత్య జీవనాన్ని పూర్తిగా తెలుగుమయం చెయ్యడానికి ఎవరికీ ఏ ఇబ్బందికానీ ఖర్చుకానీ ఉండదు. ఉద్యమాలు చేసి ఆయాసపడనక్కర్లేదు. ఉద్యమస్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. అది నూటికి నూరుపాళ్ళూ ఆచరించేదిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తక్కినవారిని ప్రభావితం చేసి కార్యోన్ముఖులయ్యేలా చూడాలి. ఇది మనందరి గురుతర బాధ్యత. తెలుగు వెలుగును దశదిశలా వ్యాపింపజేయడమో, లేక క్రమక్రమంగా కొండెక్కిపోతున్న వెలుగును పోగొట్టుకొని, మన భాషా సంస్కృతుల్ని అజ్ఞానంలోనికి నెట్టుకొని ఉనికిని కోల్పోవడమో... అంతా మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. ఆలోచించండి. ఆచరించండి. ఉద్యమించండి.
____________________________________________________________________
Labels: Telugu literature
2 Comments:
idi vere edo blog lo kuda coosinattu gurtu. akkadi nunci teesukunnaaraa ?
2:14 am
అసలు వ్యాసం కోసం, 25:04:2006 'ఈనాడు-హోమ్ పేజ్' లో 'వ్యాఖ్యానం' క్రింద డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారి "ఇంటింటా తెలుగు దివ్వె" చదవండి.
5:41 pm
Post a Comment
<< Home