My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, October 15, 2006

సారే జహాఁసే అచ్ఛా...


''భారతదేశం నాకు చాలా ప్రియమైన దేశం. అది నా దేశం కనుక కాదు. అత్యున్నతమైన ఆశయాలు, అభిలాషలు కలిగిన వ్యక్తి కాంక్షించేవన్నీ భారతదేశంలో ఉన్నాయి కనుకనే అది నాకు ప్రియతమమైన దేశం'' అన్నారు గాంధీజీ. భారతదేశం భోగభూమి కాదు. యోగభూమి, కర్మభూమి... అనీ అన్నారాయన. వేదకాలంనుంచి మనదేశంలో విలసిల్లిన సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికత విదేశీయుల మన్ననలను సైతం అందుకున్నాయి. విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు అన్యోన్యంగా కలిసి మెలిసి జీవిస్తున్న పుణ్యభూమి మనది. ''విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా...'' అన్న రాయప్రోలువారు, ''శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలుపారిన భాగ్యసీమయి, వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా...'' అనీ ఉద్బోధించారు. ఈ దేశంలో జన్మించడం అదృష్టమనీ వరమనీ ఎందరో మహానుభావులు కీర్తించారు. భారతదేశ సంస్కృతి మహోన్నతమైనది. శతాబ్దాల చరిత్ర కలిగిన నాగరికత ఇక్కడ విలసిల్లుతోంది. గంగ, యమున, గోదావరి వంటి పవిత్రనదులు, వింధ్య హిమాలయాల వంటి గొప్ప పర్వతాలున్నాయి. ఇన్ని ప్రత్యేకతలుండబట్టే- 'లేదురా ఇటువంటి భూదేవి ఎందు-' అని భారతీయులు గర్వపడుతుంటారు.


''దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా, వట్టిమాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్...''- అని ఉద్బోధించారు గురజాడ. దేశభక్తి విషయంలో మనవారు ఎవరికీ తీసిపోరు. నిజానికి ఎవరి దేశాన్ని వారు ప్రేమిస్తూనే ఉంటారు. ఒక్కో దేశం వారిది ఒక్కోతీరు. ఓ అమెరికన్ పెద్దమనిషి, మరో ఇంగ్లీషాయన కలిసి ప్రయాణం ప్రారంభించిన అయిదు నిమిషాల్లోనే వారిద్దరూ తమ దేశమే మిగతా అన్ని దేశాలకంటె గొప్పదని అనుకుంటారని అర్థమైపోతుంది. అమెరికా పెద్దమనిషి తమ దేశం ఎంత గొప్పదో చెబుతూ ఊదరగొట్టేస్తుంటాడు. ఇంగ్లీషాయన మాత్రం నోరు మెదపడు. చిరునవ్వు చిందిస్తూ దర్పంగా చూస్తూ కూర్చుంటాడు. తాను నోరు తెరిచి చెప్పకుండానే ఇంగ్లాండ్ ఎంత గొప్పదో ప్రపంచానికంతా తెలుసని ఆయన ధీమా! మాతృదేశం పట్ల మమకారం కలిగి ఉండటంలో మనవారే అగ్రగణ్యులు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎక్కడ ఉంటున్నా వారి హృదయం మాత్రం స్వదేశ స్మృతులతోనే పులకించిపోతూ ఉంటుంది. ''జంబూ ద్వీపే భరతవర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే...'' అన్న మంత్రం ఘంటారావంలా చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. బంకించంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ టాగూర్, గురజాడ ప్రభృతుల దేశభక్తి పూరిత గేయాలు దశదిశలా వినపడుతూనే ఉంటాయి. లోకమంతటికన్న మిన్నగు భారతదేశం మనదిరా- అనే అర్థంలో ఇక్బాల్ కవి రాసిన ''సారే జహాఁసే అచ్ఛా హిందుస్థాన్ హమారా...'' అన్న గేయం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.


తొంభైశాతం భారతీయులు మరుజన్మంటూ ఉంటే తాము భారతదేశంలోనే పుట్టాలని కోరుకుంటున్నారు. దేశభక్తి ప్రపూరితమైన ఇటువంటి అభిప్రాయం హైదరాబాదీయుల్లో మరీ ఎక్కువగా ఉంది. భాగ్యనగరవాసులు అత్యధికులు పునర్జన్మంటూ ఉంటే తాము భారతీయులుగానే జన్మించాలన్న ఆకాంక్షను వెల్లడించారు. ఓ ఆంగ్లపత్రిక మరో పరిశోధన సంస్థతో కలిసి నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ, ముంబాయి, బెంగుళూరు, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఇటీవల ఓ విస్తృతమైన సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వెలుగు చూసిన విశేషాలే ఇవి! మనదేశంలోనే పునర్జన్మ పొందినా విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచన ఉన్నట్లు కొంతమంది చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ నగరాలకు చెందినవారిలో 90 శాతం తిరిగి మనదేశంలో జన్మించటమే కాక ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. కోల్‌కతా, బెంగుళూరు నగరాలకు చెందినవారు మాత్రం చాలామంది తిరిగి ఈ దేశంలోనే పుట్టినా విదేశాల్లో ఉండాలని ఉందని చెప్పారు. ఆ జాబితాలో అమెరికాది మొదటి స్థానం. ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు తరవాతి స్థానాలు ఆక్రమించాయి. ఇటువంటిదే ఓ ఆన్‌లైన్ సర్వే చైనాలో నిర్వహించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 64శాతం తమకు తిరిగి చైనాలో జన్మించాలని లేదనే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆందోళన చెందిన అధికారులు ఆ ఆన్‌లైన్ సర్వేను అర్ధాంతరంగానే ఆపుచేయించారు. మనదేశంలో కులమత ప్రాంతీయ విభేదాలు, పెచ్చుమీరిన అవినీతి, తరిగిపోతున్న మానవత్వపు విలువలు కొంతవరకు నిరాశను కలిగిస్తున్నా- దేశంపట్ల ప్రజలకున్న అభిమానం, భక్తీ తగ్గకపోవటం, మరుజన్మంటూ ఉంటే తిరిగి భారతీయులుగానే పుట్టాలని ప్రజలు ఆకాంక్షించడం ముదావహం!
(ఈనాడు
Sunday , October 15, 2006
http://www.eenadu.net/homelink.asp?qry=Editorial )________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home