ఉభయతారకం

ఇక తమకు సంతానం కలగదని తెలుసుకున్నవారు కొందరు బంధువుల పిల్లలనో స్నేహితుల పిల్లలనో పెంచుకోవటమూ జరుగుతుంటుంది. 'పెంచుకున్నవాడు కొడుకూ కాదు, ఉంచుకున్నవాడు మొగుడూ కాదు అన్న ముతక సామెత నిజమవుతున్న సందర్భాలూ చాలానే ఉంటున్నాయి. పెంచినవారి ఆస్తిపాస్తులపైనే దృష్టి ఉంచి పెంపుడు తల్లిదండ్రుల బాగోగుల గురించి పట్టించుకోనివారి బాగోతాలు కొత్తేమీ కాదు. పిల్లలన్న తరవాత సమస్యలెన్నో పుట్టుకొస్తుంటాయి. పిల్లల్ని పెంచి పెద్దచేసి చదువు చెప్పించి జీవితంలో స్థిరపడేటట్లు చేసేంతవరకు తల్లిదండ్రుల బాధ్యత తీరదు. సంతానంవల్ల ఇటువంటి చింతలు కొన్ని ఉన్నప్పటికీ పిల్లల కోసం తాపత్రయపడటం మానవ సహజం. శాస్త్ర విజ్ఞానం పెరిగిన కారణంగా కొన్ని లోపాలున్నా వాటిని పక్కకు నెట్టి సంతానం పొందగల అవకాశం ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంది.
''ఎవరు కన్నారెవరు పెంచారు, నవనీత చోరుని గోపాల బాలుని'' అని ప్రశ్నించిన కవి- ''తాను కనకనె తల్లియయ్యెను, తనయుడాయెను దేముడే యశోదకు...'' అని జవాబు చెప్పారు. ఒకరి బిడ్డను మరొకరు పెంచటం వింతేమీ కాదు. ఒకరి అంశాన్ని మరొకరు తన గర్భవాసంలో ధరించి నవమాసాలు మోసి, తన కడుపులో పెరగనిచ్చి చూలింత బాలెంత కష్టాలన్నీ భరించి కని చివరకా గర్భఫలాన్ని అసలువారికి అప్పగించడం విశేషమే. తమ గర్భాశయాన్ని అద్దెకివ్వటానికి సిద్ధపడిన యువతులు అందుకు తగిన ప్రతిఫలం పుచ్చుకొని తమ ఆర్థికావసరాలను తీర్చుకుంటున్నారు. ఉభయతారకంగా ఉన్న ఈ పద్ధతి వల్ల అటు అసలు తల్లికి, ఇటు అద్దె తల్లికి- ఇద్దరికీ లాభం కలుగుతోంది. ఇటువంటి సంఘటనే ఇటీవల అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన కేరన్ కిమ్ అనే మహిళ గర్భాశయ లోపాల కారణంగా స్వయంగా గర్భభారాన్ని వహించి బిడ్డను కనలేకపోతోంది. ఫలదీకరణ ప్రక్రియలో నిపుణురాలైన అహ్మదాబాద్ డాక్టర్ నయనా పటేల్‌ను ఆమె సంప్రతించారు. కోల్‌కతాకు చెందిన ఓ మహిళ తనవంతు సహకారాన్ని అందివ్వటానికి అంగీకరించారు. ఆమె గర్భాశయాన్ని కిమ్ అద్దెకు తీసుకున్నారు. ఇందుకుగాను ఆమెకు రెండున్నర లక్షల రూపాయల నగదుతోపాటు గర్భభారాన్ని వహించిన తొమ్మిది నెలలూ నెలకు నాలుగువేల రూపాయలు ఖర్చుల కింద ముట్టాయి. గర్భాశయాన్ని అద్దెకిచ్చిన మహిళకూ ఓ బిడ్డ ఉన్నాడు. గుండెజబ్బు కారణంగా అతను మృత్యువుకు చేరువవుతున్నాడు. అతని చికిత్సకు అవసరమైన డబ్బు ఆమె దగ్గర లేదు. ''అటువంటి పరిస్థితుల్లో కిమ్ ఇచ్చిన డబ్బు అయాచిత వరంగా నాకు లభించింది. నా బిడ్డను కాపాడుకోగలిగాను'' అంటోంది ఆమె సంతోషంగా. ''ఒకరి బిడ్డను మరొకరు మోయటమంటే మాటలు కాదు. అందుకు ఎంతో సహనం, మంచితనంతోపాటు మానవతా దృక్పథం, ఇతరులకు సహాయపడే సుగుణమూ ఉండాలి. ఈ లక్షణాలన్నీ కలిగిన త్యాగమయి లభించటం నా అదృష్టం'' అని కిమ్ సంతృప్తి వెలిబుచ్చుతోంది. అటు అసలు తల్లికీ, ఇటు అద్దెతల్లికీ ఇద్దరికీ ఉభయతారకంగా సంతోషాన్ని కలిగించే ఇటువంటి ప్రక్రియను కనిపెట్టిన శాస్త్రజ్ఞులు ఎంతైనా అభినందనీయులు!
(Eenadu-11:03:2007)
--------------------------------------------------------------------------------
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home