నమ్మి చెడినవారు లేరు...
'ఉన్నదని మనమూహించే అనిర్వచనీయమైన శక్తి ఏమిటో మనకు తెలియకపోయినా అదే ఈశ్వరుడు' అన్నారు గాంధీజీ. అన్ని మతాల సారాంశం కలిగిందీ, మనల్ని ఈశ్వర సాన్నిధ్యానికి చేర్చగలిగిందే అసలైన మతం అనీ అన్నారు. మనుషులు ఆలోచించటం మొదలుపెట్టినప్పటినుంచీ రకరకాల మతాలు పుట్టుకొచ్చాయి. ఎందరో దేవుళ్ళూ ఉద్భవించారు. మతాల కారణంగా యుద్ధాలు జరగటమూ రక్తపాతం సంభవించటమూ కొత్తకాదు. మత విశ్వాసాలు కలిగి ఉండటం తప్పుకాదు. తమ మతమే గొప్పదని ఇతర మతాలవారిని కించపరచటం, వారిపై ద్వేషభావం పెంచుకోవటం మాత్రం మంచిదికాదు. సకలజన సమ్మతమైనదే అసలైన మతం. 'మతమన్నది నా కంటికి మసకైతే, మతమన్నది నీ మనసుకు మబ్బైతే మతం వద్దు, గితం వద్దు మారణహోమం వద్దు' అన్నారు కృష్ణశాస్త్రి. ఎవరెన్ని సూక్తులు వల్లించినా నాటినుంచి నేటివరకూ మతం పేరుతో మారణహోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దారుణాలు చూసి సహించలేని కొందరికి అసలు మతాల పట్లా దైవం పట్లా నమ్మకం సడలిపోవటమూ జరుగుతోంది. ''మతములనుచు పుట్టి మన్వంతరములాయె మనుజునందు మిగిలె ధనుజ వృత్తి. మతము లెప్పుడింక మనుజుని పెంచురా?'' అని సూటిగా ప్రశ్నించారు నార్లవారు. ఎవరూ సమాధానం చెప్పలేని శేష ప్రశ్నలాగానే మిగిలిపోయిందది. భగవద్గీత, బైబిల్, ఖురాన్, గురు గ్రంథసాహెబ్ వంటి వాటిలోని సూక్తులను కలగాపులగం చేసేసి దడదడా లెక్చరిస్తున్న ఆ మహానుభావుణ్ని ''అసలు ఇంతకీ మీ మతం ఏమిటండీ?'' అని అడిగాడో పెద్దమనిషి. ''ఆయన్ది వేరే మతంలెండి, రెటమతం'' అని టక్కున జవాబు చెప్పింది పక్కనే ఉన్న ఆయన సతీమణి. ఈ బాపతు రెటమతస్థుల సంగతెలా ఉన్నా ప్రపంచంలో మత విశ్వాసాలు, భగవంతునిపట్ల భక్తి భావాలు పెరుగుతున్నాయే కాని తరగటం లేదు. దేవుళ్ళ సంఖ్యకూ కొదవలేదు. హిందువులు కొలిచేందుకు ముక్కోటి దేవతలున్నారు. చిల్లర దేవుళ్ళే కాక గ్రామదేవతలూ అసంఖ్యాకం.
జీవితంలో అభద్రతాభావం ఎక్కువవుతున్నకొద్దీ భక్తి పెరుగుతుంటుందని కొందరు మనస్తత్వ శాస్త్రవేత్తల విశ్లేషణ. ''భక్తియున్నచోట పరమేశ్వరుడుండు భక్తి లేనిచోట పాపముండు భక్తి గలుగువాడు పరమాత్ముడేనయా'' అన్నారు వేమనకవి. భక్తులు కానివారిపట్లా వాత్సల్యం ప్రదర్శింపజేసి ఆదుకోవటమే భగవంతుని లక్షణమని చెప్పే కథనాలు ఎన్నో ఉన్నాయి. తెనాలి రామకృష్ణకవి సృష్టించిన నిగమశర్మ, కందుకూరి రుద్రకవి కావ్య నాయకుడు నిరంకుశుడు స్వతహాగా దుడుకు మనుషులయినా భగవంతుని కరుణచే జగత్ప్రసిద్ధి పొందుతారు. నిరంకుశుడు సాక్షాత్తు పరమశివుణ్నే జూదానికి ఆహ్వానించి రెండువైపుల పందాలూ తానేవేసి పరమేశ్వరుడే ఓడిపోయాడని నిర్ణయించి పందెం ప్రకారం తన కోరిక చెల్లించమని సాక్షాత్తు ఆ శివుణ్నే నిగ్గదీయటం మనోహరమైన నిరంకుశోపాఖ్యాన కావ్యంగా రూపుదిద్దుకొంది. ''ఓ దేవుడా నా మనస్సు యిండిపెండెంటుగా సృజించావా లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే నా యిష్టవొచ్చిన పనల్లా నేను చేశాను నువ్వెవరు అడగటానికి? లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అట్లాగయితే నువ్వే నా చేత పాపం చేయించావు గనక నీకే ఆ శిక్ష కావాల్సింది'' అంటూ ఓ కొత్త వితండవాదం లేవదీస్తాడు కన్యాశుల్కం ఫేం గిరీశం. ఆస్తికులున్నట్లే నాస్తికులూ ఉన్నారు. దేవుని ఉనికిపట్ల రకరకాల సందేహాలతో గందరగోళాలు సృష్టించేవాళ్ళూ ఉన్నారు.
చదువుకున్నవారిలో పట్నవాసపు జీవితాలకు అలవాటుపడినవారిలో మత విశ్వాసాలు తక్కువగా ఉంటాయని దేవునిపై నమ్మకమూ తక్కువని అందరూ భావిస్తుంటారు. అది సరికాదని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటీవల బయటపడింది. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనే సంస్థ దాదాపు 7670మందిని కలుసుకొని దేవుని పట్లా మతం పట్లా వారి అభిప్రాయాల గురించి ప్రశ్నించింది. వారు పాటించే ఆచారాలు, దైవభక్తికి సంబంధించి ఆచరించే విధానాల గురించీ ఆరాతీశారు. ఆ సమాచారాన్ని విశ్లేషించి చూడగా అనేక ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. పల్లె ప్రాంతాల్లో నివసించేవారికంటె పట్నవాసపు జీవితాలు గడిపేవారిలోను, చదువురాని వారికంటే చదువుకున్నవారిలోనే మత విశ్వాసాలు, దేవుని పట్ల నమ్మకం ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. పురుషుల్లో కంటే స్త్రీలలోనే మత విశ్వాసం అధికంగా ఉంటుందనీ తేలింది. పట్నవాసపు జీవితాల్లో పెరుగుతున్న ఒత్తిడీ తగ్గుతున్న స్థిరత్వం వంటివాటివల్ల వారు మతంపట్లా దైవంపట్లా మొగ్గుచూపుతున్నారని సర్వే నిర్వహించినవారు అభిప్రాయపడ్డారు. విద్యార్హతల సంగతెలా ఉన్నా సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం భగవంతునిపట్ల అచంచల విశ్వాసం ప్రకటించారు. 64శాతం ఆలయం, మసీదు లేదా గురుద్వారాలకు క్రమం తప్పకుండా వెళతామని చెప్పారు. 53శాతం ప్రతిరోజూ దైవప్రార్థన చేస్తామని చెప్పారు. వారిలో విద్యాధికులే ఎక్కువ. 46శాతం దయ్యాలు భూతాలూ ఉన్నాయనీ నమ్ముతున్నారు. 24శాతం జ్యోతిష్యంపట్ల నమ్మకం ఉందన్నారు. మతపరమైన కార్యక్రమాలకు ప్రార్థనలకు తప్పకుండా హాజరవుతామని 68శాతం చెప్పారు. పార్టీల ప్రభావం వీరి అభిప్రాయాలపై ఏమాత్రం లేదని సర్వే నిర్వాహకులు వెల్లడించారు. టెలివిజన్‌లో ప్రసారమవుతున్న మతపరమైన కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయనీ, వాటి ప్రభావంవల్లా మత విశ్వాసాలు పెరుగుతున్నాయనీ పరిశోధకులు అంటున్నారు. కారణాలు ఏమైనా నమ్మి చెడినవారు లేరు- అన్న సిద్ధాంతం పట్ల మనుషుల్లో విశ్వాసం అధికమవుతున్నట్లుంది!
(Eenaadu;04:02:2007)
---------------------------------------------------------
Labels: Religion, Religion/telugu
2 Comments:
అవును నమ్మి చెడినవారు లేదు. నమ్మకం అనేది ఒక శక్తివంతమైన సాధనం - వాస్తవాన్ని నియంత్రించేంత శక్తి కలది.
8:16 am
This comment has been removed by a blog administrator.
8:16 am
Post a Comment
<< Home