అలనాటి కౌగిలి
''ప్రేమ అనగానేమి?'' అని బ్రహ్మాండమైన ప్రశ్నవేసిన ఆసామి, ''ప్రేమ అనగా రెండు హృదయాలు ఒకే పన్‌ధాన నడుచుట'' అని తానే సమాధానం చెబుతాడు ముళ్ళపూడివారి ఓ కథలో. ప్రేమ అన్నది అన్ని కాలాలకు చెందినది. నిర్వచనాలకు అందని హృదయ సంబంధమైన మధుర బాధ. అన్ని యుగాలలోను ప్రేమ మనుషులను నీడలా వెంటాడుతూనే ఉంది. విరహవ్యధతో వేగిస్తూ, సమాగపు ఆనందసాగరంలో మునకలేయిస్తూ ప్రేమికులకు రకరకాల మధురానుభూతులను అందిస్తూనే ఉంది. ఊర్వశీ పురూరవులది పురాణకాల ప్రేమ. వరూధినీ ప్రవరులది ప్రబంధయుగ ప్రేమ. లైలామజ్నూ, సలీం అనార్కలీలది ఇటీవలి కాలానికి చెందిన ప్రేమ. కల్పితమైనా దేవదాసు పార్వతిలది అమర ప్రేమగాథగా మిగిలిపోయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. శకుంతలా దుష్యంతులు, నలదమయంతులు, సుభద్రార్జునులు తదితరులెందరో రసవంతమైన ప్రేమకథలు నడిపినవారే. ఎందరో మహనీయుల జీవిత చరిత్రల వెనక బయటకురాని రహస్య ప్రేమపురాణాలూ ఉన్నాయన్న విషయం వాస్తవమే. ''ఈ రాణీ ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులూ, మతలబులూ కైఫీయతులూ ఇవికావోయ్ చరిత్ర సారం...'' అని మహాకవి అన్నారు కాని- ముంతాజ్‌మహల్ ప్రేమకథా, కులీకుతుబ్‌షా ప్రణయగాథా చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం సంపాదించుకున్నాయి. ప్రేమలో తలమునకలుగా మునిగిపోయినా ప్రియ సమాగమం కాక విరహవ్యధతో వేగిపోతున్న సుకుమారి, ''అలరులు సూదులై మలయజాది సమస్త వస్తువులగ్నికల్పమై, మలయ సమీరముల్ విషసమానములై, హిమభానుడైన యా కలువలరేడు చండకరు కైవడి యై కనుపట్టె'' అని బాధపడుతూ ''అయ్యయో వలపను పాపమెట్టి పగవారలకున్ వలదింక దైవమా...'' అని వేడుకొంటుంది.
''ప్రేమ గుడ్డిదంటారు నిజమేనా?'' అని అడిగాడు ప్రేమకుమార్. ''నిజమే. పెళ్ళి కళ్ళు తెరిపిస్తుంది అన్న మాట నిజమే'' అన్నాడు కుటుంబరావు. ప్రేమలో పడ్డాడు అంటారు పడటమేమిటి అసహ్యంగా గోతిలో పడ్డట్లు అని విసుక్కొనే ప్రేమబాబులకు ఆ పడటమేమిటో పెళ్ళయ్యాక కాని అర్థం కాదులే- అని సర్దిచెప్పే అనుభవజ్ఞులూ అనేకమంది. వయసులో ఉన్న వారికి కలిగే సహజమైన ఉన్మాదమే ప్రేమ అని ప్రేమను నిర్వచించాడో మేధావి. బుచ్చమ్మను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయిన గిరీశం- ''అయామ్ డ్రెడ్‌ఫుల్లీ యిన్ లవ్ విత్ హర్. దీన్ని చూసిన దగ్గర్నుంచే టౌన్ లవ్‌సూ డాన్సింగర్లుసూ మీద పరమాసహ్యం పుట్టింది'' అంటాడు. ''కాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే చెలి యేమని సహింతునే'' అంటూ వెర్రెత్తిపోతాడు. ప్రేమించుకున్న వారంతా వివాహబంధంతో ముడివేసుకొని ఒకటి కాలేరు. మతాలు, కులాలు, సామాజిక నిబంధనలూ ఎన్నో అడ్డుగా నిలుస్తుంటాయి. పేద ధనిక తారతమ్యాలు ప్రేమకు అడ్డుగోడలుగా నిలవటం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. ''నేను మన్మధ్‌ను ప్రేమించిన మాట నిజమే. పెళ్ళికూడా చేసుకొనేదాన్నే- అతని బ్యాంక్ పాస్‌బుక్ చూడకపోతే. బ్యాంక్‌బుక్‌లో బాలెన్సు లేదు. ఇంకేం ప్రేమ పెళ్ళి అనుకొని గుడ్‌బై చెప్పేశాను'' అందో ప్రేమకుమారి. అందరూ అటువంటివారే ఉండరు. ప్రేమకోసం సర్వం త్యాగం చేసేవారూ మృత్యువు కూడా విడదీయలేనంతగా గాఢ ప్రేమికులూ ఉంటారు.
''ఆ ధృఢాశ్లేషమున భేదమంతరించి యొక్క హృదయమొక్క ప్రాణమైయున్నయటుల'' బిగికౌగిలిలో ఉన్న ఆ ప్రేమజంట అస్థిపంజరాలను విడదీయటానికి పరిశోధకుల మనసొప్పటం లేదు. ఇటలీలోని కెరోనా నగరానికి సమీపంలో మాన్‌టోవా నగర శివార్లలో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రజ్ఞులకు ఓ అస్థిపంజరాల జంట కనిపించింది. ఆ జంట అస్థిపంజరాలు ఒకదానికొకటి హత్తుకొని గట్టిగా కౌగలించుకొని ఉన్నాయి. అవి ఐదు లేక ఆరువేల సంవత్సరాల నాటి ప్రేమికులవిగా పరిశోధకులు భావిస్తున్నారు. కొత్త రాతియుగానికి చెందినవిగా భావిస్తున్న ఆ అస్థిపంజరాల బిగికౌగిలికి భంగం కలిగించకుండా వాటిని అలాగే పరిశోధనల నిమిత్తం ప్రయోగశాలకు తరలించాలనుకొంటున్నారు. పరిశోధనల అనంతరం వాటిని సందర్శకులు దర్శించటానికి వీలుగా మ్యూజియంలో భద్రపరుస్తారంటున్నారు. ''వేల సంవత్సరాల క్రితంనాటి ఈ ప్రేమజంట బిగికౌగిలికి మేం భంగం కలిగించదలచుకోలేదు. వారినలాగే ఉంచి పరిశోధనలు కొనసాగిస్తాం'' అంటున్నారు ఎలీనా మెనొట్టీ అనే పురావస్తు శాస్త్రజ్ఞురాలు. షేక్స్‌పియర్ మహాకవి రాసిన అమరప్రేమకావ్యం ''రోమియో జూలియట్''కు కెరోనా నగరమే నేపథ్యం. ఆ నగర సమీపంలోనే గాఢాశ్లేషంలో బిగిసిపోయిన అస్థిపంజరాల జంట బయటపడటం విశేషంగా భావిస్తున్నారు. ఆ జంటది సహజమరణమా, ఆత్మహత్య చేసుకున్నారా లేక ఏ మతాచారాల ప్రకారమో వారిని బలి ఇచ్చారా అన్నది పరిశోధనల తరవాతనే తేలుతుంది. జంట అస్థిపంజరాల పక్కనే మరొక మానవ అస్థిపంజరం కూడా కనబడింది. దాన్నిబట్టి చరిత్రకు అందని కాలానికి చెందిన శ్మశానవాటికగా ఆ ప్రదేశాన్ని పరిగణించవచ్చంటున్నారు. జంట అస్థిపంజరాల తలలు ఉత్తరం దిక్కుగా కాళ్ళు దక్షిణదిశగా ఉండేటట్లు ఖననం చేయగా, ఆ సమీపంలోనే దొరికిన మరో మానవ అస్థిపంజరం తల తూర్పు దిక్కుగా కాళ్ళు పడమటి దిశగా ఉన్నాయి. ''అలా భిన్న దిక్కుల్లో ఎందుకు ఖననం చేశారో బోధపడటం లేదు'' అంటున్నారు శాస్త్రజ్ఞులు. వివరాలు పరిశోధనల్లో కాని తేలవు. చరిత్రకందని కాలపు మడతల్లో సైతం అమరప్రేమకథలు దాగి ఉన్నాయని ఈ జంట అస్థిపంజరాలు రుజువు చేస్తున్నాయి. అందుకేగా- ''ప్రేమకన్నను యెక్కువేముందిరా, యెల్లకామ్య పదవులకన్న ప్రేమే యెక్కువరా'' అన్నారు కవి!
(Eenadu-25:02:2007)
--------------------------------------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home