కొను.. కొనిపించు...
'విదేశీ కంపెనీలు కొంటాం...
ఎంత ఖరీదైనా ఫర్వాలేదు
ఎవ్వరడ్డొచ్చినా కేర్ చేయం'
అంటూ కాలరెగరేస్తోంది ఇండియన్ కార్పొరేట్ రంగం. సమరానికి సై అన్నట్లు ఎక్కడే బేరమొచ్చినా సరే మేం రెడీ అంటూ సిద్ధపడిపోతున్నాయి మన కంపెనీలు. వ్యాపారం చేసుకోవడానికి ఫ్రెంచివారు, డచ్ వారు, ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారని చరిత్రలో చిన్నప్పుడే చదువుకున్నాం. కాలక్రమేణా వాళ్లు బలిసిపోయి మన చొక్కాలే పట్టుకునే స్టేజ్ వచ్చేసరికి మేలుకుని ఢాం ఢూం అంటూ ఫైట్ చేసి దేశం నుంచి బయటకు గెంటేశాం.
అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! ఇప్పుడు మనవాళ్లే మోండా మార్కెట్లో మామిడిపళ్లు కొన్నంత తేలిగ్గా ఫారిన్ వెళ్లి వేల కోట్లు పోసి కంపెనీలను కొనుక్కుని వచ్చేస్తున్నారు. అందుకే
'ఆడవోయి భారతీయుడా
బేరమాడి కొనవోయి 'సీమ' కంపెనీల్...'
అన్న గీతం 'కోరస్'వత్తరంగా వినబడుతుంటే మనవాళ్లు ఊరకనే చేతులు ముడుచుకుని కూర్చుంటారా చెప్పండి. టెట్లే టీ, కోరస్, నోవెలిస్, రీపవర్... అబ్బో చెప్పుకుంటూ పోతే లిస్టు చేంతాడంత అవుతుంది. పరాయి గడ్డ మీద పురుడు పోసుకున్న కంపెనీలు ఇండియన్ల వశమవుతుంటే 'పోల వ్యాపారికిని దూర భూమి లేదు' అనిపించక మానదు కదా! పరి'శ్రమయేవ జయతే' అనుకుంటూ కొనుగోలే గోల్‌గా పడమటి దేశాల వైపు భా'రథ్' సారథులు దూసుకుపోతుంటే అక్కడి బాసులు తూరుపు తిరిగి దణ్నం పెట్టక తప్పట్లేదు.
వేరే దేశంలోని పరిశ్రమలను సొమ్ము చూపి, దమ్ము చూపి సొంతం చేసుకోవడమే ఈ రోజుల్లో అసలు సిసలైన సక్సెస్. కిందటేడాది విలీనాలు, కొనుగోళ్లపై ఇండియా ఇంక్ సుమారు 20.6 బిలియన్ డాలర్లను ధారపోసిందని ఒక అంచనా.ఇండియా పేద దేశం- ఇది ఒకనాటి మాట. ఇప్పుడది పాత పాట! బ్రిటన్‌లో అయితే అతి పెద్ద విదేశీ పెట్టుబడిదారుగా భారత్ అవతరించి, అగ్రరాజ్యం అమెరికానే తలదన్నడం విశేషమే కదా!
ఒక్క ఐటీ రంగంలోనే కాదు, ఔషధ తయారీ, బ్యాంకింగ్ రంగాల్లోనూ భారత్ వెలిగిపోతోంది. విదేశాల్లో భారతీయ పెట్టుబడులు పెరుగుతున్న తీరుకు 'లేదురా ఇటువంటి భూదేవి ఎందు' అనక తప్పదు. 'అమృతం కురిసిన రాత్రి' రాసిన బాలగంగాధర తిలక్ ఉంటే మారిపోయిన ఇండస్ట్రీ లక్కు చూసి 'డాలర్లు కురిసిన రాత్రి' మకుటంతో 'ఇండియాలో డాలర్లు పండును అమెరికాలో సంతానం పండును' అని తన కవితను మార్చి రాసేసేవాడు. ఇప్పుడే కాదు... ఇక ముందు కూడా
'కొను.. కొనిపించు... ఇండియన్ల సత్తా చూపించు... విదేశీ గుండెల్లో విమానాలు పరిగెత్తించు' అంటూ మనవాళ్లకు జేజేలు పలుకుతూ మీసం మెలేద్దామా!
- ఫన్‌కర్
(Eenadu,10:06:2007)
______________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home