కోడళ్లకు కొత్త శిక్షణ

అత్తగారి అధికారం కొన్నాళ్ళు కోడలి పెత్తనం కొన్నాళ్ళు అని సామెత. ఇంట్లో పెత్తనం కోసమే అత్తా కోడళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం ఎక్కువగా జరుగుతుంటుంది. అప్పటిదాకా ఎదురులేని తన పెత్తనానికి కోడలి రాకతో కొంత బ్రేకు పడిందేమోనని అత్తగారికి అనుమానం కలుగుతుంది. దాంతో కోడలిపై అకారణ కార్పణ్యం ఏర్పడుతుంది. ''అత్త చేజారినది అడుగాటి కుండ కోడలు చేజారినది కొత్త కుండ...'' వంటి సామెతలు ఇటువంటి సందర్భాలలోనుంచి ఉద్భవించినవే. ''మా అత్తగారికి ఒంట్లో బాగుండటం లేదు. అస్సలు మాట్లాడలేకపోతోంది. మీకు వీలైతే వచ్చేవారంలో కాని వచ్చేనెలలోకాని ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసివెళ్ళండి డాక్టరుగారూ...'' అంటూ ఓ కోడలు డాక్టరుకు ఫోను చేసింది. ''వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నారా... చాలా మంచిపని. నా వంతు విరాళంగా మా అత్తగారిని ఇస్తాను తీసుకెళ్ళండి...'' అంది మరో తెలివైన కోడలు. అత్తాకోడళ్ళ మధ్య పోట్లాటలు అనాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. భర్త అజమాయిషీ తగ్గిపోయి కొడుకు అధికారం కండువా భుజాన వేసుకోగానే అత్తగారి అధికారం అటకెక్కి కోడలి పెత్తనం మొదలవుతుంది. అప్పటినుంచీ అత్తగారు కృష్ణా రామా అంటూ మూల కూర్చోక తప్పదు. అటువంటి పరిస్థితుల్లో కోడలి గురించి కొడుకుతో ఏమి చెప్పినా చెవిటివానిముందు శంఖం ఊదినట్లే అవుతుంది.
అత్తాకోడళ్ళ మధ్య అవగాహనలోపం ఏర్పడి గృహ శాంతి కొరవడటానికి కారణాల గురించి విపులంగా అధ్యయనం చేసింది జైపూర్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థ. ఐ.టి.ఇ. అనే సంక్షిప్త నామంకలిగిన ఈ సంస్థ కొత్తకోడళ్ళకు అత్తవారింట్లో ఎలా సర్దుకుపోవాలో, అత్తలతో ఏ పేచీలు రాకుండా ఎలా నెగ్గుకురావాలో తెలియజేసే ఓ కొత్తకోర్సును ప్రారంభించింది. ఈ విషయాలపై కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు తగు శిక్షణ ఇస్తారు. అనుభవజ్ఞులైన అత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, ప్రసిద్ధి చెందిన మహిళలు, సంఘ సేవకులు తరగతులు నిర్వహించి కొత్తకోడళ్ళకు అత్తవారింట్లో ఎలా నెగ్గుకురావాలో కిటుకులు బోధిస్తారు. వంటరానివారికి పాకశాస్త్రాన్నీ నేర్పిస్తారు. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు డిప్లొమా సర్టిఫికెట్లను ఇస్తారు. ఈ సర్టిఫికెట్లు పొందినవారు అత్తవారిళ్ళల్లో ఏ సమస్యలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించి ఆదర్శ గృహిణులుగా పేరు తెచ్చుకోగలరని సంస్థ వారు భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే ఈ డిప్లొమా కోర్సుకు అమెరికా, జర్మనీ దేశాల విశ్వవిద్యాలయాల నుంచి గుర్తింపు సాధించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ''మన దేశంలో అత్తాకోడళ్ళ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే అత్తవారిళ్ళల్లో సామరస్య పూర్వకంగా ఎలా ప్రవర్తించాలో, నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కొత్తకోడళ్ళకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కోర్సును ప్రారంభించాం. కోడళ్ళకు ఇచ్చే ఈ కొత్త ట్రయినింగ్ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయనే మా విశ్వాసం-'' అంటున్నారు సంస్థకు చెందిన ఆశిష్‌శర్మ!
(Eenadu, 15:07:2007)
-------------------------------------------------------
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home