కార్డులదే 'క్రెడిటంతా'!
'కార్డేరా అన్నిటికీ మూలం కార్డు విలువ తెలుసుకొనుట ధన'కుల' ధర్మం...''
కాలు లేకున్నా గడప దాటవచ్చు గాని, క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో, పెట్రో కార్డో, సెల్‌ఫోన్‌కు సిమ్ కార్డో ఏదీ లేకుండా జనం స్టెప్పు ముందుకు వేయలేకున్నారు. లక్ష్మీం 'కార్డు' సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం' అని చేతులు జోడించి ప్రార్థించాల్సిన పరిస్థితి. పోతన దిగివస్తే 'కార్డులు వాడెడు కరములు కరములు' అని పద్యం చెబుతాడు. శ్రీశ్రీ ఇప్పుడు ఉంటే ''వస్తున్నాయొస్తున్నాయ్ స్మార్టుకార్డులొస్తున్నాయ్'' అంటూ కార్డుప్రస్థాన గీతాన్ని ఆలపించక తప్పదు! ఇన్ని కార్డులేల స్మార్ట్ కార్డు ఉంటే పోలా అని రైతులు అనుకోవచ్చు. వారి ఇంటి ముంగిటికే ఎంచక్కా బ్యాంకింగ్ సేవలు అందించడానికి కార్పొరేషన్ బ్యాంకు ఈ 'స్మార్ట్ కార్డు'లను ప్రవేశపెట్టింది మరి. రేషన్ కార్డు, డ్యూటీలో ఐడెంటిటీ కార్డు (దీనిని అమెరికాలో బిజినెస్ కార్డు అని పిలుస్తారు), ఐటీలో పాన్ కార్డు, షాపింగుకు కోబ్రాండెడ్ కార్డులు, ఆరోగ్య బీమాకు హెల్త్ కార్డు ( మళ్లీ వీటిలో గోల్డ్, సిల్వర్, స్టాండర్డ్ కేటగిరీ కార్డులున్నాయి) ఇలాగ... ప్రతి కార్యకలాపానికీ కార్డులు రికార్డు స్థాయిలో పుట్టుకొచ్చిమనిషిని 'శుభా'వితం చేస్తున్నాయి. జేబులో చిల్లి గవ్వ లేకున్నా పెట్రోకార్డుంటే 'బండి' నడుస్తుంది. చేతిలో కార్డులుంటే, ఖాళీ జేబుతోఅయినా లోకం చుట్టిన వీరుడు కావచ్చు. కార్డును నువ్వు కాపాడుకొంటే అది నిన్ను కాపాడుతుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఎవరిదగ్గరయినా ఉందని తెలిస్తే అశోకా ద గ్రేట్ అన్నట్టు చూసేవారు. ఇప్పుడు అటువంటి కార్డుల్లో ఏ ఒక్కటి లేకపోయినా ముఖం వైపు అదో రకంగా చూస్తున్నారు.
'కార్డు పోయిందా డబ్బు గోవిందా' అని పాడుకోవల్సిందే. 'వడ్డి'చ్చేవాడు మన వాడనుకొని క్రెడిట్ కార్డులను వివిధ సంస్థలు ఎడాపెడా జారీ చేసేస్తున్నాయి. ఏ కార్డు ప్రత్యేక ప్రయోజనం దానికుంది. పాన్ కార్డు వచ్చి ఇన్‌కంట్యాక్స్‌ను గుర్తు చేసి 'మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే' అంటుంది. ఒళ్లెలా ఉంది? ప్రీమియం కడతావా లేదా అని అంతరాత్మ బెదిరించడం వల్ల ఆరోగ్య బీమా కంపెనీల హెల్త్ కార్డులు ఎంతో మంది దగ్గర కనిపిస్తూన్నాయి. కార్డుదారుల తల్లితండ్రులకో, భార్యాబిడ్డలకో అనారోగ్య సమయాల్లో నెత్తిన పాలు పోసేవీ ఇవే. కార్డు అంటే ప్లాస్టిక్ కరెన్సీయే. క్రెడిట్ కార్డు 'ఫోన్ బిల్లు కట్టేస్తా, ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపేస్తా' అంటూ అండగా నిలబడుతుంది. కార్డు కొనుగోళ్లకు పాయింట్లవారీగా పర్సంటేజీ క్యాష్ బ్యాక్ పథకాలున్నాయ్. ఉద్యోగులు ఆఫీసుల్లో అడుగు పెట్టినా, బయటకెళ్లినా 'పంచ్ అన్నది పెంచుమన్నా' అంటారు టైమ్ ఆఫీసు వాళ్లు. పిల్లలు మార్కులు మాగా వచ్చినప్పుడు 'అహనా ర్యాంకంట ఓహొనా కార్డంట...' అని హొయలు పోతారు. వీటన్నింటి కన్నా ఒక ఆకు ఎక్కువ చదివేది రేషన్ కార్డు. కొందరిని గులాబి రంగులో, మరికొందరిని కటాక్షిస్తుంది. ఈ మధ్య రేషన్ కార్డులను విదేశాలకు మనుషుల అక్రమ తరలింపునకు వాడుకుంటూ అక్రమ వ్యాపారం వెలగబెడుతున్నారు. ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం చేసిన పోస్ట్ కార్డేమో పదిహేను పైసల నుంచి యాభై పైసలకు పెరిగినా నా రాత మారలేదు అని ఆరున్నొక్క రాగం అందుకొంది. ఇప్పుడు పోస్ట్ కార్డు అంటే అదేమిటనన్నట్టు చూస్తున్నారంటే ఇహ చెప్పేందుకేముంది?
- ఫన్‌కర్
(Eenadu,29:04:2007)
____________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home