వంచనలోనే ఆనందం?
- చికిత
ప్రేమికుల రోజు, మిత్రుల రోజు, నీటి రోజు, నిప్పు రోజూ ఉన్నట్టుగా ఫూల్స్‌కి(మూర్ఖులకి) ప్రత్యేకంగా ఒక పండగ రోజు ఏప్రిల్ మొదటి తారీఖున ఉండటం ఎంతైనా ముదావహం. మిగతా రోజులన్నీ వారివి కావని కాదు. ఆస్తమా డే, క్యాన్సర్‌డే, ఎయిడ్స్ డే అని ప్రత్యేకంగా ఉంటాయి. అయినంత మాత్రాన మిగతా రోజుల్లో ఆయా జబ్బులకి ప్రాధాన్యం ఇవ్వరని కాదుగా.
పునఃచైతన్యం పొందటానికీ, పదవిలో ఉన్నవారు ప్రతియేటా ప్రజలకు పునరంకితం కావటానికీ స్టేడియంలో సంబరాలు జరుపుకొన్నట్టుగానే యావత్ మూర్ఖజాతి ఒకటై, (మూర్ఖపు) పనులన్నీ పక్కనపెట్టి- మూర్ఖలోకపు సత్తా చాటడానికి, మూర్ఖుల పునరుజ్జీవనానికి సంకల్పించటానికి ఒక రోజంటూ ఉండటం ఎంతో అవసరం.
మూర్ఖత్వం ఒకందుకు చాలా మంచిది. ప్రేమలో పడ్డవాడు ప్రాణాన్ని లెక్కచేయడు. సర్వస్వం త్యాగం చేస్తాడు. వాడికి బాధే సౌఖ్యం. దేవుడి భక్తిలో లీనమయినవాడికి ఐహిక కష్టసుఖాలు తెలియవు. అలాంటివాడు దారిద్య్ర బాధను లెక్కచేయడు. అలాగే మూర్ఖత్వం అబ్బితే గొర్రెపోకడే. మనం ఎన్నిసార్లు ఎలా మోసపోతున్నామనే స్పృహ ఉండదు. ప్రతిసారీ ఎన్నికల్లో ఇట్టే మోసపోతాం. మోసం తాలూకు నొప్పి గ్రహించే స్థితిలో ఉండం. అవునా కాదా?
విషయాన్ని కాస్తంత భిన్నంగా ఆలోచిద్దాం... వన్యమృగ సంరక్షణ దినోత్సవాన్ని వన్యమృగాలు జరుపుకోవు. మనం జరిపి, వాటి అభివృద్ధికి పాటుపడతాం. అలాగే మూర్ఖుల అభివృద్ధికి మూర్ఖులే పాటుపడాల్సిన పనిలేదు. మూర్ఖుల అవసరం ఉన్నవారు మూర్ఖుల్ని మూర్ఖులుగా ఉంచటానికీ, కొత్తవారు మూర్ఖులుగా పరిణతి చెందటానికీ సతతం పాటు పడతారు.
పురాణేతిహాసాల్లోనూ, చరిత్రలోనూ మనకు మూర్ఖులకు కొదవలేదు. మూర్ఖులే లేకుంటే అరాచకం తాండవిస్తుంది. జీవితంలో ఆనందం అంతరిస్తుంది. ఎవరైనా ఫూల్ అయితే మనం నవ్వుతాం. ఫూల్ కాని వారిని ఫూల్ చేసి ఆనందిస్తాం. ఫూల్ చేయడంలో ఆనందం ఉంది. ఒక వ్యక్తిని ఫూల్ చేస్తేనే ఎంతో ఆనందిస్తాం. ఈ లెక్కన కోట్లసంఖ్యలో ఉన్న ప్రజానీకం మొత్తాన్నీ ఫూల్స్ చేస్తున్నవారికి ఇంకెంత ఆనందం కలుగుతుండాలి? బ్రహ్మానందం అంటే అదేనేమో! అనంతానందం... అది అనుభవించినవాడికి తెలుస్తుంది. మనకు అర్థంకాదు.
మన మేరకు మనం మనకు దొరికిన వాణ్ని బక్రా చేసి ఆనందిస్తాం. ఎక్కువ మందిని బక్రా చేసి ఆనందిస్తున్నవాళ్లు అధికారంలో ఉండి అమితానందరస సాగరంలో మునిగి తేలుతుంటారు.
అధికారంలో ఉన్నవారిని ఐదేళ్లదాకా ఎలాగూ దించలేం... వారు ఏం చేసినా సరే ఎంత మేసినా సరే. మనల్ని బక్రా చేసి వాళ్లు గడ్డిమేస్తారు. వారిని మూర్ఖుల్ని చేయలేం. కనీసం అలా ఊహించుకుని జోకులు చెప్పుకుంటే పోలా?
సంతోషం సగం బలం అన్నారు. సరిగ్గా ఇలాగే ఊహించి ఉంటారు మన పూర్వీకులు. అందుకే రాజులపైనా, మంత్రులపైనా, ప్రజల్ని పీడిస్తున్న ఇతరేతర అధికార గణాలపైనా వారివారి మూర్ఖత్వం పైనా కథలుకథలుగా చెప్పుకొని కాలం గడిపేసి ఉంటారు.
ఈ లెక్కన పురాతన కాలం నుంచే మన దేశంలో 'మూర్ఖుల'కు కొదవలేదని అర్థమవుతోంది. కథలు ఊర్నే పుడతాయా, నిప్పులేనిదే పొగరాదు. తుగ్లక్‌లు కోకొల్లలు, నాటికీ నేటికీ.
రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం ప్రభలు చిమ్ముతూ పరిఢవిల్లుతోంది. కాని మూర్ఖ సంతతి మాత్రం అంతరించిందా అంటే లేదనే చెప్పాలి.
ఎదుటివాడిని ఫూల్ చేస్తేనే మనం తెలివిగలవాడిగా చెలామణీ అవుతాం. ఎంతో మందిని ఫూల్ చేస్తేనే నాలుగురాళ్లు వెనకేసుకోవచ్చు. అధికారం కూడా అంతే అనుకున్నాం కదా. ఈ పరమార్థం తెలిసినవాడు ఎప్పుడూ పైనే, మనపైనే ఉంటాడు.
(Eenadu,01:04:2007)
____________________________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home