వెబ్‌లో తెలుగు వెలుగులు
(10:06:2007)
'భారత్ వెలిగిపోతోంది'... ఇదో రాజకీయ వ్యాఖ్య.ఇందులో నిజానిజాలు ఆ వ్యాఖ్య చేసిన కీయనాయకులకే ఎరుక.'ఇంటర్‌నెట్‌లో తెలుగు వెలిగిపోతోంది'... ఇది మాత్రం పదహారణాల నిజం. నమ్మకపోతే... వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు. ఇదొక్కటే కాదు, ఆన్‌లైన్‌లో మాత్రమే వెలువడే తెలుగు పత్రికలూ అచ్చతెలుగు బ్లాగులూ ఎన్నో ఎన్నెన్నో! అదో ప్రత్యేక లోకం. అంతర్జాలం(ఇంటర్‌నెట్)లో తెలుగు మాయాజాలం... పదండి మనమూ చూద్దాం.
ఏదో రిఫరెన్సు కోసం అర్జంటుగా 'భర్తృహరి' సుభాషితాలు చూడాల్సి వచ్చింది. అంత అర్జంటుగానూ ఆ పుస్తకం దొరకడమంటే కష్టమే. అథవా దొరికినా... ఏదో చిన్న సందేహం తీర్చుకోవడం కోసం అంత ఖర్చు పెట్టి పుస్తకం కొనడానికి మనసొప్పని వాళ్లు చాలా మందే ఉంటారు. ఏం ఫర్వాలేదు! అలా ఇంటర్‌నెట్ సెంటర్‌కి వెళ్లి .www.andhrabharati.com సైట్ చూస్తే సరి. అందులో భర్తృహరి సుభాషితాలు చూడీజీ(చూడ్డం ఈజీ అన్నమాట). అదొక్కటేనా! రామాయణ, భారత, భాగవతాలూ... మనుచరిత్ర, పారిజాతాపహరణం లాంటి ప్రబంధాలూ... వేమన, సుమతీశతకాలూ... అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలూ... ఇలా ఏం కావాలన్నా ఒక్క (మౌస్)క్లిక్కు దూరంలో ఉంటాయి. ఆంధ్రభారతి వంటి సాహిత్య సంబంధ వెబ్‌సైట్లే కాకుండా జాతీయ, అంతర్జాతీయ వార్తలూరాజకీయ విశ్లేషణావ్యాసాలూ వంటలూ జోకులూ పుస్తక, సినిమా సమీక్షలూ కళలూ సంస్కృతుల విశేషాలందించే తెలుగు వెబ్‌సైట్లు బోలెడు.తెలుగు వెబ్‌సైట్లను స్థూలంగా ఆన్‌లైన్ వార్తాపత్రికలు, నెట్‌లో మాత్రమే లభ్యమయ్యే వెబ్‌జైన్లు, బ్లాగు సైట్లుగా విభజించుకోవచ్చు. ఇరవైనాలుగ్గంటల వార్తా చానళ్లెన్నున్నా పొద్దున్నే పేపర్ చదవందే కడుపు కదలదు చాలా మందికి. ఇక్కడంటే తెల్లారేసరికి గుమ్మంలో పేపరు వేయించుకునే సౌలభ్యం ఉంది కానీ... వేరే దేశాల్లో ఉండే తెలుగువారికి ఆ సౌకర్యం ఏదీ? తెల్లారితే ఆఫీసు పనుల్లో బిజీగా ఉండేవారి ఇబ్బందీ అదే. తెలుగుపేపర్ల ఇంటర్‌నెట్ ఎడిషన్లు అలాంటి వారి కోసమే. ఉదాహరణకు ఈనాడు పేపర్ నెట్ఎడిషన్‌ను .www.eenadu.net లో చూడొచ్చు. అలాగే మిగతా పేపర్లవీ.
వెబ్‌జైన్స్
పత్రికల విషయానికొస్తే... కౌముది, సుజనరంజని, ఈ మాట, పొద్దు... ఇవన్నీ ఇంటర్‌నెట్‌లో మాత్రమే చూడగలిగే ఆన్‌లైన్ తెలుగు పత్రికలు. ఈ విభాగంలో ప్రాచుర్యం పొందిన వెబ్‌సైట్లు ఇవీ...
www.koumudi.net
www.siliconandhra.org
www.prajakala.org
www.eemata.com
http://poddu.net
అంతా 'బ్లాగు' మయం!
సాధారణంగా ఏ విషయం మీదైనా మంచో చెడో మనకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని నలుగురికీ తెలిసేలా చేసే వెసులుబాటు ఈ బ్లాగింగ్. ఒక్కమాటలో చెప్పాలంటే సొంతగోడు వినిపించుకోగలిగే ఒక సౌలభ్యం. అలాగని బ్లాగింగ్‌ని అంత తేలిగ్గా తీసిపారెయ్యక్కర్లేదు. సునామీ వచ్చినప్పుడు ప్రసార సాధనాల కన్నా ముందు ఇంటర్‌నెట్ ద్వారా ప్రపంచం వెుత్తానికీ తెలిసింది బ్లాగర్ల ద్వారానే. అంతెందుకు! మన బ్లాగర్ల వల్లే నెట్‌లో తెలుగు విస్తృతి పెరుగుతోందంటే అతిశయోక్తి కాదు.
'తెలంగాణ వస్తుందా' దగ్గర్నుంచి 'ఫలానా సినిమా ఎందుకు ఫ్లాపయిందంటారూ...' దాకా బ్లాగర్లకు ప్రతిదీ ఇష్యూనే. అలా అని అందరూ సిల్లీ కబుర్లతో కాలక్షేపం చేస్తారని కాదు. ఎంతో ఉపయోగపడే సీరియస్ చర్చలూ సాగుతాయి. మన తెలుగు బ్లాగుల పేర్లు కూడా 'సోది', 'తెరచాటు చందమామ', 'అహ నా బ్లాగంట'... ఇలా ఒకింత వినూత్నంగా ఉంటాయి.
అంతాబానే ఉంది కానీ... అసలింతకీ తెలుగులో బ్లాగింగ్ చేయడం ఎలా అనే సందేహం రావచ్చు. దానికో మార్గం ఉంది. .www.blogger.com/start మసైటులోకి వెళ్తే అందులో ఇచ్చిన సూచనల ప్రకారం ఎవరైనా తమ సొంత సోది రాసుకోవచ్చు(సొంత బ్లాగు రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గం మాత్రమే. ఇలాంటివి చాలానే ఉన్నాయి. నెట్‌లో వెతికితే ఇంకా చాలా దొరుకుతాయి). అయితే... ఈ సైటు ద్వారా మన భావాలను తెలుగులో టైపు చేయలేం. దానికి 'యూనికోడ్ ఎడిటర్' అవసరం. అదేంటో అని కంగారు పడక్కర్లేదు. అదికూడా ఆన్‌లైన్‌లోనే దొరుకుతుంది.http://lekhini.org అనే వెబ్‌సైట్‌లోకి వెళ్తే కావలసినంత పైత్యాన్ని తెలుగులోనే వెళ్లగక్కి దాన్ని అక్కణ్నుంచి కాపీ చేసి మన బ్లాగు ఎడిటర్‌లో అతికించి ఇంచక్కా పోస్ట్ చేసెయ్యెుచ్చు(పద్మ, బరహ వంటి మరికొన్ని ఎడిటర్లు కూడా ఉన్నాయి, బ్లాగుల్లోకి అడుగంటూ పెడితే అన్నీ అవే తెలుస్తాయి). అందుకు కావలసిందల్లా కాసింత ఇంగ్లిషు పరిజ్ఞానం, కూసింత టైపింగ్ నైపుణ్యం... అంతే!
సరే! మనం రాయాలనుకున్నది రాస్తాం. దాని సంగతి మిగతా నెటిజన్లకు ఎలా తెలుస్తుందంటారా? http://koodali.org అనే తెలుగు బ్లాగుల కూడలి ఈ ప్రశ్నకు సమాధానం. మీ బ్లాగ్ చిరునామా తెలియచేస్తూ ఆ వెబ్‌సైట్‌లో అభ్యర్థన ఉంచితే మీరూ 'కూడలి'లో సభ్యులయిపోతారు(మీ బ్లాగులో అసభ్య/అభ్యంతరకర రాతలేవీ లేకపోతేనే సుమా!). http://thenegoodu.org,
http://telugubloggers.blogspot.com
అనే మరో రెండు వెబ్‌సైట్లు కూడా తెలుగు బ్లాగర్ల సమాహారాలే.
తెవికీ
...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్ (http://te.wikipedia.org) ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం వెుదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి....ఇవీ వెబ్‌లో తెలుగువెలుగులు. ఇప్పటికే ఎందరో ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంతో నెట్‌లో ఈ తెలుగువెలుగుల్ని పూయిస్తున్నారు. ఈ జోరు తగ్గకుండా ఉండాలంటే... మరిన్ని తెలుగుసైట్లతో నెట్ కళకళలాడాలంటే... కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అందరూ తమ వంతు కృషిచేయాలి. లేకపోతే ఆంధ్రులు ఆరంభశూరులన్న అపప్రథ ఉండనే ఉంది, గుర్తుందిగా!
http://www.eenadu.net/htm/2vnewfeatureshow.asp?qry=2&reccount=12
_____________________________________________
Labels: Blogging
0 Comments:
Post a Comment
<< Home