పెద్ద మనసు
వృత్తుల్లో భిక్షాటన అతి ప్రాచీనమైనది. కేవలం పేదరికం వల్లేకాక పరంపరగా వస్తున్న ఆచారంవల్లనూ వెనకటి రోజుల్లో కొందరు మాధూకర వృత్తితోనే జీవనం సాగించేవారు. వారిని పండితులుగా భావించి గౌరవించి ఆదరించేవారు. ఎవరైనా సరే ఇంటిముందు నిలబడి- భిక్షాందేహి అని అర్థిస్తే ఇల్లాళ్ళు భిక్షం పెట్టకుండా పంపేవాళ్ళు కాదు. నలుగురికి పెట్టిందే మనకు మిగిలేది అన్న నమ్మకంవల్ల అప్పట్లో దానం చేయటానికి ఎవరూ వెనకాడేవారు కాదు. ''గురుకుల వాసమూ మాధూకర వృత్తీ చదువుకొనేవాడికివి మంచివనే నా నమ్మకం యిప్పటికీ. తుమ్మెద కాస్తకాస్త చొప్పున పువ్వుపువ్వునుంచీ మకరందం సంపాదించుకొంటుంది. భోజనం విషయమై విద్యార్థికిది సరిగా అలాంటి వృత్తి'' అని రాశారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన ''అనుభవాలూ- జ్ఞాపకాలూను'' అనే గ్రంథంలో. పరమేశ్వరుణ్నే పతిగా పొందాలని పార్వతి తపశ్చర్య ప్రారంభించినప్పుడు కపటవటుని రూపంలో వచ్చిన శివుడు భిక్షాటన విషయమే ప్రస్తావించి ఆదిదేవుణ్ని పరిహసిస్తాడు. ''ఎక్కడా మనువు దొరకకనా ఆ జంగమయ్యే కావాలంటున్నావు'' అని అడిగి- ''ముది గొడ్డునెక్కి భిక్షాటనంబు చేయబోవుట యదియు మెచ్చాయె జువ్వె...'' అంటూ హేళనచేస్తాడు. శివనింద భరించలేక పార్వతి కోపం తెచ్చుకుంటే అప్పుడు పరమశివుడు తన అసలు రూపం ప్రదర్శించి ఆమెను కరుణించి కల్యాణమాడతాడు. రానురాను కాలం మారిపోయింది. దానధర్మగుణాలు తగ్గిపోయాయి. భిక్షాటనను బిచ్చగాళ్ళను నిరసనగా చూడటమూ ఎక్కువైపోయింది. భిక్షుకుల మోసాలు వేషాలు కూడా అధికమయ్యాయి.
''ఇలా రోడ్డుమీద నిలబడి అడుక్కోవటానికి నీకు సిగ్గుగా లేదూ?'' అని అడిగాడు ఆ పెద్దయ్య తన ముందు నిలబడి చెయిచాపిన భిక్షుకుణ్ని. ''అయితే ఏం చేయమంటారు ఆఫీసు పెట్టమంటారా?'' అని రుసరుసలాడాడా ఆసామి. ''నా చెయి కిందా మీ చెయి పైనా ఇచ్చిపుచ్చుకొను రుణమే బాబూ, ముష్టి ఏమిటది ముసలి బ్రహ్మ మన చిట్టాలో రాసిన జమలే బాబూ...'' అంటూ దబాయింపు సెక్షను ఉపయోగించి మరీ అడుక్కొంటాడో యాచకేశ్వరుడు ఓ సినిమాలో. యాచించటం దగ్గరకొచ్చేసరికి మహావిష్ణువంతటివాడు వామనుడైపోతాడు. ''అధిక దానంబడుగ అది పాడి కాదు పృధివి మూడడుగులు దానంబు యిమ్మి...'' అని బలిచక్రవర్తిని అడుగుతాడు. అసలు విషయాన్ని గ్రహించిన శుక్రాచార్యుడు- ''వామనరూపుడై వసుధ జన్మించి నిను వంచన చేయ యిట కొచ్చినాడు, పొట్టివానికి కాదె పుట్టెడు బుద్ధి దిట్టతనమున వీని ఝడిపించి విడువు-'' అంటాడు. బలిచక్రవర్తి అందుకు ఒప్పుకోడు. మహామహులు కొలిచే శ్రీహరి- ''కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నా పాయమే'' అంటూ తన చేయి మీదుగా వామనుని చేయి కిందుగా ఉండగా మూడడుగుల నేల దానమిస్తాడు. ఆ వెంటనే వామనుడు విజృంభించి బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కటం అదో రసవత్తరమైన కథ. భిక్షాటనకు ఇంత పూర్వచరిత్ర ఉన్నప్పటికీ ఈ రోజుల్లో భిక్షుకులపై సానుభూతి చూపించి గౌరవించేవారు దాదాపు లేరనే చెప్పాలి. కోల్‌కతాకు చెందిన మలేసాహా మాత్రం అందుకు మినహాయింపు.
''మా అబ్బాయి పెళ్ళి మీరంతా తప్పక రావాలి'' అంటూ బంధువులను, స్నేహితులను, తెలిసినవారిని పిలవటం మామూలు. వచ్చిన వారికి చందన తాంబూలాది సత్కారాలు చేయటమూ పరిపాటే. కోల్‌కతాలోని సాహా కుటుంబీకుల పద్ధతే వేరు. వారు తమ ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకు పనికట్టుకొని వెళ్ళి వీధి బిచ్చగాళ్ళకు శుభలేఖలిచ్చి మరీ ఆహ్వానిస్తారు. మిగతా అతిథులతో సమానంగా ఆదరిస్తారు. విందుభోజనం పెట్టి నూతన వస్త్రాలూ బహూకరిస్తారు. ఈ పద్ధతిని మొదట్లో సతీష్‌చంద్రసాహా ప్రారంభించాడు. ఆయన తన కుమారుడు మలేసాహా వివాహానికి దాదాపు 175మంది వీధి భిక్షుకులను ఆహ్వానించాడు. ''ఆ సమయంలో ఆ భిక్షుకుల మొహాల్లో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. వారు హృదయపూర్వకంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. బడుగు జీవుల ఆశీర్వాద ఫలమే మా కుటుంబాన్ని చల్లగా కాపాడుతోంది'' అంటాడు సతీష్‌చంద్రసాహా. తండ్రి నెలకొల్పిన సంప్రదాయాన్ని ఆయన కుమారుడు మలేసాహా కూడా అనుసరిస్తున్నాడు. ఇటీవల మలేసాహా తన భార్యా కుమారునితో కలిసి సీల్దానుంచి సోధ్‌పూర్ వరకు తిరిగి కనపడ్డ భిక్షుకులందర్నీ ఆహ్వానించాడు. ''మొదట్లో నేను నమ్మలేకపోయాను. కాని నిజంగానే వారు నన్ను పిలుస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. కొద్దికాలం క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ వారిచ్చిన కొత్తచీర కట్టుకొని పెళ్ళికి వెళ్ళాను. సాహా కుటుంబం మమ్మల్నెంతగానో ఆదరించింది' అంటూ సంతోషంగా చెప్పింది డమ్‌డమ్ విమానాశ్రయం దగ్గర బిచ్చమెత్తుకొనే తులసీరాణిదేవి. సాహా కుటుంబీకులు ఆహ్వానించి తీసుకొచ్చిన భిక్షుకుల్లో వికలాంగులు, గుడ్డివారు, సాధువులు సైతం ఉన్నారు. అందరినీ ఆదరించి పెళ్ళికూతురు మాంపియే స్వయంగా విందు భోజనం వడ్డించింది. ఆపై మాలెసాహా వారందరికీ కొత్తబట్టలు బహూకరించాడు. ఊహించని ఈ అపూర్వ సత్కారానికి భిక్షుకులంతా ఎంతో సంతోషించి ఆ కుటుంబంవారంతా చల్లగా ఉండాలని తమ శుభాకాంక్షలు తెలుపుతూ వెళ్ళారు. ''ఈ సంప్రదాయాన్ని నా తరవాతి తరాల వారూ కొనసాగిస్తారనే నా నమ్మకం'' అంటున్నాడు మలేసాహా. మంచి పద్ధతి ఎవరికైనా అనుసరణీయమే కదా!
(Eenadu-18:03:2007)
--------------------------------------------------------------------------------
Labels: beggars/Telugu
0 Comments:
Post a Comment
<< Home