My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, June 12, 2007

మంచి మిత్రుడు

'క స్నేహితుడి కోసం ప్రాణాల నర్పించటమనేది ఏమంత కష్టమైన పనేమీ కాదు; కాని అంతటి త్యాగానికి అర్హుడైన మంచి స్నేహితుడిని సంపాదించుకోవడమే కష్టం!' అన్నాడొక పెద్దాయన. మంచి స్నేహితుడు మన కష్టాలను భాగిస్తాడు, సుఖాలను హెచ్చవేస్తాడు అన్నారు పెద్దవాళ్లు. లోకంలో తల్లిదండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి స్నేహితుడే అన్నాడు శ్రీమాన్‌ పరవస్తు చిన్నయసూరి తన నీతి చంద్రికలోని మిత్రలాభంలో.

'మన స్నేహితుడు- మనం పాపకార్యాలు చేయబోతుంటే వారిస్తాడు. మనచేత మనకు మేలు కలిగే పనులే చేయిస్తాడు. మన రహస్యాలను బయటకు పొక్కనివ్వడు. మన సుగుణాలను వృద్ధి చేస్తాడు. మనం కష్టాలలో ఉంటే వదలి వెళ్లడు. డబ్బు లేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు. ఇవే మంచి మిత్రుడి లక్షణాలు' అన్నాడు భర్తృహరి.

'నీ శత్రువుల చేత జూద మాడించి, రాజ్యాన్ని కాజేసి, అడవులకు పంపావు; బాగానే ఉన్నది. అంతటితో సరిపోయిందనుకొన్నావా? మన ఐశ్వర్యాన్నీ విలాసాలనూ వారికి చూపించి ఏడిపించవద్దా? వాళ్లున్న చోటికే వెళదాం పద!' అంటూ తన మిత్రుడినీ అతడి పటాలమంతటినీ తీసుకొని వెళ్లినవాడికీ, వాడివెంట వెళ్లినవాడికీ, వారి బంధుమిత్రాదులందరికీ శృంగభంగమైన కథ మనకు తెలుసు. ఇనుముతో కలిసి ఉన్నందుకు అగ్నికి సమ్మెట దెబ్బలు తప్పవు మరి.

బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి; కానీ, స్నేహితానికి అక్కరలేదు. చిన్నతనంలో ఒకే గురువు వద్ద యుద్ధ విద్య నేర్చుకొని 'ఒరే! నీకెప్పుడైనా ఇబ్బంది అంటూ వచ్చినట్లయితే మహారాజును నేనున్నానని మర్చిపోవద్దు; నా దగ్గరకు రావటానికి మొహమాట పడొద్దు' అని వాగ్దానం చేసిన మహారాజు వద్దకు ఆ బ్రాహ్మణుడు వెళ్లి 'నా కోసం ఏమీ వద్దు. మా అబ్బాయి పాల కోసం ఏడుస్తున్నాడు. ఒక్క ఆవును మాత్రం ఇవ్వు. చాలు!' అని అడిగితే ఆ మహారాజు నానా దుర్భాషలాడి పంపించాడు. ఫలితం అనుభవించాడు. ఈ కథ కూడా మనకు తెలుసు.

ఎప్పుడో చిన్నతనంలో కలసి చదువుకొన్న కుచేలుడు చినిగిపోయిన తుండుగుడ్డ చివర మూడు గుప్పెళ్ల అటుకులు మూట కట్టుకొని శ్రీ కృష్ణుడి వద్దకు వెళితే ఆయన ఆ బీద బ్రాహ్మణుడికి బ్రహ్మరథం పట్టాడు. ఆ అటుకుల నెంతో ఆప్యాయతతో తిన్నాడు. అతడడగ కుండానే అనంతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. కనుకనే ఆదర్శమైత్రికీ, మైత్రీ మాధుర్యానికీ మారురూపంగా నిలిచింది వారి కథ. అట్లా ఉండాలి స్నేహితుడంటే.

మంచి మిత్రుడు కంటికి రెప్పలాగా, కాలికి చెప్పులాగా మనలను కాపాడుతూనే ఉంటాడు. అంటే తాను ఇబ్బందిపడుతూ కూడా మనకు సుఖాన్ని కలిగిస్తాడు. సుగ్రీవుడికి వచ్చిన కష్టాన్ని విని 'సంజాత బాష్పః...' - కన్నీరు కార్చాడు శ్రీరాముడు. ఆయనే గుహుడితో 'ఆత్మ సమ స్సఖః-' నీవు నాకు ఆత్మతో సమానమైన స్నేహితుడివి అన్నాడు.

సంసారమనే విష వృక్షానికి అమృతంతో సమానమైన ఫలాలు రెండే రెండు. ఒకటి మంచి పుస్తకం; రెండవది మంచి మిత్రుడు. మంచి పుస్తకాన్ని చదువుకొంటూ ఆనందానుభూతిని పొందడం, మంచి మిత్రులతో మాట్లాడుతూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం- ఈ రెండూ మన చేతిలోని పనులే! కనుక మనం మంచి మిత్రులను సంపాదించుకొందాం! మనమూ వారికి మంచి మిత్రులు గానే ఉందాం! మన మందరమూ ఈ విధంగా ఉన్నట్లయితే మన సమాజం తప్పకుండా అమృత వృక్షమవుతుంది. సందేహం లేద.

- డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
(Eenaadu,09:06:2007)
_______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home