'పన్నో' లక్ష్మీ ప్రచోదయాత్
'అశోకుడు చెట్లు నాటించెను
రోడ్లు వేయించెను'
అని పిల్లలు అదేపనిగా బట్టీ వేస్తుంటే ఇన్‌కమ్ ట్యాక్స్ లేకుండా ఆ మహానుభావుడు ఇన్ని పనులు ఎలా చేయగలిగా'డబ్బా'! అని ఇప్పటి పాలకులు 'చెక్కు'న వేలేసుకోవాల్సిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ కున్న ప్రాధాన్యం అటువంటిది. నిన్నగాక మొన్న బచ్చన్ల ఇంటి కోడలైన 'ఐశ్వర్య'రాయ్ మమ్ము చూడు, మా ట్యాక్స్ చూడు అంటోంది మరి. బచ్చన్ల కుటుంబం (ఐశ్వర్య సహా) రూ. 15 కోట్లు పన్ను కట్టి 'హీరో'దాత్తం ప్రదర్శించింది. మరోపక్క బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మాత్రం నేనే 'నెంబర్ వన్' అంటూ పాతిక కోట్ల పన్ను కట్టేసి సకల కళాప్రియులకి ఆదర్శప్రాయంగా నిలిచాడు. 'పన్నో' లక్ష్మీ ప్రచోదయాత్ అంటున్నారు జనం. ఈ ప్రపంచాన్ని కార్ల్‌మార్క్స్ ఉన్నవాళ్లు, లేనివాళ్లుగా విభజించాడు. కానీ ఉన్న వాళ్లను ఆదాయపు పన్ను కట్టేవాళ్లు, కట్టని వాళ్లుగా విభజించి కొత్తరకం వర్గ పోరాటం గురించి చెబితే ఇంకో రకమైన విప్లవం అదిరిపోయేది.
పన్ను దొంగలు వెన్న దొంగకు మించిన వాళ్లు. శ్రీకృష్ణ పరమాత్ముడు మన్ను తిని నోట్లో భువన భాండాలు చూపించి అదేదో గొప్పనుకున్నాడు. పన్ను దొంగలు మాత్రం పద్నాలుగు భువన భాండాలూ దిగమింగి ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లకు గూట్లో మట్టి చూపించాలని ప్రయత్నిస్తూంటారు. దాంతో ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్లు సోదాయం (ఆదాయం+సోదా) కోసం దూసుకుపోతుంటారు. ఆదాయపు పన్ను వల్ల 'సేవ్' చేయవచ్చు సరే, 'షేవ్' కూడా ఎలా చేయొచ్చో ఎగవేత మహానుభావుల్ని అడిగితే కంఠోపాఠంగా చెప్పేస్తారు.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందనేది సాంఘిక శాస్త్రం చెప్పే పాఠం. ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ల జాబు మాత్రం ఉన్నవాళ్ల జేబు చుట్టూ తిరుగుతుందనేది 'జీవ'శాస్త్రం చెప్పే పాఠం. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కలర్'ఫుల్'గా ఉండాలంటే 'బ్లాక్'మనీ 'వైట్'మనీగా మారాలని 'ధనవద్గీత' చెబుతోంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో యా(వే)తన జీవుల కష్టాలు యాతన జీవులవి. 'పెట్టని అమ్మ ఎటూ పెట్టదు... పెట్టే ముండకేమొచ్చింది' అన్నట్టు కట్టని మహానుభావులు ఎటూ కట్టరు.. కట్టేవాడికేమొచ్చింది' అన్నట్టుగా ఉంటోంది ఏలినవారి వరుస అనుకుంటూ సగటు జీవులు జేబులు తడుముకోవాల్సి వస్తోంది. ఏ చట్టం తన పని తాను చేసుకోకపోయినా ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుందన్నది వాస్తవం. అందుకే 'రవి గాంచనిచో కవి గాంచున్ అన్న పద్యం పాతబడిపోయింది. రవి గాంచకపోయినా, కవిగాంచక పోయినా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కాంచునే కదా అన్న పంక్తి పుట్టుకొచ్చింది. అందువల్ల ఈ దేశంలో అందరికీ ట్యాక్స్ కట్టేంత స్థోమత నివ్వు భగవంతుడా అని ప్రార్థిద్దాం. అంతకంటే ఏం చేయగలం. మనమూ పన్నుపోటు బాధితులమే కదా.
-ఫన్‌కర్
(Eenadu, 13:05:2007)
_______________________________________________
Labels: pun/telugu
0 Comments:
Post a Comment
<< Home