మరో వింత
''చూడు చూడు గోడలు వైరుధ్యాల నీడలు...'' అన్నారో కవి. గోడలు మనుషులను విడదీస్తాయి. వంతెనలు కలుపుతాయి. మనుషులు గోడలు నిర్మించటంలో చూపే ఉత్సాహం వంతెనలు కట్టుకొని మానసిక సాన్నిహిత్యం పెంపొందించుకోవటంలో ప్రదర్శించరు. ఆ కారణంగానే ప్రపంచంలో ఇన్ని అభిప్రాయ భేదాలు వైరుధ్యాలు చోటు చేసుకొని అనేక ఆందోళనలకు, అలజడులకు కారణమవుతున్నాయి. దేశాలను విడదీసిన గోడలూ ఉన్నాయి. చైనా గోడ, బెర్లిన్ గోడ చరిత్ర ప్రసిద్ధాలే. మంగోల్ దాడులకు తట్టుకోలేక అప్పటి చైనా చక్రవర్తులు గోబీ ఎడారికి చైనా దేశానికి మధ్యగా పెద్ద గోడను నిర్మింపజేశారు. చైనా గోడను ప్రపంచ వింతల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. తూర్పు పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ అప్పట్లో బెర్లిన్ నగరంలో గోడను నిర్మించారు. ఒకే దేశంలోని మనుషులను వేరు చేస్తూ ఇటువంటి గోడను నిర్మించటాన్ని మానవతావాదులు వ్యతిరేకించారు. అనేక ఉద్యమాల దరిమిలా బెర్లిన్ గోడను పడగొట్టాక ఐక్య జర్మనీ ఏర్పాటయింది. విడదీసే గోడలు, కలిపే వంతెనలను గురించి చెప్పుకొనేటప్పుడు ఇటువంటి ఉదంతాలెన్నయినా గుర్తుకు వస్తాయి. సీతాదేవిని రక్షించి తీసుకురావటానికి కపి సైన్యంతో బయలుదేరిన శ్రీరామచంద్రునికి కల్లోల జలధి అడ్డువస్తుంది. సముద్రాన్ని దాటి లంకానగరం చేరాలంటే ''నాలుగామడ దాట నా నేర్పుమీద నా చేతగాదను నొక్క వానరుండు, ఎన్మిదామడ దాటనేర్తు మీద నా చేతగాదను నొక్కవానరుండు, పదియామడైన నే బరతెంతు మీద నా చేతగాదను నొక్కవానరుండు'' అంటూ కపి సైన్యం సముద్రాన్ని లంఘించి లంకానగరం చేరటం తమవల్ల కాదంటారు. అప్పుడు సేతువు నిర్మించటం అనివార్యమవుతుంది. సుగ్రీవుని ఆజ్ఞానుసారం వానర వీరులంతా కలిసి సముద్రంపై సేతువును కట్టటానికి పూనుకొంటారు. విశ్వకర్మకు ఔరస పుత్రుడైన నీలుడు అనే శిల్ప విద్యాప్రవీణుడు మిగతా వానరుల సహాయంతో సముద్రంపై సేతువును నిర్మింపజేస్తాడు. పురాణ ప్రసిద్ధమైన సముద్రంపై నిర్మించిన ఆ వంతెన ఆనవాళ్ళను దర్శించటం పుణ్యప్రదమని ఈనాటికీ భక్తులు నమ్ముతారు.
''సేతువు దర్శింప మహాపాతకములు బాసిపోవు'' అన్నారో పూర్వ కవి. కింద గలగలా పారుతున్న నీటితో నిండిన నదులపై నిర్మించిన వంతెనలను పర్యాటకులు ఉత్సాహంగా దర్శిస్తుండటం నేటికీ జరుగుతున్నదే. వంతెనలు దూరాలను కలుపుతూ మనుషులను, దేశాలను దగ్గర చేస్తుంటాయి. వంతెనలవల్ల కలిగే మార్పులు కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి ఇబ్బందులనూ కలిగించవచ్చు. ''అసలు మన ఊరికీ తిప్పలన్నీ ఆ బూసయ్య వొంతెనేయించాకే వచ్చిపడ్డాయి. వొంతినతోపాటూ బస్సులూ వచ్చాయి. ఊరి తీరే మారిపోయింది. అంతకుముందు బీడీలు, సిగరెట్లు, సోడాలు, కిళ్ళీలు మన ఊళ్ళో అమ్మేవారా? ఇప్పుడు ఆ మండి నొంతిన దగ్గర అన్నీ ఈ కొట్లే'' అంటుంది ఓ పల్లెటూరి ఇల్లాలు నార్లవారి 'వంతెన' అనే నాటికలో. వంతెనల వంటి వాటివల్ల పల్లెటూళ్ళకు పట్నవాసపు సంస్కృతులు రవాణా కావటం ఆమెకు ఇష్టం ఉండదు. మార్పులను ఎవరూ అడ్డుకోలేరు. ఓడ ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి ఓ దీవిలో చిక్కుబడిపోయాడు. ఏళ్ళు గడిచిపోతున్నా తిరిగి మామూలు ప్రపంచంలోకి వెళ్ళే మార్గం కనపడక అల్లాడిపోయాడు. అదృష్టవశాత్తు ఓరోజు ఓ ఓడ కనపడింది. సంతోషంతో అరుస్తూ తనను రక్షించి ఆ దీవిలోనుంచి తీసికెళ్ళమని ప్రార్థిస్తూ ఓడకు దగ్గరగా పరుగులు పెట్టాడా వ్యక్తి. ఓడ కెప్టెన్ మాట్లాడకుండా ఓ పేపర్లకట్ట అతనిమీదకు విసిరేసి ముందు అవి చదవమన్నాడు. ''పేపర్లు చదవటమేమిటి?'' అన్నాడా వ్యక్తి తెల్లబోతూ. ''ఆ పేపర్లు చదివితే ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది. అప్పటికి కూడా వస్తానంటే నా అభ్యంతరం లేదు తీసికెళతాను'' అన్నాడు కెప్టెన్ చల్లగా.
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండటంతో దేశాల మధ్యే కాదు ఖండాల మధ్య దూరమూ తగ్గిపోతోంది. ఖండాలను సైతం చేరువ చేసే కొత్తరకం సముద్ర గర్భసొరంగ మార్గాలు రూపొందుతున్నాయి. లోగడే ఇంగ్లీషు ఛానెల్ కింద జలగర్భ సొరంగ మార్గం ఏర్పడటంతో బ్రిటన్ ఫ్రాన్సులు దగ్గరయ్యాయి. ఆ ఛానల్ టన్నెల్ పుణ్యమా అని కేవలం 32 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తే చాలు ఇంగ్లాండు నుంచి ఫ్రాన్సుకు చేరిపోవచ్చు. ఇప్పుడు అదే పద్ధతిలో ఆఫ్రికా ఐరోపా ఖండాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో మరో సముద్ర గర్భ సొరంగ మార్గం నిర్మించే ప్రయత్నాల్లో పడ్డారు ఇంజినీర్లు. ఆఫ్రికాను ఐరోపా నుంచి వేరుచేస్తూ మధ్యదరా సముద్రం పరుచుకొని ఉంది. ఆ సముద్ర గర్భంలోనుంచే ఓ సొరంగ మార్గం తవ్వితే ఆ రెండు ఖండాల మధ్యా దూరం తగ్గిపోతుంది. మొరాకో, స్పెయిన్ ప్రభుత్వాలు ఆ సత్కార్యానికే పూనుకొన్నాయి. వీరు అనుకొన్న విధంగా సముద్రగర్భంలో సొరంగ నిర్మాణం సాగి, రైళ్ళు తిరిగితే- దక్షిణ స్పెయిన్‌లోని సెవెల్లి నగరంలో ఉదయం ఎనిమిది గంటలకు రైలెక్కినవారు తొమ్మిదిన్నర అయ్యేసరికల్లా మొరాకోలోని టాంజియార్ రేవు పట్టణం చేరుకుంటారు. ప్రస్తుతం నౌకలో ప్రయాణం చేసినా లేదా రైల్లో ప్రయాణం చేసినా అంతకు మూడు నాలుగురెట్లు ఎక్కువ కాలం పడుతోంది. ఆ కారణంగా జిబ్రాల్టర్ జల సంధినుంచి ఓ జలగర్భ సొరంగ మార్గాన్ని తవ్వి మొరాకో, స్పెయిన్ దేశాల మధ్య దూరాన్ని తగ్గించాలని ఉభయప్రభుత్వాలు సంకల్పించాయి. 600కోట్ల నుంచి 1300కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో, ఐరోపా సంఘం సహకారంతో ఆ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. సాంకేతిక రంగంలోనే అద్భుతమైన వింత అని చెప్పదగ్గ ఈ ప్రాజెక్టును సత్వరంగా పూర్తి చేయాలనే దృఢసంకల్పంతో ఉన్నాయి మొరాకో, స్పెయిన్ దేశాలు. ''శాస్త్ర విజ్ఞానమద్భుత సరణి పెరగ మానవుడొనర్పలేనిదేదేని గలదె...'' అని కవికోకిల గతంలోనే చెప్పారు. ఆయన మాటలే నిజమవుతున్నాయి!
(Eenadu-18:02:2007)
--------------------------------------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home