సర్వ మత్తు సమ్మేళనం!
- ప్రభవ
లక్షన్నర 'మందు' కొట్లున్న రాష్ట్రంలో ఒక్కరోజేం ఖర్మ, నిత్యం అదోరకం ఉగాది! హైదరాబాద్ రవీంద్ర భారతిలో కవిసమ్మేళనానికి మించి, రాష్ట్రమంతా మదిరాసుర జయజయధ్వానాలు నిత్యం లాగే ఈ రోజూ మిన్నంటుతున్నాయి. సురాంధ్రలో తెలుగుతల్లి కన్నీటి సాక్షిగా మదిరకవి సమ్మేళనం జనాన్ని ఊపేస్తోంది. మహాకవుల బాణీలతో సమకాలీన సామాజిక క్షుద్రాన్ని ఆవిష్కరిస్తోంది.
మహాకవంతటి మామూలు కవి చీర్స్ చెబుతూ...
''నాకు గ్లాసులున్నాయ్...
నాకు డోసులున్నాయ్!
ఎవరని ఎంతురోనన్ను...
యేననంత మోదభీకర మదిర లోకైకపతిని'' అంటూ ప్రారంభించాడు.
అంతలోనే, 'తమ్ముడా' అంటూ కవిత్వం తూలిందోగొంతు.
''బీరు పొంగిన మత్తుగడ్డ
బ్రాంది పారిన తూలుసీమ
రాలునిచ్చట బొట్టుబొట్టు తాగిచావర తమ్ముడా!
బెల్టుషాపులు పెరిగెనిచ్చట
రంగుసారా పొంగెనిచ్చట
కాపురములే కూలెనిచ్చట
దుఃఖ భూమిది చెల్లెలా!
విపిినబంధుర మద్యవాటిక ఉప'నిషా'న్మధువొలికెనిచ్చట,
సారా తత్త్వము విస్తరించిన సారా మిద్దెరా తమ్ముడా'' అంటూ మందు కొట్టినా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేసింది.
అంతవరకు మౌనంగా 'ద్రవి'స్తున్న నోరు ఒక్కసారిగా పొగలుకక్కింది...
''నేను సైతం బొక్కసానికి
బాటిలొక్కటి హారతిస్తాను!
నేను సైతం మద్య వృష్టికి
జీతమంతా ధారపోస్తాను!
నేను సైతం పుస్తెలమ్మి పస్తులుండి తాగిచస్తాను!'' అంటూ, ఒక్క దమ్ములాగి, మళ్ళీ గళం విప్పాడు కవి...
''పదండి తూలుతు
పదండి పొర్లుతు
పదండి పోదాం పై'పైకి'!
మరో బెల్ట్ షాప్
మరో బ్రాంది షాప్
మరో దుకాణం పిలిచింది!''
అంటూ ఆపి, తన తరవాతి కవి చెప్పేదానికోసం చెవి రిక్కించాడు.
''బాటిలును ప్రేమించుమన్నా
బీరు అన్నది పంచుమన్నా
ఒట్టి బాటిల్ పగలగొట్టోయ్
నిండు బాటిల్ పట్టవోయ్!
బ్రాంది రమ్ములు పొంగిపొరలే దారిలో నువ్వు తాగి పడవోయ్!
మందులోనె మత్తు గలదోయ్
తూలిపడువాడేను మనిషోయ్!
మద్యాభిమానము నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పబోకోయ్
ఆలినమ్మో తాళినమ్మో
తాగి ప్రభుతకు చూపవోయ్!
రాష్ట్రమంటే మట్టికాదోయ్
రాష్ట్రమంతా మందేనోయ్!''
అంటూ కర్తవ్యబోధ చేసింది.
సర్వజిత్తు నామ సంవత్సరం ఎప్పుడనేదానితో సంబంధం లేకుండా సర్వమత్తు కవిసమ్మేళనం కొనసాగుతోంది. మద్యాభ్యుదయ కవులు తమ వంతుకోసం చూస్తున్నారు- మధ్యమధ్యలో బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్నాది షడ్రుచో'ప్రేత'మైన సమ్మేళన తీర్థాన్ని చప్పరిస్తూ.
మార్చి నెల సగం గడిచిపోయింది. ఎండలు మండిపోతున్నాయ్. పల్లెల్లో పట్టణాల్లో జనం గొంతు తడవడం లేదని విమర్శ వస్తే ఎంతటి అప్రతిష్ఠ! మంచినీళ్ళు దొరకని కుగ్రామాల్లో సైతం సాఫ్ట్ డ్రింకులు, మినరల్ వాటర్ దొరుకుతున్నాయంటే... ప్రభుత్వానికి ఎంతటి అవమానం?
కాబట్టే ఎంతటి మారుమూల పల్లెల్లోనైనా, బస్సు చొరబడని కుగ్రామంలోనైనా, స్కూలూ ఆసుపత్రే లేని తండాల్లోనైనా, అడవిలోనైనా లంకలోనైనా... 'గొంతు తడిపే'ందుకు మన సర్కారు కంకణంతోపాటు నడుం కట్టింది.
పల్లెపల్లెకూ బెల్టుదుకాణాలు విస్తరించి, అక్షరాలా అవి లక్షన్నర దాటిపోయినప్పుడు... ఎవరనగలరు గొంతు తడిసే అవకాశం లేదని?
పదహారు వందలమంది ఉన్న పల్లెలో ఏడు బెల్టుషాపులున్నప్పుడు, శతాబ్దాలనాటి ఆచారాలతో ఏం నిమిత్తం? అసలు ఉగాది ఎప్పుడయితే ఏంటి? పచ్చడిని మించిన 'ఔషధం' ఉండగా ఎందుకీ 'చింత'? పండు, బెల్లం రేట్లు పెరగవచ్చుగానీ, మందురేటు పెరక్కుండా ప్రభుత్వం సకల చర్యలూ తీసుకుందా లేదా?
ఇది సామాన్యుల ప్రభుత్వమనడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా?
నీతి: రాష్ట్ర ప్రభుత్వం నీకేమిచ్చిందని కాదు... రాష్ట్ర ప్రభుత్వానికి ('మందు' తాగడం ద్వారా) నువ్వెంత ఇస్తున్నావన్నది ప్రధానం.
(EEnadu, 19:03:2007)
____________________________________________
Labels: Humour, Humour/ Telugu
0 Comments:
Post a Comment
<< Home