సంతోషం
నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడా వెదకకు. అది నీ ఆంతర్యంలోనే ఉంది- అన్నారో మేధావి. హాయిగా ఆనందంగా జీవితం గడపడమన్నది వారివారి మనస్తత్వాలపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎన్నికష్టాలొచ్చినా నిబ్బరంగానే ఉంటారు. మొహంమీది చిరునవ్వును చెదరనీయరు. మరికొందరు ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతూ దిగులుపడుతుంటారు. ఇంకొందరు అసలు ఏ కష్టనష్టమూ కలగకపోయినా ఎప్పుడో ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ ఇప్పటినుంచే బెంగపెట్టేసుకుంటారు. నిజంగా జరిగేవాటికంటే కాల్పనిక ఆలోచనలే మనిషిని ఎక్కువగా భయపెడుతుంటాయి. ఇటువంటి వ్యక్తులు తాము ఆనందంగా ఉండలేరు, ఇతరులను ఉండనీయరు. వెలుగు చీకట్లలాగే జీవితమన్న తరవాత కష్టసుఖాలు రెండూ కలిసే ఉంటాయి. సుఖాలకు పొంగిపోకుండా కష్టాలకు కుంగిపోకుండా రెంటినీ సమదృక్పథంతో చూస్తూ జీవితం గడపటమే బుద్ధిమంతులు చేయాల్సిన పని. ''అదియె జీవన రహస్యము, చేదు తీపులు రెండు జేరియేయుండు, ఒకటి యుండినచోట నుండు రెండవది...'' అన్నాడో కవి. జీవితమంతా ఒయాసిస్సేలేని ఎడారి అని, సుఖసంతోషాల జాడలేని మరుభూమి అని ఏవేవో ఊహించుకొని బాధపడేవారిని- ''అరుణములౌ సాంధ్యారాగంబుల, మైమరపించెడి మలయా నిలముల, పాకెడుమబ్బుల పందెపుపరుగుల, చక్కదనంబుల చందమామగన ఆనందమే లేదా లోకమున ఆనందమే లేదా...'' అని సూటిగా ప్రశ్నించారు భావకవి బసవరాజు అప్పారావు. ఇంత ఆనందం మనచుట్టూ ఉన్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులకు కదిలిపోతూ జీవితంలో సంతోషమే లేదని భావించటం సబబుకాదని కవి భావం.
డబ్బుంటే చాలు అన్నీ ఉన్నట్లే, సుఖసంతోషాలు అందుబాటులోకొచ్చినట్లే అని కొంతమంది భావిస్తుంటారు. డబ్బొక్కటే నిజమైన ఆనందానివ్వలేదని విజ్ఞులంటారు. ఆ ఆసామి డబ్బు బాగా గడించాడు. మేడలూ మిద్దెలూ కట్టించాడు. ఇంటినిండా నౌకర్లనూ చాకర్లనూ పెట్టుకున్నాడు. అయినా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటాడు. ''నీకేమోయి బోలెడంత డబ్బు సంపాదించావు. ఇంటినిండా బంగారమే. అయినా హాయిగా ఉండక ఎప్పుడూ అలా దిగులుగా ఉంటావేం'' అని ప్రశ్నించాడో శ్రేయోభిలాషి. ''అదేనోయి నా దిగులు. ఆ డబ్బే నా భయానికి కారణం. ఎప్పుడు ఏ దొంగ దృష్టి మా ఇంటిమీద పడుతుందోనని నా భయం. నిద్రపట్టదు...'' అంటూ తెగబారెడు నిట్టూర్పు విడిచాడా డబ్బుబాబు. డబ్బు, హోదా, సంపద కంటేె మనిషికి నిజమైన ఆనందాన్ని కలిగించేవి నిర్మలమైన అంతఃకరణ, మంచితనం మాత్రమే. ''ఏమిటండీ అంత సంతోషంగా ఉన్నారు?'' అని అడిగాడు బాసుగార్ని చెంచాబాబు. ''నీదగ్గర దాచటమెందుకు? మా ఆవిడ ఊరికెళ్ళిందోయ్. అందుకే అంత సంతోషం...'' అన్న బాసు అంతలోనే ఫేసు మార్చి ఏడుపు మొహం పెట్టాడు. ''మీ ఆవిడ ఊరెళ్ళిందన్నారు. మంచిదేగా. మరి ఇంకా దిగులు పడతారెందుకు?'' అన్నాడు చెంచా. ''దిగులుపడక మరేం చేయను. రేపేగా ఆవిడ తిరిగొచ్చేది...'' అంటూ బావురుమన్నంత పనిచేశాడు బాసు. కష్టసుఖాలు కావడికుండలు అన్నారు. ఒకదాన్ని మోసేటప్పుడు రెండోదాన్నీ భరించక తప్పదు. ఆనందం, విషాదం రెండూ జీవితంలో ఉండేవే. రెంటినీ అనుభవించక తప్పదు ఎంతటివారికైనా.
సంతోషం సగంబలం అన్నారు. సంతృప్తి, ఆశావహ దృక్పథం కలవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. ప్రపంచంలో అందరికంటె సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారనే విషయంపై లండన్‌కు చెందిన ఓ నెట్‌వర్క్‌వారు వినూత్న సర్వే నిర్వహించారు. సంస్థకు చెందిన పరిశీలకులు 14 దేశాలను సందర్శించి 16-34 సంవత్సరాల మధ్య వయసున్న అనేకమందిని ప్రశ్నించారు. సంపన్న దేశాలవారికంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువమంది తాము ఆనందంగా ఉంటున్నట్లు చెప్పారు. అమెరికా బ్రిటన్‌లతోపాటు సంపన్న దేశాలకు చెందిన పలువురు నిరాశాపూరిత దృక్పథాన్నే ప్రదర్శించారు. భారత్‌కు చెందిన ఎక్కువమంది తాము సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. జపాన్‌లో అధిక సంఖ్యాకులు సుఖసంతోషాలకు, తమకు ఆమడదూరమన్న నిరాశా నిస్పృహలు వెలిబుచ్చారు. ప్రపంచం మొత్తం మీద 43శాతం మాత్రమే తాము ఆనందంగా ఉన్నట్లు ఒప్పుకొన్నారు. సంపన్న దేశాలకు చెందిన వారిలో 30శాతం తాము సంతోషంగానే జీవితం గడుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో భారత్ అగ్రస్థానంలో నిలవటం సంతోషించదగ్గ విషయమే. భారతీయుల్లో తాత్వికచింతన, సంప్రదాయబద్ధమైన జీవితంపట్ల మక్కువ అధికంగా ఉండటమే వారు ఆనందంగా గడపటానికి కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. సంపన్నదేశాల్లో ఆశావాదం లోపించటం, పోటీతత్వం పెరగటం, జీవితంలో ఒత్తిడి ఎక్కువ కావటం, వృత్తి ఉద్యోగాల్లో ఎదురవుతున్న సమస్యలు వారిని సుఖసంతోషాలకు దూరం చేస్తున్నాయి. వర్ధమానదేశాల్లో యువత ఆశావహ దృక్పథంతో ముందుకు వెళుతూ భవిష్యత్తును బాగు చేసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. దాంతో వారు తాము ఆనందంగానే ఉన్నామని భావిస్తున్నారు. ఈ విషయంలో భారత్‌కు చెందినవారు అందరికంటె ముందు నిలవగా, స్వీడన్‌వారు రెండో స్థానంలో ఉన్నారు. నిరాశావాదానికి చోటివ్వకుండా ఆశావహ దృక్పథంతో కృషి చేసేవారు ఎంత అభివృద్ధినైనా సాధించగలరు. మన దేశానికి చెందిన యువత అటువంటి ప్రయత్నంలోనే ఉండటం హర్షణీయం!
(Eenadu,Editorial,03:12:2006)
---------------------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home