తాగిచూడు తేనీరు

కాఫీ టీలు జంటకవుల్లాంటివి. ఒకటి ఉన్నచోట మరొకటి ఉండనే ఉంటుంది. ఈ రెంటిలో ఏది గొప్ప అనే చిక్కుప్రశ్న వేస్తే మాత్రం సమాధానం చెప్పటం కష్టమే. రంభ, ఊర్వశిలలో ఎవరు గొప్ప అందగత్తె అన్న జటిలమైన పజిల్ పరిష్కరించిన ఏ విక్రమార్కునిలాంటి వాడో మళ్లీ పుట్టుకొచ్చి సమాధానం చెప్పాల్సిందేగాని- మామూలు మనిషికి సాధ్యంకాదు. దక్షిణాదిన కాఫీ ప్రాబల్యం ఎక్కువగా ఉండగా ఉత్తరాది వారికి చాయ్ అంటేనే ప్రాణం. ఉత్తర దక్షిణ సంస్కృతులు రెండింటినీ మేళవించుకొని వెలిగిపోతున్న హైదరాబాద్ వంటి నగరాల్లో కాఫీ టీలు రెండూ అప్రతిహతంగానే చలామణీ అవుతుంటాయి. మందుకీ సిగరెట్లకే కాదు, కాఫీ టీలకూ కవిత్వానికీ కూడా దగ్గర సంబంధమే ఉంది. ''మధురవాణి సాఖి హృదయేశ్వరి... పాత్రిక నింపి తెచ్చి...'' ఇచ్చిన మధువు తాగి మధురమైన మదిర కవిత్వం పారశీకపు గుబాళింపులతో రాసిన కవులున్నట్లే ఒక కప్పు కాఫీయో టీయో తాగి సిగరెట్టు దమ్ములాగుతూ అమోఘమైన కవిత్వం రాసే ఆధునిక కవులూ ఉన్నారు. శివకేశవుల్లాగా కాఫీ టీలు అభేద్యాలు అంటూ రెంటినీ సమానంగా లాగించే సవ్యసాచులూ ఎందరో. ''ఫిల్టరు మొదటి పట్టు నాకే సుమా ఒట్టు...'' అంటూ అందుకోసమే ఇంట్లో అందరికంటే ముందే లేచిపోయే ఉత్తమా ఇల్లాళ్లు ఉన్నారు. ''పక్కింటావిడ కొనుక్కున్న కాఫీ కలర్ చీర ఎంత బాగుందో... ఈసారి పండక్కి నేనూ అటువంటి కాఫీ కలర్ చీరే కొనుక్కుంటాను'' అంటూ తన నిర్ణయాన్ని వెలిబుచ్చిన శ్రీమతి హటాత్తుగా స్వరం హెచ్చించి, ''కాఫీ పొడి అయిపోయింది టీ పొడీ నిండుకున్నట్లుంది... అర్జంటుగా బజారుకు వెళ్లి రెండూ పట్రండి'' అని ఆజ్ఞాపిస్తే గురుడు పుంజాలు తెంపుకొంటూ బజారుకు పరుగెత్తక తప్పదు.
తేనీటి ఘుమఘుమలో కాఫీ పరిమళమో ముక్కు పుటాలకు సోకితే కాని తెల్లవారదు చాలా మందికి. ఇంకా పాన్పు దిగకుండానే, కళ్లు తెరవకుండానే కాఫీ గ్లాసు కోసమో టీ కప్పు కోసమో బారెడు పొడుగున చేతులు జాపే మహానుభావులు- ఎందరో. కాఫీ, టీలు జీవన స్రవంతిలో అంతగా అల్లుకుపోయాయి. ఈ రెండు పానీయాల్లో దేని రుచి దానిదే అయినప్పటికీ, ఆరోగ్య రీత్యా కాఫీ కంటె టీయే బెటరంటున్నారు డాక్టర్లు. టీకి హృదయసంబంధమైన వ్యాధులను నిరోధించే శక్తి ఉందంటారు. అది టీ డికాక్షన్‌లో పాలు కలపనప్పుడు మాత్రమే. పాలు కలిపినప్పుడు టీ అటువంటి శక్తిని కోల్పోతుంది అంటున్నారు పరిశోధకులు. ''ప్రపంచంలో మంచినీరు తరవాత మనుషులు ఎక్కువగా తాగేది టీనే. ఆ కారణంగా వ్యక్తుల ఆరోగ్యంపై టీ ఎటువంటి ప్రభావం చూపుతుంది అనే విషయం నిగ్గుతేల్చాలని సంకల్పించాం...'' అన్న డాక్టర్ వెరెనా స్టాంగల్ మరికొందరు జర్మన్ శాస్త్రజ్ఞులతో కలిసి అనేక పరిశోధనలు నిర్వహించారు. ఇంగ్లాండ్, భారత్ వంటిచోట్ల టీలో పాలు కలుపుకొని సేవించే అలవాటు ఉంది. ''బ్లాక్ టీలో ధమనులను వ్యాకోచింపజేసే లక్షణం ఉంటుంది. అందువల్ల రక్తప్రసరణ సజావుగా సాగిపోతుంది. పాలు కలపటంవల్ల టీకి రక్తనాళాలను వ్యాకోచింపజేసే శక్తి తగ్గిపోతుంది. ఆ కారణంవల్ల రక్తప్రసరణలో లోపాలు ఏర్పడే అవకాశాలున్నాయి...'' అంటున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ మేరియోలోపెజ్ అనే శాస్త్రజ్ఞురాలు. ఈ బృందం ఎంపికచేసిన 16 మంది వ్యక్తుల్లో కొందరితో బ్లాక్ టీని, మరికొందరితో పాలు కలిపిన టీని తాగించారు. రెండు గంటల తరవాత వారినందరినీ పరీక్షించగా పాలు కలపని టీ తాగిన వ్యక్తుల రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ సులువుగా సాగినట్లు, పాలు కలిపిన టీ తాగినవారిలో అటువంటి పరిణామం లేనట్లు తేలింది. కాబట్టి రుచుల కోసం చూడకుండా పాలు కలపని టీ తాగటమే అలవాటు చేసుకోవటం మంచిదేమో!
(Eenadu, 13:05:2007)
___________________________________________
Labels: Liesure/Telugu
0 Comments:
Post a Comment
<< Home