My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, May 29, 2007

మతచిహ్నాల వైశిష్ట్యం

తెలియని దాన్ని తెలిసేవిధంగా బోధించడానికీ; అమూర్త వస్తువులను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించడానికీ ప్రతీకలు ఉపయోగపడతాయి. మనం మాట్లాడే భాష కూడా చాలావరకు ప్రతీకలు, గుర్తులతో కూడుకున్నదే. గణిత శాస్త్రంలో వీటి ప్రాముఖ్యం చాలా హెచ్చు. విజ్ఞాన శాస్త్రంలోనేగాక మతంలో కూడా ఈ చిహ్నాల అవసరం ఎంతయినా ఉంది. మతం కొన్ని భావాలను విస్పష్టంగా నిరూపించాలంటే ప్రతీకలు వాడక తప్పదు.

ఓం కారం హిందూ మతంలో ఎంతో ముఖ్యమైనది. ఈ జగత్తును శాసించే అద్భుత శక్తికిది ఓ సంకేతం. పరబ్రహ్మకు సర్వోత్కృష్టమైన ప్రతీకే ''ఓం''. దీనినే ప్రణవం అని కూడా అంటారు. ఓంలో అ-ఉ-మ అనే మూడు వర్ణాలు మిళితమై ఉన్నాయి. ''అ'' అంటే సృష్టి. ''ఉ'' అంటే స్థితి; ''మ'' అంటే అమ్మ అని అర్థం. ఈ మూడు పనులను నిర్వర్తించే పరమాత్మే ''ఓం'' అక్షర సంకేతం. వేదాలు, ఉపనిషత్తులు కూడా దీని మహత్తును చాటుతున్నాయి. ఓంకారంతోనే హిందూ మత కర్మకాండలు ఆరంభమవుతాయి.

బౌద్ధుల ప్రతీక ధర్మచక్రం. తొట్టతొలుత బుద్ధుడు సారనాథ్‌లో ఓ ఐదుగురు శిష్యులను కూచుండబెట్టుకుని తన ఉపదేశాన్నందించాడు. ఆ రోజు ప్రారంభించిన ధర్మబోధనా వ్యాసంగమే ధర్మచక్ర ప్రవర్తన అయింది. శిష్యగణానికి బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని బోధించాడు. ఈ ఎనిమిది అంశాలకు ఆ చక్రంలోని ఎనిమిది ఆకులూ ప్రతీకలు. ధర్మచక్రం మధ్య కుండ మీద మూడు చుక్కలుంటాయి. దుఃఖహేతువులైన దుష్టచింతన, అజ్ఞానం, కామం అనే మూడింటికీ మూడు చుక్కలూ సంకేతాలు. పరిణామశీల జగత్తునూ, దాని క్షణికత్వాన్నీ ఈ చక్రం సూచిస్తుంది.

జైన మతస్తులు నెలవంక, స్వస్తికం మధ్య ఒక చక్రంతో కూడిన అరచేతిని తమ మత ప్రతీకగా వ్యవహరిస్తున్నారు. రత్నత్రయంగా పిలిచే సద్విశ్వాసం, సత్‌జ్ఞానం, సత్ప్రవర్తన అనే మూడింటి ద్వారా మానవ జాతికి విమోచన సాధ్యమని మత ప్రతీకలోని ఆ అరచేయి సూచిస్తుంది. స్వస్తికం (స్వస్తిక్) మంగళప్రద చిహ్నం. దానిపై ఉండే మూడు చుక్కలూ ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలకు గుర్తులు. చంద్రవంక మోక్షం పొందినవారు నివసించే పరలోకానికి చిహ్నం.

ఇస్లామిక్ సంస్కృతికి ప్రధాన చిహ్నాలు నెలవంక, నక్షత్రం. ఆటోమన్ తుర్కలు బైజాంటైన్ సామ్రాజ్యాన్ని జయించినప్పుడు ఆ సామ్రాజ్యపు సైనిక లాంఛనమయిన నెలవంక, నక్షత్రం గుర్తును సంగ్రహించారు. లోకయాత్రలో అలసిన బాటసారులకు చల్లని వెలుగునిచ్చేవాడు చంద్రుడనీ, అల్లాను చేరే మార్గాన్ని నక్షత్రం నిర్దేశిస్తుందనీ వారి విశ్వాసం.

ఏసుక్రీస్తు సిలువ మీద ప్రాణాలర్పించాక క్రైస్త్రవులకు సిలువ మతచిహ్నమైంది.

పార్శీల మతాన్ని జొరాస్ట్రియనిజమ్ అంటారు. ఈ మత ప్రవక్త జొరాస్టీర్, జరమిష్ట్ర అని చెబుతారు. ఈ మతస్తులకు అగ్ని దివ్యపురుషుడు. అగ్ని సర్వకల్మషాలను దహించివేస్తుంది కనుక అది పరిశుద్ధమైందనీ, సర్వజీవుల్లోను ప్రకాశించే వెలుగు అగ్నేనని భావిస్తారు. వారి ఆలయాల్లో అగ్ని ఆరిపోకుండా నిరంతరం ఉండేవిధంగా ఎంతో జాగ్రత్త వహిస్తారు.

ప్రపంచంలో ప్రతి మతానికీ ఓ ప్రతీక ఉంటుంది. మతాలు, మత చిహ్నాలూ వేరైనా మనుషులంతా ఒకటేనని మతచిహ్నాలన్నీ పరమాత్మను చేరుకునే మార్గాన్నే సూచిస్తున్నాయన్నది మాత్రం మరవకూడదు.


- యం.సి.శివశంకరశాస్త్రి
(Eenaadu-26:05:2007)
----------------------------------------------------------------

Labels: ,

0 Comments:

Post a Comment

<< Home