ఇతరులు మెచ్చిందే అందం !
''చూడదగినదైన జూడగ వలయురా'' అన్నాడు వేమన. సృష్టిలో అందానికి ఎంతో ప్రాముఖ్యముంది. పచ్చని చెట్లు, విచ్చిన పూలు, నీలం కొండలు, మెరిసే ఆకాశం, కదిలే మబ్బులు... అన్నింటా అందం తొణికిసలాడుతూనే ఉంటుంది. చూడగలిగిన కళ్ళూ, ఆస్వాదించగలిగిన హృదయం ఉండాలంతే! ఒకరికి అందంగా అనిపించింది మరొకరికి అలా అనిపించకపోవచ్చు. అప్సరస ఊర్వశి నల్లగా ఉంటుందని పురాణం. అటువంటి ఊర్వశిని తలమునకలుగా ప్రేమించాడు పురూరవుడు. అంత నల్లటి ఆమెను ఎలా ప్రేమించావయ్యా అని ఏ నారదుడో అడిగితే, నా కళ్ళు పెట్టుకుచూడు మహానుభావా- అని పురూరవుడు సమాధానం చెప్పేవాడనిపిస్తుంది, ఊర్వశీ పురూరవుల ప్రణయగాథ తెలిసినవాళ్ళకు. అటువంటి స్థిరమైన అభిప్రాయాలు అందరికీ ఉండవు. మనుషుల్లో కొన్ని బలహీనతలు తప్పనిసరి. ఏ వస్తువు విలువ అయినా ఇతరులు చెబితే కాని నమ్మకం కుదరదు కొందరికి. తన మనసుకు నచ్చినా ఇతరులూ తన అభిప్రాయంతో ఏకీభవిస్తేకాని సంతృప్తి కలగదు చాలామందికి. ముఖ్యంగా స్త్రీలు తమకంటే తోటి మహిళల అభిప్రాయాలకే ఎక్కువ విలువనిస్తారు. తనకు వంద చీరలున్నా ఎదురింటావిడ కట్టుకున్న చీరే బాగుందనుకోవటం చాలామంది ఆడవాళ్ళ నైజం. ఆ అమ్మ బట్టల షాపులో బీరువాలన్నీ ఖాళీ చేయించి చీరలు గుట్టగా పోయించింది. అయినా ఒక్కటీ నచ్చటంలేదు. ''ఇంతకూ మీకు ఎటువంటి చీర నచ్చుతుందమ్మా'' అని అడిగాడు విసిగిపోయిన షాపాయన. ''నాకు నచ్చటం కాదు ముఖ్యం. మా పక్కింటావిడకు నచ్చాలి. ఈ చీర తానే ముందు ఎందుకు కొనుక్కోలేదని ఆవిడ గింజుకోవాలి. అటువంటి చీరలు చూపించండి'' అంది. ఈ చిక్కు సమస్య తీర్చటం తనవల్ల కాక గుడ్లు తేలేశాడు షాపాయన!
అసలు తాము చూడకపోయినా ఇతరులు చెప్పుకొంటున్న మాటలు విని హృదయాలు అర్పించుకున్న కావ్యనాయికలున్నారు. దమయంతి ఆ కోవకు చెందిన నాయికే. తాను స్వయంగా నలమహారాజును చూడకపోయినా, 'పుల్విలుకాని తోడ సరిపోలెడు చక్కనివాడు భూమిలో నెవ్వడు చెప్పు'డని చెలికత్తెలనడుగుతుంది. వారు 'ఒప్పులకుప్ప నలుండుగాక యొండెవ్వడు' అంటే, ఆ మాటలు నమ్మి అతణ్నే ప్రేమిస్తుంది. అలాగే నలమహారాజు సైతం దమయంతిని అప్పటికి తాను చూడకపోయినా హంస చేసిన వర్ణనలు విని ఆమెపట్ల అనురక్తుడవుతాడు. కొంతమంది సొంత అభిప్రాయాలకంటే ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువనిస్తుంటారు. ఈ మనస్తత్వాన్ని పొరుగింటి పుల్లకూర రుచి అని తేలిగ్గా కొట్టిపారేయటానికి వీలులేదు. ఏ విశేషమో లేకపోతే అవతలివారిని అంతగా ఎలా ఆకట్టుకోగలుగుతారన్న ఆలోచనే వీరికి కూడా అవతలి వ్యక్తిపై ఆకర్షణను కలిగించవచ్చు. నలుగురు నడిచిందే దోవ అని ఒకరు చూపిన ఏ ప్రత్యేకతో ఆకర్షణీయంగా కనపడి పదిమందీ ఆ పోకడలే పోవటం పరిపాటి. ఫ్యాషన్ల విషయంలో మహిళలు ఇతరులను అనుకరించటం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. పూర్వం కన్నాంబ చీరలనీ కాంచనమాల గాజులనీ ఆ నటీమణులు వారు నటించిన సినిమాల్లో ధరించిన చీరలు గాజులు వంటివాటిని ధరించటమే ఫ్యాషన్‌గా భావించి అటువంటివాటి కోసమే బజారుకు పరిగెత్తేవారు మహిళలు. ఇప్పుడు- శ్రీదేవి చీరలు, జయప్రద గాజులు అంటూ పేర్లు మారాయి- అంతే తేడా.
'తాను మెచ్చిన కొమ్మ తళుకు బంగరుబొమ్మ' అన్నారో కవి. మగవారి విషయంలో ఈ సూత్రం వర్తిస్తుందేమో కాని, ఆడవారికి కాదు. మహిళలు తమతోపాటు అవతలివారినీ ఆకర్షించిన పురుషులనే అందగాళ్లుగా భావిస్తారు. ''అందం అన్నది చూసేవారి దృష్టిని బట్టి, వారి ఆలోచనలను బట్టి ఉంటుందనే మాట నిజమే. స్త్రీల విషయంలో ఇతరుల అభిప్రాయాల ప్రభావమూ ఎక్కువే. తన కళ్ళతో చూసేదానికన్నా ఇతరులు మెచ్చుకున్న అందమే వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది'' అంటున్నారు ఇంగ్లాండుకు చెందిన బెన్‌జోన్స్ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. అబర్డీన్ విశ్వవిద్యాలయానికి చెందిన బెన్‌జోన్స్ మరికొందరు పరిశోధకులతో కలిసి ఈ విషయంలో ఓ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో వారు కొంతమంది మహిళలను ఎంపిక చేసి వారికి కొంతమంది అందగాళ్ళ ఫొటోలు చూపించారు. తరవాత వారికి మరో వీడియో చిత్రాన్ని చూపారు. ఆ వీడియో చిత్రంలో ఆ మగవారితో పాటు వారిని చూస్తున్న కొందరు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీడియోలో కనిపిస్తున్న మహిళలు కొందరు పురుషుల వంక మెచ్చుకోలుగా చిరునవ్వులు చిందిస్తూ చూడగా కొందరు మగవారిని చూస్తూనే మొహం చిట్లిస్తూ అయిష్టాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను చూపించి అందులో కనిపించిన మగవారిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పమని సర్వేలో పాల్గొన్న ఆడవారిని అధ్యయన బృందం కోరింది. అప్పుడా మహిళలు వీడియోలో కనిపించిన స్త్రీలు చిరునవ్వులు చిందిస్తూ ఏ మగవారిని చూశారో వారే ఎక్కువ అందగాళ్ళని వారికే తమ ఓటు వేశారు. ఈ అధ్యయనాన్ని బట్టి అందం విషయంలో తోటి మహిళల అభిప్రాయాలు ఆడవారిపై మంచి ప్రభావాన్నే చూపుతాయని అధ్యయన బృందం నిగ్గుతేల్చింది. పురుషుల దగ్గరకొచ్చేసరికి ఇందుకు ఫక్తు వ్యతిరేకమైన భావాలు వ్యక్తమయ్యాయి. అదే వీడియో చిత్రాన్ని కొందరు పురుషులకు చూపించగా మహిళలు మెచ్చుకోలుగా చిరునవ్వులు చిందిస్తూ చూసిన మొహాలను వారు తిరస్కరించారు. ఇందుకు పురుషుల్లో సహజంగా ఉండే పోటీతత్వంతోపాటు అసూయ కూడా కారణం కావచ్చని బెన్‌జోన్స్ అంటున్నారు. ఆ సంగతెలాఉన్నా వ్యక్తుల అందాన్ని అంచనా కట్టటంలోను, ఒక వ్యక్తి పట్ల ఆకర్షణకు లోనుకావటంలోను అవతలివారి అభిప్రాయాల ప్రభావమూ ఉంటుందని తేలిపోయిందంటోంది అధ్యయన బృందం. మనసు చేసే మాయాజాలాల్లో ఇదో నవకోణం!
(Eenaadu-28:01:2007)
-----------------------------------------------------------------------
Labels: Beauty/telugu
0 Comments:
Post a Comment
<< Home