నవ్వంటే నవ్వులాట కాదు
-సోనాలి
నవ్వు విలువ చెప్పటానికి ''ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు'' అనే పాత పాట చరణం ఒక్కొటి చాలు. ''నీ దరహాసచంద్రికలు నిండిన నా మనస్సులో లేదు కదా లవలేశము పేదరికమ్ము'' అనే పద్యపంక్తి కూడా నవ్వు అనేది మనసుని ఎలా నింపుతుందో చెబుతుంది. ఒక్కసారి నవ్వరాదూ, ముత్యాలు ఏరుకుంటాననీ, మల్లెపూలు కోసుకుంటాననీ ప్రేయసితో చెప్పని ప్రియుడెవరుంటారు? ఆ ఒక్క మాటతో సదరు ప్రేయసి జీవితాంతం నడచి రాదూ...
ఎంత అపరిచితుడైనా (సినిమా కాదు) ఒక్కసారి నవ్వి చూడండి. వెంటనే బదులొస్తుంది. ఆత్మనీ, ప్రేమనీ, స్నేహాన్నీ అన్నింటినీ తెలియజేసేది నవ్వు ఒక్కటే. నవ్వుది జీవద్భాష, నవ్వుది అంతర్జాతీయ భాష. పసిపాప దగ్గర్నుంచీ పండు ముసలిదాకా నవ్వు ఎల్లలెరుగదు. నవ్వుతో కోటి భావాలు పలికించవచ్చు.
ఇలా నవ్వు గురించి ఎంతో చెప్పవచ్చు. రామాయణంలో నవ్వు ప్రస్తావన ఉంది, భారతంలోనూ ఉంది. (ప్రబంధ యుగంలో ఏడ్పుకి ఇచ్చిన ప్రాధాన్యం నవ్వుకి ఇవ్వలేదు.)
నవ్వు గురించి ఎంతైనా చెప్పవచ్చు కానీ నవ్వించేట్టు చెప్పటం కష్టం. ఎదుటివారిని ఇట్టే ఏడిపించవచ్చు కానీ నవ్వించటం కనాకష్టం. నవ్వించటం అంత సులభం కాదు. ఎదుటివాడికి హాస్య చతురత లేకుంటే ఇక బ్రహ్మతరమూ కాదు (బ్రహ్మ నవ్విస్తాడని అర్థం చేసుకోవద్దు). నవ్వించే ప్రతివాడి వెనకాలా ఒక విషాదం ఉంటుందన్నాడు ప్రముఖ హాస్య రచయిత ఆర్ట్ బుక్‌వాల్డ్. ప్రతి ఆనందం వెనకాలా మరొకరి దుఃఖం ఉంటుందన్నాడు బాల్జాక్. (ఈ సూత్రాలన్నీ కితకితలు పెట్టి నవ్వించేవాడికి వర్తించవు).
నవ్వు ఆరోగ్యాన్నిస్తుంది. నవ్వు బలాన్నిస్తుంది. (నవ్వుతున్నప్పుడు బలం పనికిరాదు. మనం దిండుని కూడా ఒడిసి పట్టుకోజాలం. తెలుసా!)
బాల్జాక్ చెప్పింది నిజమేననిపిస్తోంది. నాయకుల ఆనందం వెనకాల ప్రజల దుఃఖం ఉంటుంది. అవినీతీ, కాంట్రాక్టులూ, రోడ్లూ, ప్రాజెక్టులూ, సర్కారు ఇళ్లూ చూడండి... నిజమే కదూ!
''లోకమునందు ఏ మనుజుడు ఎక్కువ ఆనందము పొందును'' అని యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు. దానికి ధర్మరాజు సత్యకాలం మనిషి కనుక పారలౌకిక సమాధానమేదో ఇస్తాడు. నేనైతేనా ''ఎక్కువ కొంపలు ముంచినవాడు ఎక్కువ ఆనందము పొందును. దేశాన్ని నట్టేట్లో ముంచినవాడు బ్రహ్మానందము చెందును.'' అని ఠకీమని జవాబిచ్చేవాణ్ని, యక్షుడి బుర్ర తిరిగి స్పృహ తప్పేట్టు!
''నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు'' అని సిగ్గు తీసి చెట్టుమీద పెట్టేవాళ్లకీ పరమానందం సిద్ధిస్తుంది. లక్షలు తీసుకుని మహిళల్ని దేశాలు దాటించేవాడికున్నంత ఆనందం నీకూ నాకూ దక్కుతుందా?
'లంచం తిన్నావు' అంటే, 'రసీదు చూపెడితేనే ఒప్పుకుంటా' అనేవాళ్లకేం చెబుతాం? గాదెకింది పందికొక్కు రసీదిచ్చి బొక్కుతుందా, దొంగకుక్క రసీదిచ్చి కుండలు నాకుతుందా?
ఆనందించటం నేర్చుకోవాలని రుషులూ, సర్వసంగ పరిత్యాగులూ, ఆనందం పుష్కలంగా దొరుకుతున్నవాళ్లూ ఫ్రీగా ఉద్బోధిస్తారు. ఆ తత్వం తలకెక్కితే అంతా హాయే. దేవదాసు చెప్పినట్టు బాధే సౌఖ్యమనుకోవచ్చు, చీదరింపే సింగారమనుకోవచ్చు. అలా అనుకుంటే చాలు... ఆనందమే ఆనందం, డబ్బే డబ్బు, సౌఖ్యమే సౌఖ్యం! అనుకుంటాంకానీ, ఆనందాన్ని పొందటానికి అనేక మార్గాలున్నాయి. అందుకు సందు దొరక్క ఎదుటివాణ్ని వెక్కిరిస్తాం కాని!
సొంతంగా ఆనందించలేనివాడు ఆనందించేవాణ్ని చూసి ఆనందించటం నేర్చుకోవాలి. అలా కాకపోతే మనకు ఏడుపే మిగులుతుంది. ఆనందించేవాడు చెప్పే సూక్తి ఇది.
అలా నవ్వుకోటానికీ, ఆనందించటానికీ మనకు బోలెడు సరుకుంది. కళ్లంటూ ఉంటే చూసీ, వాక్కంటూ ఉంటే రాసీ అన్నట్టుగా చూడగలిగే భావుకత, నవ్వగలిగే సృజన ఉండాలి. అవి లేకుంటే అది ఎదుటివాడి తప్పా చెప్పండి?
కుక్క పిల్లా, సబ్బు బిళ్లా, అగ్గిపుల్లా ఏదైనా కవితామయమే అన్నట్టు ఏ పార్టీ అయినా, ఏ లీడరయినా, ఏ అధికారి అయినా వాళ్లూ, వాళ్ల చేష్టలూ, వాళ్ల మాటలూ ఆనంద రససాగరంలో ముంచి తేలుస్తాయి. వక్రీకరించి వ్యంగ్య పరచటానికి ఏ కార్టూనిస్టులో, హాస్య రచయితలో అవసరంలేదు. మన నాయకపుంగవాల (పుంగవాలే కాదు గవాలు కూడా అని మనవి) మాటల్ని వరసగా పేర్చుకుపోండి ఫకాల్న నవ్వు వస్తుంది చెకుముకి రాయితో నిప్పు పుట్టినట్టు!
పాతకాలపు జానపద సినిమాలో రాజబాబుని సిపాయిలు పట్టుకుని రహస్యాలు ''చెప్పు చెప్పు చెప్పు'' అని అడిగితే రాజబాబు వారికి చెరో చెప్పు చేతికిచ్చి బురిడీ కొట్టించి పరారై ఆనందిస్తాడు. రాజబాబు ఇద్దరు వ్యక్తుల్ని బురిడీ కొట్టిస్తేనే నవ్వు పుట్టినప్పుడు మన నాయకాగ్రేసరులు ఏకకాలంలో ఎందరినో బురిడీ కొట్టించినప్పుడు ఎంతగా ఆనందించాలి!
తెనాలి రామలింగడు అందర్నీ బురిడీ కొట్టించే కదా నవ్విస్తాడు. నసీరుద్దీన్ కానీ, బీర్బల్ కానీ అంతా బురిడీ వ్యవహారమే కదా, మరి వారికి దొరికిన మర్యాదా, గౌరవాదులు దేశాన్ని బురిడీ కొట్టించేవారికెందుకు లేవు? ఉండాలిగా!
ఇప్పుడు లైన్లోకి వచ్చారుగా... మనకు ఎంత ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, అనంతానందం దొరుకుతోందో ఎరిగారా.
కరెంటు కోతా, రైతుల ఇబ్బందులూ, ఈతిబాధలూ, అవినీతి బాధలూ, నిరుద్యోగం, మోసం, దగా, ఆక్రమణలూ, గూండాయిజం, అధిక ధరలూ ఇవన్నీ మరచి ఆనందంగా ఉండాలంటే వాటిని చూసి నవ్వటం నేర్చుకోవాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి అన్నారు.
నవ్వు దుఃఖాన్ని మరిపిస్తుంది. నవ్వు బాధల్నించి ఉపశమింప జేస్తుంది. నవ్వులో చాలా రకాలు ఉన్నాయికానీ తేటతెల్లని నవ్వుని పోగొట్టుకోనంతవరకు ఎన్ని కష్టాలు వచ్చినా అజేయంగా నిలుస్తాం. ఈ రోజు కష్టాల్ని చూసి నవ్వుదాం, అవినీతిని చూసి అపహాస్యం చేద్దాం, గూండాయిజంపై వికటాట్టహాసం చేద్దాం, నవ్వుల కొరడాలతో బాధల వీపుల్ని బద్దలు చేద్దాం.
(Eenadu, 06:05:2007)
_____________________________________________
Labels: Humour, Humour/ Telugu
0 Comments:
Post a Comment
<< Home